మెయన్ ఫీచర్

పేరుకు మాత్రమే ప్రజాస్వామ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య దేశా లు దుందుడుకు నిరంకుశ పాలనలను, ఉగ్రవాద సైన్యాన్ని ఎదుర్కోవలసి ఉంది. అయితే కొంతకాలంగా ఈ అంశంలో ప్రజాస్వామ్య దేశాలు వెనుకడుగు వేస్తున్నాయనే అభిప్రాయం కలుగుతున్నది. ప్రపంచంలో ప్రజాస్వామ్య వికాసానికి విశేషంగా అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఫ్రీడంహౌస్ ప్రతి సంవత్సరం ప్రకటించే ‘ప్రపంచంలో స్వాతంత్య్ర వార్షిక నివేదిక’ ప్రజాస్వామ్య దేశాల అంకితభావానికి ప్రతీక. ఈ నివేదికలో ఒక దేశాన్ని ‘స్వేచ్ఛా’ దేశంగా పేర్కొంటే అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని, ప్రజాస్వామ్యం పటిష్టతకు ఆ దేశం అంకితభావంతో కృషిచేస్తున్నదని అర్థం. ప్రపంచంలో నిరంకుశ దేశాల ఆధిపత్య ధోరణులను ఎదుర్కోవడానికి సహకరించడంతోపాటు, సుపరిపాలనను ప్రోత్సహించే దేశా లు అటువంటి హోదా పొందుతాయి.
పూర్తిగా ప్రజాస్వామ్య స్ఫూర్తిలేని దేశాలు ‘పాక్షికంగా స్వేచ్ఛ’గల దేశాలుగా నివేదిక పేర్కొంటోంది. మిగిలిన దేశాలు ‘స్వేచ్ఛ లేని’ దేశాలుగా ఉంటాయి. మూడు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య స్ఫూర్తి విశేషంగా వికసిస్తూ ఉండటం వాస్తవం.
బెర్లిన్ గోడ కూలిపోవడం, సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం కావడంతో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ప్రజాస్వామ్య మార్గంలోకి వచ్చాయి. చిలి, దక్షిణ ఆఫ్రికా, పోలండ్, తైవాన్ వంటి దేశాలు ప్రజాస్వామ్య దేశాలుగా ఈ కాలంలోనే వికసించడం గమనార్హం.
అయితే ఈ ప్రగతి ఈ శతాబ్దం ప్రారంభం నుండి తిరోగమనం వైపు మళ్ళినట్లు తాజా వార్షిక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఫ్రీడంహౌస్ తాజాగా ప్రకటించిన 2014 వార్షిక నివేదిక ఇటీవలనే విడుదలయినది. వరుసగా తొమ్మిదవ సంవత్సరంలోనూ పలు ప్రజాస్వామ్య దేశాలలో పెరుగుతున్న నిరంకుశ ధోరణులు వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తున్నది.
అయితే పలు ‘పాక్షిక స్వేచ్ఛ’ దేశాలు ‘స్వేచ్ఛలేని’ దేశాలుగా, ‘స్వేచ్ఛలేని’ దేశాలు మరింత అధ్వాన్నంగా మారుతున్నా పూర్తిగా ‘స్వేచ్ఛ’గల దేశాలలో మాత్రం పరిస్థితులలో చెప్పుకోదగిన మార్పులేకపోవడం కొంత ఉపశమనం కలిగిస్తుంది.
1999 నుండి 18 దేశాలు ‘స్వేచ్ఛా’దేశాలుగా మారాయి. అయితే వాటిల్లో మెక్సికో, ఉక్రెయిన్ 2010లో, ఇండోనేసియా, సిమిత్రా మిపాదీ 2013లో ‘పాక్షిక స్వేచ్ఛ’ వర్గీకరణకు దిగిపోయాయి. అయితే పలు ప్రజాస్వామ్య దేశాలు చాలా చిన్న దేశాలు కావడంతో వాటిపై అంతర్జాతీయ పరిణామాల ప్రభావం పరిమితంగానే ఉంటుందని చెప్పవచ్చు. ఫిజి, గునియా-బిసాయు వంటి చిన్న దేశాలు వర్గీకరణలలో ర్యాంకింగ్‌ను మెరుగుపరచుకున్నా ప్రాంతీయంగా బలోపేత దేశాలైన ఈజిప్ట్, టర్కీ, థాయిలాండ్, ఉగాండా వంటి దేశాలు ‘స్వేచ్ఛ’ లేని దేశాల హోదాకు దిగజారాయి. ‘స్వేచ్ఛా’ దేశాలుగా పేర్కొన్నంత మాత్రాన పలు దేశాలు తమ హోదాను అదే విధంగా కాపాడుకోలేవని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం పలు ఉపద్రవాలనుండి, ఎదురవుతున్న సవాళ్ళనుండి తమ ను కాపాడుకోవడానికి ప్రజాస్వామ్య దేశా లు మరింత సమష్టి కృషి జరుపవలసిన అవసరాన్ని ఈ నివేదిక వెల్లడిచేస్తున్నది.
నిరంకుశ దేశాలలో ప్రజాస్వామ్య స్ఫూర్తి పాత్ర వహించడానికి కృషిచేయడంతోపాటు తమ సోదర ప్రజాస్వామ్య దేశాలు ఆ స్ఫూర్తి కాపాడుకోవడానికి సహితం జాగృతంతో వ్యవహరింపవలసి ఉంది. అప్పుడే స్వాతంత్య్రంకోసం జరిగే పోరాటాలు మరింత విస్తృతం కాగలవు. ప్రపంచంలో ప్రజాస్వామ్య స్ఫూర్తి వికసింపచేయడానికి మార్గం ఏర్పడుతుంది.
ప్రపంచంలో రాజకీయ హక్కులు, పౌర స్వాతంత్య్రాల ప్రాతిపదికగా రూపొందించే నిరంకుశ ప్రభుత్వాలు వినూత్న వ్యూహాలను అమలుచేస్తుండటం వల్లనే ప్రజాస్వామ్యం స్ఫూర్తి దిగజారుతున్నట్లు తెలుపుతుంది. 25 సంవత్సరాలలో మరెప్పటికైనా ఇప్పుడు ప్రపంచంలో అత్యుత్తమ ప్రభుత్వంగా ప్రజాస్వామ్యాన్ని ఆమోదించడం, ప్రజాస్వామ్య ఆలోచనలపై ఏర్పడే అంతర్జాతీయ వ్యవస్థ నేడు ప్రమాదంలో పడిందని ఫ్రీడంహౌస్ పరిశోధనా విభాగం ఉపాధ్యక్షుడు ఆర్స్‌పుడ్డింగ్టన్ ఆందోళన వ్యక్తంచేశారు.
ఇటీవల కాలంవరకూ అంతర్జాతీయ ఒప్పందాలకు మద్దతు ప్రకటిస్తున్నామని అంటూ పోటీతత్వంతో కూడిన ఎన్నికలు, మానవ హక్కులకు పైపై సానుభూతిని పలు నిరంకుశ ప్రభుత్వాలు వ్యక్తం చేస్తూ వచ్చాయి. అయితే నేడు అవే దేశాలు ఏక పార్టీపాలన ఆధిపత్యం కోసం వౌలిక దౌత్య సూత్రాల అడ్డంకులను త్రోసివేయడానికి వెనుకాడటం లేదు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని పెంపొందించుకున్న దేశాల ర్యాంకింగ్ 61 దేశాలనుండి 33కు పడిపోగా, ప్రశంసనీయ కృషిచేసిన దేశాల సంఖ్య గత తొమ్మిదేళ్ళలో అతి తక్కువగా ఉన్నది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి, ఈజిప్ట్ అధ్యక్షుడు ప్రజాస్వామ్య ప్రయోజనాలను తిరోగమనం పట్టించడం, పత్రికా స్వాతం త్య్రం-పౌర సమాజానికి వ్యతిరేకంగా టర్కీ అధ్యక్షుడు రికాప్ తయిప్ ఎర్డోగాన్ ప్రచారాన్ని ఉధృతం కావించడం, చైనాలో మరింతగా పెరుగుతున్న నిరంకుశ ధోరణులను ఈ వార్షిక నివేదిక ఉదహరించింది. ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో ప్రజాస్వామ్య ప్రమాణాల పట్ల పెరుగుతున్న అసహనాన్ని ఈ నివేదిక నమోదు చేసింది.
2014లో స్వేచ్ఛా ధోరణులకు ఉగ్రవాదం ముప్పుగా పరిణమించడాన్ని ఈ సందర్భంగా ఈ నివేదిక వివరించింది. పశ్చిమ ఆఫ్రికా, మధ్యప్రాచ్యం నుండి దక్షిణ ఆసియా వరకూ రాడికల్ జిహాదీ శక్తులు స్థానిక ప్రభుత్వాలకు, ప్రజలకు పెనుముప్పుగా పరిణమించాయి. ఈ శక్తులు భద్రతా దళాలను మూకుమ్మడిగా చంపివేస్తుండటం, పౌరులను ఊచకోతకు గురిచేస్తుండటం, విదేశీయులను బందీలుగా తీసుకుంటుండటం, అల్పసంఖ్యాక మతాలకు చెందిన వారిని చంపడం వంటి చర్యల ద్వారా ఇరాక్, సిరియా, పాకిస్థాన్, నైజీరియా వంటి దేశాలలో ఇటువంటి శక్తు లు పెను విధ్వంసాలను సృష్టిస్తున్నాయి. ఈ వార్షిక నివేదిక 195 దేశాలలో ధోరణులను నిశితంగా విశే్లషించి కేవలం 89 దేశాలు (46 శాతం) ‘స్వేచ్ఛా’ దేశాలు అని, మరో 55 దేశాలు (28 శాతం) ‘పాక్షికంగా స్వేచ్ఛ’గల దేశాలు అని వర్గీకరించింది. మిగిలిన 51 దేశాలను (26 శాతం) ‘స్వేచ్ఛ లేని’ దేశాలుగా పేర్కొన్నది.
ముఖ్యంగా ఆర్థికంగా శక్తివంతమై, ప్రాంతీయంగా విశేష పలుకుబడిగల అజర్‌బైజాన్, ఈజిప్ట్, కెన్యా, నైజీరియా, రష్యా, థాయిలాండ్, టర్కీ, వెనుజులా వంటి పెద్ద దేశాలలో ప్రజాస్వామ్య ధోరణులు సన్నగిల్లి, నిరంకుశ ధోరణులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ఈ దేశాలలో భావ ప్రకటనా స్వాతంత్య్రం, పౌర సమాజం, చట్టబద్ధ పాలన అధ్వాన్నం కావడం గమనార్హం.
చాలా దేశాలలో ప్రభుత్వ నిఘా పెరగడం, ఇంటర్నెట్ సమాచారంపై ఆంక్షలు విధించడం, వ్యక్తిగత స్వయంప్రతిపత్తిపై నిర్బంధాలు నూతనంగా పెరుగుతున్న ఆందోళన కలిగిస్తున్న పరిణామాలు. ముఖ్యంగా మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా ప్రాంతాలలో పరిస్థితులు అధ్వాన్నంగా మారాయి. యురేషియా, సిరియాలలో నిరంకుశ పాలనకు పౌర యుద్ధం తోడు కావడం, ప్రజలలో వర్గ విభజన, నియంత్రణ లేని ఉగ్రవాదంతో ఈ దశాబ్దంలోనే అతి తక్కువ ర్యాంకింగ్ ఈ దేశాలకు లభించింది. అయితే ఈ పరిణామాలకు ఇక మినహాయింపు తునీషియా. 40 సంవత్సరాల క్రితం అరబ్ ప్రపంచంలో లెబనాన్‌లో పౌరయుద్ధం సంభవించిన అనంతరం తొలిసారిగా ఒక దేశం ‘‘స్వేచ్ఛా’’ దేశంగా మారింది. ‘స్వేచ్ఛ లేని’ దేశాలుగా పేర్కొన్న 51 దేశాలలో రాజకీయ హక్కులు, పౌర స్వాతంత్య్రాల విషయంలో అతి తక్కువగా 7 పాయింట్లు లభించాయి. అధ్వాన్నపు దేశాలుగా సెంట్రల్ అరబ్ రిపబ్లిక్, ఈక్వెటె రియల్ గునియా, ఇరిటరియా, ఉత్తర కొరియా, సౌదీ అరేబియా, సోమాలియా, సూడాన్, సిరియా, తుర్కెమేనిస్థాన్, ఉజ్బెకిస్థాన్ దేశాలు ఉన్నాయి. టిబెట్, పశ్చిమ సహారా భూభాగాలు సహితం ఈ కోవకే వస్తాయి. అర్థ శతాబ్దకాలం అనంతరం తమ సంబంధాలను సాధారణ స్థాయికి తీసుకువెళ్ళాలని అమెరికా-క్యూబా దేశాలు అంగీకరించినట్లు వెలువడిన ప్రకటన అమెరికా ఖండాలల్లో చారిత్రాత్మక పరిణామం అని చెప్పవచ్చు. ‘స్వేచ్ఛ’ విషయంలో అమెరికాలో అధ్వాన్నపు దేశంగా క్యూబాను పేర్కొన్నా, ఆ దేశంలో స్వతంత్ర మీడియా పెరుగుతుండటం హర్షణీయ పరిణామం.
మెక్సికోలో నేరమయ హింస, అవినీతిలను అరికట్టలేని అధికారులకు వ్యతిరేకంగా ప్రారంభమైన ప్రజాగ్రహం అధ్యక్షుడు ఎన్‌రిక్యూపినానియటో ఆధిపత్యాన్ని సవాల్ చేసే ప్రజా నిరసనగా మారింది.
అమెరికాలో మిస్సౌరీ, న్యూయార్క్‌లలో ఇతర చోట్ల ఆఫ్రికన్ అమెరికన్లను చంపివేయడంపై నిరసనలు చెలరేగాయి. అందుకు బాధ్యులైన అధికారులపై తగు చర్యలు తీసుకోలేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తమయింది. దేశంలో 2001లో జరిగిన ఉగ్రవాదుల దాడుల అనంతరం ఉగ్రవాదులనే అనుమానంతో కేంద్ర నిఘా విభాగం చిత్రహింసలకు పాల్పడటంపై అమెరికా సెనేట్ సవివరమైన నివేదికను డిసెంబర్‌లో విడుదల చేసింది. థాయిలాండ్‌లో ఎన్నికయిన ప్రభుత్వా న్ని సైన్యం తొలగించడం, మార్షియల్‌లా (సైనిక పాలన)ను అమలుచేయడం, రాజకీయ హక్కుల- పౌర స్వాతంత్య్రాలపై తీవ్ర ఆంక్షలు విధించడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.
పాక్షికంగా సైనిక పాలన నుంచి ప్రజాస్వామ్యం వైపు అడుగులు వేస్తున్న మయన్మార్‌లో పాత్రికేయులు, ప్రదర్శనలపై తీవ్ర ఆంక్షలు అమలుచేస్తున్నారు. భవిష్యత్ ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థుల సంఖ్యపై పరిమితులపై ప్రారంభమైన నిరసనల సందర్భంగా హాంగ్‌కాంగ్‌లో పత్రికా స్వాతంత్య్రం, సమావేశపు స్వాతంత్య్రంలపై ఆంక్షలు విధించారు.
గత సంవత్సరం అవినీతిపరుడైన అధ్యక్షుడు విక్టర్ మనుకోవుచ్‌ను తొలగించడం ద్వారా యుక్రెయిన్‌లో సాధించిన విజయాలు మార్చిలో క్రిమియాను రష్యా ఆక్రమించడం, రష్యా అనుకూల వేర్పాటువాదులతో కొనసాగుతున్న పోరాటాలు ఆందోళనకు దారి తీస్తున్నాయి. అంతర్గతంగా నిరసనలపై నియంత్రణ, మీడియాపై ఆంక్షలు, ప్రభుత్వేతర సంస్థలపై ఆంక్షలను రష్యా అమలుచేస్తున్నది.
టర్కీలో ప్రధానమంత్రి ఎరొడ్గన్ అధ్యక్ష పదవి చేపట్టి తన మద్దతుదారులపై అవినీతి కేసులు దర్యాప్తు కొనసాగకుండా అడ్డుకోవడం, మీడియా న్యాయవ్యవస్థలలో జోక్యం పెరుగుతుండటంతో ప్రజాస్వామ్య విలువలు మరింతగా క్షీణిస్తున్నాయి.
ఎన్నికలను నిలిపివేసి, సామూహిక విచారణలు జరుపుతూ అన్ని రకాల నిరసనను అణచివేస్తూ ఈజిప్ట్ తిరిగి నిరంకుశ పాలన వైపు తిరిగింది. మొత్తం మీద ప్రపంచంలో ప్రజాస్వామ్య స్ఫూర్తి తిరోగమనంలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

- చలసాని నరేంద్ర