మెయన్ ఫీచర్

అవార్డులకు కొలమానం ఏమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగువారు మొదటి నుంచీ నష్టజాతకులు. ఇది నిజమేనన్నట్టు ఐతరేయ బ్రాహ్మణంలో ఒక కథ ఉంది. దాని ప్రకారం ఆంధ్రులు తాము చేయని నేరానికి తండ్రి విశ్వామిత్రుడి చేత అభిశప్తులైనారు. అంటే వీరిది క్షత్రియ రాజ వంశం. పుష్కర్ ప్రాంతం. ఇది హర్యానా ప్రాంతంలో ఉంది. మెగస్తనీసు తన ఇండికాలో ఆంధ్రుల మహానగరాలను ఎంతో ఘనంగా వర్ణించాడు. కాకతీయాంధ్ర సామ్రాజ్యం 1323 సెప్టెంబర్‌లో పతనమైనాక ఈ ప్రభుత్వం నుండి వెళ్లిన వారు విజయనగర సామ్రాజ్యం స్థాపించారు. అళియ రామరాయలు యుద్ధంలో ఓడిపోయిన తర్వాత తమిళనాడులోని తంజావూరు ముఖ్యపట్టణంగా తెలుగు రాజుల పాలన మొదలైంది. ఈ వంశ స్థాపకుడు విశ్వనాథ నాయకుడు. వీరి తెలుగు భాషా సాహిత్య పోషణను ‘దక్షిణాంధ్ర నాయక రాజయుగం’ పేరిట పిలుస్తారు. ఆ తర్వాత అక్కడ మహారాష్ట్రుల పాలన మొదలైనా, వారు తెలుగు భాషా సంస్కృతులను పోషించటం విశేషం. అలాంటిది తెలుగువాడుగా చిత్తూరులో పుట్టిన కరుణానిధి వంటివారు తమిళనాట తెలుగు భాషను ఎదగనీయలేదు. మద్రాసును ఆంధ్రప్రదేశ్‌లో విలీనం కాకుండా చేసిందెవరు? తిరుత్తని ఎందుకు దూరమయింది? ఇవన్నీ తెలుగువారు నష్టజాతకులు అనడానికి కొన్ని ఉదాహరణలు మాత్రమే.
ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్పుకోవలసి వచ్చిందంటే ‘తెలుగువారికి కేంద్రం అన్యాయం చేసింది’ అని రాజకీయ నాయకులు గగ్గోలు పెడుతున్నారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి తగినన్ని నిధులు రావటం లేదు. ‘ప్రత్యేక హోదా’ అసలే లేదు. తెలంగాణకు కూడా భారీగా నిదులు రావటం లేదు. ఈ ఆరోపణలకు ఏవేవో సమాధానాలు కేంద్రం నుండి వచ్చాయి. ‘మీరు లక్షల కోట్ల అప్పులు చేసి, వాటికి మమ్మల్ని నిధులు ఇవ్వాలంటే ఎలా?’ అని ఒకాయన అన్నాడు.
గత నెలలో 69వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం కొందరికి ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించింది. అందులో ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కేవలం ఒక్కరికి మాత్రమే పురస్కారం దక్కింది. దీనికి కారణమేమిటి అని ఆలోచిస్తే తెలుగువారు నష్టజాతకులు అని మరొకసారి నిరూపణ అయింది. తెలంగాణ సర్కారు, ఏపీ ప్రభుత్వం చెరో పాతిక పేర్లు అధికారికంగా ఢిల్లీకి పంపాయి. ఈ రెండు జాబితాలను చెత్తబుట్టలో పడేశారు. తెలుగు ముఖ్యమంత్రులకు కాస్త పౌరుషం ఉంటే ఇకమీదట ‘పద్మ’ అవార్డులకు నామినేషన్లు పంపకూడదు. ‘తెలంగాణ ప్రభుత్వం పంపిన జాబితాలో పారదర్శకత లేదు. తమ ప్రభుత్వానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతునిచ్చేవారి పేర్లే పంపారు’ అన్నది ఓ ఆరోపణ. ఇది ఎంతవరకు నిజం? విద్యావేత్త చుక్కా రామయ్య సిపిఎం మద్దతుదారు. కవి సుద్దాల అశోక్ తేజ ‘ఆకుపచ్చని చందమామ నీవేనమ్మా’ అంటూ కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముందు ఆడుతూ పాడుతూ మురిపించాడు. చాగంటి కోటేశ్వరరావు ప్రవచనా సుధామృతం ఎలా ఉరకలు వేసిందో ఆనాటి సభలో ఉప రాష్టప్రతి వెంకయ్య చూశారు. తెలంగాణ నుండి పంపిన జాబితాలో అశోక్‌తేజ పేరు ఉంది. 2017, 2018 సంవత్సరాల్లో చాగంటి పేరును ఏపీ ప్రభుత్వం సిఫారసు చేసినా ఆయనకు ‘పద్మ’ పురస్కారం దక్కలేదు. నరేంద్ర మోదీకి తెలుగు రాదు. అందుకని మల్లాది చంద్రశేఖర శాస్ర్తీ, కందుకూరి శివానందమూర్తి, మైలవరపు శ్రీనివాసరావు, గరికపాటి నరసింహారావు, చాగంటి కోటేశ్వరరావు వంటి పండితుల పేర్లు తెలియక పోవచ్చు. కానీ, నిర్మలా సీతారామన్, సుజనా చౌదరి, అశోక్‌గజపతిరాజు వంటి తెలుగువారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కదా. వారైనా తెలుగు తేజాల గూర్చి ఎందుకు చెప్పలేకపోయారు? ఇందుకు సమాధానం ఒక్కటే- తెలుగువారు నష్టజాతకులు. వారిలో వారికి ఐక్యభావం లేదు. ఢిల్లీలో వీళ్ల ముఖాలు ఎవ్వరూ చూడరు.
ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వానికి ‘పద్మ’ అవార్డుల కోసం వచ్చిన సిఫారసుల సంఖ్య 15,700. కేంద్రం ప్రకటించినవి- 3 పద్మవిభూషణ్‌లు, 9 పద్మభూషణ్‌లు, 73 పద్మశ్రీలు. ఇందులో ఎక్కువ భాగం అవార్డులు త్వరలో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకు దక్కాయి. 2015లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎక్కువ సంఖ్యలో ‘పద్మా’లు దేశ రాజధానిలోని ప్రముఖులనే వరించాయి. మహారాష్టల్రో శివసేన పార్టీ వారు పెట్టే బాధలు తట్టుకోలేక ఎన్‌సిపిని మంచి చేసుకోవటం కోసం శరద్‌పవార్‌కు పద్మవిభూషణ ఇచ్చారు. విదేశాలలో వున్న భారతీయులను 14 పద్మాలు వరించాయి. తమిళనాడు కోటాలో సంగీత దర్శకుడు ఇళయరాజాకు ‘పద్మం’ వస్తే తెలుగువారు చంకలు గుద్దుకోవటం దేనికి? గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావుకు ‘్భరతరత్న’ ఇచ్చి ఉంటే మనం సంతోషపడాలి కాని లతా మంగేష్కర్‌కు వస్తే మనకెందుకు ఉబలాటం? నట దిగ్గజాలైన సావిత్రి, ఎస్.వి.రంగారావులకు మరణానంతరం పురస్కారాలు ప్రకటిస్తే బాగుండేదని నటుడు పవన్‌కళ్యాణ్ అనగానే- ‘వారిద్దరూ కాపు కులస్థులు కాబట్టి పవన్ అలా అన్నాడు’ అని ఒకరు వ్యాఖ్యానించారు. ఇదీ తెలుగువారి ఐక్యత! 2017లో ఆంధ్రప్రదేశ్‌లో పద్మభూషణ్ పురస్కారాలతో సహా ఆరు పద్మాలు ఒకే సామాజిక వర్గానికి వచ్చాయి ఎందుకని? ఏపీ ప్రభుత్వం గత సంవత్సరం పంపిన జాబితాలో జి.సత్యవాణి (ఆధ్యాత్మికవేత్త), చాగంటి (ఆధ్యాత్మికవేత్త), ఆశావాది ప్రకాశరావు (కవి- రాయలసీమ) వంటి ప్రముఖుల పేర్లు ఉన్నాయి. వీరు అవార్డులు పొందడానికి కులం అడ్డొచ్చిందా?
ప్రముఖ సినీనటి అంజలీదేవి మరణశయ్యపై ఉన్నప్పుడు తనకు పద్మ పురస్కారం రాలేదే.. అని విలపించింది. మరో ప్రఖ్యాత నటి జమునకు అవార్డు ఇవ్వాలన్న సిఫారసు కూడా గతంలో బుట్టదాఖలైంది. తెలుగువారంటే కేంద్రానికి ఎటువంటి గౌరవమూ మొదటి నుండీ లేదు. పి.వి.నరసింహారావు, ఎన్.టి.రామారావుల పేర్లను ‘్భరతరత్న’ కోసం తెలుగు ప్రభుత్వాలు సూచించినా పట్టించుకోలేదు. తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదంతో తెలుగువారికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ఎన్టీఆర్‌కు భారతరత్న పురస్కారం ఎందుకు రాలేదు? తమిళనటుడు ఎంజిఆర్‌కు ఎందుకు వచ్చింది? ఇక, రాజకీయంగా ఆలోచిస్తే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బిజెపి ఎదగకపోవటానికి కారణం కేంద్రమే. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్ టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే, కేంద్ర మంత్రి మహేశ్ శర్మ వచ్చి కేసీఆర్‌ను పొగిడితే ఇక కార్యకర్తల మనోస్థైర్యం దెబ్బతినదా? 2019 ఎన్నికల సంవత్సరం. ఈ తరుణంలో తెలుగువారి మనోభావాలు దెబ్బతినేలా కేంద్ర ప్రభుత్వం చిన్న తప్పటడుగు వేసినా అందుకు భారీ మూల్యం చెల్లించక తప్పదు. భారతీయ సాహిత్య పరిషత్ అఖిల భారత అధ్యక్షుడు, జానపద సాహిత్య పరిశోధకుడు, తెలంగాణ జాతిరత్నం అయిన ప్రొఫెసర్ కసిరెడ్డి వెంకటరెడ్డి పద్మశ్రీ పురస్కారానికి దరఖాస్తు చేస్తే ఎందుకు తిరస్కరించారో కేంద్రంలోని పాలకులు జవాబు చెప్పాలి.
దేశంలో 29 రాష్ట్రాలున్నాయి. ఒక్కొక్క రాష్ట్రానికి మూడు పురస్కారాలు ఇవ్వటం సమ్మతమే కదా. రెండు తెలుగు రాష్ట్రాల నోట్లో మట్టి కొట్టడం, త్వరలో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకు అవార్డుల పంపిణీ చేయడం ఏం న్యాయం? ప్రముఖ కవి ఎన్.గోపి పేరును మూడు సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం పద్మ పురస్కారానికై ఢిల్లీనేతలకు సిఫార్సు చేయడం, అక్కడ వరుసగా తిరస్కరించడం జరుగుతున్నది. ప్రముఖ సినీనటుడు మురళీమోహన్ పేరు 2016, 2017 సంవత్సరాల్లో వరుసగా ఎందుకు సిఫార్సు చేశారు? కాంగ్రెస్ హయాంలో సినీ దర్శకుడు బాపు పేరును ఆరు సంవత్సరాల పాటు వరుసగా తిరస్కరించారు. ఎవరు ఎన్ని నిరసనలు తెలిపినా- ‘నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు..’ అన్నట్లు కేంద్రంలోని పాలకులు ప్రవర్తించారు. పద్మ, ఫాల్కే, సాహిత్య, సంగీత, నాటక అకాడమీ పురస్కారాలకు ఎంపికలో మతలబు ఏమిటి? ఈ ఎంపిక తీరుపై విచారణ జరిపే ధైర్యం కేంద్ర పాలకులకు ఉందా? సరైన మార్గదర్శకాలను ఇకనైనా రూపొందిస్తారా?
విజయవాడకు చెందిన మాంటిస్సోరి కోటేశ్వరమ్మ- ‘92 ఏళ్ల వయసులో నాకు ఈ పద్మాలతో పనేమిటి?’ అని ఆశ్చర్యపోయినా ఆమెకు గతంలో అవార్డు ప్రకటించారు. కోట సచ్చితానంద శాస్ర్తీ (హరిదాసు) తన పేరులో బ్రహ్మశ్రీ పేరు ‘పద్మశ్రీ’ చూచుకోవాలని ఉందని అర్థించినా ఆయనను పట్టించుకోలేదు. మహాత్మా గాంధీని ‘పంది’ అని తిట్టిన ఋత్విక్ ఘటక్ అనే బెంగాలీ కమ్యూనిస్టుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం లోగడ పద్మశ్రీ ఇప్పించింది.
చతుర్వేదాలను తెలుగులోకి తెచ్చిన అపర వ్యాసుడు మర్రి కృష్ణారెడ్డి, వేద గణిత మహాదధి అవధాని గారి పేర్లు తెలంగాణ ప్రభుత్వం దృష్టిలోకి రానే రాలేదు. రావూరి భరద్వాజ పేరును రికమెండ్ చేసినా ఢిల్లీ ప్రభుత్వం పట్టించుకోలేదు. గుంటూరు శేషేంద్ర శర్మకు పద్మశ్రీ కానీ జ్ఞానపీఠం కానీ ఇవ్వకండని హైదరాబాద్ నుండి కొందరు ఢిల్లీ వెళ్లి ప్రచారం చేసి వచ్చారు. కేంద్ర సాహిత్య అకాడమీ దుర్మార్గాలపై విచారణ జరిపించండి అంటూ అకాడమీ రాష్ట్ర కన్వీనర్‌గా పనిచేసిన డాక్టర్ అక్కిరాజు రమాపతిరావుగారు గతంలోనే ఒక లేఖ విడుదల చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని సలహాదారులు, సామ్యవాదులు, దళారులు, శకుని మామలు.. ఇలా ఎందరో కలిసి ఈ పురస్కారాల ప్రక్రియను భ్రష్టుపట్టించారు.
*

-ప్రొ. ముదిగొండ శివప్రసాద్