మెయిన్ ఫీచర్

నృత్య కౌముది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశంలో నృత్యం ఎంతో పవిత్రమైనది. భారతీయ సాంప్రదాయ నృత్యం పథం, గమ్యం కూడా భగవంతుని పాదాలు చేరటమే! కూచిపూడి మన తెలుగువారి మణిమయ కిరీటం. ఇది చేసేవారికి, చూసేవారికి భక్తి, ముక్తి, రక్తి లభిస్తాయి. కూచిపూడికే తరతరాలుగా అంకితమైన సంప్రదాయ కటుంబాలు ఎన్నో ఉన్నాయి. వీరికి నృత్యం ఒక తపస్సు. అటువంటి ఆణిముత్యం డా. యేలేశ్వరపు శ్రీనివాసులు. వీరు దశాబ్దాలుగా కూచిపూడికి సేవ చేస్తున్న నృత్య కౌముది. ‘‘కూచిపూడి భాగవతుల ప్రదర్శిత యక్షగానాలలో ప్రతినాయక పాత్రలు- పరిశీలన’’ అనే అంశంపై సిద్ధాంత వ్యాసం రాసి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో 2016లో పిహెచ్‌డి పొందారు. సంగీతం, సాహిత్యం, నృత్యం మూడింటిలో ఎన్నో ఉన్నత శిఖరాలు చేరారు వీరు. ‘‘చిన్నప్పటినుండి కళలను నేర్చుకోవాలి. నృత్యం నేర్చుకుని, ప్రచారం చేసి, పరిశోధన చేయాలి. అప్పుడే ప్రజలకు కళాకారుల విలువ, కళల విలువ తెలుస్తుంది’’ అంటారు డా యేలేశ్వరపు శ్రీనివాసులు.
*
యేలేశ్వరపు వేణుగోపాల శర్మ కుమారుడైన ఈయన ఎంతోమంది వద్ద నృత్యం నేర్చుకున్నారు. డా.వెంపటి పెదసత్యం, డా.వెంపటి చినసత్యం, పద్మశ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మ, నాట్యాచార్య మహంకాళి శ్రీరాములు శర్మ, నాట్యాచార్య పసుమర్తి రత్తయ్య శర్మగారి వద్ద కూచిపూడి నేర్చుకున్నారు. దాదాపు రెండు దశాబ్దాలుగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, శ్రీ సిద్ధేంద్రయోగి ప్రాంగణం, కూచిపూడి నృత్య విభాగంలో పనిచేస్తూ అక్కడ విద్యార్థులకు కూచిపూడి నేర్పిస్తున్నారు.
ప్రశ్న:మీకు నృత్యంలో ఎవరు సహాయం చేశారు?
జవాబు: వెంపటి చినసత్యం, వేదాంతం సత్యనారాయణ శర్మ, మహంకాళి శ్రీరామశర్మ తదితరులు నృత్యంలో చాలా ప్రోత్సహించారు.
ప్రశ్న: జీవితంలో బాగా గుర్తుపెట్టుకున్న ప్రదర్శనలు ఏవి?
జవాబు: వేదాంతం సత్యనారాయణ శర్మగారు సత్యభామ, ఉష పాత్రలు వేయించారు. ఆయన నట్టువాంగం చేస్తుండగా, పాట మహంకాళి శ్రీరాముల శర్మగారు. ఇది మనస్సుకు ఎంతో సంతోషంగా అనిపించింది- 1993, 94, 95లలో.
ప్రశ్న: విదేశాలలో మీరు పొందిన అనుభవాలు?
జవాబు: అమెరికా, ఫ్రాన్సు, కెనడా వెంపటి చినసత్యంగారితో వెళ్లాను. అప్పుడు రవికి అనుకోకుండా జ్వరం వచ్చింది. నేను వెంటనే శివుడిగా క్షీరసాగర మథనంలో చేశాను. అప్పుడు అందరూ ఎంతో మెచ్చుకున్నారు. గురువుగారి మెచ్చుకోలు రావడం ఒక మధురస్మృతి. కెనడా వెళ్ళినప్పుడు, ఒటావా, టోరంటోలో హరవిలాసం చేశాము. అప్పుడు ఒకతనికి వీసా రాలేదు. అప్పుడు నేను బ్రహ్మ, వీరభద్రుడు, మన్మథుడు అన్నీ ఒకేసారి చేశాను. గురువుగారు నన్ను ప్రోత్సహించారు. అది మనస్సుకు హత్తుకుపోయింది.
ప్రశ్న: వర్తమానంలో టీవీ, సినిమా బాగా ప్రభావితం చేస్తున్నాయి. మరి మన సంప్రదాయ కళలకు ప్రజాధారణ ఎలా?
జవాబు: ఇప్పుడు జనరేషన్‌లో మీడియా ప్రభావం బాగా ఉంది. కళాతపస్వి కళలు, కళాకారులమీద సినిమాలు తీసేవారు. సాగరసంగంమ, శంకరాభరణం వచ్చినపుడు అందరూ సంగీతం నేర్చుకోవడంపై ఆసక్తి చూపేవారు. అందుకే నేడు టీవీ, సినిమాలలో కళలు బాగా ప్రోత్సాహం చేస్తే కళలు బాగా రాణిస్తాయి. మంచి సినిమాలు, టీవీ సీరియల్స్ రావాలి.
ప్రశ్న: అవార్డులు కొంతమందికే వస్తున్నాయ.. ఆర్థిక స్థోమత, రాజకీయ పలుకుబడి సహాయపడుతుంది అంటున్నారు కొందరు. మీరేమంటారు?
జవాబు: అవార్డులు ప్రతిభకి వచ్చేవి ఒప్పుడు. ఇప్పుడు అలా జరగడంలేదు. అది తప్పు. బాగా కృషి చేసి, కష్టపడి ప్రతిభ వున్నవారికి అవార్డులు రాకపోతే చాలా బాధపడాల్సిన విషయం. అలా ఉండకుండా రికమెండేషన్స్ లేకుండా కేవలం ప్రతిభని, సృజనని గుర్తించి అవార్డులు ఇవ్వాలి. అప్పుడే ఇచ్చేవారికి, పుచ్చుకునేవారికి ఆనందంగా ఉంటుంది.

పురస్కారాలు, సత్కారాలు
డా. యేలేశ్వరపు శ్రీనివాసులుఎన్నో గౌరవాలు,పురస్కారాలు, సత్కారాలు పొందారు. నిండుకుండ తొణకదు అని అంటారు. వీరు 2010లో కేంద్ర సంగీత నాటక అకాడమీ, న్యూఢిల్లీవారి బిస్మిల్లాఖాన్ యువ పురస్కారం పొందారు. నృత్యకౌముది, నృత్యరత్న అనే బిరుదులు కూడా ఉన్నాయి. దూరదర్శన్‌లో బిగ్రేడ్ కళాకారుడు. ఎన్నోసార్లు ఎస్‌విబిసి (శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్‌లో) నాద నీరాజనంలో ప్రదర్శించారు.
డా.యేలేశ్వరపు శ్రీనివాసులు నృత్యంమీద ఎన్నో వ్యాసాలు ప్రచురించారు. దేశమంతటా ఎన్నో లెక్చర్ డెమాన్‌స్ట్రేషన్లు ఇచ్చారు. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ పబ్లిక్ స్కూల్స్‌లలో దాదాపు వందకుపైగా లెక్చర్ డెమాన్‌స్ట్రేషన్లు ఇచ్చారు.

దేశ విదేశాలలో ప్రదర్శనలు
2వేలకుపైగా నృత్య ప్రదర్శనలు దేశ విదేశాల్లో ఇచ్చారు. యుఎస్‌ఎలో 1994, 1998, 2000, 2008లో కూచిపూడి ప్రదర్శనలిచ్చారు. అక్కడ సిలికాన్ ఆంధ్రా ఫెస్టివల్‌లో భాగం పంచుకొని మన కీర్తి పతాకను ఎగురవేశారు. 1993లో కెనడా, 2001లో ఫ్రాన్స్, 2010లో వరల్డ్ కామన్‌వెల్త్ ఇనాగరేషన్‌లో నృత్య ప్రదర్శనలిచ్చారు. సంగీతం అంటే ఎంతో ఇష్టం. ఆట, పాట, మాట అంటే నృత్యం, సంగీతం, సాహిత్యం అన్నీ అభ్యాసం చేసి కళలకే అంకితం అయ్యారు.

-డా. శ్రీలేఖ కొచ్చెర్లకోట, పిహెచ్.డి