ఈ వారం కథ

ఉపకారం మామ్మ? - కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇల్లంతా మామిడి తోరణాలు కట్టడం పూర్తయింది. వీధి చావిడి, మండువా, నడవా, గదుల గుమ్మాలన్నింటికి బంతిపూలతో అలంకరణ పూర్తయింది. వీధిలో వేసిన పెద్ద తాటాకు పందిరి. దాని రాటలకు కొబ్బరాకులు చుట్టి అలంకరించారు. నేలంతా ఆవుపేడతో అలికి ముగ్గులు తీర్చిదిద్దారు. పెరట్లో గాడిపొయ్యి దగ్గర వంటవాళ్ళు ‘సారె’కోసం మిఠాయి చేస్తున్నారు. ఆ పక్కనే ఇత్తడి గాబులో కాఫీ మరుగుతోంది. ఉదయం టిఫెనుకోసం ‘‘వాసిన పోళి, గారెలు, పచ్చడి, ఉప్మా తయారవుతున్నాయి. కమ్మనైన వీటి సువాసనలు అక్కడివారి ఆకలిని పెంచే విధంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా పెళ్ళి కళ ఉట్టిపడిపోతోంది.
పెళ్ళికొడుకూ పెళ్ళికూతురూ ఫారిన్‌లో చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నవాళ్ళయినా తాత, తండ్రులది కోనసీమలోని పక్కపక్క గ్రామాలు కావడంతోను, అక్కడ పెద్దపెద్ద మండువా ఇళ్ళు ఉండడంతోనూ, అక్కడే పెళ్ళిచేసుకుందామనుకున్నారు. పెరట్లో ఉన్న రెండెకరాల కొబ్బరితోట వీరి వివాహానికి వేదిక కానుంది. ఫంక్షను హాల్లో పెళ్ళి, బఫే భోజనాలకి అలవాటుపడిన బంధువులు, స్నేహితులూ అందరూ ఆ మాఘమాసపు పల్లెటూరి పెళ్ళికి మూడురోజుల ముందే తరలివచ్చారు. వచ్చిన అతిథులందరికి ఏ లోటూ లేకుండా అన్ని ఏర్పాట్లూ సమకూర్చబడ్డాయి.
* * *
అంత హడావిడిలోనూ కామేశ్వరి కనబడకపోయేసరికి కంగారుపడింది రాజ్యం. బారెడు పొద్దెక్కింది. వంటవాళ్ళు ఉదయం ఫలహారాలు తయారుచెయ్యడమైపోయింది. మధ్యాహ్నం భోజనంలోకి ఏం కూరలు వండించాలో ఏమో ఈ కామేశ్వరి కనబడదేం అనుకుంటూ వీధి సావిడి నుంచి నూతి పళ్ళెంవరకు వెదుకుతూ పెరట్లో ఉన్న చావిడిలోకి వచ్చింది రాజ్యం.
* * *
కావమ్మగారూ అని పిలువబడే డెబ్బై రెండేళ్ళ కామేశ్వరి రెండొందల గడప ఉన్న అందమైన ఆ అగ్రహారంలో అందరికి తలలో నాలుకే. ఎప్పుడు ఆ ఊరు వచ్చిందో ఎవరికీ తెలీదు. ఎవరింట్లో ఏ సాయానికైనా నేనున్నాను అంటూ ప్రత్యక్షమవుతుంది. పెళ్ళీపేరంటం, పురుడూ, పుణ్యం, పండుగ, పబ్బం, ఇదీ, అదీ అని లేదు, మంచి, చెడ్డా అని అసలే లేదు. ఎలాంటి సందర్భమైనా కాకితో కబురంపినా రెక్కలు కట్టుకుని వాలిపోతుంది. అవలీలగా ఒంటిచేత్తో వందమందికి వండి వార్చేయగలదు. అగ్రహారంలో ఏ ఇంటి బాలింత ఉన్నా పత్యం తయారుచేసి పెట్టడం, నెలపురుడు వెళ్ళేవరకు పసిపిల్లలకి నలుగు పెట్టి స్నానం చేయించడం, ఏం ఇంట్లో పండుగలకు కొత్తల్లుళ్ళు వచ్చినా ఆ ఇంట నాలుగురోజుల ముందునుంచే పిండి వంటలుచేసి పెట్టడం, ప్రతీ ఇంటి దీపారాధనకూ కావలసిన వత్తులు చేసిపెట్టడం, ఇవన్నీ కామేశ్వరి ఏ ప్రతిఫలం ఆశించకుండా మనస్ఫూర్తిగా సంతోషంగా అందించే సేవలు. ఆవిడ చేతిలో అమృతం ఉండేదో ఏమో ఏం వండినా అద్భుతమైన రుచితో ఉండేవి. బొబ్బట్టు చేసినా, కరకరలాడే దిబ్బరొట్టి కాల్చినా, రోటి పచ్చళ్ళు రుబ్బినా ఆ ఇంటిల్లిపాది లొట్టలేసుకుంటూ తినాల్సిందే. ఎవరో ఒకరింట్లో మధ్యాహ్నం భోజనం చెయ్యడం, రాత్రి తన గదికొచ్చి ఏ మజ్జిగో తాగి పడుకోవడం, మళ్ళీ మరునాడు ఏ ఇంటికి ఏ అవసరానికి తాను ఉపయోగపడతానా అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటుంది. ఇదే ఆవిడ దినచర్య. అందుకనే ఆ ఊరి వాళ్ళందరి ఇళ్ళ కుటుంబ సభ్యుల సంఖ్యలోనూ, కామేశ్వరి చేరిపోతూ ఉంటుంది. సమవయస్కులు ఆవిడని కామేశ్వరీ అని, కొంచెం చిన్నవారు కావమ్మగారూ అని, ఈతరం పిల్లలు ఉపకారం మామ్మగారూ అని ఆవిడ్ని అభిమానంగా పిలుచుకుంటారు. ఆవిడ వ్యక్తిగత జీవితాన్ని గురించి ఎన్నిసార్లడిగినా ఆవిడ దగ్గర చిర్నవ్వే సమాధానం వచ్చేది. మీరందరూ నా బంధువులేనర్రా ఈ ప్రపంచమంతా నాకుటుంబమే అంటూ తప్పించుకునేది. పరోపకారార్థం జీవిస్తున్న ఆవిడను గురించి మరి ఎవరూ ఏమీ ప్రశ్నించేవారు కాదు. ప్రస్తుతం ఆవిడ రాజ్యంగారి ఒక్కగానొక్క కొడుకు రాఘవ కూతురు వింధ్య పెళ్ళిపనులకోసం రాజ్యం వాళ్ళింట్లోనే ఉంటోంది. ఈ కుటుంబమంటే కామేశ్వరికి ప్రత్యేకమైన అభిమానం కూడా. రాజ్యం కొడుకు రాఘవకి హైద్రాబాద్‌లో ఉద్యోగం. అతని కూతురి పెళ్ళే ఇప్పుడు జరగబోయేది. రాజ్యం భర్త కాలంచేసాక ఆస్తిపాస్తులు చూసుకుంటూ మరిది కుటుంబంతోపాటు ఆ పల్లెటూళ్ళోనే ఉండిపోయింది.
ఇల్లంతా వెదుకుతూ పెరిటిసావిట్లో ఉన్న మూలగదిలోకి వచ్చింది రాజ్యం. అక్కడ నిద్రపోతున్న కామేశ్వరిని చూసి ‘‘అదేవిటీ ఈవిడ ఇంకా నిద్ర లేవలేదూ సూర్యోదయానికి ముందే అందరికీ అన్నీ అమర్చిపెట్టే మనిషి ఇవాళ ఏమైంది వంట్లో బాగోలేదా అనుకుంటూ నుదుటిమీద చెయ్యివేసింది. కరంటుషాక్ కొట్టినట్టుగా ఉలిక్కిపడింది. మంచు ముద్దలా కామేశ్వరి దేహం. గుండె దడదడ లాడుతుండగా ఆవిడ ముక్కుదగ్గర వేలుపెట్టి చూసింది. శ్వాస ఆడటం లేదు. వళ్ళంతా చెమటతో ముద్దయిపోయింది రాజ్యానికి. కాళ్ళు వణుకుతుండగా అక్కడే కూలబడిపోయింది.
‘‘హారి భగవంతుడా ఏవిటిదారి. ఇంటి నిండా పెళ్ళివారు. మరో రెండు రోజుల్లో పెళ్ళి. ఈ టైంలో ఈవిడ ఇక్కడ మరేమీ ఆలోచించ లేకపోయింది. రాజ్యానికి నోరు పిడచకట్టుకుపోతోంది. రాకరాక కొడుకుకోడలు వచ్చి మనవరాలి పట్టుదలతో తన దగ్గర పెళ్ళిచేస్తున్నారు. బోలెడంత డబ్బు ఖర్చుపెట్టి ఏర్పాట్లన్నీ చేసారు.’’ రాజ్యం మెదడులో కందిరీగల్లా ఆలోచనలు.
అయోమయంగా వెర్రి చూపులు చూస్తున్న రాజ్యం దగ్గరికి ‘‘అక్కా ఇక్కడున్నావా? అవతల పెళ్ళికూతుర్ని చేసే టైమవుతోంది త్వరగారా’’ అంటూ రాజ్యం ముఖం చూసి ఆగిపోయింది తోటికోడలు మణి. పరిస్థితి అర్ధంచేసుకుని ‘‘అయ్యో ఇదెక్కడి ప్రారబ్దం అక్కయ్యా పెళ్ళింట్లో. ఇప్పుడేం చేద్దాం? పోనీ ఏదో ఒక ఆసుపత్రిలో ఏవీ ఎరగనట్టు జాయిన్ చేద్దామా. మిగతా విషయం పెళ్ళి తరువాత చూడవచ్చు’’అంది. మనిషి పోయిందని వాళ్ళు అప్పుడైనా చెబుతారు కదామణీ. అయినా నాలుగురోజులకి గాని పెళ్ళి హడావిడి అవదు. అన్ని రోజులూ... ఏం పాలుపోవడం లేదు మణీ, ఈలోపు ఈ విషయం మగ పెళ్ళివారికి తెలిస్తే’’అంది రాజ్యం జేవురించిన ముఖంతో. పైగా వాళ్ళందరూ విడిదికి వచ్చేసారు కూడాను.
‘‘కంగారు పడకు అక్కయ్యా’’ మీ మరిదితో మాట్లాడదాము’’ అంటూ భర్త రామాన్ని రహస్యంగా పిలుచుకొచ్చింది. విషయం విన్న రామం ‘‘టౌన్లోఉన్న ఆసుపత్రి మార్చురీకి బాడీని పంపేద్దాం. తరవాత చూద్దాం’’.అన్నాడు. ‘‘అన్నిరోజులు అక్కడ ఎలా ఉంచుతాం రామం.’’ అంది రాజ్యం.
పోనీ ఊరు వాళ్ళందరికీ కావల్సిన వ్యక్తేకదా ఈవిడ. ఎవరో ఒకరు ముందుకు వచ్చి ఈవిడకి కర్మకాండలు జరిపిస్తారేమో అంది మణి. ‘‘అది జరిగే పనేనా ఇలాంటి బాధ్యతను ఎవరు తలకెత్తుకుంటారు?’’ అన్నాడు ఆలోచిస్తూ.
తల్లి, పిన్ని బాబయ్య కూడా ఇంట్లో కనబడకపోయేసరికి రాఘవ కూడా అక్కడికి వచ్చాడు ఏమైందంటూ. నిస్సత్తువగా కూలబడ్డ తల్లిని చూసి కంగారుపడ్డాడు. రామం విషయం విడమర్చి చెప్పాడు రాఘవతో. అతను కూడా మణి అన్నట్టుగానే ఎవరైనా ముందుకొస్తారేమో తెలుసుకోడానికి ఊళ్ళోకి వెళ్ళారు. ఈ హడావిడికి ఇంట్లో వాళ్లందరికీ, ఇరుగుపొరుగు వారికీ విషయం పొక్కిపోయింది. ఒక్కొక్కరూ ఒక్కొక్క సలహా ఇవ్వడం మొదలుపెట్టారు. రేగిపోయిన జుట్టుతో కామేశ్వరి శరీరం పక్కనే నీరసంగా, కారుతున్న కన్నీటిని కూడా తుడుచుకోకుండా శూన్యంలోకి చూస్తున్న రాజ్యం చుట్టూ చేరారందరూ. పావుగంటలో తిరిగి వచ్చారు. రామం రాఘవ.
‘‘ఏమైందండీ ఎవరైనా ముందుకొచ్చారా’’ అంది మణి.
‘‘సంబంధం లేని మైలని మేమెందుకు తలకెత్తుకుంటాం. మీ ఇంట్లో జరిగింది గాబట్టి మీదే బాధ్యత’’ అన్నారు. లేకపోతే పంచాయితీ ఆఫీసుకు ఫోన్‌చేస్తే వాళ్ళే వచ్చి తీసుకుపోతారు’’ అని సలహా కూడా ఇచ్చారట. ఆమాటకి చివ్వున తలెత్తింది రాజ్యం. ‘‘అయ్యో అనాధ శవంలా అలా వద్దు’’ అంది బాధగా. ‘‘అంటే ఆవిడ అనాధ కాదా? ఉండి ఉంటే ఆవిడ బంధువులకి కబురు పెట్టండి. ఎవరో ఎక్కడ్నించి వచ్చిందో తెలినీ ఆవిడకి పెళ్ళిపీటల మీద కన్యాదానం చెయ్యాల్సిన నేను గుండు కొట్టించుకుని ఈ అనాధ ప్రేతానికి కర్మకాండలు చెయ్యాలా’’ అన్నాడు రాఘవ. ‘‘అది కాదురా అని రాజ్యం ఏదో చెప్పబోయేలోపే’’ ‘‘చాలమ్మా ఇంక ఆపు ఒక వంటావిడకోసం నువ్వింతలా బాధపడిపోవడం నాకు ఆశ్చర్యంగా అనిపిస్తోంది. అయినా ఆవిణ్ని అసలు ఎందుకు పిలిచావు. డబ్బు పడేస్తే బోలెడంతమంది పనివాళ్ళు దొరుకుతారు. నీకుమరీ కాపెన్నం ఎక్కువైపోయిందమ్మా’’ అన్నాడు చిరాగ్గా.
‘‘అయ్యో అలా అంటావేంట్రా నిన్నటిదాకా జిఱ్రురచీది ఎరుగని మనిషి. ఇలా జరుగుతుందని ఎవరనుకుంటారు. మంచి మనిషి. తన చేత్తో ఏ పని చేసినా మంచే జరుగుతుంది’’ అంది రాజ్యం బాధగా. ఈలోపు పనిమనిషి రత్తాలు ‘‘ఓయమ్మా నీకప్పుడే నూరేళ్ళు నిండిపోయాయా అంటూ’’ ఏడుస్తూ పరిగెత్తుకొచ్చింది.
‘‘ష్’’గట్టిగా అరవకు నీకావిడమీద అంత ప్రేముంటే మీ యింటికి శవాన్ని తీసుకు నీ మొగుడు చేత కర్మకాండలు చేయించు. ‘‘గయ్యిమన్నాడు రాఘవ. ఊహించని అతని మటలకి బిత్తరపోయింది రత్తాలు.
ఇంతలో రామం కొడుకు వాసు పరిగెత్తుకొచ్చి ‘‘నాన్నా మామ్మగారి రేకు పెట్టెలో ఇవి దొరికాయి’’అంటూ ఓ బాంకు పాసు పుస్తకం ఓ పాతకాలంనాటి ఫొటో పట్టుకొచ్చాడు. ఆత్రంగా పాసుపుస్తకం తెరిచాడు రామం. అందులో ముప్ఫైనాలుగువేల ఐదువందల బాలెన్సు ఉంది. పుస్తకంలో చిన్న కాగితం మడత కూడా ఉంది. అందులో ‘‘అడపా దడపా ఎవరైనా బహుమతిగా నా చేతిలో పెట్టిన మొత్తాన్ని దాచాను. ఈ సొమ్ము నా కర్మకాండలకి వాడండి’’అని రాసి ఉంది. పుస్తకంతోపాటు ఉన్న ఫొటోని చూస్తున్న రామం కళ్ళు వెడల్పయ్యాయి. గబుక్కున ఆ ఫొటోని లాక్కోబోయింది రాజ్యం. అందనివ్వలేదు రామం. ఆతృతంగా రాఘవ ఆ ఫోటోలోకి తొంగిచూసాడు. విచిత్రంగ అతని కళ్ళు ముడుచుకున్నాయి. ఫొటోలో ఉన్నది తన తండ్రి పక్కన మరొక స్ర్తి, ఆవిడ చేతిలో ఒక చంటి బిడ్డ, ఫొటో వెనకాల అది తీయించుకున్న సంవత్సరం, స్టూడియో పేరు కలకత్తా అని ఇంగ్లీషులో రాసి ఉంది.
రాఘవ ఆవేశంగా రాజ్యం దగ్గరికి వచ్చాడు.
ఈ ఫొటోలో ఉన్నది నానే్ననా. మరి ఆవిడెవరు? ఈ ఫొటో కామేశ్వరమ్మ పెట్లోకెలా వచ్చింది? గబగబ అడుగుతున్నాడు. రాజ్యం కూడా ఫొటోని దీక్షగా చూసి అందులో ఉన్నది తన భర్తేనని చెప్పింది.
అంటే మరీవిడ ఎవరు? ఆవిడ చేతిలోని పిల్లాడెవరు? నిజం చెప్పమ్మా నువ్వేదో దాస్తున్నావమ్మా’’ అన్నాడు కళ్ళు పెద్దవిచేస్తూ.
అందులో ఉన్న పిల్లాడివి నువ్వే, నిన్ను ఎత్తుకున్నది మరెవరోకాదు కామేశ్వరీ అని పిలువబడే ఈవిడే’’ అంది నిర్లిప్తంగా.
అంటే.... అయోమయంగా చూసాడు రాఘవ.
‘‘మీ నాన్నగారు పెళ్ళికాక ముందునుంచే ఫుట్‌బాల్ ఆడుతుండేవారు. నేషనల్ ఛాంపియన్ కూడా. మోహన్‌బగాన్ టీంలో ఆడుతూ తరచుగా కలకత్తా వెడుతూండేవారు. అక్కడే పరిచయమైంది కోమలీముఖర్జీ అనే బెంగాలీ అమ్మాయి. ఆ అమ్మాయే ఈ కామేశ్వరమ్మ. మీనాన్న తనని ఇష్టపడి అక్కడే పెళ్ళిచేసుకున్నారు. ఆ విషయం ఎవ్వరికీ ఇక్కడ చెప్పలేదు. చిన్నప్పటినుంచి పెంచి పెద్దచేసిన మేనమామ అభ్యర్థనను కాదనలేక ఆరోగ్యం సరిగా లేని నన్ను పెళ్ళాడారు. పెళ్ళై చాలారోజులైనా నాకు పిల్లలు కలగలేదు. డాక్టర్లు మరి పుట్టరని చెప్పేసారు.
సంతు లేకుండా పోతుందే అని బాధపడుతున్న నాకు మెల్లగా ఒక రోజు మీనాన్న కోమలి విషయం చెప్పారు. తమకి రెండేళ్ళ బాబు గూడ ఉన్నాడని నీకిష్టమైతే వాళ్ళని తీసుకుని వస్తానని చెప్పారు. ఈ ప్రతిపాదనకి మొదట నేను ఒప్పుకోలేదు. ఏడ్చి గొడవచేసాను. తరువాత మెల్లగా సరేనన్నాను. ఆయన తరువాత కలకత్తానించి నిన్ను మాత్రమే తీసుకువచ్చారు. కోమలి నా కాపురంలో నిప్పులు పోయడానికి ఇష్టపడ రాలేదట. బంధువుల అబ్బాయిని దత్తత చేసుకున్నామని అందరికీ చెప్పి నిన్ను పెంచాము. మా నాన్న పోయిన నాలుగైదేళ్ళకి కోమలి వెదుక్కుంటూ మనింటికి వచ్చింది. తనకక్కడ ఎవరూలేరని తలదాచుకోవడానికి కాస్తంత చోటిమ్మని అడిగింది. కాని నిన్ను నానుంచి ఎక్కడ దూరం చేస్తుందో అని భయపడి నేను తనని దగ్గరకి రానీయలేదు. పైగా విషయం ఎవరికైనా చెబితే నిలువనీడ లేకుండా చేస్తానని బెదిరించాను. అందుకనే దూరంగా చిన్న ఇంట్లో ఉంటూ తను దూరంనించి చూసి ఆనందిస్తూ విషయం పెదవి దాటకుండా ఇన్నాళ్ళూ మాట నిలబెట్టుకుని చివరికి తన మనవరాలి పెళ్ళి యింట్లో... అంటూ మరి మాటరాక కొంగు నోటికడ్డంబెట్టుకుంది.
రాఘవ కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. కన్న కొడుకునై ఉండి ఎంత అన్యాయంగా మాట్లాడాను. తనేనా అనాధ, వంట మనిషి అంటూ... ఛా నేనసలు మనిషినేనా అనుకుంటూ పశ్చాత్తాపంతో రగిలిపోతూ కామేశ్వరి కాళ్ళముందు పడి వెక్కివెక్కి ఏడవసాగాడు. అతన్ని ఓదార్చడం అక్కడున్న వాళ్లతరం కావట్లేదు.
ఎప్పుడు వచ్చిందో ఇదంతా చూస్తున్న వింధ్య గబగబ తండ్రి దగ్గరకొచ్చి బాధపడకండి నాన్నా ‘‘ఉపకారం మామ్మగారికి అదే నాన్నమ్మకి మీరే అంత్యక్రియలు చేయండి. నా పెళ్ళి కొన్నాళ్ళు వాయిదావేసుకుందాం. ఆవిడని మీ చేత్తో పుణ్యలోకాలకి పంపండి నాన్నా. ఈ విషయం దిలీప్ వాళ్ళు కూడా (మగపెళ్ళివారు) అర్థంచేసుకుంటారు ప్లీజ్’’ అంది ఏడుస్తూ.
బరువెక్కిన గుండెతో తదుపరి కార్యక్రమంకోసం కదిలాడు రాఘవ. *

రచయిత్రి సెల్ నెం: 8019261852

- గంటి ఉషాబాల