మనలో - మనం

మనలో-మనం ( ఎడిటర్‌తో ముఖాముఖి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్.కె. హైదరాబాద్
సమాజాన్ని అనేక కోణాలలో తూర్పారబట్టిన, మహా కవులైన వారిని గొప్పవారుగా గుర్తించి గౌరవించిన వారే, సామాన్యులు చేసే విమర్శలను నెగెటివ్ థింకింగ్‌గా భావిస్తారెందుకు?
ఆ గొప్పవారూ వారి సమకాలికుల చేత ఇలా తిట్లు తిన్నవారే.

డి.వెంకట్రావు, ఉయ్యూరు
తెలంగాణలో టి.ఆర్.ఎస్. - టి.డి.పి. - కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం, ఏ.పి.లో టి.డి.పి - వై.సి.పి సంకీర్ణ ప్రభుత్వం నడుస్తోంది. ఉత్తరాఖండ్‌లో బిజెపి కూడా అలాంటి దుష్ట సంప్రదాయానికి తెర తీసి భంగపడింది. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం పట్ల, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేని ఇలాంటి జంప్‌జిలానీలను చట్టసభలకు పంపిన ఓటర్లు ముమ్మాటికి దోషులంటాను. అవునా కాదా?
కాదు.

ఎన్.ఆర్.లక్ష్మి, సికిందరాబాద్
అన్ని సీజన్లలోనూ రెండు చేతులా సంపాదిస్తున్న పురోహితులకు పిల్లనివ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఆడపిల్లలు కూడా సాఫ్ట్‌వేర్లు, ప్రభుత్వ ఉద్యోగస్తులనే కోరుతున్నారు. పురోహితులంటే అంత చిన్నచూపెందుకో?
కొంత స్వయంకృతం.. కొంత సమాజకృతం.. ముందు పురోహితుల వైఖరి మారాలి.

కాకుటూరి సుబ్రహ్మణ్యం, కావలి
ఇటీవల భవిష్య కాలంలోని కూపను సైజు పూర్తిగా తగ్గించి వేశారు. ప్రశ్న రాయడానికి కనీసం అవసరమైన పది అక్షరాలు రాయడానికి కూడా ఆ స్థలం చాలదు. కావున దయచేసి గతంలో వలె ఈ శీర్షిక సైజును పునరుద్ధరించండి.
కూపన్ మీద స్థలం చాలనపుడు ప్రశ్న వేరే కాగితం మీదా రాసి పంపొచ్చు.

ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
గొప్పవారు గతించినపుడు గోరంత గొప్పను కూడా కొండంత పొగిడి చింతను తెలియజేస్తారు కదా. మరి బ్రతికున్న గొప్పవారిని అంతగా తలవరేమి? ఉదాహరణకు వాజ్‌పేయి, శేషన్.
ప్రత్యేకంగా తలచుకోవటానికి వారు అవకాశం ఇవ్వాలి కదా?

విష్ణువు కల్కావతారం ఎత్తడానికి కలియుగం నాల్గవ పాదం రావాలిట. ఇప్పటికీ పిశాచ, రాక్షస గణాల పరమయిన ప్రపంచం అప్పటికెలా ఉంటుందో ఊహించి చెప్పండి.
పిశాచ, రాక్షసమయం కావొచ్చు.

సి.ప్రతాప్, శ్రీకాకుళం
ఈ మధ్య పత్రికలలో వస్తున్న కథలు చదువుతుంటే సో..సోగా ఉంటున్నాయి. కథ, కథనాలలో వైవిధ్యం కనపడటం లేదు. వృద్ధుల నిరాదరణ, కొడుకుల మధ్య పాలిటిక్స్, అవినీతి బాగోతాలు, సరొగసీ వంటి అరగదీసిన అంశాలపైనే కథలు వస్తున్నాయి. రచయితలలో ఆలోచనా శక్తి తగ్గిందా? లేక సాహిత్యం తన ప్రాభవాన్ని కోల్పోతోందా?
లోపం రచయితలదే. వారి లోపల వెలుగున్నప్పుడు లోకానికీ పంచగలరు. ఈ కాలానా గొప్ప కథలు వస్తూనే ఉన్నాయి.
ఎ.సూర్య, సికిందరాబాద్
‘బొగ్గు పాల కడిగిన పోవునా మలినంబు’ అన్నట్లు, అంటుకున్న మసి ప్రచారాలతో సమసిపోతుందా? ఇతరులకు కూడా అంటుతుందా?
అంటించుకుంటే అంటుతుంది.

కాళిదాసు, కావలి
‘దుర్ముఖి’ అంటే ‘చెడు ముఖం కలది’ అని కదా అర్థం. ఎందుకలాంటి పేరు ఒక తెలుగు సంవత్సరానికి పెట్టారంటారు?
దుర్మతి, రక్తాక్షి, రాక్షస లాంటివీ ఉన్నాయి మరి. ఆ పేర్లు పెట్టిన వాళ్లు ఏబ్రాసులు కారు. వాటి గోల మనకేల?

భారతదేశం అంటే ‘హిందుస్తాన్’ అని, ‘హిందూత్వ’ మతం కాదని - జీవన విధానమని, అగ్రవర్ణ పేదల్నీ ఆదుకోవాలని, ‘మైనారిటీ’లు మిగతా దేశాల్లో ఏ విధంగా ఉన్నారో తెలియజేస్తూ ‘ఆర్టికల్స్’ వ్రాస్తున్న వన్ అండ్ ఓన్లీ దినపత్రిక ఆంధ్రభూమే. అదీ ‘తెలుగు’లో కావడం, ఆ రకంగా మానసికంగా కొందరికైనా భరోసా కల్గించడం శభాష్.
సంతోషం.

నల్లపాటి సురేంద్ర, కొత్తగాజువాక
కొన్ని రోజులు తర్వాత ప్రభుత్వ పాఠశాలలు తీసేస్తారని వాదన వినిపిస్తోంది. నిజమేనా?
అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఆంధ్రప్రదేశ్ విడగొట్టింది కాంగ్రెసయినా? వైకాపా, టిడిపికి భాగం లేదా?
అందరూ తోడు దొంగలే.

ఎం.కనకదుర్గ, తెనాలి
ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు తీవ్ర దుర్భిక్ష పరిస్థితులలో కొట్టుమిట్టాడుతూ, పేద, మధ్యతరగతి ప్రజల బ్రతుకులు ఛిద్రవౌతున్న సందర్భంలో అధికార పార్టీలు ఎమ్మెల్యేలను కొంటూ విపక్షాలను నిర్వీర్యం చేసే క్షుద్ర రాజకీయ చర్యలకు పాల్పడడాన్ని ఏమనాలి?
ఈ కాలపు రాజకీయం.

గిరిధర్, కాకినాడ
ఎవరండీ ఈ జనం మెచ్చిన రాణి? ఆమె మన దేశానికి ఏం ఉపకారం చేసిందట? ఆమె ముఖచిత్రంతో బాటు మూడు పేజీల రైటప్ అవసరమా? ఒక పేజీ చాలదా?
చాలదు.

లోకం భానుచందర్, ముస్తాబాద్, కరీంనగర్
ప్రతి వారం ఎక్కడి నుంచో మేము పంపే ప్రశ్నలను మీరు ఎంతో చమత్కారంగా జవాబులిస్తున్నారు కదా. దీనివల్ల మీకేం అనిపిస్తుంది సార్!
మొత్తానికి ఈ వారం గడిచిందనిపిస్తుంది.
*

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా : మనలో మనం, ఆదివారం అనుబంధం, ఆంధ్రభూమి దినపత్రిక, 36 సరోజినీదేవీ రోడ్, సికిందరాబాద్-500003
e.mail : bhoomisunday@deccanmail.com