మెయన్ ఫీచర్

ఒకరిది దూకుడు... మరొకరిది తడబాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి మరో నాలుగు నెలల్లో నాలుగేళ్లు పూర్తవుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు వేరు అయినప్పటికీ, ఈ రెండు రాష్ట్రాల ప్రజలు ప్రస్తుతం, భవిష్యత్తులో కూడా తమ గత అనుబంధాలను మర్చిపోరు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల తీరు, వారి స్వభావం, పార్టీల భవిష్యత్తు, రెండు రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీల గురించి ఎల్లప్పుడూ చర్చించుకుంటారు. దేశంలో మిగతా రాష్ట్రాలకు కాని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూటమికి గాని ఈ విశే్లషణలతో అవసరం లేదు. ఇటీవల ఒక ఆంగ్ల టీవీ చానల్ నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుమాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌తో తెలంగాణను పోల్చవద్దని, తెలంగాణ అన్ని రంగాల్లో ముందంజలో ఉందని చెబుతున్నప్పుడు ఆత్మవిశ్వాసం, ధీమా, కార్యదీక్ష కనపడింది. రాష్ట్ర విభజనకు దారితీసిన పరిస్థితుల్లో కేసీఆర్ వ్యవహరించిన తీరుకు అతీతంగా గానే తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ ఇంటర్వ్యూలను చూస్తారు. కేసీఆర్ అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముచ్చటపడుతారు. 2014 జూన్ 2 తర్వాత కేసీఆర్ పాలనా శైలిని చూసి తమకు అటువంటి వ్యక్తిత్వం ఉన్న నేత రాష్ట్ర పాలకుడుగా ఉంటే బాగుంటుందని ఆంధ్ర ప్రజలు ఇటీవల కాలంలో తరచుగా భావిస్తున్నారు. రాజకీయాల గురించి ఎక్కువగా చర్చించుకునే ప్రజల నోటి వెంట ఈ మాట వస్తూంటుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పోల్చితే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజకీయాల్లో కాకలు తీరిన యోధుడే. ఇది గతం. ఈ విషయంలో మరో మాటకు తావులేదు. ఇటీవల కాలంలో అనేక అంశాల్లో చంద్రబాబు సంశయాత్మక వైఖరి ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
కేసీఆర్ కామెంట్స్‌కు చంద్రబాబు స్పందిస్తూ హైదరాబాద్‌ను 1995 తర్వాత చూడాలని, ఆంధ్రపాలకులు ధ్వంసం చేశారని, తాము పునర్నిర్మిస్తున్నామని కెసిఆర్ మాట్లాడడం సరికాదన్నారు. ఈ అంశంపై చంద్రబాబు చాలా పేలవంగా మాట్లాడినట్లు జనాభిప్రాయం వ్యక్తమైంది. సైబరాబాద్ అనే హైటెక్ సిటీ నిర్మాణం ఘనత చంద్రబాబుకే దక్కుతుందని కెసిఆర్ తనయుడు కెటిఆర్ స్వయంగా కితాబునిచ్చారు. ఈ సంగతిని చంద్రబాబు మర్చిపోయారు. చంద్రబాబు సైబరాబాద్ నిర్మాణాన్ని చరిత్ర నమోదు చేసింది. చంద్రబాబు వల్లనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని ప్రతి రోజూ, ప్రతి నిమిషం ప్రత్యర్థి రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రత్యర్థి పార్టీ పాలకులు ఎందుకు చెబుతారు ?.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి విశే్లషిస్తే చంద్రబాబులో మునుపటి చంద్రబాబు లేరు. 1995 నుంచి 2004 వరకు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, 2004 నుంచి రాష్ట్ర విభజన జరిగే వరకు 2014 వరకు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు రాణించారు. కాని విభజన తర్వాత ఏపి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబులో అనేక అంశాల్లో తడబాటు కనపడుతుంది. హైదరాబాద్‌ను కోల్పోయి, సరైన వౌలిక సదుపాయాలు లేని ఆంధ్ర రాష్ట్ర అధినేతగా చంద్రబాబు ఎంతో దూకుడుగా వ్యవహరించి అభివృద్ధితో పాటు రాష్ట్ర ప్రజలను భాగస్వామ్యం చేస్తారనుకున్న ప్రజలు తమ అంచనాలు తప్పాయనుకుంటున్నారు.
తన భావాలను కచ్చితంగా, కరాఖండిగా చెప్పడం, సిద్ధాంత నిబద్ధత కలిగి ఉన్న కేసీఆర్ రాష్ట్రంలోనే కాకుండా దేశ రాజకీయాల్లో చాణక్యనీతిని ప్రదర్శిస్తూ రాణిస్తున్నారు. వడ్డించిన విస్తరిలా ఉన్న తెలంగాణ రాష్ట్ధ్రానేతగా కేసీఆర్ అంతగా శ్రమపడాల్సిన అవసరం లేదు. కాని చరిత్రలో తనకు లభించిన అవకాశాన్ని కేసీఆర్ ప్రతిక్షణం సద్వినియోగం చేసుకుంటూ పాలన రంగంలో దూసుకుపోతున్నారు. అదే చంద్రబాబు నాలుగేళ్లుగా ఒకటే మాట. రెవెన్యూ లోటు, వౌలిక సదుపాయాల లేమి అనే మాటను పదే పదే వల్లెవేస్తున్నారనే విమర్శలకు ఆస్కారం ఇచ్చారు. కేసీఆర్ రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ చేశారు. పది జిల్లాలను పునర్విభజన చేసి 31 జిల్లాలను ఏర్పాటు చేశారు. కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్ ప్రాంతాలను ఏర్పాటుచేశారు. ఇది సాహసోపేతమైన చర్యగా చెప్పవచ్చును. కేసీఆర్ చేసే పనిని చంద్రబాబు చేయలేకపోయారు. మరో ఏడాదిలో ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పుడు జిల్లాల విభజనకు పూనుకున్నా, అది సాధ్యమయ్యే పనికాదు. ఆంధ్రాలో ఉన్న 13 జిల్లాలు అతి పెద్దవి. జిల్లాల పునర్విభజన నిధులతో కూడుకున్నది కావచ్చు. కాని ప్రతి అంశాన్ని నిధులతో ముడిపెట్టడం వల్ల జిల్లాల పునర్విభజన అనే మహత్తరమైన అవకాశాన్ని చంద్రబాబు కోల్పోయారు. నిధులలేమితో బాధపడుతుంటే కొత్త జిల్లాలెందుకని కొట్టేశారు. కాని జిల్లాల పునర్విభజన వల్ల నవ్యాంధ్రప్రదేశ్ పరిపుష్టమయ్యేది. 13 జిల్లాలు 25 లోక్‌సభ స్థానాలకు విస్తరించి ఉన్నాయి. ప్రతి లోక్‌సభ స్థానాన్ని ఒక జిల్లాగా చేసే అవకాశం ఉంది.
ఆంధ్రాలో హైకోర్టు ఏర్పాటుపై కూడా చంద్రబాబు తాత్సారం చేశారనే అపవాదు ఉంది. సాధారణ ప్రజలకు, న్యాయవాదులకు హైకోర్టు విభజనాధికారం సుప్రీంకోర్టుకు ఉందా, హైకోర్టుకు ఉందా, కేంద్రం చేతుల్లో ఉందా అనే విషయాన్ని పట్టించుకోరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చకాచకా జరిగిపోతే, ఇంకా రకరకాల సాంకేతిక విధానాలను ముడిపెట్టి హైకోర్టు విభజన ఆలస్యం చేశారు. అమరావతి వద్ద నిర్మించిన తాత్కాలిక సచివాలయ భవన సముదాయం పక్కనే ఒక రూ.100 కోట్లతో తాత్కాలిక హైకోర్టు భవనాలను పనిలో పనిగా నిర్మించి ఉంటే ప్రజలు హర్షించి ఉండేవారు. లేదా ఎన్నో భవనాలు, వౌలిక సదుపాయాలు ఉన్న తిరుపతిలో తాత్కాలికంగా ఏర్పాటు చేసి ఉన్నా ప్రజలు స్వాగతించేవారు. ఈ రోజు విజయవాడ చుట్టుపక్కల విసిరేసినట్లు ఉండే మూడు భవనాలను ఎంపిక చేసి వాటిలో ఒకటి ఖరారు చేసుకోవాలని హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం సూచించింది. ఈ విషయంలో కూడా ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
1990 దశకంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో ఏర్పాటులో కీలక సూత్రధారిగా ఉండి అపరచాణక్యుడిగా పేరు పొందిన చంద్రబాబు ఈరోజు రాజకీయాల్లో తనకంటే జూనియర్ అయిన ప్రధాని నరేంద్రమోదీని కూడా తన చతురతతో మెప్పించలేకపోతున్నారు. ఇటీవల చంద్రబాబు మాట్లాడుతూ, విభజన చట్టంలో హామీలను అమలు చేయని పక్షంలో సర్వోన్నత న్యాయస్థానం గుమ్మం తడుతామని పేర్కొనడంపై సర్వత్రావిమర్శలు వస్తున్నాయి. ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న టిడిపి కేంద్రంపై కోర్టుకు వెళ్లడం సాధ్యమయ్యే పనేనా.
ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్, చంద్రబాబుల మధ్య ప్రజలు పోల్చుతున్నారు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా లేకపోయినా, కేంద్రం నుంచి నిధులు రాకపోయినా, కేసీఆర్ సాహసంతో ముందడుగు వేసి ఈ ప్రాజెక్టు నిర్మాణం పనులను వేగవంతం చేశారు. అదే చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై విభజన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మాత్రమే శ్రద్ధ పెట్టారు. విభజనకు ముందు చంద్రబాబు పోలవరంకు వ్యతిరేకం కాదన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఎదురవుతున్న అవాంతరాల విషయంలో సాహసంతో కూడిన పోరాటం చేయడంలో విఫలమవుతున్నారు. ఆంధ్రుల భావోద్వేగాలకు ప్రతీక అయిన పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం పెడుతున్న తిప్పలపై మడమ తిప్పకుండాపోరాడడంలో చంద్రబాబు అనిశ్చిత స్థితికి గురవుతున్నారు. దివంగత వైఎస్ నిర్మంచిన కుడికాల్వపై పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం పూర్తి చేసి చరిత్రలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకు ప్రతీక అయన పోలవరం విషయంలో డూ ఆర్ డై బాటిల్ పద్ధతిని ఎంచుకోలేదు.
తెలంగాణ రాష్ట్రం విద్యుత్ కొరతలతో ఏర్పడింది. కాని ఈ రోజు కెసిఆర్ దార్శనికత, పట్టుదల వల్ల మిగులు విద్యుత్ దశకు చేరుకుంది. ఈ తరహా పట్టుదల చంద్రబాబులో లోపించడంపై చంద్రబాబంటే అభిమానం ఉన్నవాళ్లకు కూడా అర్థం కావడం లేదు. ఆంధ్రాకు ప్రత్యేక హోదా నుంచి ప్రత్యేక ప్యాకేజికి దిగజార్చి ఈ రోజు నిధులను రాబట్టుకోలేకపోతున్నారు. ఒకప్పుడు చంద్రబాబు దూకుడుగా వ్యవహరించే నాయకునిగా, మంచి పరిపాలన నిపుణుడిగా ఉండేవారు. ఈ రోజు ప్రతి మాటలో నిర్వేదం కనపడుతోంది. చివరకు రైల్వే జోన్‌ను కూడా సాధించలేకపోయారు. ఎవరికి అవసరంలేని నియోజకవర్గాల పెంపుదల గురించి ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి.
విభజన జరిగిన నాలుగేళ్లు గడచినా, ఆంధ్ర సంస్కృతి, చరిత్ర, భాష, సంప్రదాయాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో చంద్రబాబు పాత్ర శూన్యం. ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయలేదు. గోదావరి, కృష్ణ పుష్కరాలను బాగా నిర్వహించామనుకుంటే చాలదు. ఆంధ్ర ప్రదేశ్ బహుముఖ సమాజంతో కలగాపులగంగా ఉంటుంది. ప్రజలను ఏకత్రాటిపైకి తెచ్చేందుకు సాంస్కృతిక సభలు, సమావేశాలు నిర్వహించే దిశలో చంద్రబాబు ఆసక్తిచూపించలేదు. అదే కేసీఆర్ ప్రతి అంశంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటేందుకు కలిసి వచ్చే ఏ అవకాశాన్ని వదులుకోలేదు. ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించి తెలంగాణ సంస్కృతి, సాహిత్య సౌరభాలను ప్రపంచానికి చాటారు. కెసిఆర్ కు ఉన్న కుటుంబ బంధం చంద్రబాబుకు లేకపోవడాన్ని కూడా ప్రజలు గమనించారు. కేసీఆర్ కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత, మేనల్లుడు హరీష్ రావు ఉద్యమంలో చురుకుగా పాల్గొనడమే కాకుండా తెలంగాణ అభివృద్ధిలో మమేకమయ్యారు. రాజకీయంగా కేసీఆర్‌కు ఇంత కంటే గొప్ప ఆస్తి ఇంకేమి కావాలి. చంద్రబాబుకు కుటుంబ అండదండలు తక్కువే.
ప్రపంచ తెలుగు మహాసభలకు ప్రవచనాలు, అవధానాలు చేసే ఒక పండితుడిని కేసీఆర్ ప్రభుత్వం ఆహ్వానిస్తే, మా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును పిలవలేదు. అందుకే తాను వెళ్లడం లేదని తన ఆత్మగౌరవాన్ని చాటుకున్నారు. అదే సభలకు చంద్రబాబు బావమరిది, సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ వెళ్లడంకూడా ఏపీ ప్రజలు నిశితంగా గమనించారు. కేసీఆర్ లాంటి వ్యక్తిత్వం ఉన్న నేత ఏపీ ముఖ్యమంత్రి అయి ఉంటే, బాలకృష్ణ ప్రపంచ తెలుగు మహాసభలకు వెళ్లి ఉండేవారా ? పిల్లి నల్లదా, తెల్లదా అని చూడరాదు. అది ఎలుకను పడుతుందా లేదా అనేది ముఖ్యమని చంద్రబాబు హైదరాబాద్‌లో జరిగే అంతర్జాతీయ సాంకేతిక సదస్సుల్లో ఎప్పుడూ చెప్పేవారు. ఆనాటి చంద్రబాబు ఇప్పటి చంద్రబాబులో మచ్చుకు కూడా కనపడరు.

-కె.విజయ శైలేంద్ర 9849998097