మెయిన్ ఫీచర్

గుణసంపద.. గురుభక్తితోనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కురు, పాండవ సంగ్రామానంతరం, కౌరవ రాజు ధృతరాష్ట్రుడు, తన వారందరూ యుద్ధంలో మరణించారని వ్యధజెందాడు. ఆశ్రమ ధర్మాన్ని పాటించి, వానప్రస్థ జీవితం అరణ్యంలో తపస్సు చేసుకుంట కాలం గడపాలని దృఢ సంకల్పంతో వున్నాడు. రాజ్యంలో ప్రజలందరినీ సమావేశపరచాడు. వ్యథతో తన సంకల్పమును వివరించి వారి అనుమతిని ప్రార్థించాడు.
ధర్మరాజును మీకూ, మిమ్మల్ని అందరినీ ఆయనకూ అప్పగించిపోతున్నానని తెలిపాడు. ధృతరాష్ట్రుని సంకల్పం విన్న ప్రజలు అందరూ తెల్లమొగాలు వేశారు. ఒకరికొకరు సంజ్ఞలతోనే సంప్రదించుకున్నారు. వారు ధృతరాష్ట్రునికి తమ ఆలోచనను తెలుపుమని ఒక ఉత్తమ విప్రుని తమ ప్రతినిధిగా నిర్ణయించుకున్నారు. ఆ విప్రుడే శంబుడనే మహానుభావుడు. ప్రజల భావాలను చక్కగా సమన్వయం చేసుకొని తెలియజెబుతూ, ప్రధానంగా ధృతరాష్ట్రుడు - దుర్యోధనుడు ఎలాంటి తప్పు చేయలేదనీ జరిగినదంతా ఒక పీడకలయనీ, అంతయూ విధి ప్రేరణతోనే జరిగినదనీ, పాండవులందరూ మహాత్ములనీ, తగిన ఆధారాలతో వివరంగా చెబుతూ, ఆంధ్ర మహాభారతంలో ఆశ్రమవాస పర్వంలోని ఒక పద్యం ద్వారా వివరించాడు తిక్కమ మహాకవి.
పాండవుల గుణగణాలను ఒక కంద పద్యంలో వివరించాడు.
కం శూరులు - శాంత స్వాంతులు
పౌర జన ప్రకర - జానపద చయ నిత్యా
పార ప్రమదా పాదన
పారగుల తుల - గురుభక్తి పరతంత్రాత్ముల్-
అని వర్ణించాడు మహాకవి.
ఈ విషయాన్ని కవి విప్రుడైన శంబుని ద్వారా కురుపతికి విపులీకరిస్తూ, రాజా! పాండవ రాజకుమారులు గొప్ప పరాక్రమవంతులు- ధైర్య గుణ సంపన్నులు. శాంత మనస్కులు. పల్లె, పట్టణాల ప్రజలందరికీ నిరంతరం అంతులేని ఆనందమును కలిగించే విద్యలో ఆరితేరినవారు.
వీరి గుణాలకు ముఖ్యమైన పరిపూర్ణమైన గురుభక్తి. అదే శ్రీకృష్ణ్భక్తిలో పరవశించిన హృదయంగలవారు. భక్తి ప్రక్కనే భగవంతుని నివాసం గదా మరి! శంబుడు పాండవుల శౌర్యమును ముందుగానే ప్రస్తుతించాడు. పరిపాలనా ధర్మమును నెరపడంలో ప్రధాన లక్షణం శౌర్యం. అనగా పట్టుదల సడలని దృఢమైన చిత్తవృత్తి. అదే మనోధర్మంగా ఉంది.
ఇదే విషయాన్ని వాల్మీకి మహర్షి రామాయణం అరణ్యకాండలో ఒక శ్లోకంలో తెలిపారు.
శ్రీరామచంద్రుడు సీతాదేవికి ధైర్యంగా తన దృడ నిర్ణయమును వివరిస్తూ, సీతా! నేను జీవితాన్నైనా వదలివేస్తారు. సోదరుడైన లక్ష్మణునితోపాటు నిన్నైనా వదలగలను కానీ ఆడిన మాటను ముఖ్యంగా బ్రాహ్మణులకు సంబంధించిన దానిని ఎన్నటికీ వదలను అన్నాడు.
అటువంటివానిని ఆచరించడానికి ప్రథమంగా కావలసిన గుండె బలమును శౌర్యం అంటారు. అది నిండుగా గలవారే శూరులు ధీరులు. పాండవులు అట్టివారు. భారతీయ ధర్మంలో రాజు యొక్క జీవనము ప్రజల కోసమే. ఆ రీతిగా జీవించడానికి అవసరమైన మనోధర్మం పాండవులలో ఏ కొంచెమూ లోపం లేకుండా వున్నదని శంబుని ఆలోచన. ప్రధాన భావన.
శౌర్యగుణం శాంత గుణమును చెదరగొడుతుంది. పాండవులలో ఆ చెదరుపాటు కొంచెం కూడా కనబడదు. శాంతం అనగా మనసును తన అధీనంలో ఉంచుకోవడం. ఇంద్రియ వికారములకు లోబడకుండా నిల్పుకోవడం. పాండవుల స్వాంతం శాంతగుణంతో నిండియ్నుది.
ఉద్యోగ పర్వంలో కృష్ణరాయబార సమయంలో శ్రీకృష్ణ భగవానుడు కూడా పాండవులు శాంతశూరులు అనీ, శాంతమైన మనస్సుగలవారు గనుకనే అపకారమే చేసే శీలం గల దుర్యోధనుని ఘోషయాత్రలో గంధర్వులనుండి రక్షించారు. తుదివరకూ పాండవులు సంధినే కాంక్షించారు. ఐదు ఊళ్ళతో తృప్తిపడడానికి సిద్ధపడ్డవారు.
పట్టణాలు - పల్లెలు అనీ రాజ్యంలో రెండు విభాగాలుంటాయి. వీటిని ఎలాంటి భేదం లేని దృష్టితో పాలించడం ఉత్తమమైన రాజు యొక్క ధర్మం- కర్తవ్యం.
పరిపాలన అంటే కంటికి రెప్పలా కాపాడడం. దీని రాజు ఎంతో సమర్థవంతంగా నిర్వహించినపుడు ప్రజలందరిలో ఆనందం తాండవమాడుతుంది. విప్రుడైన శంబుడు చాలా దీర్ఘంగా వివరించినాడు. అలాంటి ప్రజల సంతోషం నిత్యంగా ఉన్నదనీ, నిండుగా వుందనీ, అపారంగా ఉందనీ సమయోచితంగా తెలిపినాడు. ఉత్తముడైన రాజునకు ప్రజల ప్రశంస పరమ ఆనందాన్ని పరమ తృప్తినీ కల్గిస్తుంది అంటూ, ఇది పాండవుల పరంగా శంబుడు విన్నవించాడు.
చివరలో పాండవుల గురుభక్తిని ప్రశంసిస్తూ పాండవులు పై పద్యంలో తెలిపిన విధంగా అతుల గురుభక్తి పరతంత్రాత్ములు అన్నాడు. మహారాజా! తల్లి- తండ్రి-జ్ఞానబోధ చేసి ఆచార్యుడు గురువులు వారియెడల త్రికరణశుద్ధిగా భక్తితో ఉండడం పరమ పదం పొందడానికి సాధనంగా వారు దానికి వశమైన ఆత్మగలవారని తెలిపాడు సమయోచితంగా.
రాజా! వారి రాజధర్మం శాంత ప్రవృత్తిని బాధపెట్టలేదు. ప్రజారాధనను ఏమరునట్లుగా చేయలేదు. ‘రాజ్యాంత నరకం ధృవం’ అని శాస్త్రం గదా! రాజ్యపాలన ముగిసిన పిదప తప్పనిసరిగా నరకం ప్రాప్తిస్తుంది అన్నారు తత్త్వజ్ఞులు. ఆ పరిస్థితి కలుగకుండా కాపాడుకోవడానికి వలసిన ఆధ్యాత్మిక జ్ఞాన సంపదను, తక్కిన గుణాలను చెడగొట్టలేదు అంటూ మహాభారతంలో పాండవుల ఆదర్శప్రాయమైన జీవితం కలవారని ప్రజల తీర్పును ధృతరాష్ట్రునికి మరొకసారి విప్రవరుడైన శంబుడు చక్కగా ఉపదేశించుట సమాజానికి కూడా దివ్య సందేశమే మరి. ఇది ఒకవిధంగా కురురాజుకు ఓదార్పును కూడా కల్గించినదని తిక్కన మహాకవి భారతంలో వివరించారు. తరించి- తరింపజేశారు.

- పి.వి.సీతారామమూర్తి