మనలో - మనం

మనలో-మనం (ఎడిటర్‌తో ముఖాముఖి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుష్యమీ సాగర్, హైదరాబాద్
హిందు మతంలో మహిళా స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుంది అని పలువురు గగ్గోలు పెడ్తున్నారు. కేవలం కొన్ని ఆలయాల్లో మహిళలకు ప్రవేశం అనర్హులు అన్న దానికి మేము ఆ ఆలయాలకే వెళ్లి పూజలు చేస్తాము అని కోర్టుకి వెళ్లడం.. ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం కూడా మహిళలు అక్కడ గర్భగుడిలోకి వెళ్లి పూజలు చెయ్యడాన్ని సమర్థించడం.. మెజారిటీ ప్రజల భావాలను దెబ్బ తీయడమే కదా? ఇదే విధంగా అన్య మతస్తుల దేవాలయాల్లో ఆచార వ్యవహారాల్లో జోక్యం చేసుకొని అందరికి సమన్యాయం జరపాలి కదా? కేవలం హిందు మతంపైన ఇంత ఉత్సాహం ఎందుకు? అది కూడా దేశం మొత్తం గౌరవించే న్యాయస్థానం కూడా ఇలా చెయ్యవచ్చా..?
మనమున్నది హిందూ వ్యతిరేక వ్యవస్థలో! చిన్నప్పటి నుంచీ మనకు చెప్పే చదువు, మనం చదివే చరిత్ర, ఐకాన్స్ అనబడేవాళ్లు మనకు నూరిపోసే ఆలోచనా రీతి, మతం గురించి, గతం గురించి మన కళ్లకున్న కనపడని రంగుటద్దాలు - అన్నీ హిందూ వ్యతిరేకమైనవి. వాటి ప్రభావం అందరి మీదా వారికి తెలియకుండానే పడుతుంది. అత్యున్నత స్థానాల్లోని న్యాయమూర్తులూ దీనికి అతీతులుకారు.

అనదాసు సత్యనారాయణ, పెద్దాపురం
కొత్త రాజధాని అమరావతికి రావడానికి ఉద్యోగులు మారాం చేస్తున్నారు. సౌకర్యాలు లేవని రాలేమని అంటున్నారు. వేలకు వేలు జీతాలు తీసుకుంటూ మారాం చేస్తే ఎలా? ఉద్యోగ నియామక పత్రాలలో సకల సౌకర్యాలు కల్పిస్తామని ఆనాడు హామీ ఇవ్వలేదు కదా! కొత్త అల్లుడు కోరే కోర్కెలులా ఉన్నది నేటి ఉద్యోగుల పరిస్థితి. ప్రభుత్వం మెడలు వంచి వాళ్లను తీసుకొని రావద్దా?
పాయింటే. కాని పనిచేసే వారి బాగోగులూ ప్రభుత్వం చూడాలి. వారి న్యాయమైన కోరికలు మన్నించాలి.

ఎ.వి.సోమయాజులు, కాకినాడ
విభజన చట్టం హైదరాబాదులో ఉండడానికి 10 సం. మనకు హక్కు కల్గిస్తే, ఆ సదుపాయం ఉపయోగించుకోకుండా అమరావతి అంటూ విభజన మర్నాటి నుండే పనులు ప్రారంభించడంలో గల విశేషమేమిటి?
రాజధాని రాష్ట్రం లోపలే ఉండాలి. హైదరాబాదులో ఆ రాజధాని ఉండటం అందరికీ ఇబ్బందే. ఎప్పటికైనా కదలాల్సిందే. అదేదో ముందుగా కదలడం మంచిదే.

కాళిదాసు, కావలి
‘రామానుజం’ గురించి మీరు పుస్తకం వ్రాయాలి. ఆయనను గురించి చదువుతుంటే ఒక్కో దగ్గర ఒక్కో విషయం తెలుస్తూ ఉంది. అలాకాక సమగ్రంగా, మొత్తంగా ఒకే గ్రంథంగా ‘ఎస్సార్’ గురించి తెల్సుకొనేట్లు ఉంటే బాగుంటుందన్పిస్తూంది.
బాగానే ఉంటుంది. కాని చెయ్యి ఖాళీ లేదు. మరొకరిని చూద్దాం.

ఎన్.ఆర్.లక్ష్మి, సికిందరాబాద్
కోదండరామ్ గారికి ఎంఎల్‌సి పదవి నిచ్చినట్టయితే ప్రభుత్వం మీద విమర్శ చేసేవారు కాదేమో? ఏమంటారు?
ఏమో!

సోమశంకరం, వక్కలంక
చిన్న సంఘటన (మొన్న హనుమంతుడి కంటి నీరులా) జరిగితే నలుగురిని పిలిచి వాళ్ల మధ్య వాదోపవాదాలు పెట్టే ఛానెల్స్‌ను ఎలా అర్థం చేసుకోవాలి?
తంపులు పెట్టటమే వారి పని.
ఎస్.కె. హైదరాబాద్
వృద్ధులు, కళారంగంలోని యువతను ప్రోత్సహిస్తూ ఉత్సాహంగా ఉంటుంటే, అదే యువత సీనియర్ సిటిజన్స్‌ను చిన్నచూపు చూడటం ఏమిటి?
కొందరి తీరునుబట్టి అందరూ అలాగే అనుకోలేము.

బి.ఆర్.సి.మూర్తి, విజయవాడ
కేంద్రం వైద్యులకు మాత్రమే పదవీ విరమణ వయస్సు పెంచితే మిగతా వాళ్లు ఊరుకుంటారా? ఇది ‘విభజించు పాలించు’ అన్న సూత్రానికి అనుగుణంగా లేదా?
లేదు. వారి వెనుకే మిగతా వారూ. ఈ రోజుల్లో నోరులేని వాళ్లు ఎవరూ లేరు.
మోదీ హిందూత్వ ఎజెండాని అనుసరిస్తున్నట్టు ప్రతిపక్షాలు దుయ్యబడుతున్నాయి. ఏం? అయోధ్య రామమందిరానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా? హిందువుల తీర్థయాత్రలకు రాయితీ ఇచ్చాడా? హిందువులకు ఏమి ఫేవర్ చేశాడని గగ్గోలు పెడుతున్నారు.
ఇస్తాడేమో అన్న భయంతోనే ముందరి కాళ్లకు బంధాలు.

విరూపాక్షుడు, వక్కలంక
ఇతర దేశాలలో ప్రధానమంత్రులూ, అధ్యక్షులూ వగైరా రోడ్డుపైకి వచ్చినపుడు వరుస కార్లు, ట్రాఫిక్ నిలిపివెయ్యడం లాంటివీ జరుగవుట. తరచూ విదేశీ పర్యటనలు జరిపే మన ప్రభుత్వ నాయకులు ఈ సంగతులను పట్టించుకోరేమి?
పటాటోపం మీద యావ. చుట్టూ ఎందరు గన్‌మన్లు ఉంటే, సామాన్య జనాన్ని ఎంతగా సతాయిస్తే విఐపిలకు అంత గొప్ప.

జంగా నరసింహారావు, ఏలూరు
ప్రస్తుతం రాజకీయాల్లో, సినిమా వ్యాపార రంగాల్లో వారసత్వ పోకడలు నడుస్తున్నాయి. అలాగే మీ పేపరుకు కూడా మీరు వారసుడిని తయారుచేస్తున్నారా?
అద్దెకున్నవాడు వారసుడిని చూస్తానంటే ఇల్లుగలాయన ఊరుకోడు.

సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం
రాజకీయ ప్రముఖులకు ‘్భరతరత్న’ ఇవ్వాలని చాలామంది నాయకులు వత్తిడి చేస్తారు. కానీ ‘గంధర్వ గాయని’ ఈ అత్యున్నత అవార్డుకు నూరు శాతం అర్హురాలైన మన సుశీలమ్మకు ఈ అవార్డు వచ్చేలా వత్తిడి చేస్తే బాగుంటుంది కదా!
ఇవ్వాలంటే ఇంకా చాలామంది ఉన్నారు.

ఎం.బి.కృష్ణమూర్తి, తుని
కులగజ్జి పోవాలంటే ఏం చేయాలి?
పోదు. మనమూ ఇంకొకరికి అంటిస్తే సరి.

కాకుటూరి సుబ్రహ్మణ్యం, కావలి
గోమాంస భక్షణ పంచ మహాపాతకాలలో ఒకటని పెద్దలు చెబుతారు. ‘ఆహార స్వేచ్ఛ’ అనే పేరుతో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి అతిథులను ఆహ్వానించి ఒక వర్గం వారి విశ్వాసాలను రెచ్చగొట్టడానికి చట్టాలు ఎలా అంగీకరిస్తాయి?
అన్నీ చట్టాల్లో ఉండవు. అడగవలసింది - ప్రజలు ఎలా అంగీకరిస్తున్నారు - అని.
*

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా : మనలో మనం, ఆదివారం అనుబంధం, ఆంధ్రభూమి దినపత్రిక, 36 సరోజినీదేవీ రోడ్, సికిందరాబాద్-500003
e.mail : bhoomisunday@deccanmail.com