మెయన్ ఫీచర్

తప్పుడు బిల్లులు.. ఖజానాకు చిల్లులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో అందరికీ ఉచిత వైద్యం లభ్యం కానందున ముఖ్యంగా వైద్య ఖర్చుల పేరిట తలసరి ఆదాయంలో పదిశాతం వెచ్చిస్తున్నందున, ప్రభుత్వం ఉద్యోగుల జీతభత్యాలలో ఏటా రూ.15,000 లేదా నెలకు రూ.1,250 చొప్పున ‘టాక్స్ ఫ్రీ మెడికల్ రీ ఎంబర్స్‌మెంట్’ విధానాన్ని కొనే్నళ్ల క్రితం ప్రవేశపెట్టింది. ప్రభుత్వం సదుద్దేశంతో అమలు చేస్తున్న మెడికల్ రీ ఎంబర్స్‌మెంట్ వల్ల లక్షలాది మంది ఉద్యోగులు లబ్ది పొందుతున్నారు. 10 శాతం టాక్స్ పరిధిలో ఉన్న వారికి రూ.1500, 30 శాతం టాక్స్ పరిధిలో ఉన్న వారికి రూ.4500 వరకు ఇన్‌కంటాక్స్ ఆదా అవుతుంది. కాకపోతే వచ్చిన చిక్కల్లా ఏమిటంటే- దీన్ని దుర్వినియోగం చేయడమే.
అన్ని ప్రభుత్వ శాఖల్లో అకౌంట్స్ డిపార్ట్‌మెంట్ నుంచి ‘జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఫలానా తారీఖు లోపల మెడికల్ బిల్లులు, ఇతర సేవింగ్స్‌కు సంబంధించి ఆధారాలతో పాటు జమ చేయాలి’ అని పిడుగులాంటి వార్త ఉద్యోగులకు అందుతుంది. ఏడాదంతా ఆస్పత్రులకు, మందులకు వేలకు వేలు ఖర్చుపెట్టి, తీరా అవసరమైన సమయంలో ఆ రసీదులు, బిల్లులు కనపడక కొంతమంది, ఈ లబ్ధిని ఎందుకు వదిలేసుకోవాలి అని కొంతమంది ఆందోళన చెందుతారు. ‘అయ్యో.. బిల్లులన్నీ శ్రీమతి ఆఫీసులో జమ చేసింది.. నా బిల్లుల కోసం ఏదో ఒకపక్క త్రోవ చూసుకోవాలి అని అతికొద్దిమంది ఉద్యోగులు ఆలోచిస్తుంటారు. వీరికి తగ్గట్టుగానే కొంతమంది రంగంలోకి దిగి ఆపత్కాలంలో ఆదుకునే వాళ్లలాగ వాళ్లకి కావాల్సినన్ని నకిలీ బిల్లులు తయారుచేసి పెడతారు. ఇలాంటి ఏజెంట్లు 20 శాతం వరకూ ఉద్యోగుల వద్ద కమీషన్ తీసుకొని మెడికల్ దుకాణానికి పది శాతం కమీషన్ ముట్టజెప్పి బిల్లులు సంపాదిస్తారు. మెడికల్ బిల్లులు, పెట్రోల్ బిల్లులు, డ్రైవర్ల జీతాలు, ఎల్టీఏ వంటివి క్లెయిమ్ చేయడానికి నకిలీ బిల్లులను సృష్టించడం దేశంలో సాధారణమైపోయింది. కానీ, ఇటీవల కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఈ విషయాన్ని చాలా తీవ్రతతో పరిశీలిస్తున్నాయి. ఈ విషయం కంపెనీ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించినది, ఉద్యోగుల నైతిక విలువలు, విశ్వాసం, నమ్మకానికి సంబంధించినవని ఇన్ఫోసిస్, ఇంటెల్ వంటి వివిధ ఐటి కంపెనీలు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి.
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఫైనాన్స్ బిల్లు ఆమోదం పొందాక, 2018-19 ఆర్థిక సంవత్సరం నుంచి వేతనం పొందే ప్రతి అసెస్సీకి ఇప్పటివరకు పొందుతున్న టాక్స్ ఫ్రీ మెడికల్ రీఎంబర్స్‌మెంట్, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్‌కు బదులుగా, 40 వేలు ప్రామాణిక మినహాయింపులభ్యమవుతుంది. ఆదాయపు పన్ను మిగులులో లబ్ది చేకూరకపోవడంతో ఈ మార్పును ‘జీరోసమ్ గేమ్’గా పరిగణించినా అడ్మినిస్ట్రేటివ్, ప్రాసెస్, బెస్ట్ ప్రాక్టీసెస్, స్టాట్యుటరీ కంపలియన్స్ పరంగా ఈ నిర్ణయం వలన ఉద్యోగులు, సంస్థలు, పెరోల్ ప్రాసెసింగ్ కంపెనీలకు ప్రయోజనకరమే.
భారతీయ ఆదాయపు పన్ను చట్టం-1961 సెక్షన్ 17(2)లోని నిబంధన (బి) ప్రకారం ఉద్యోగులు గడువు తేదీ లోపల బిల్లులు సమర్పించకపోతే జీతంపై టిడిఎస్ రూపంలో పన్ను పడటం, తర్వాత ఇన్‌కం టాక్స్ రిటర్న్‌లు దాఖలు చేయడం ద్వారా బిల్లులు సమర్పించి రిఫండ్ పొందడం లాంటి పద్ధతికి స్వస్తి చెప్పొచ్చు. ఇప్పటి వరకు కొంతమంది ఉద్యోగులకు ఏటా రూ.15,000 రూపాయల వరకు మెడికల్ రీఎంబర్స్‌మెంట్, రూ.19,200 ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్‌గా జీతంలో ‘టాక్స్ ఫ్రీ’ భత్యంగా పొందేవారు. ఈ రెండు అలవెన్సులు అన్ని సంస్థల్లో ఉద్యోగులందరికీ పూర్తిగా లభ్యమవడం లేదు. చిన్న కంపెనీలు, ఎస్‌ఎంఇలు, టాక్స్ కన్సల్టెంట్లు,పెరోల్ సాఫ్ట్‌వేర్‌లపై ఖర్చు పెట్టలేక లేదా కంపెనీలో మానవ వనరుల విభాగం లేనందువలన లేదా అవగాహనా రాహిత్యం వలనో జీతంలో భాగంగా టాక్స్ ఫ్రీ అలవెన్సులను చేర్చకపోవడమో లేదా పూర్తి మొత్తం పరిగణనలోకి తీసుకోకపోవడమో జరిగి ఉద్యోగులకు ట్యాక్స్ భారం పడేది. పెద్ద కంపెనీలు, బహుళజాతి కంపెనీలు ఉద్యోగులకు ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యం కలిగించడం వలన లేదా ఉద్యోగులకు ఉచిత ఆరోగ్య బీమా పాలసీ కల్పించడం వలనో అందరి ఉద్యోగులకు ఈ అలవెన్స్ కల్పించడం లేదు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అందరు ఉద్యోగులకు తమ కంపెనీ విధానాలు, నిబంధనలకు అతతంగా అందరితో సమానంగా రూ.40 వేలు వరకు స్టాండర్స్ డిడక్షన్ పొందగలుగుతారు.
మెడికల్ రీయింబర్స్‌మెంట్‌పై ట్యాక్స్ మినహాయింపు పొందడానికి ప్రతి సంవత్సరం వైద్య వ్యయ బిల్లులను తమ కంపెనీలలో హెచ్‌ఆర్/ఫైనాన్స్ విభాగాలకు సమర్పించవలసి వస్తుంది. వేలాది ఉద్యోగులు సమర్పించే బిల్లులను తనిఖీ చేయడం, ఆడిట్ కోసం టన్నుల కొలదీ ఉండే ఈ బిల్లులను స్టోర్ రూములలో భద్రపరటం లాంటి నిర్వహణాత్మక చర్యలు నుంచి సంస్థలకు ఉపశమనం కలిగిందనే చెప్పాలి. మెడికల్ షాపులు మందులతో పాటు అలంకార వస్తువులు కూడా విక్రయిస్తున్న తరుణంలో వైద్య బిల్లులు పొందడానికి, కొందిమంది ఉద్యోగులు సబ్బులు, క్రీములు లాంటి నిత్యావసర వస్తువులు కొని మందుల పేరుతో బిల్లులు పొందుతున్నారు. కొంతమంది ఏజెంట్లు 10 శాతం కమీషన్ తీసుకొని సులువుగా బిల్లులు సమకూరుస్తున్నారు. దీంతో నకిలీ మెడికల్ బిల్లులు ఒక పెద్ద సమస్య అయిపోయింది. హెచ్‌ఆర్, ఫైనాన్స్ విభాగాలు నకిలీ బిల్లులను కనుగొన్నప్పటికీ సమయాభావం, వనరులు లేకపోవడం వలన మిన్నకుండిపోతున్నాయి. ఉద్దేశ పూరిత నకిలీ బిల్లులు, మోసపూరిత క్లయిములు లాంటి విషయాలను కొన్ని బహుళజాతి కంపెనీలు చాలా తీవ్రంగా తీసుకొని నకిలీ బిల్లులు సమర్పించిన ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా బయటకు పంపుతున్నాయి.
మెడికల్ బిల్లులు ఆడిటర్లు, ఐటి విభాగాల అధికారులచే పరిశీలింపబడొచ్చు. తమ ఉద్యోగులు పన్ను మినహాయింపు కోసం దాఖలు చేసిన బిల్లుల కచ్చితత్వంపై కంపెనీ యజమానులదే బాధ్యత. నకిలీ బిల్లులను కనుగొనకుండా ఉద్యోగుల నుంచి పన్ను రాబట్టకపోతే అది టిడిఎస్ సంబంధిత జరిమానాలకు దారి తీయవచ్చు. అందుకే చాలా కంపెనీలు,పెరోల్ ప్రాసెసింగ్ సంస్థలు ఈ విషయంలో కఠినమైన ఆడిట్ ప్రమాణాలను ఆచరిస్తున్నాయి.
కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు తక్కువ పన్ను పడేటట్టుగా ‘టాక్స్ ఫ్రెండ్లీ ప్యాకేజీ’ ఇవ్వదలిచి కారు మెయింటెన్స్, డ్రైవర్ జీతం అలవెన్సు లాంటివి కల్పించడంతో మరికొన్ని బిల్లులు కారు క్యూబిక్ కెపాసిటీ ఆధారిత లెక్కలు లాంటివి గందరగోళం ఇంకా కొనసాగుతోంది. కారు నిర్వహణ భత్యం పొందేవారు రవాణా భత్యం పొందలేరు. ఇలాంటి అవినీతిని ప్రేరేపించే అలవెన్సులు, రీయింబర్స్‌మెంట్లు తొలగించి, అందుకు బదులుగా సార్వత్రిక ప్రామాణిక మినహాయింపును ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టడం అందరికీ ప్రయోజనకరమే. అవినీతి తొలగి పారదర్శకత చోటుచేసుకుంటుంది. సమయం ఆదా అయి ఉత్పాదకత పెరుగుతుంది.
యాజమాన్యం నిర్వహించే ఆసుపత్రి లేదా క్లినిక్‌లో లేదా ప్రభుత్వ ఆసుపత్రి లేదా ఆదాయపు పన్ను చీఫ్ కమిషనర్ ఆమోదం పొందిన ఆసుపత్రిలో వెచ్చించే వైద్య ఖర్చులకు ఎటువంటి పరిమితి లేకుండా ఉద్యోగులు పూర్తి పన్ను మినహాయింపు పొందవచ్చు. రూ.15000 రీ యింబర్స్‌మెంట్ వెనక్కి తీసుకొన్నా ఈ మినహాయింపులు కొనసాగుతాయన్న విషయం విదితమే.
ఇన్‌కంటాక్స్ చట్టంలో 80డిడి వంటి సెక్షన్ల కింద- అంగవైకల్యం, దీర్ఘకాలిక అనారోగ్యం బారిన పడితే వారి వైద్యం నిమిత్తం ఖర్చు చేసిన మొత్తంపై కూడా పన్ను వెసులుబాటు కొనసాగుతోంది. ఈ సెక్షన్ కింద లబ్ది పొందడానికని నకిలీ డాక్టర్ సర్ట్ఫికెట్లు, బిల్లులు సమర్పించి పట్టుబడ్డ ఉద్యోగులు కోకొల్లలు. నకిలీ మెడికల్ బిల్లుల కుంభకోణంలో రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు రెండాకులు ఎక్కువే తిన్నారు. ఆ మధ్య పత్రికలలో ఈ కుంభకోణాల గురించి ధారావాహికల్లా వార్తలొచ్చాయి. మహారాష్టల్రోని లాతూర్ జిల్లా పరిషత్‌లో సుమారు 2500 మంది టీచర్లు నకిలీ వైద్య బిల్లులు సమర్పించిన కుంభకోణం వెలుగులోకొచ్చింది. తెలంగాణ నీటిపారుదల శాఖలో నకిలీ వైద్య బిల్లు కుంభకోణం విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ ద్వారా వెలుగులోకి వచ్చింది. వీళ్లు ఏకంగా తమ శాఖలో రిటైరైన ఉద్యోగుల పేరిట వైద్య పరిహారం పథకం కింద లక్షల విలువైన వైద్య బిల్లులు క్లెయిమ్ చేశారని దర్యాప్తు నివేదిక వెల్లడించింది. నకిలీ వైద్య బిల్లుల రాకెట్‌కి సంబంధించి ఇరిగేషన్ శాఖలో ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మెడికల్ రీయింబర్స్‌మెంట్లో మరో భారీ కుంభకోణం తూర్పు గోదావరి జిల్లాలో బిఎస్‌ఎన్‌ఎల్ విభాగంలో బట్టబయిలైంది. ఉద్యోగుల మెడికల్ రీయింబర్స్‌మెంట్ వోచర్లను సరిగా తనిఖీ చేయలేదని, ఆమోద ప్రక్రియలో జాగ్రత్తలు తీసుకోలేదని ధ్రువీకరణ అయింది.
ఒఎన్జీసీ, గెయిల్ లాంటి ప్రముఖ ప్రభుత్వరంగ సంస్థలు కూడా ఈ బోగస్ మెడికల్ రాకెట్‌కి బలి అవుతున్నాయి. కొంతమంది ఉద్యోగులు బోగస్ రసీదులు సృష్టించి లక్షలు కాజేసిన వైనం విజిలెన్స్ శాఖ కోడై కూసింది. ఇటీవల కేరళలో ఏకంగా ఒక పెద్ద తిమింగలమే వలలో చిక్కుకొంది. రాష్ట్ర ఖజానాకు నష్టాన్ని కలిగించే రీయింబర్స్‌మెంట్స్‌ను క్లెయిమ్ చేయాలనే ఆరోపణలకు సంబంధించి, విజిలెన్స్- యాంటీ కరప్షన్ బ్యూరో ఆధ్యర్యంలో ఆరోగ్య, సామాజిక న్యాయ మంత్రి కె.కె.షిలాజాపై ప్రాథమిక విచారం జరిపాక బాగోతం బయటపడింది.
మందుల దుకాణాల వారు ఇలాంటి నకిలీ బిల్లులకు ప్రత్యేక పుస్తకాలను వినియోగిస్తున్నారు. కొంతమంది ‘సాహసం సేయరా డింభకా’ అన్న వైనంలో నకిలీ వ్యాట్, జిఎస్టీ నెంబర్లతో బిల్లు పుస్తకాలు ముద్రణ చేయడానికి ఒడిగడుతున్నారంటే- ఈ విషయంలో ప్రభుత్వం, ఆదాయపన్ను శాఖ, విజిలెన్స్ విభాగాల అలసత్వం, ఉదాసీన వైఖరి తేటతెల్లమవుతోంది. డాక్టర్ల నుండి ధ్రువీకరణ పత్రం పొందడం ద్వారా మెడికల్ రీయింబర్స్‌మెంట్ పొందడంపై ప్రభుత్వ ఉత్తర్వులను పరిమితం చేయాలి. నకిలీ పత్రాలను ఇచ్చే వైద్యులపైనా కఠిన చర్యలు తీసుకోవాలి.

- సునీల్ ధవళ