మెయన్ ఫీచర్

మారని మహానా(యు)డు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాదాపు 50 లక్షల మంది ఇన్సూరెన్సు తీసుకున్న కార్యకర్తలు, పార్టీ ఫిరాయించిన 17 మంది ఎమ్మెల్యేలు, అధికారం వచ్చి రెండేళ్లయినా ఇంతవరకూ రాని పదవుల కోసం చకోరపక్షుల్లా ఎదురుచూస్తున్న తమ్ముళ్ల సాక్షిగా..నేటి నుంచి మొదలుకానున్న టిడిపి మహానాడు కార్యకర్తల బ్రహ్మోత్సవం మూడురోజులు జరగనుంది.
నిజానికి ఎన్టీఆర్ జీవించినప్పుడు జరిగిన మహానాడుతో కలిపి తిరుపతిలో జరుగుతున్న నాలుగవ మహానాడు ఇది. కానీ, పార్టీ నాయకత్వం దీనిని మూడవ మహానాడుగానే ప్రకటిస్తోంది. ఈ 34వ మహానాడులో తీర్మానాలు, ప్రత్యర్థిపార్టీలపై విమర్శలు, అధినేతపై పొగడ్తలు షరామామూలే అయినప్పటికీ, జాతీయ పార్టీగా మార్చిన తర్వాత జరుగుతున్న ఈ మహానాడుకు కొంత ప్రాధాన్యం ఉంది. జరిగిన వ్యవహారాలను సింహావలోకనం చేసుకుని, భవిష్యత్తుపై అంచనాతో పార్టీకి దిశానిర్దేశం చేసే మహానాడుపై శ్రేణుల అంచనాలు భారీగానే ఉన్నాయి.
పదేళ్లపాటు పార్టీ జెండాను భుజం పుళ్లు పడేలా మోసిన కార్యకర్తలకు ఇప్పటివరకూ జరిగింది శూన్యం. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా మాజీ అధికారులకు, సొంత వారికి తప్ప కార్యకర్తలకు పట్టం కట్టిందేమీలేదన్న అసంతృప్తి ఉంది. వైఎస్ పాదయాత్రలో పాల్గొన్న వారందరికీ పదవులు దక్కాయన్న ప్రచారం దృష్టిలో ఉంచుకుని, బాబు కూడా అదే సూత్రం పాటించారు.
కానీ, వైఎస్ వెంట నడిచింది చాలా ఏళ్ల నుంచి పార్టీలో ఉన్నవారైతే, బాబు వెనుక నడిచింది అప్పటికి ఏడాది ముందు మళ్లీ బాబును కలిసిన అధికారులు, జర్నలిస్టులు. ఇప్పుడు వారికే పదవులు దక్కాయి తప్ప, బాబు పాదయాత్ర విజయవంతం కోసం పనిచేసిన వారికి మాత్రం మిగిలిగింది మొండిచేయి. నమ్మినవారికి న్యాయం చేయలేరన్న అపప్రధను బాబు ఇప్పటికీ తొలగించుకోలేకపోయారు. యువ నాయకత్వ ప్రమేయంతో పార్టీకి అద్దిన కార్పొరేట్ సంస్కృతి సంప్రదాయ కార్యకర్తను పార్టీకి మానసికంగా దూరం చేస్తోందన్న ఆవేదన లేకపోలేదు.
తాను మారానని గతంలో ఒకటికి పదిసార్లు చెప్పినప్పటికీ, బాబు ధోరణిలో ఏ మాత్రం మార్పు రాలేదంటున్నారు. సొంత సామాజికవర్గాన్ని ప్రోత్సహించే విషయంలోనే బాబు గత ధోరణి మారింది తప్ప, మిగిలినదంతా పాతదేనని నేతలు విశే్లషిస్తున్నారు. గతంలో సొంత సామాజికవర్గాన్ని ప్రోత్సహించేందుకు భయపడిన బాబు, ఈసారి మాత్రం ఆ విషయంలో ఎవరికీ భయపడటం లేదని, ఈ విషయంలో పుత్రప్రోత్సాహమే ఎక్కువగా ఉందంటున్నారు. అయితే, అది మోతాదు మించుతున్న ప్రమాదం కనిపిస్తుంది. దానివల్ల మిగిలిన వర్గాలు దూరమవడంతోపాటు, ఏకమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తాను తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు అధికారులకు ఎక్కువ విలువ ఇచ్చి, కార్యకర్తలను విస్మరించానని, పొగడ్తలకు పొంగిపోయి, వాస్తవాలు తెలుసుకోలేకపోయానని, అధికారంలోకి వస్తే మీకే తొలి ప్రాధాన్యం ఇస్తానని ఎన్నికల ముందు కార్యకర్తలకు బాబు చేసిన బాసలు గాలికెగిరిపోయాయి. అసలు కార్యకర్తలను కలవడమే కష్టమయింది. పదేళ్లు పార్టీ కోసం పనిచేసిన తనకు ఇప్పటివరకూ బాబు, లోకేష్ అపాయింట్‌మెంట్ దొరకడం లేదని సినీ నటి కవిత ఎన్నోసార్లు మీడియా ముందు కన్నీరు పెట్టుకున్నారు. ఎమ్మెల్యేలకే సమయం ఇచ్చే పరిస్థితి లేదని, ఈ విషయంలో బాబు మళ్లీ పాత ధోరణిలోనే కనిపిస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సీఎంఓలో కూడా ప్రజాసంబంధాలున్న వారు ఒక్కరూ లేరంటున్నారు. కాంగ్రెస్ హయాంలో ఒక వెలుగు వెలిగిన వారికి మళ్లీ అందలం ఎక్కిస్తున్నారు. వారిని మార్చాలని ఎన్ని ఒత్తిళ్లు వస్తున్నా అప్పుడు ఉండొచ్చు. ఇప్పుడు బాగానే పనిచేస్తున్నారు కదా అని స్వయంగా బాబు ప్రశ్నించడంతో నేతలు బిత్తరపోతున్నారు.
అటు చాలామంది అధికారులు కూడా బాబు పనితీరుతో విసుగెత్తిపోతున్నారు. సమీక్షలు, సమావేశాల విషయంలో బాబు వైఖరిలో మార్పు రాలేదు. గంటలపాటు తమ సహనాన్ని పరీక్షిస్తున్నారని, సమావేశాల వల్ల పని జరగడం లేదని, అందుకే తాము కూడా అంకెలగారడీ చేయాల్సి వస్తోందంటున్నారు. ఈసారి ఉద్యోగులను ఎక్కువ కష్టపెట్టనని చెప్పినప్పటికీ, అది ఆచరణలో కనిపించడం లేదంటున్నారు.
నిజానికి బాబు అనుభవానికి 13 జిల్లాల పాలన పెద్ద సమస్య కాదు. సమైక్య రాష్ట్రానికి సీఎంగా పనిచేసిన దానికంటే, ఎక్కువ కష్టపడుతున్నారు. ప్రతిపక్షాలు లేని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆడుతూపాడుతూ పరిపాలిస్తుంటే, బాబు మాత్రం అటు ప్రతిపక్షం ఇటు సమస్యలతో పోరాడవలసి వస్తోంది. బాబు నిత్యం కష్టపడుతున్నప్పటికీ అది నిష్ఫలమేనంటున్నారు. మునుపటి మాదిరిగానే కలెక్టర్లు, ఎస్పీలకు పెత్తనం ఇవ్వడం వల్ల మంత్రులు బాబుకు మానసికంగా దూరమవుతున్నారు. ఫలితంగా బాబు ఎవరినీ సొంతం చేసుకోలేకపోతున్నారు. మనమడిని ఎత్తుకునే వయసులో కూడా కాళ్లకు బలపాలు కట్టుకుని, రాష్ట్భ్రావృద్ధి కోసం తపిస్తోన్న బాబు ఎక్కువ కష్టపడకుండా, మంత్రులు, నేతలకు స్వేచ్ఛ ఇస్తే ఎక్కువ ఫలితాలు వస్తాయ. నిజానికి, తెలంగాణతో పోలిస్తే ఏపిలో అవినీతి ఎక్కువగా ఉందన్న నిజం సర్వేలు కూడా తేల్చాయి. తెలంగాణలో అది కొంతమందికే పరిమితమైతే, ఏపిలో విస్తృతమయింది. ఎమ్మెల్యేల విచ్చలవిడితనంతో పార్టీ పరువు రోడ్డెక్కింది. బాబు తొమ్మిదేళ్లు సీఎంగా చేసినప్పుడు కూడా ఇంత బరితెగింపు ధోరణి లేదని, చివరకు సొంత పార్టీ నేతల ఆస్తులే కొల్లగొడుతున్న దారుణం నెలకొందని సీనియర్లు వాపోతున్నారు. అగ్రనేతల సంతానాలు జనాలను దోచుకుంటున్నారన్న భావన సొంత పార్టీ శ్రేణుల్లోనే నెలకొంది. వాటిని అనుభవిస్తోన్న జనాలకు ‘కాంగ్రెస్ వాళ్లే నయమన్న’ భావన మొదలయింది. ఇది పార్టీ భవిష్యత్తుకే ప్రమాదకరం, దీనిని గాడిలో పెడితేనే పార్టీకి ఆరోగ్యం.
ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్న యువనేతలు, అధికారం అనుభవిస్తూ జనాలకు చేరువయ్యే బదులు ఇప్పటినుంచే అడ్డదార్లు తొక్కితే, ఇక పార్టీకి మిగిలేది ఎవరన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కొందరు యువనేతల చర్యల వల్ల జనంలో పేరు ప్రతిష్ఠలు తెచ్చుకున్న వారి తలిదండ్రుల పేర్లు అప్రతిష్ఠపాలవుతున్నాయని సీనియర్లు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.
పదేళ్లు తాము ఎవరిమీదయితే పోరాడామో అదే దళారులు, నేతలే ఇప్పుడు తమ ప్రభుత్వంలో కూడా పెత్తనం చేస్తున్న దుస్థితి ఉందని తమ్ముళ్లు వాపోతున్నారు. ప్రతిపక్షంలో ఉండగా తాము ఏ కంపెనీలకు వైఎస్ అడ్డగోలుగా కాంట్రాక్టులు ఇచ్చారని పోరాడామో, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే కంపెనీలను అందలమెక్కిస్తుంటే ఇక విశ్వసనీయత ఎక్కడ ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. అవే కంపెనీల అధిపతులు పార్టీ నాయకత్వానికి దగ్గరగా ఉంటే, వాటిని వ్యతిరేకించిన తాము మాత్రం అపాయింట్‌మెంట్ల కోసం గేటు బయట ఉండాల్సిన దుస్థితి ఏర్పడిందన్న ఆవేదన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
పార్టీ జెండా మోయని వారిని, ప్రతిపక్షంలో ఉండగా తమపై కేసులు పెట్టిన వారిని అందలమెక్కిస్తే, ఇక పార్టీలో మనస్ఫూర్తిగా పనిచేసే వాతావరణం ఎందుకుంటుందని శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. మరి అధికారం వచ్చి ఎవరికి లాభమన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అధికారం వచ్చింది తమకు కాదని, దళారులు, ఫిరాయింపుదారులు, వ్యాపారస్తులకేనన్న భావన బలంగా నాటుకుపోయింది. మరి దీనిపై మహానాడు ఎలా స్పందిస్తుందో చూడాలి.
వైసీపీ నుంచి చేరిన ఎమ్మెల్యేలతో పార్టీ బలపడిందని భావిస్తున్నప్పటికీ, అది వాపేనని నేతలు స్పష్టం చేస్తున్నారు. పోలీసుల సమక్షంలో మినీ మహానాడు నిర్వహించుకున్నారంటే పార్టీలో క్రమశిక్షణ ఏస్థాయిలో దిగజారిందో, బాబంటే ఏ స్థాయిలో భయం పోయిందో చెప్పకనే చెబుతుందని విశే్లషిస్తున్నారు. అధినేత అంటే గతంలో అంతో ఇంతో నేతలకు భయం ఉండేది. వైసీపీ ఎమ్మెల్యేలకు కండువాలు కప్పిన తర్వాత ఆ భయం కూడా పోయింది.
ఈ రెండేళ్లలో అమరావతిలో మోదీ ఇచ్చిన నీళ్లు, మట్టి తప్ప ఒక్క ఇటుక కూడా రాలేదు. ఇంకా పిల్లిమొగ్గలు వేస్తూనే ఉంది. ఇది బాబు ప్రతిష్ఠకు సవాలుగా మారింది. ఐటి ప్రమోషన్‌కు మారుపేరయిన బాబు, ఇప్పటివరకూ ఏపికి ఒక్క ఐటి కూడా తీసుకురాలేకపోయారన్న భావన యువకుల్లో ఉంది. కొత్త రాజధానిని వృద్ధి చేస్తారన్న నమ్మకంతోనే బాబును గెలిపించారు. ఆ నమ్మకంలో సగం శాతం కూడా ఈ రెండేళ్లలో సాధించలేకపోయారు.
వాజపేయి హయాంలో వెలిగిన బాబు ప్రభ..మోదీ హయాంలో కొడిగట్టడంతో బాబుకు జాతీయ స్థాయిలో ఇమేజ్ తగ్గిపోయింది. మునుపటి మాదిరి తన అవసరం లేకుండానే, ఢిల్లీ బండి నడుస్తుండటమే దానికి కారణం. దానితోపాటు బిజెపితో సంబంధాలు కూడా సందేహంగానే మారింది. పై స్థాయిలో బాగానే ఉన్నప్పటికీ కిందిస్థాయిలో మాత్రం మనసులు కలవడం లేదు. ఈ విషయంలో ఢిల్లీ నాయకత్వం బాబును అనుమానిస్తోంది. ఆయన ఆదేశాలతోనే టిడిపి నేతలు తమను విమర్శిస్తున్నారని, హోదాపై ఉద్యమిస్తున్న కెవిపితోపాటు, మరికొందరు ఉద్యమకారుల వెనుక టిడిపి ప్రోత్సాహం ఉందన్న అనుమానం ఢిల్లీ నాయకత్వంలో స్పష్టంగా ఉంది. పైగా బాబును మోదీ నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. ఢిల్లీతో సంబంధాలు పునరుద్ధరించుకుంటేనే, బాబు పెట్టుకున్న అమరావతి ఆశలు నెరవేరతాయి. వీటిపై మహానాడు నుంచి ఎలాంటి స్పష్టత వస్తుందో చూడాలి.

- మార్తి సుబ్రహ్మణ్యం