మెయన్ ఫీచర్

పెట్టుబడుల కోసం మోకరిల్లాలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పటిదాకా ఆ నదిని ఈదుకుంటూ దాటేవారు కొందరైతే, ఈత రానివారిని నాటు తెప్పలపై చేరవేసేవారు మరికొందరు. అభివృద్ధి అనే ఓ ఎజెండాకింద అక్కడ ఓ బ్రిడ్జిని నిర్మించారు. దానికై అప్పులు చేయాల్సి వచ్చింది. ఆ ఋణానికి, అక్కడి ఉత్పత్తి శక్తులకు, సాధనాలకు ఎలాంటి సంబంధం లేదు. ఆ బ్రిడ్జి నిర్మాణంలో ఇరుపక్కల జనాలు పాలుపంచుకోలేదు. శ్రమ చేయలేదు. ఊహించని కల మాత్రం సాకారమైంది. ఇరు ప్రాంతాల మధ్య వందల కిలోమీటర్ల దూరం తగ్గింది. రవాణా బాగా పెరిగింది. ఓ దశాబ్ద కాలంలో ఇరువైపు గ్రామాల్లో కొట్టొచ్చిన మార్పు జరిగింది. విద్యా అవకాశాలు పెరిగాయి. అటవీ సంపద కనుమరుగు కాగా, ఖనిజ వనరులు తరగిపోవడం మొదలైంది. పచ్చని పంటలతో, సహజసిద్ధ నీటి వనరులతో, జలసంపదతో, అటవీ సంపదలతో అలరారిన గ్రామాలు వల్లకాడవడం ప్రారంభమైంది. ఊరుమ్మడి బతుకులు చిధ్రం కాసాగాయి. అధునాతన పోకడలు ఆవాస ప్రాంతాల ముఖచిత్రానే్న మార్చివేశాయి. దీంతో స్థానికులు స్థానికేతరులుగా, బయటివారు అసలైనవారుగా రాజకీయాలు మారిపోయాయి.
దీనంతటికీ ఆ వంతెనే కారణమని చందమామలోని ముసలమ్మలా ఓ పెద్దమ్మ చిలక జోస్యం చెప్పింది. దాంతో ఇరుప్రాంత ప్రజలు రాత్రికి రాత్రి ఆ బ్రిడ్జిని నదిలో కలిపేశారు. వెంటనే రాజ్యం ఏర్పరచుకున్న చట్టసభలు, తాము రూపొందించుకున్న చట్టాలతో చుట్టాల్లా చూడాల్సిన పాలితులను శతృ శిబిరాలకు తరలించాయి. నేరాలంటే తెలియని వారిపై దేశద్రోహం మోపబడింది. దీనిపై అన్ని దృశ్య మాధ్యమాల్లో మేధావుల మధ్య, రాజకీయ వాదుల గుంపులతో తీవ్రస్థాయి చర్చలు జరిగాయి. కరెంట్ అఫైర్స్ (current affairs), స్పాట్‌లైట్ (spotlight)అంటూ ముఛ్చట్లే ముచ్చట్లు! పత్రికల్లో ప్రధాన శీర్షికన కథనాలు. వెనుక అదృశ్యశక్తులంటూ, తీవ్రవాదులంటూ, నక్సలైట్లంటూ రాజకీయ ప్రకటనలు వెలువడ్డాయి. అది దేశద్రోహమేకాదు అంతర్జాతీయ ద్రోహమంటూ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా తేల్చేసాయి. ఈ చర్చల సారం నిర్బంధ శిబిరాల్లోని జనాలకేమీ అర్థం కాలేదు. అత్యాధునిక కెమెరాలతో, యాంకర్లు నది దగ్గర ప్రత్యక్షమయ్యారు. సమస్యంతా నదిని ఎలా దాటాలనే! పోతే, బయటి మాధ్యమాల్లో కనపడిన అలజడి నది పరిసర ప్రాంతాల్లో ఎక్కడా కనపడకపోగా, నది ప్రశాంతంగా ప్రవహించడం, నాటు తెప్పలతో మిగిలిన జనాలు అటూఇటూ దాటడం ఆశ్చర్య పరచింది. ఉత్సాహం పట్టలేని ఓ యువ యాంకరమ్మ అడిగిన ప్రశ్నకు తలబొప్పికట్టే సమాధానం! బ్రిడ్జి కట్టి మా దగ్గర డబ్బులు గుంజితే, ఇప్పుడు నదిని దాటడానికి మాకే డబ్బులిస్తున్నారు అనే తూటాలాంటి సమాధానం మరో ప్రశ్నకు ఆస్కారం లేకుండా చేసింది.
ఈ ఘటన వాస్తవమా? కాదు - కథనం అనుకుంటే..? రెండు దృక్కోణాలు కనబడతాయి. అభివృద్ధికి ఇదే గీటురాయి అని భావిస్తే, గ్రామస్తులు అభివృద్ధి నిరోధకులు! దీనికి విలోమంగా అభివృద్ధి నీడన అమాయక ప్రజలతోపాటు, అటవి, ప్రకృతి సంపదలను దోచుకోవడం, వారిని నిరాశ్రయుల్ని చేయడం రెండోది. ఇందులో ఏది వాస్తవం అంటే, పాలకులపక్షాన ఒక దృశ్యం కనపడితే, పాలితుల పక్షాన మరొకటి వుంటుంది.
ఇప్పుడోసారి దావోస్‌వైపు దృష్టి సారిద్దాం! ఇరవై ఏళ్ల తరువాత తిరిగి భారత్ ప్రధాని ఆ సదస్సుకు హాజరుకావడం. అయితే ఏంటి? అప్పటి ప్రధాని దేవగౌడ నిద్రపోయే ప్రధాని అయితే, ఇప్పటి మోదీ వైబ్రెంట్, నిద్రను దరిరానీయని ప్రధాని. గంటసేపు హిందీలో మాట్లాడినా, మధ్య మధ్యన సంస్కృత శ్లోకాలతో 3వేలకు పైగా పాల్గొన్న ప్రపంచ సీఈఓలను (CEO)లను ఉర్రూతలూగించాడు. రెండోది, సాచివేత, ఎర్ర తివాచి కథ చెప్పడం! ఇప్పటిదాకా భారతదేశ ప్రభుత్వాలు రెడ్‌టేపిజంతో రెడ్‌కార్పెటును పర్చలేదట! కానీ, అభివృద్ధి నిరోధకంగా ఉన్న 1400 చట్టాల్ని రద్దుచేసి సాచివేతను తోకముడిపించి ఎర్రతివాచీని విప్పి ప్రపంచస్థాయి పెట్టుబడిదార్లను మోదీజీ ఆహ్వానించాడట! జాతీయ ఉద్యమకాలంలో ఈ మాటలను వలస పాలకుల నీతిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడేవారు. ఎర్రతివాచీ పరువడం అంటే అడుగులకు మడుగులొత్తడమని వ్యంగ్యంగా అంటూ వుంటాం! మరి, గాంధీ బతికి వస్తే ఏం చేసేవాడో తెలియదుగానీ, ఆయన మాటలను మాత్రం ఆర్‌ఎస్‌ఎస్‌కన్నా చెవికెక్కాయా అనేది ఓ ప్రశ్న!.. నా ఇంట్లోకి అన్ని దేశాల సంస్కృతులు రావాలని, అందుకోసం ఎల్లవేళలా కిటికీలు తెరిచి వుంచాలని, కానీ స్వంత సంస్కృతిని మాత్రం దెబ్బతీయవద్దు అని గాంధీ అన్న మాటలు ఉటంకింపు! ఒకవేళ విని ఉంటే వాజ్‌పాయ్‌కి కూడా ఈ మాటలు అర్థమయ్యాయా అనేది ఓ ధర్మసందేహం!
ఇలా సాగిన మోదీ ప్రసంగంలో మూడు సవాళ్లను వివరించాడు. మొదటిది శీఘ్రగతిన గతి తప్పుతున్న వాతావరణం! దీనికి ఉదాహరణగా దావోస్‌నే ఉదహరిస్తూ దేవగౌడ వెళ్లినపుడు హిమపాతం లేదట! ఇప్పుడంతా హిమమయమేనట! మొన్నటి నవంబర్‌లో ఢిల్లీ వీధులుగాని, మోదీ ప్రసంగిస్తున్న సమయంలోనే జమ్మూలోని వైష్ణోదేవి పరిసర ప్రాంతంలో కురిసిన మంచుగాని మోదీ ప్రస్తావించకపోవడం గమనార్హం! ఈ అనూహ్య పరిస్థితులకు పెద్దన్న అమెరికా ఎంత కారణమో, అనుంగు సోదరుడైన భారత్ అంతే కారణమని దాటవేస్తే..? రెండో అతిపెద్ద సవాలు.. ఉగ్రవాదం! నిజానికి మధ్య ఆసియా, వీటిని చర్నాకోలతో నడుపుతున్న పశ్చిమాసియా దేశాలతోపా రిమోటు కంట్రోలు చేస్తున్న అమెరికాకే ఇది పెను సవాలు. మూడువైపుల సముద్రం నుండి, ఉత్తరాన హిమాలయాలున్న భారత్‌కు మనవాళ్లు చెబుతున్నంత ప్రమాదం వుందా? వుంటే, అది ఎన్‌డీఏ హయాంలోనే ఎక్కువెందుకవుతున్నది అన్నది ఏనాటికీ తేలని ప్రశే్న!
ఆయన ప్రవచించిన మూడో సవాలు అంతర్జాతీయ స్వార్థం! బహుశా ఆ సభలో పాల్గొన్న చంద్రబాబుకు, కేటీఆర్‌కు ఈ పరిభాష బాగా అర్థమై ఉంటుంది. చేతులు నొప్పిపెట్టేదాకా వారు బల్లలపై చరచి ఉంటారు. మోదీ మాటల్లో.. ‘‘ప్రపంచశక్తులు (దృష్టిలో ప్రజలే ఉండాలి) ప్రపంచీకరణను వదిలించుకోవాలని, దీనిని నిలిపివేయాలని కూడా కోరుకుంటున్నాయట..! నిజంగా ఇది వాస్తవమే అయితే, ఆహ్వానించతగ్గ పరిణామం కాదా? ఈ ప్రపంచీకరణేగా మనలాంటి దేశాలను అప్పుల్లో ముంచింది. సంప్రదాయ వృత్తులను నాశనం చేశాయి. రైతులను, చేనేత కార్మికులను ఉరికంబాలకు ఎక్కిస్తున్నాయి. చివరికి విద్యార్థులను విద్యాలయాలపై దూకేలా చేయడమే కాదు - సెలవులకై, పరీక్ష తేదీల పొడిగింపునకై విద్యార్థులే సహచర విద్యార్థులను చంపుతున్నారు. ఇవన్నీ ప్రపంచీకరణ ఫలితాలు కావా?
కాదని భావిస్తే గత మార్చి 2017 నాటికి దేశవిదేశీ అప్పు 471.9 బిలియన్ల డాలర్లకు ఎందుకు చేరింది? అప్పులు పెరిగినా సరే, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) 2013-14లో 36 బిలియన్ డాలర్లుంటే నేడు 60 బిలియన్ డాలర్లకు పెరిగిందనే సంతోషం కావచ్చు! పెట్టుబడిదారులు దేశాలకు, ప్రజలకు సేవ చేస్తారనే ఆర్థిక సిద్ధాంతమేదైనా ఉందా? ఏ దేశంలోనైనా నిరూపించబడిందా? తెలంగాణ ఆర్థికమంత్రి కూడా ఈ జపానే్న పఠించాడు. పెట్టుబడుల్ని ఆకర్షించడం, అప్పులు తేవడమే పాలకుల విధి అయితే, దీనికి చట్టసభలు అవసరమా? పెట్టుబడిదారులకు కాంట్రాక్టు ఇస్తే సరిపోదా? (ఇప్పుడు జరుగుతున్నది అదేగా!)
బాగా అభివృద్ధి చెందిన దేశం జపాన్ అప్పుల్లో ఉంటే, మన పెద్దన్న అమెరికాయే ఆర్థికంగా సతమతమవుతుంటే అప్పులు మనకో లెక్కా అని తృప్తి పడవచ్చు. మరి స్విస్ బ్యాంకుల్లోని 2.1 బిలియన్ డాలర్ల భారతీయుల నల్లడబ్బు ఎక్కుడినుంచి వచ్చింది? ఈ డబ్బుతోపాటు, ఈ దేశానికి అప్పులిస్తున్నవారు, పెట్టుబడులు పెడుతున్నవారు ఎవరు? దాదాపు ఈ దేశం నుంచి దావోస్‌కు వెళ్లిన 120 మంది సీఈఓల ఆస్తులు ఎందుకు పెరుగుతున్నాయి? అయినా నమ్మకుంటే, ఆర్థికఫోరం సాక్షిగా, ప్రారంభ సమావేశానికి గంటముందే, ఆక్స్‌ఫాం (Oxfam) విడుదల చేసిన ఆర్థిక సర్వే ఫలితాల మాటేంటి? గత సంవత్సరం భారతదేశ సంపదలోని 73 శాతం కేవలం ఒక శాతం వ్యక్తుల చేతుల్లో మాత్రమే వుందని, 67 కోట్ల సాధారణ ప్రజల చేతిలో ఉన్నది కేవలం ఒక శాతం సంపదమాత్రమేనని చెప్పిన కఠోర వాస్తవానికి, మోదీ ఏ సమాధానం చెబుతారు? 2014నాటి ఎన్నికల నినాదం నుంచి, 2014, 2015, 2016, 2017లలో ఎర్రకోట సాక్షిగా మాట్లాడిన మాటలకు, నేడు దావోస్‌లో మాట్లాడిన మాటలకు తేడా ఏంటి?
ఓ సాధారణ గ్రామీణుడి రోజువారి సంపాదన ఓ ముఖేష్ అంబానీ లాంటి వ్యక్తి వార్షిక ఆదాయంతో సమానం కావాలంటే రమారమి 941 సంవత్సరాలు పనిచేయాలట! ఈ దేశంలో అతి ధనవంతులైన వారి ఆస్తి రూ.20.7 లక్షల కోట్లు, 29 రాష్ట్రాల వైద్య, విద్య ఖర్చుల బడ్జెట్‌కు సరిపోతుందట! బాపురే! మోదీకిఈ లెక్కలు తలకెక్కితే సొమ్మసిల్లి పడిపోవాలి! మనమైతే నిజంగానే పడిపోయేవారం. అందుకే, ఈ దేశం బాగుపడాలంటే, ఎంపీలు, ఎమ్మెల్యేలు, న్యాయమూర్తుల జీతాలు ఇబ్బడిముబ్బడిగా పెంచుకోవడం కాదు, దేశీయ స్థాయిలోని సీఈఓ (CEO)ల జీతాల్లో 60 శాతం కోత వేయాలని సెలవిచ్చింది ఆ నివేదిక. ఇది జరిగే పనేనా అంటే మాత్రం అది ఓ పిచ్చిప్రశ్న అవుతుంది.
ఈ నివేదికను పక్కన పెడదాం. స్వయాన ప్రపంచ ఆర్థిక ఫోరం (WEF) విడుదల చేసిన నివేదిక సంగతేంటి? మోదీ ప్రస్తావించిన మూడు మంత్రదండాలకు భిన్నంగా, జీవన ప్రమాణాల్లో, పర్యావరణ సమగ్రతలో, భావితరాలు ఋణగ్రస్తులుగా మారకుండూ ఉండడంలాంటి ప్రామాణిక సూచికల్లో 79 దేశాల్లో భారత్ 60వ స్థానం! మన పక్క దేశాలైన చైనా 15వ స్థానంలో, నేపాల్ 22వ, బంగ్లాదేశ్ 34వ, శ్రీలంక 40వ స్థానాల్లో వుంటే మన పక్కలో బల్లెం పాకిస్తాన్ 46వ స్థానంలో వుండడం నిజంగా మోదీకి దిగ్భ్రాంతి కలిగించి ఉండాలి. పైగా చీలికలకు తావులేని వ్యూహం అంటూ, దుష్ఫలితాలకు తావిచ్చే దురాలోచనలు చేయవద్దంటూ, సత్ఫలితాలనిచ్చే సదాలోచనలే చేయాలంటూ, ఇవే మేక్ ఇన్ ఇండియాగా మారుస్తాయంటూ సెలవివ్వడంలోని ఆంతర్యం మోదీకి, ఆయన విధానాలకు తబ్బిబ్బవుతున్నవారికే అర్థం కావాలి! తాకట్టులో భారతదేశం అన్న తరిమల నాగిరెడ్డి మాటల్ని ‘తక్కట్లో’ అని మార్పు చేస్తేగాని 2019నాటి దావోస్ 49వ సదస్సుకు పరమార్థం వుండదు. అప్పటికి పైన ప్రస్తావించిన ‘గల్పిక’ వాస్తవ కథగా మారవచ్చని బోధపడవచ్చు!

- డా. జి.లచ్చయ్య సెల్: 94401 16162