మంచి మాట

ఆదర్శ పుత్రులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతిరత్నాలు జగతి ప్రగతికి మూల స్తంభాలు. వారే సనాతన సంస్కృతిని విశ్వవికాసాన్ని కలుగజేసే మానవోత్తములు. పూవు పుట్టిన తోడనే పరిమళభరితాన్ని ప్రాణికోటికందిస్తున్న చందాన, మానవుడు పుట్టుకతోనే తన అపూర్వ లక్షణాల్ని అలరింపజేస్తారు. అట్టివానిని మహాత్ముడంటారు.
పతిత పావనుడైన పరమేశ్వర ప్రార్థనకు నోచుకోని నాస్తికుణ్ణి, సద్గుణాల్తో సంఘాన్ని ఉద్ధరించనివాణ్ణి కన్నతల్లి కడుపు చెడబుట్టినట్లే అని ఆంధ్ర మహాభాగవతకర్త పోతనామాత్యుడు సాంఘికులకు హితవు పలికాడు. పుత్రుడు పుట్టిననాడే తండ్రికి సంతసం కల్గదనీ జనానీకం అతని సద్గుణాల్ని దర్శించి పొగడ్తల జల్లులు అతనిపై ప్రసరింపజేసినపుడే తండ్రి ఆహ్లాదాన్ని అనుభవిస్తాడని సుమతీ శతకకర్త బద్దెన కవీంద్రుడు పల్కినాడు. ఇక మూర్ఖుని లక్షణాల్ని గూర్చి తర్కిస్తే ఇసుక నుంచి తైలం తీయడం, మృగతృష్ణలోని నీరాన్ని సేవించడం కుందేటి కొమ్ము సాధించడం మూర్ఖుని రంజింపచేయడం కంటే సులభమని సూక్తుల ద్వారా తెలుస్తుంది.
ఒక సమయంలో గాంధారి తన శుభాన్ని కోరి, ఐరావత వ్రతాన్ని నిర్వహించింది. అసమర్థులైన తన కుమారులు స్వర్గలోకం నుంచి ఐరావతాన్ని తెచ్చే ప్రయత్నాన్ని చేయలేక బంకమట్టితో ఐరావతాన్ని తయారుచేయించి తల్లి వ్రతాన్ని పరిసమాప్తం చేశారు. ఆ వ్రతానికి గాంధారి తమ సవతియైన కుంతీదేవిని పిలువలేదు. కానీ కలిమిలేములు శాశ్వతం కాదని, వెనె్నల చీకటి సమానమే అని సువిశాల భావంతో తరించే కుంతీమాత, తాను ఐరావత వ్రతాన్ని చేసేటప్పుడు గాంధారిని పిలిచింది. ఆమె సన్మార్గం లోకపూజితమైంది. ప్రతిభావంతులు, తేజోవిరాజితులు, నిజాయితీకి నిలువుటద్దాలు విశ్వవిరాజిత వీరులు అగు పంచపాండవులు తమ తల్లికి దివి నుంచి భువికి అసలు ఐరావతాన్ని రప్పించి లోకోత్తరంగా తల్లివ్రతాన్ని జరిపించారు. ఆదర్శపుత్రులుగా అలరారినారు. తల్లి ఋణాన్ని తీర్చుకొన్న తనయులుగా రాణించారు.
గంగామాతకు, శంతన మహారాజుకు అష్టమ గర్భాన జనించాడు భీష్ముడు. తన మొదటి పేరు దేవవ్రతుడు. శంతనుడొకనాడు మహాసౌందర్యవతియైన మత్స్యగంధిని సందర్శించాడు. ఆమె దాశరాజు కొమరిత. ఆమె అందానికి ఆకర్షింపబడి వివాహమాడవలెనని ఆమె తండ్రికి తన అభిప్రాయాన్ని తెలిపాడు. దేవవ్రతునికి పుట్టే కుమారునికి రాజ్యం పట్ట్భాషేకం చెయ్యకుండా నా కుమార్తెకు జన్మించే పుత్రునికి పట్టం కట్టే విధమైతే తన కుమార్తె శంతనుని పరిణయమాడడానికి సమ్మతిస్తానని దాశరాజు తెలిపాడు. దాశరాజు సమాధానం శంతనునికి ఇరుకున పడ్డట్టయింది. దిగాలుగా ఇంటికేగాడు. తండ్రిని సంతోషపెట్టుటకై దేవవ్రతుడు తాను వివాహం చేసికోనని ప్రతిజ్ఞ చేశాడు. అది భీషణమైన ప్రతిజ్ఞ కాన భీష్ముడు అనే పేరు సార్థకమైంది. తండ్రికోసం తాను త్యాగం చేసి ఆదర్శ పుత్రునిగా అవనికి అలంకార ప్రాయమైనాడు భీష్ముడు.
విశ్వావతారుడు, విశ్వజనారాధ్యుడు, వేదమయుడు అయిన శ్రీమన్నారాయణమూర్తి వాహనమైన గరుత్మంతుడు తన తల్లియైన వినత దాస్య విముక్తి కోసం దేవేంద్రునితో ఘోరంగా పోరు సల్పి విజయదుందుభి మ్రోగించి అమృతం తెచ్చి తల్లికి సమర్పించి ఆమె బాధను బాపినాడు. తల్లి ఋణం తీర్చుకొన్న తనయుడుగా లోక ప్రఖ్యతిగాంచాడు. ఆదర్శపుత్రునిగా అలరారాడు. శ్రవణ కుమారుడు పుట్టు గ్రుడ్డివారైన తల్లిదండ్రులకు చేసిన సేవ మరురానిది. తల్లి రుణం, తండ్రి ఋణం తీర్చుకొన్న తనయుడుగా వాసికెక్కాడు. తరువాత తరం వారికి పైన పేర్కొన్న వారంతా మార్గదర్శకులుగా మహోత్తమ మానవత్వాన్ని సంతరించుకొన్నారు. పవిత్రులు లోకకల్యాణం కోసం పాటుపడ్డారు. అందుకే నేటి తల్లిదండ్రులు కూడా లోకోత్తురులైన బిడ్డలకు జన్మనివ్వాలి. వారిని లోకోపకారం చేసే వారిలాగా పెంచాలి. భూతదయ సమదృష్టిని అలవర్చుకునేట్టుగా వారిని పెంచాలి. దీనికి తల్లిదండ్రులు సైతం నీతినిజాయతీలతో మెలగాలి. పెద్దలు ఎలా ఉంటే పిన్నలుకూడా అవేలక్షణాలను పుణికి పుచ్చుకుంటారు కనుక పెద్దలు ఆదర్శవంతులుగా ఉంటే పిన్నలు చెప్పకుండానే ఆదర్శవంతులు అవుతారు.

-విద్వాన్ వల్లూరు చిన్నయ్య