మిర్చిమసాలా

విద్యారంగంలో ముగురమ్మలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్థిక పరమైన లావాదేవీల్లో లక్ష్మీదేవిని, విద్యారంగంలో చదువుల తల్లి సరస్వతిని మనం తలుచుకుంటాం, ప్రార్థింస్తూంటాం. అయితే, యాదృచ్ఛికంగా తొలిసారి ఆంధ్ర ప్రదేశ్‌లో ముగ్గురు మహిళామూర్తులు విద్యారంగానే్న శాసిస్తుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా- తొలుత మహిళ విద్యావంతురాలైతే ఆ కుటుంబంలో అందరూ విద్యావంతులవుతారని భావిస్తున్నట్లే మహిళా ఉన్నతాధికారిణులే విద్యారంగాన్ని నడిపిస్తుంటే అంతకంటే మనకేమికావాలి? అంటున్నారు విద్యారంగ ప్ర ముఖులు. ఐఎఎస్ అధికారిణుల్లో డి.ఉదయలక్ష్మి రాష్ట్ర సాంకేతిక విద్య, ఉన్నత విద్య కమిషనర్‌గా, సుమిత్రా దావ్రా ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా, సంధ్యారాణి పాఠశాల విద్య కమిషనర్‌గా సంస్కరణలకు శ్రీకారం చుట్టి శభాష్ అనిపించుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి సైతం వీరు ప్రశంసలు అందుకుంటున్నారు. మరి వీరికి మనమూ శాల్యూట్ చేద్దామా..
-నిమ్మరాజు చలపతిరావు

ప్రకృతి-వికృతి-సంస్కృతి
సంస్కృతి అంటే ఏమిటి? అయ్యో... ఆ మాత్రం తెలియదా? అని ఎవరైనా ఠకీమని సమాధానం చెప్పేస్తారు. కాగా, కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు తనదైన శైలిలో ఈ మాటకు అర్థం చెప్పి అందరినీ నవ్వించారు. ‘ఈ మధ్య ఒకాయన నన్ను సంస్కృతి అంటే ఏమిటి? అని అడిగారు. అందుకు నేను స్పందిస్తూ ప్రకృతి అంటే- ఎవరైనా తమకు తాము సంపాదించుకుని తినడం, వికృతి అంటే పక్కవాడి తిండిని బలవంతంగా దోచుకుని తినడం, సంస్కృతి అంటే ఇతరులకు పెట్టిన తర్వాతే తాను తినడం..’ అని వెంకయ్య అనగానే సభికుల కరతాళధ్వానాలతో హాలంతా మారుమోగింది.
-వి.ఈశ్వర్ రెడ్డి

ఇసుక దుమారం!
ఎపిలో సిఎం చంద్రబాబు తెచ్చిన ఉచిత ఇసుక పాలసీలో లోపాలున్నాయని తెలుగుతమ్ముళ్ళు వీధిన పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని నాగావళి, వంశధార నదుల నుంచి ఇసుకను అధికార పార్టీ నేతలు విశాఖ నగరానికి తరలిస్తూ కోట్లకు పడగలెత్తారు. టెక్కలి నియోజకవర్గం తప్ప- పక్క నియోజకవర్గాలకు ఈ ఇసుక తరలింపు ఆఫర్ ఉంది. దీంతో కీలక పదవిలో ఉన్న టెక్కలి దేశం నేత.. తనకు దక్కనిది మిగతా ఎమ్మెల్యేలకు దక్కరాదన్న అక్కసుతో ‘ఇసుక దందాల’పై దాడులు జరిపించి, మొత్తానికి నిషేధం విధించారు. కలెక్టర్ నుంచి గనుల శాఖ అధికారులంతా ఇసుక రీచ్‌ల్లో మకాం వేయాల్సివచ్చింది. ఇసుక తవ్వకాలు నిలిచిపోయినా, ఈ తంటా టిడిపి నేతల మధ్య మంటలు పుట్టించింది. సామాన్యులకు ఇసుక అందని పరిస్థితికి దేశం నేతల తగాదాలు కారణమయ్యాయ. టెక్కలి నేత లిక్కర్ లాబీ నుంచి భారీగా వసూళ్లు చేస్తున్నట్టు అధికార పార్టీ ఎమ్మెల్యేలు గళం విప్పడం ప్రారంభించారు. సిక్కోలు టిడిపిలో ఈ ఇసుక దుమారం మిగతా ప్రజాప్రతినిధులకూ ఆగ్రహం తెప్పించింది. లిక్కర్ మాఫియా గుట్టరట్టు చేయాలన్న వ్యూహానికి కొందరు అధికార పార్టీ నేతలే జత కడుతున్నారు. మొత్తానికి ఇసుక, లిక్కర్ లాబీలతో టిడిపిలో ముసలం పుట్టింది. -ఉరిటి శ్రీనివాస్

కెసిఆర్ రొటీన్ షెడ్యూల్
తెలంగాణ సిఎం కెసిఆర్ దైనందిన కార్యక్రమాలు రెం డేళ్లుగా మరీ రొటీన్‌గా మారిపోయాయి. ఆయన ఏ రోజు ఎక్కడుంటారో కళ్లు మూసుకొని ఇట్టే చెప్పేసేలా షె డ్యూల్ ఉండేది. శుక్ర లేదా శనివారం సాయంత్రం ఫా మ్ హౌస్‌కు వెళ్లి విశ్రాంతి తీసుకోవడం, సోమవారం నర్సన్నపేట, ఎర్రవెల్లిలలో పర్యటించి సాయంత్రానికి హైదరాబాద్ చేరుకోవడం ఆనవాయితీగా మారింది. మంగళ, బుధవారాల్లో ఎడతెరిపి లేకుండా క్యాంపు కార్యాలయంలో సమీక్షలు నిర్వహిస్తారు. ఈ సమీక్షల్లో తప్పకుండా ఉండే అంశాలు- యాదాద్రి, మిషన్ భగీరథలు. గురు లేదా శుక్రవారాల్లో సాయంత్రం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో భేటీ అవుతారు. ఈ భేటీల్లో గత ఏడాదంతా ఓటుకు నోటు అంశంపై చర్చిం చేవారు. దీని స్థానంలో మొన్నటి దాకా కొత్త జిల్లాల ఏర్పాటు, ప్రస్తుతం సచివాలయం కూల్చివేత అంశం చేరింది. గవర్నర్‌ను ఎప్పుడు కలిసినా ఎర్రపూల బొకే ఇస్తుంటారు. బొకే ఇస్తున్నప్పటి ఫొటో కింద తేదీ వేస్తే తప్ప- ఏ ఫొటో ఎప్పటిదో తెలుసుకోవడం మీడియాకు సమస్యగా మారింది. గవర్నర్‌తో భేటీ తర్వాత మళ్లీ ఫామ్ హౌస్‌కు వెళ్లడం పరిపాటిగా మారింది. కనీసం గవర్నర్‌కు ఇచ్చే బొకే రంగు మార్చినా కాస్త భిన్నంగా ఉంటుందేమో!
-వెల్జాల చంద్రశేఖర్

‘రెడ్ క్యాపిటల్’ కారాదు..
ఈ మధ్య రంగుల పేర్లతో అనేక బ్రాండ్లు వెలుస్తున్నాయి. హరిత విప్లవాన్ని గ్రీన్ రివల్యూషన్ అన్నారు. ఇటీవల కొంతకాలంగా గ్రీన్ ఎనర్జీ అంటున్నారు. కాలుష్య రహిత విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు గ్రీన్ ఎనర్జీ అనే పేరును విస్తృతంగా వాడుతున్నారు. బ్లూ రెవెల్యూషన్ అనే మరో పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది. రొయ్యలు, చేపల పెంపకాన్ని వృద్ధి చేసేందుకు ఈ పదం వాడుతున్నారు. తాజాగా ఎపి సిఎం చంద్రబాబు నాయుడు అమరావతిని బ్లూ, గ్రీన్ క్యాపిటల్‌గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. అమరావతిలో అడుగుపెడితే ఎక్కడ చూసినా పచ్చదనం కనపడుతుందిట! సరస్సులు, నదుల్లో చేపలు ఎగిరి పడుతూ చూడముచ్చటగా ఉంటుందట! కాగా, మల్కాన్‌గిరి ఎన్‌కౌంటర్‌లో అనేక మంది మావోయిస్టులు హతమయ్యారు. ఆంధ్ర పాలకులపై ప్రతీకారం తీర్చుకుంటామని మావోలు సవాల్ విసిరారు. ఇదంతా చూస్తుంటే అమరావతి ‘రెడ్ క్యాపిటల్ కాకుండా చూస్తే బాగుంటుంది బాబూ’ అని ప్రజాస్వామ్యవాదులు కోరుతున్నారు.
-శైలేంద్ర