మెయన్ ఫీచర్

సంక్షోభంలో ప్రజాస్వామ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోవియట్ యూనియన్ కూలిపోవడం, ప్రపంచంలో ‘ప్రచ్ఛన్న పోరు’ ముగియడంతో ప్రపంచ ప్రజలు నిరంకుశ వ్యవస్థలకు చరమగీతం పలకడం ప్రారంభమైనది. 20వ శతాబ్దంలో జరిగిన సైద్ధాంతిక పోరులో ‘ఉదారవాద ప్రజాస్వామ్యం’ అంతిమంగా ఘనవిజయం సాధించినట్లు అందరం సంబరాలు జరుపుకున్నాం. అయితే 25 సంవత్సరాల అనంతరం నేడు చూసుకుంటే తీవ్ర ఆవేదన కలుగుతున్నది.
వరుసగా గత పుష్కర కాలంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య విలువలు నిర్వీర్యం కావడం జరుగుతున్నది. నిరంకుశ, వామపక్ష పాలనలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల గురించిన తగు పరిజ్ఞానం లేని నేటి యువత ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం కోల్పోవడం ప్రారంభమవుతూ వుండడం అత్యంత ప్రమాదకరమైన పరిణామంగా భావించవచ్చు.
వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న ఫ్రీడమ్ హౌస్ విడుదల చేసిన 2018 నివేదిక ప్రకారం 2017లో ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడింది. ప్రజాస్వామ్యానికి మూల అంశాలైన స్వేచ్ఛగా న్యాయంగా ఎన్నికలు జరపడం, మైనారిటీల హక్కులు, పత్రికా స్వాతంత్య్రం, చట్టబద్ధపాలన వంటి అన్ని అంశాలు తీవ్రమైన దాడులకు గురవుతున్నాయి. మొత్తంమీద నికరంగా 71 దేశాలలో రాజకీయ హక్కులు, పౌర స్వాతంత్య్రాలు దిగజారగా, కేవలం 35 దేశాలో మాత్రమే పురోగతి కనిపిస్తున్నది.
ఇప్పటివరకు ప్రపంచంలో సంప్రదాయకంగా ప్రజాస్వామ్య సమాజానికి తానే దిక్సూచిగా భావిస్తూ, ప్రజాస్వామ్య వ్యవస్థల బలోపేతంపై అంకితమైనట్లు చెప్పుకొనే అమెరికా తిరోగమనంలో పడింది. ఆ దేశంలోనే రాజకీయ హక్కులు, పౌర స్వాతంత్య్రాలు క్షీణించడం ప్రారంభమైంది. ప్రపంచంలో ప్రజాస్వామ్యం క్షీణించడం ప్రారంభమైన 2006 నుండి ఇప్పటివరకు 113 దేశాలలో అటువంటి ధోరణులు కనబడుతుండగా, 62 దేశాలలో మాత్రమే పరిస్థితులు మెరుగుకావడం జరుగుతున్నది.
ఒక దశాబ్దం క్రితం ప్రజాస్వామ్యంవైపు అడుగులు వేస్తున్న దేశాలుగా ప్రపంచ దృష్టిని ఆకట్టుకున్న టర్కీ, హంగేరీ వంటి దేశాలు ఇప్పుడు నిరంకుశ పాలనలో ముగ్గుతున్నాయి. 2010లో పరిమితంగా ప్రజాస్వామ్యాన్ని అనుమతించిన మయన్మార్‌లోని సైనిక పాలకులు గత సంవత్సరం తీవ్ర విస్మయం కలిగించే ‘జాతి శుద్ధీకరణ’ పేరుతో మారణహోమానికి పాల్పడుతూ అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలకు ఎదుర్కోవలసి వస్తున్నది.
మరోవంక ప్రపంచంలో బాగా పేరొందిన ప్రజాస్వామ్య దేశాలు ఆంతరంగిక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. సామాజిక, ఆర్థిక అసమానతలు పెరుగుతూ ఉండడం, పక్షపాత విధానాలు, దాడులు, శరణార్థులు పెరుగుతూ ఉండడంతో పొరుగువారి పట్ల భయంతో చూడవలసి రావడం వంటి సమస్యలకు గురవుతున్నారు. వౌలిక పౌర, రాజకీయ స్వాతంత్య్రాలపట్ల నిబద్ధత లేని, విశేష ప్రచారం పొందడం కోసం ప్రజాకర్షణీయ విధానాలను అవలంబిస్తున్న నాయకులు పలు ప్రజాస్వామ్య దేశాలలో అధికారంలోకి రావడం నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న మరో పెనుసవాల్.
ఫ్రాన్స్, నెదర్లాండ్స్, జర్మనీ, ఆస్ట్రేలియాలలో గత సంవత్సరం అటువంటి ప్రజాకర్షక విధానాలు చేపట్టిన నాయకులు ఎన్నికలలో చెప్పుకోదగిన విజయాలు సాధించగలిగారు. దానితో సుస్థిరమైన పొత్తులతో ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం ప్రధాన రాజకీయ పార్టీలకు సవాల్‌గా మారింది. ఈ పరిస్థితులను అనుకూలంగా మార్చుకొని తమ సొంత దేశాలలో అణచివేతలు ఉధృతం చేస్తూ, ఇతర దేశాలలో తమ ప్రభావాలను పెంచుకోవడం కోసం ప్రపంచంలోనే మేటి నిరంకుశ దేశాలైన చైనా, రష్యా అధినేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.
అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇప్పుడు తమను అనుసరించక తప్పని పరిస్థితులు నెలకొంటున్నాయని చైనా అధ్యక్షుడు జీ జింపింగ్ ఈమధ్య ధీమా వ్యక్తం చేశారు. చైనా మార్గంలో కోర్టులను రాజకీయ ప్రభావితం చేయడం, అసమ్మతి పట్ల అసహనం వ్యక్తం చేయడం, ఎన్నికల ఫలితాలను ముందే నిర్దేశించడం వంటి దుర్లక్షణాలు వ్యాప్తి చెందే ప్రమాదం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామిక వ్యతిరేక విధానాలు వ్యాప్తి చెందుతూ ఉండడం ప్రాథమిక హక్కులకు భంగం కలగడమే కాకుండా ఆర్థిక, భద్రత ప్రమాదాలకు కూడా కారణమవుతున్నది. ఎక్కువ దేశాలు స్వతంత్రంగా ఉంటే అమెరికాతోసహా అన్ని దేశాలు భద్రంగా, మరింత సంపన్నంగా ఉండగలవు. ఎక్కువ దేశాలు నిరంకుశ, అణచివేతలకు పాల్పడుతూ ఉంటే ఒప్పందాలు, కూటములు కూలిపోయి దేశాలు, మొత్తం ప్రాంతాలు అస్థిరతకు గురవుతాయి. హింసాయుత ఉగ్రవాదుల కార్యకలాపాలకు అవకాశాలు పెరుగుతాయి. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు నిబంధనలు ఏర్పర్చుకొని అందరు పాటించే విధంగా చూడడం కోసం ప్రజలకు అవకాశం కల్పిస్తాయి.
బాధ్యతలనుండి వైదొలగిన అమెరికా
ప్రజలకు తమ జీవితాలు, పనుల విషయంలో తమ అభిప్రాయం చెప్పుకొనే అవకాశం కల్పిస్తాయి. అటువంటి వాతావరణం శాంతి, స్వేచ్ఛ, రాజీ ధోరణులకు అనువైన అవకాశం కల్పిస్తాయి. అయితే నిరంకుశ పాలకులు తమ పౌరులపై నిర్హేతుకమైన నిబంధనలను రుద్దుతారు. ప్రజల ఇబ్బందులను నిర్లక్ష్యం చేస్తారు. 2017లో ప్రజాస్వామ్యం సంక్షోభంలో పడడానికి ప్రపంచవ్యాప్తంగా జరిగిన పలు పరిణామాలు కారణమైనా, అన్నింటికన్నా ముఖ్యమైనది ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించి మద్దతు పలికే తన చరిత్రాత్మక బాధ్యత నుండి అమెరికా వైదొలగడం అని చెప్పవచ్చు. నిరంకుశ వ్యవస్థల నుండి ఎదురుకాగల సవాళ్ల కారణంగా అమెరికా తన సాంప్రదాయక పాత్ర నుండి వెనుకడుగువేస్తున్నది.
ప్రజాస్వామ్యం విషయంలో అమెరికా ప్రభుత్వాలు చిరకాలంగా చాలా పొరపాట్లు చేస్తూనే వున్నాయి. అయినప్పటికీ అమెరికా ప్రజలు, వారి నాయకులు మొత్తంమీద ఇతరుల హక్కులకోసం నిలబడటం తమ నైతిక బాధ్యతగా మాత్రమే గాకుండా తమకు కూడా ప్రయోజనకరం అని భావిస్తూ ఉంటారు. అయితే అఫ్ఘానిస్తాన్, అంతకుముందు ఇరాక్‌లలో జరిగిన యుద్ధాలలో తీవ్రంగా నష్టపోవడం, ఆర్థిక సంక్షోభం కారణంగా అమెరికా ప్రజలలో అంతర్జాతీయ వ్యవహారాలలో పాత్ర వహించడం పట్ల ఏహ్యభావం కలగడం ప్రారంభమైనది.
ఒకవంక ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించే బాధ్యత, మరోవంక సైనిక జోక్యం, ఆర్థికభావం వంటి అంశాలు ప్రజలలో తీవ్రమైన ప్రతికూల ప్రభావాలకు దారితీస్తాయి. ఒబామా ప్రభుత్వం తన విదేశ విధాన ప్రకటనలలో ప్రజాస్వామ్య ఆలోచనలకు మద్దతు తెలుపుతూ వచ్చినా ఆచరణలో మాత్రం వెనుకడుకు వేసింది. దానితో అంతర్జాతీయ పరిణామాలను ప్రభావితం చేయగల సామర్థ్యం అమెరికాకు తగ్గిపోవడమే కాకుండా, అటువంటి ప్రయత్నాలపట్ల అమెరికా ప్రజలలో సుముఖత కూడా తగ్గుతూ వచ్చింది.
అయితే 2017లో ట్రంప్ ప్రభుత్వం అటువంటి భేషజాలకు పోకుండా, గత ఏడు దశాబ్దాలుగా అమెరికా నాయకత్వాన్ని నడిపిస్తున్న విధాన సంబంధ అంశాలకు బహిరంగంగానే తిలోదకాలు ఇస్తూ వస్తున్నది. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ‘అమెరికన్ ఫస్ట్’ నినాదం దశాబ్దాలుగా అమెరికా అనుసరిస్తున్న ఫాసిజంపై యుద్ధం, సామూహిక ప్రపంచ భద్రత, పరస్పరం ప్రయోజనం కలిగించే వాణిజ్యం వంటి విధానాలను వ్యితిరేకిస్తూ వచ్చిన వర్గాలనుండి వచ్చిందే కావడం గమనార్హం. పర్యావరణం, ఆయుధ నియంత్రణ తదితర అంశాలపై అంతర్జాతీయ ఒప్పందాల పట్ల ప్రతికూలత చూపడం చూస్తుంటే అమెరికా వెనుకడుగు వేయడం స్పష్టంగా కనిపిస్తుంది.
ఇతర ప్రజాస్వామ్య దేశాలతో ఒప్పందాలు, పొత్తులు విషయంలో సహితం ట్రంప్ విశ్వజనీత హక్కుల గుర్తింపు గురించి కాకుండా సాంస్కృతిక, నాగరిక బంధాల గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు. ట్రంప్ విదేశీ పర్యటనలలో సహితం ‘ప్రజాస్వామ్యం’ గురించి ప్రస్తావన ఎక్కడా కనిపించడం లేదు. పైగా ప్రపంచంలో దారుణమైన నిరంకుశ పాలకులపట్ల ఆరాధనాభావం వ్యక్తం చేస్తూ వారితో వ్యక్తిగత స్నేహం చేసే ప్రయత్నాలు ప్రదర్శిస్తున్నారు. గతంలో రెండో ప్రపంచయుద్ధం తరువాత కొందరు అమెరికా అధ్యక్షులు వ్యూహాత్మకంగా కొందరు నిరంకుశ పాలకులతో సహకార ధోరణి అవలంబించినా ప్రజాస్వామ్యం అత్యుత్తమమైన పాలనావ్యవస్థ అనే తమ దృఢమైన భావాలనుండి మాత్రం వెనుకకు తగ్గలేదు. రష్యా, చైనా, నిరంకుశ పాలనలో వున్న ఇతర దేశాల నుండి పెరుగుతున్న ప్రమాదాలను సమర్థవంతంగా ఎదుర్కోవడం కోసం ప్రజాస్వామ్య దేశాలతో కలిసి నడవాలని అభిలాష నేడు అమెరికా ప్రభుత్వంలో కనిపించడం లేదు.
2017లో అమెరికాలో పాలనా వ్యవస్థలు సహితం నైతిక పరిధులను అతిక్రమించడం మరింత ఆందోళన కలిగిస్తున్నది. అమెరికా చరిత్రలో కుటుంబ సభ్యులను ప్రభుత్వంలో కీలక పదవులలో నియమించుకున్న మొదటి అధ్యక్షుడు ట్రంప్ కావడం గమనార్హం. అట్లాగే వివిధ వ్యాపార ప్రయోజనాలుగల వారిని పలు పదవులలో నియమించారు. తమ వ్యాపార సామ్రాజ్యానికి, ప్రభుత్వానికి మధ్యగల దూరాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తున్నది. ట్రంప్‌వలే మీడియా వారిని బెదిరించడం, తనకు సహకరించని జడ్జిలపై విమర్శలు చేయడం వంటి విపరీత ధోరణులు అమెరికాలో చాలా అరుదని చెప్పవచ్చు.
ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా..
మరోవంక మాస్కో, బీజింగ్‌లకు ప్రజాస్వామ్యం తమ అణచివేత పాలనలకు అత్యంత ప్రమాదకరమని తెలుసు. అందుకనే తమ దేశాలలో విమర్శలను ఒకవంక నిర్దాక్షిణ్యంగా అణచివేస్తూ, మరోవంక ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య పాలనలను నిర్వీర్యం చేసే విధంగా తమ పలుకుబడిని పెంచుకొనే ప్రయత్నాలు ఈ రెండు దేశాలు చేస్తున్నాయి. ఇంటర్‌నెట్, సోషల్ మీడియాలపై ఆంక్షలు ద్వారా ప్రభుత్వ నియంత్రణ ఉండేటట్లు చేస్తున్నారు. దానితో పాలనావ్యవస్థలో అవినీతి, అన్యాయం, ప్రభుత్వ ఉల్లంఘనలకు బాధ్యత వహించకపోవడం పెరుగుతున్నది.
అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలలో జరిగిన ఎన్నికల సమయంలో ఆయా దేశాలలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తప్పుడు ప్రచారం చేసినట్లు నిర్థరణ అయింది. ఐరోపాలో విద్వేషాలు వ్యాప్తి చేసే రాజకీయ పక్షాలతో సంబంధాలు పెంచుకోవడం, పొరుగు దేశాలపై దాడులకు పాల్పడటం, మధ్యప్రాచ్య దేశాలలోని నిరంకుశ పాలకులకు ప్రత్యామ్నాయ సైనిక వనరులు సమకూర్చడం కూడా చేస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను విచ్ఛిన్నం చేయడం, వాటిని కలిపి ఉంచే ఐరోపా యూనియన్ వంటి వ్యవస్థలకు చేటు తీసుకురావడం రష్యా ప్రధాన లక్ష్యంగా కనిపిస్తున్నది. ఈ దిశలో చైనా మరింత ఉదృతంగా, దూకుడుగా అడుగులు వేస్తున్నది.
అగ్రరాజ్యాల ప్రభావం లేకుండా మయన్మార్, టర్కీ వంటి అవినీతి, నిరంకుశ దేశాలు ప్రపంచ సుస్థిరతకు సవాల్‌గా పరిణమించడాన్ని చూస్తున్నాము. నేడు ప్రపంచీకరణ అనివార్యమైన సమయంలో స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం ఒక దేశానికి పరిమితం కాలేవు. వీటి మనుగడకు ఇతర దేశాలలోని పరిస్థితులు సహితం ప్రభావం చూపుతాయి. నిజాయితీగా ఎన్నికలు జరపడం, భావ ప్రకటన స్వాతంత్య్రం, జవాబుదారీతనం గల ప్రభుత్వం, పోలీసు, సైనికులు, ఇతర అధికార సంస్థలను నియంత్రించగల సమర్థవంతమైన నియమ నిబంధనలు ఉదార ప్రజాస్వామ్య వ్యవస్థలకు కీలక అంశాలు. అటువంటి విలువలను ఇతర దేశాలతో సంబంధం లేకుండా ఒక దేశంలో అమలులో ఉండేవిధంగా చేయడం 21వ శతాబ్దంలో అసంభవం కాగలదు.

-చలసాని నరేంద్ర 9849569050