కథ

మనసు దాటని మాట -- కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాండ్‌ఫోన్ మళ్లీ మళ్లీ మోగుతోంది.... అరణ్య రోదనంలా..!
‘ఈ టైంలో కొంపలు మునిగిపోతున్నట్లు అదే పనిగా ఎవరా ఫోను? వెళ్లి చూడు - ఆ బుద్ధిలేని వాళ్లెవరో?’ విసుక్కొంటూ హైమకు ఆర్డర్ జారీ చేశాడు శంకరం. మధ్యాహ్నం భోంచేసి భుక్తాయాసంతో పవళించిన పతిదేవుడు శంకరం పాదాలొత్తుతున్న హైమ భయపడుతూ వెళ్లి ఫోన్ తీసింది.
‘హలో...’ అవతల స్ర్తి కంఠం.
‘హలో’
‘ఎవరు మాట్లాడేది? హైమవతేనా?’
‘అవును. మీరెవరు?’ ఆశ్చర్యపడుతూ అడిగింది హైమ. తన పూర్తిపేరు నడిగేవాళ్లు అరుదు.
‘మీరు కదా. ‘నువ్వు’ అనవే. నా గొంతును గుర్తుపట్టలేదా? నేనే.. ప్రభావతిని’

‘హాయ్ ప్రభా! నువ్వా? బావున్నావా? ఎన్నాళ్లకెన్నాళ్లకు నీ కంఠం వినే అదృష్టం? ఎక్కణ్నుంచి మాట్లాడుతున్నావ్? ఏమిటి విశేషం? అవును.. నా ఫోన్ నెంబర్ ఎలా సంపాదించావ్?’
‘మనసుంటే మార్గముంటుందే మొద్దూ.. నీ సంగతి చెప్పు. అంతా బావున్నారా? పిల్లలేం చేస్తున్నారు? పెళ్లిళ్లయి సెటిలయినట్టేనా? మీరింకా ఆ పల్లెటూరిని వదల్లేదా? మన ఫ్రెండ్స్ ఎవరైనా ఎప్పుడైనా కలుస్తున్నారా?...’ తనలాగే ప్రశ్న మీద ప్రశ్న వేసిన ప్రభావతికి ఓపిగ్గా సమాధానాలు చెప్పింది హైమ. ఇన్‌కమింగ్ ఫోనే గనుక శంకరం కోప్పడడని హైమ ధీమా.
‘ఇంతకీ ఇంతకాలానికి నేనెందుకు గుర్తొచ్చానో అసలు విషయం చెప్పావు కాదు...’ సుమారు పాతికేళ్ల పాత సంగతులను తవ్వుకొన్న తర్వాత హైమ అడిగింది.
‘చెప్పానుగా. మా పెద్దోడు ‘వంశీ’ బ్యాంక్ ఆఫీసరని. అతగాడికి మీ ఊరు ట్రాన్స్‌ఫర్ అయింది. చిన్నప్పటి మన స్కూల్ ముచ్చట్లు అప్పుడప్పడు పిల్లలకు చెపుతుంటానుగా? అవి గుర్తొచ్చి ‘పందలపాక’ పేరు నా నోట విన్నట్టుందన్నాడు. నాకు ముందుగా ఆ పేరు వినగానే ‘పెదరాయుడు’ పంచెలు జ్ఞాపకం వచ్చి, ఆ తర్వాత మెరుపులా అది మీ వూరేనని గుర్తొచ్చింది. నేను నీ పెళ్లికి రాలేదని కొంతకాలం అలిగి మాట్లాడ్డం మానేసినా, ఆ తర్వాత ఫోనులో ఆ పల్లెటూళ్లో నీ అనుభవాలు, అగచాట్లు ఏకరువు పెట్టేదానివిగా? అదీ సంగతి. అయితే ఇప్పటికీ నువ్వక్కడ ఉంటున్నదీ లేనిదీ తెలియకపోయినా ‘ట్రై’ చేశాను. అదృష్టవశాత్తూ దొరికావు. మావాడు రేప్పొద్దుటే రాజమండ్రిలో
రైలు దిగి నేరుగా మీ ఇంటికే వస్తాడు. వాడికి వసతి, హోటల్ వగైరా ఏర్పాట్లు నువ్వే చూసిపెట్టాలి. వాడు చాలా మొహమాటస్థుడు’
‘అలాంటప్పుడు నువ్వే అతణ్ని తీసుకురావలసింది...’
‘సారీ. ఇప్పుడు వీలు కాదు. చిన్నాడికి పరీక్షలు. వాడిని కనిపెట్టుకొని ఉండాలి. తర్వాత తప్పకుండా మీ ఇంటికొచిచ నువ్వెళ్లమనే వరకు ఉంటాను. సరేనా? ఈలోగా నువీ సహాయం...’
‘ప్రభా, నువ్వు కూడా పరాయిదానిలా ఇంత మొహమాటపడుతూ మాట్లాడ్డం బాగోలేదు. మీ అబ్బాయి మా ఇంట్లోనే ఉంటాడు. ఓకేనా?’
‘్థంక్యూ. మీకు అసౌకర్యం కాకపోతే అలాగే. కాని ‘ఫ్రీ’గా మాత్రం వద్దు సుమా!’
‘సర్లే. ఇది ఫోనులో తెగే విషయం కాదు కాని రేపు మీవాడు ట్రెయిన్ దిగగానే ఫోను చెయ్యమను. ఇంటికెలా రావాలో చెబుతాను’
ఫోను పెట్టేసి గిల్టీగా ఫీలవుతూ వచ్చిన హైమకేసి అసహనంగా చూశాడు శంకరం.
‘నీకేమైనా బుద్ధుందా? వయసులో వున్న కుర్రాణ్ణి ఇంట్లో పెట్టుకోడానికెలా ఒప్పుకున్నావ్? ఇన్నాళ్లూ ఈ ఇల్లు ఎవరికీ ఎందుకద్దె కివ్వడం లేదో తెలిసి కూడా తగుదునమ్మా అని మాటిస్తావా?’ రుసరుసలాడుతూ తిట్ల దండకం లంకించుకున్నాడు శంకరం.
‘సారీ! ప్రభా నేనూ రామచంద్రపురం స్కూల్లో చదివేరోజుల్లో ప్రాణానికి ప్రాణంగా ఉండేవాళ్లం. ఆ స్నేహం వల్ల మర్యాద కోసం మాటిచ్చాను. చూద్దాం. అతనొచ్చిన తర్వాత ప్రవర్తన నచ్చకపోతే ఏదో నెపంతో బయటకు పంపేద్దాం. తల్లిగా వసంత బాధ్యత మీకంటె నాకే ఎక్కువ’ కాళ్ల దగ్గర చేరి ఎలాగో సర్దిచెప్పి అతణ్ణి శాంతింపజేసేసరికి హైమకు దేవతలు దిగొచ్చారు.
* * *
వసంత వయసులో వున్న కనె్నపిల్ల కాదు - ఒక బిడ్డ తల్లి. మగ తోడు దూరమైన అద్భుత సౌందర్యరాశి. ఆ ఇంటి పంజరానికి పరిమితమైన చిలక. చెయ్యని నేరానికి ఏకాంతవాస శిక్షను అనుభవిస్తున్న ఖైదీ.
వసంతకు బాహ్య ప్రపంచంతో సంబంధం లేదు. పెళ్ళిళ్లకూ పేరంటాలకూ వెళ్లడానికి వీల్లేదు. ఆ ఇంట్లో ఆమె ఉంటున్నట్టు బయట వాళ్లకెవరికీ తెలియనివ్వరు గనుక జనాభా లెక్కలు, ఓటరు గుర్తింపు కార్డులు వగైరా కూడా ఆమెకు వర్తించవు. నిత్యం పూజలతో, స్తోత్రాలతో, ఆధ్యాత్మిక గ్రంథాలతో కాలాన్ని వెళ్లబుచ్చే వసంత దృష్టిని ఆ లోకం నుంచి మళ్లించేవాళ్లు తల్లి హైమ, పసిపిల్ల మాత్రమే!
ఆ ఇంటికి సాధారణంగా ఇరుగుపొరుగూ, బంధువులూ రారు. వచ్చిన వాళ్లలో వసంత విషయం తెలిసిన వాళ్లెవరయినా ఆమె పట్ల సానుభూతి చూపిస్తే- ఆమెకు భక్తి తప్ప వేరే లోకం లేదనీ, ఆమె యోగిని లాంటిదనీ తల్లిదండ్రులు చెప్పడం, వసంత విరక్తితో కూడిన ఎండు నవ్వు తప్ప మారుపలక్కపోవడం పరిపాటై పోయాయి.
వసంత శంకరం ఏకైక కుమార్తె. కొడుకు రాంబాబు వున్నా లేనట్టే లెక్క. ఇంజనీరింగ్ చదివిన రాంబాబు ప్రేమించిన పిల్లను పెళ్లి చేసుకోడానికి శంకరం సుతరామూ అంగీకరించక పోవడంతో అతను ఇంటితో తెగతెంపులు చేసుకొని తన బ్రతుకు తను బ్రతుకుతున్నాడు. ఉన్నది నాలుగెకరాలే అయినా నలభై ఎకరాల భూస్వామిలా బిల్డప్ ఇచ్చే శంకరం ఇంట్లోనయినా వీధిలోనయినా తన మాటే చెల్లాలనే తిక్కమనిషి. ఊళ్లో వాళ్లు అతణ్ని పరోక్షంలో తిక్కశంకరయ్య అనే అంటుంటారు. పంచాయతీ వార్డ్ మెంబర్‌గా వరసగా మూడుసార్లు ఎన్నిక కావడంతో శంకరం మంత్రివర్గమంతా తన చేతిలో వున్నట్టు మాట్లాడుతుంటాడు.
‘వసంత తెలివైన పిల్ల. చదివించ’మని ఎంత పోరినా, వినిపించుకోని శంకరం ఆమెను పదో తరగతిలో చదువు మానిపించాడు. ఆ తర్వాత భార్య ఎంత మొత్తుకున్నా వినకుండా, కనీసం వసంత అభిప్రాయం కూడా అడక్కుండా వ్యసనపరుడని తెలిసి కూడా మేనల్లుడికిచ్చి కట్టబెట్టాడు. పెళ్లై రెండేళ్లు నిండకుండానే అతగాడు తప్ప తాగిన స్థితిలో ‘లొల్లి’కీ ‘రాయవరానికి’ మధ్య కారుతో చెట్టును గుద్దేసి అక్కడికక్కడే చనిపోయాడు. మేనరికం దుష్ఫలితం వల్ల బుద్ధిమాంద్యంతో పుట్టిన పసిగుడ్డుతో పుట్టిల్లు చేరింది వసంత.
వసంతకు పునర్వివాహం చెయ్యమని కొందరు పెద్దలు సూచించినా, ఆమె అందం చూసి సంబంధాలు మోజుగా వచ్చినా - శంకరం మొండిగా కాదన్నాడు. పైగా తన మేనల్లుడు చనిపోవడానికి వసంత జాతకంలో వైధవ్యం రాసి పెట్టి ఉండడమే కారణమన్నాడు. సంప్రదాయ విరుద్ధమైన మళ్లీ పెళ్లి తనకు సమ్మతం కాదన్నాడు. తన కూతురు మచ్చలేనిదనీ, ఆమెకు చనిపోయిన భర్తే దేవుడనీ, ఆమె మనసులో మరో మగాడికి చోటుండదనీ - తన అభిప్రాయాలను ఆమె మీద రుద్ది ఆమె నోరు కట్టేశాడు. భర్తతోనే ఆ పిల్లకు శారీరక వాంఛలు కూడా చచ్చిపోయాయనీ, నిప్పులాంటి ఆమె మరో పెళ్లికి ఒప్పుకోవడం లేదనీ ప్రచారం చేసి హైమ చేత కూడా బలవంతంగా వంత పాడించాడు.
అలా వసంతం మోడువారిపోయింది. వసంత ఆ పెంకుటింట్లో నాలుగు గోడల మధ్య బందీ అయింది...!
* * *
కాశీ మజిలీ కథల్లో రాకుమారుడు వేటకో దేశాటనకో పంచకళ్యాణి గుర్రమెక్కి బయల్దేరుతుండగా, ఫలానా దిక్కుకు తప్ప ఎటైనా వెళ్లమని తల్లో, తండ్రో, గురువో ఆదేశించినట్టు - వంశీ ఆ ఇంట్లో అడుగుపెట్టి పరిచయం చేసుకోగానే వంకరం అతని కోసం కేటాయించిన గది నుంచి ఎడమ వైపు మాత్రం ఎప్పుడూ వెళ్లొద్దని హెచ్చరించాడు. ఆ ఇంట్లో కుక్కలు లేవు. మరి కారణం చెప్పకుండా ఇంటాయన చేసిన హెచ్చరిక పిల్లలకు ‘ఏ’ సర్ట్ఫికెట్ సినిమా గుర్తులా ఆసక్తి కలిగించినా, వంశీ మొదటి వారం అటువైపు తలెత్తి చూడ్డానికి కూడా ప్రయత్నించలేదు. ఆ తర్వాత ఓ రోజు ఉదయం బాత్‌రూమ్ నుంచి తన గదికి వస్తుంటే అటువైపు నుంచి వచ్చిన అలికిడికి తలెత్తి చూశాడు - ఓ మెరుపు తీగె లాంటి అమ్మాయి తనకేసి తదేకంగా చూస్తోంది. ఆ సౌందర్యరాశికేసి మళ్లీ చూడాలనిపించినా, ఆ అమ్మాయి ఇంటి యజమాని కెక్కడ ఫిర్యాదు చేస్తుందోనని ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు.
క్రమంగా హైమ దగ్గర చనువు పెరుగుతున్న కొద్దీ ఆవిడ చెప్పే విషయాల వల్ల తెలిసింది - ఆ అమ్మాయి పేరు వసంత అనీ, ఆమె ఇంటివాళ్ల కూతురేననీ! హైమ ఎంత బలవంతపెట్టినా అద్దె ఇచ్చే షరతు మీద ఆ ఇంట్లో వుండడానికి తప్ప తినడానికి వంశీ మెత్తబడలేదు. కాఫీ, టీలు కూడా అలవాటులేని వంశీ ప్రవర్తన, వినయం చూసి హైమే కాదు శంకరం కూడా ముగ్ధుడయ్యాడు. అందుకే అద్దె చెల్లిస్తూ ఇంట్లో హైమకు చేదోడువాదోడుగా ఉండే బుద్ధిమంతుడైన కుర్రాడు అనే నమ్మకం కుదిరి వంశీని ఇంట్లో కంటిన్యూ చేయడానికి శంకరం తలూపాడు. తను సిఫారసు చేసిన ఇద్దరు ముగ్గురికి వంశీ ‘బ్యాంక్ లోన్స్’ కూడా ఇప్పించడంతో ఊళ్లో తన పరపతి పెరుగుతుందని శంకరానికి వంశీ మీద గురి కుదిరింది.
హైదరాబాద్ లాంటి సిటీలో పుట్టి పెరిగిన వంశీ పందలపాక లాంటి పల్లెటూరికి బదిలీ అయినప్పుడు ఎంతగా భయపడ్డాడో - ఆ వాతావరణానికి అలవాటు పడిన తర్వాత అంతగానూ ఆనందించాడు. అక్కడి పచ్చని ప్రకృతితోపాటు ప్రజల ఆదరణ, ఆప్యాయత అతని నాకట్టుకున్నాయి. ముఖ్యంగా ఎంత వద్దన్నా వినకుండా అప్పులు తీసుకొన్న రైతులు తెచ్చిఇచ్చే కానుకల్ని ఏం చేసుకోవాలో తెలియక హైమ చేతికిమ్మంటుంటే ఆమె ఆ గౌరవానికి మురిసిపోతోంది. ఆ చుట్టుపక్కల కళ్లు చెదిరే రైస్‌మిల్స్, గోడౌన్స్ నిర్మించిన మోతుబరులు పార్టీలకని పిల్చినా సున్నితంగా తిరస్కరించి సెలవు రోజుల్లో చదువుకొంటూనో, రాసుకొంటూనో గదికి పరిమితమయ్యే వంశీ సంస్కారానికి ఆశ్చర్యపోయిన ఆ దంపతులు అతణ్ని కన్న తల్లిదండ్రుల అదృష్టానికి అసూయ పడేవారు. హైమ ప్రభావతికి ఫోను చేసినప్పుడల్లా వంశీ వంటి బుద్ధిమంతుడు ఈ కాలంలో అరుదని మెచ్చుకొనేది. వంశీకి తీరిక చిక్కినప్పుడు దగ్గర కూర్చుంటే అతని తల్లి ప్రభావతి, తను రామచంద్రపురం స్కూల్లో చేసిన అల్లర్ల గురించి హైమ కథలు కథలుగా చెప్పేది. వంశీ తన తండ్రి ‘హార్టెటాక్’తో ఆకస్మికంగా కన్ను మూసిన తర్వాత తల్లి తననూ, తమ్ముణ్నీ ఎన్ని బాధలు పడి పెంచి పెద్ద చేసిందీ కళ్లు చెమరిస్తుండగా ఆత్మీయంగా చెప్పుకొనేవాడు. అతని మాటల్లో తల్లి పెంపకమే తననింత బాధ్యతాయుతంగా క్రమశిక్షణతో మెలగడానికి కారణమనే భావం, తల్లిపట్ల గౌరవం స్పష్టమయ్యేది. ఇలా హైమకు చేరువై కష్టసుఖాలను చెప్పుకుంటున్నప్పుడు రెండు చెవులు తమ సంభాషణను ఆత్రంగా వింటున్నాయనే రహస్యాన్ని వంశీ కళ్లు ఆలస్యంగా పసికట్టాయి.
ఆ తర్వాత భర్త ఎప్పుడూ పట్టించుకోని హైమవతి అనారోగ్యం పట్ల తక్షణం స్పందించి ఆవిణ్ని హాస్పిటల్‌కి తీసుకెళ్లడం, మెడికల్ షాప్ నించి మందులు తీసుకుని రావడం, ఆవిడ మొహమాటపడి అవసరమైనపుడు కూడా నోరు తెరిచి అడక్కపోయినా ఆ అవసరాల నర్థం చేసుకొని కావలసిన వస్తువులు తెచ్చిపెట్టడం, దినపత్రికకు కూడా దిక్కులేని ఆ కొంపలోకి అనేక వార మాస పత్రికల్ని తేవడం వంటి పనులతో వంశీ ఆ కుటుంబ సభ్యులలో ఒకడయ్యాడు. హైమ అతని మంచితనాన్ని మెచ్చుకొంటూనే అతని చేత డబ్బు ఖర్చుచేయిస్తున్నానని నొచ్చుకొనేది. తన ఔదార్యాన్ని రెండు కళ్లు చాటుమాటుగా ఆరాధనాపూర్వకంగా అభినందించడం వంశీకి ఆశ్చర్యాన్ని కలిగించింది. తను విన్నదానికీ చూస్తున్న దానికీ పొంతన కుదరక భయంభయంగా ఆ కళ్లల్లో కళ్లు కలపడం ఆరంభించాడు. తన వైఖరిని గమనించిన బ్యాంక్ మెసెంజర్ వీర్రాజు ‘మీరు నక్కతోక తొక్కి ఆ ఇంట్లో దిగారు. మీలాంటి అందగాడు లైనేస్తే - ఆ అమ్మాయి ముగ్గులోకి దిగడం గ్యారంటీ. ఈ అనువైన అవకాశాన్ని వదులుకోకండి. ఎంత నిప్పయినా ఆవిడ మాత్రం ఉప్పూ కారం తినడం లేదా?’ అంటూ ప్రోత్సహించబోతే అతను ఎప్పుడూ నోరెత్తకుండా మొహంవాచేలా చివాట్లు పెట్టాడు వంశీ...!
* * *
‘మనింట్లో ఉంటున్న అబ్బాయిగారు శానా మంచాయనండి. నేనడగ్గానే బ్యాంకులో పదివేలు అప్పిప్పించి అవసరానికాదుకున్నారు. గుణమే కాదండి. సూడ్డానిక్కూడా ‘సినిమా ఈరో’లా సాలా బావుంటారు’ గది ఊడ్చడానికెళ్లిన పనిమనిషి చంద్రి వసంత దగ్గర వంశీని పొగిడింది.
‘అయితే నాకేంటి? నాకీ విషయం ఎందుకు చెబుతున్నట్టు? ఆయన నీకు డబ్బిచ్చి ఇలా చెప్పమన్నాడా? నీ మాటలు నాన్న వింటే మళ్లీ నిన్నీ గడప తొక్కనివ్వడు. ఇక ముందు ఎలా ఎప్పుడూ చెప్పకు...’ వసంత హెచ్చరికకు చంద్రి మొహం చిన్నబుచ్చుకుంది. చంద్రిని కోప్పడ్డం వెనక వసంత భయానికర్థముంది. వంశీ వంక తను ప్రేమగా చూడ్డం చంద్రి గమనించిందేమోనని వసంత బెదురు...!
అమ్మలేనప్పుడు గది తాళం వేసి ఉంటే తన నడగడానికి భయపడి చాలాసార్లు గది ముందు తచ్చాడినపుడు... మందకొడిగా వుండే పాపకు తరచుగా ఆటవస్తువులు తెచ్చి దానిని ప్రేమగా లాలించినప్పుడు... పత్రికలను నేరుగా తన కివ్వడానికి సందేహించి అమ్మద్వారా పంపించినప్పుడు... పత్రికల్లో వంశీ రాసిన కథల్ని చదివినప్పుడు... అనేక సందర్భాలలో వంశీతో మాట్లాడాలనుకొంది. కనీసం ఆ భావాల్ని ఉత్తరాల ద్వారా తెలియజేయాలనుకొంది. కాని అతను అపార్థం చేసుకొంటాడేమోనని ఒకవంక, ఏ మాత్రం పొక్కినా నాన్న అతణ్ని మెడబట్టి బయటకు గెంటేస్తాడని మరొకవంక... భయాలు పీడిస్తుంటే మనసు విప్పలేక, దాని నదుపులో పెట్టుకోలేక వసంత ఊగిసలాట...!
* * *
‘హైమా, వంశీకి పెళ్లి సంబంధాలు మోజుగా వస్తున్నట్టు నేనిది వరకు చెప్పాను కదా? తనేమో ఇప్పుడప్పుడే పెళ్లి వద్దని పాతపాటే పాడుతున్నాడు. కాని ఇప్పుడొచ్చిన సంబంధం అన్నివిధాలా నాకు నచ్చింది. మనం అవునంటే ఎల్లుండి హైదరాబాద్‌లోనే పెళ్లిచూపులేర్పాటు చేస్తామని బతిమాలుతున్నారు. తీరా నేను వంశీకి ఫోన్ చేస్తే వాడు నా మాట లెక్కచెయ్యడం లేదు. వాడికిప్పుడు నాకంటె నువ్వెక్కువై పోయావు గనుక నీ మాట వింటాడని నమ్మకం. నువ్వెలా నచ్చజెబుతావో తెలీదు. వాణ్ని పెళ్లిచూపులకు పంపించే బాధ్యత నీది...’ ప్రభావతి ఫోన్‌కి స్పందించిన హైమ వంశీని మొహమాటపెట్టి పెళ్లిచూపుల కెళ్లడానికి ‘సరే’ అనిపించింది.
ఆ సాయంత్రం హైదరాబాద్‌కి ప్రయాణమవుతూ, దండెం మీద ఆరేసిన బట్టలు తీసుకోడానికి పెరట్లోకి వెళ్లిన వంశీ వీణానాదం లాంటి ఓ స్వరం వినిపించి ఉలిక్కిపడి అటు చూశాడు. మొక్కలకు నీళ్లు పోసే మిషతో వయ్యారంగా శకుంతలలా నిల్చున్న వసంత!
‘మీరు పెళ్లిచూపులకు వెళ్తున్నారట కదా! కంగ్రాట్స్’ ‘పెళ్లికానుక’ చిత్రంలో ‘ఏవండోయ్ శ్రీవారూ, ఒక చిన్నమాట...’ పాట సందర్భం గుర్తొచ్చింది వంశీకి.
‘్థంక్స్’ మొదటిసారి పెదవి విప్పిన వసంత సాహసానికి బిత్తరపోయిన వంశీ ‘ఇది కలా? నిజమా?’ అన్నట్టు ఆమెకేసి సందేహంగా చూశాడు.
వంశీ సంశయాన్ని కనిపెట్టిన ఆమె పెదవులపై దరహాసం విడీవీడని గులాబీ మొగ్గలా!
‘మిమ్మల్ని చేసుకొనే అమ్మాయి చాలా అదృష్టవంతురాలు..’
‘అది అదృష్టం అనుకొంటే - ఆ అదృష్టం మిమ్మల్నే వెతుక్కొంటూ వస్తే..?’ ఈసారి ఎంత ధైర్యంగా అడిగాడో, అంత నిర్భయంగానూ ఆమెకేసి చూశాడు. ఆమె మాధవ దేవుని రాక కోసం ముస్తాబైన వసంత లక్ష్మిలా ఉంది.
‘అలాంటి వరాన్ని వదులుకోను..’ ఆమె మాటలు తడబడుతున్నాయి. క్రీగంటి చూపులు కలవరపెడుతున్నాయి.
‘్థంక్స్. మీ గురించి విన్న తర్వాత, మీ పేరెంట్స్‌కి నా మీద వున్న నమ్మకాన్ని పాడుచేసుకోవడం ఇష్టంలేక - మీ వంక చూడ్డానికి సాహసించలేక పోయాను. ఆ తర్వాత మీ కళ్లు మాట్లాడాన్ని కనిపెట్టి కంటి భాషతోనే బదులిచ్చాను. కాని పెదవి విప్పడానికి భయపడ్డాను. సమయం మించి పోకుండా మీరైనా తెగించి...’
‘మీరు కాదు ‘నువ్వు’ అనండి. మిమ్మల్ని ఇష్టపడిన నా కదలికల్ని గమనించినా, నా మీద పడిన యోగిని ముద్రకు భయపడి మీరు ‘ఐ లవ్‌యు’ చెప్పలేకపోయారు. నాకు చెప్పాలని నోటి వరకు వచ్చినా, బిడ్డ తల్లినయిన నాకు మీ చేయి అందుకొనే అర్హత ఉందో లేదోనని భయం. ఈ భయాలతో మన మధ్య వౌనమే మిగిలింది. ఇప్పుడైనా నేను తెగించి నా మనసులో మాట బయటపెట్టకపోతే ఇద్దరికీ ఇష్టమైన గొప్ప అవకాశం చేజారిపోయేది. ఆ తర్వాత ఎప్పుడో తెలిసి జీవితాంతం కుమిలిపోయేవాళ్లం. రచయితగారూ, ప్రేమించడానికే కాదు, ప్రేమించానని చెప్పగలగడానికీ సాహసం కావాలి. మనసు దాటని మాటకు చెల్లించే మూల్యం జీవితాంతం దహించే నిప్పుని మూట గట్టుకోవడమే..’
‘వండర్‌ఫుల్. నీకిన్ని మాటలు వచ్చనీ, నువీ పంజరాన్ని దాటి వచ్చే చొరవ తీసుకుంటావనీ నేనూహించలేక పోయాను. ఐ వెల్‌కమ్ యు. నేనింక హైదరాబాద్ వెళ్లడం లేదు. ఈ దేవత కరుణించింది కదా...’ అంటూ వసంత చేతిని తన చేతుల్లోకి తీసుకొని ముద్దాడాడు వంశీ.
‘గదిలో కూర్చొని వసంతం వసంతం అని తన మదిలో మలిన శృంగార తృప్తి పొందేవాడు వికారుడు, శకారుడు. సంప్రదాయ భీరువుకీ అస్వతంత్ర వితంతువుకీ వసంతం లేదు. సాహసి కానివాడు జీవన సమరానికీ స్వర్గానికీ పనికిరాడు...’ తిలక్ కవిత వంశీ మెదడును పదునెక్కిస్తోంది.
‘మా బావను పెళ్లి చేసుకోమన్నప్పుడు మా నాన్న మాటను కాదనలేక పోయాను. ఇప్పుడు మీ ఆహ్వానానికి అవుననకపోతే - నన్ను భగవంతుడు కూడా రక్షించలేడు’ వసంత ధైర్యానికీ స్థైర్యానికీ వంశీ ఆశ్చర్యపోయాడు. అప్రతిభుడైన అతను హైమ ఆశీస్సుల కోసం యాంత్రికంగా వసంత ననుసరించాడు..!
*

పైడిపాల
డా.పి.ఎస్.రెడ్డి, 11-20, కొంకపల్లి,
అమలాపురం-533 201.. 99891 06162

-పైడిపాల