మంచి మాట

జగమంతా రామమయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సృష్టి స్థితిలయాదులకు కారణమైన శ్రీహరియే కౌసల్య పుత్రుడై ఈ భూమిపైన జన్మించాడని అంటారు. కాని ఆ రాముడు ఎక్కడా తాను శ్రీహరి నని చెప్పలేదు. బ్రహ్మాదిదేవతలు వచ్చి నీవు శ్రీహరి అవతారుడివని చెప్పినా తాను మాత్రము దశరథుని పుత్రుడినని, దాశరథి అని కోదండరాముడనని చెప్పాడు.
భక్తజన సంరక్షకుడు. సకలార్థసిద్ధి సహితుడు. రామఅన్న పిలుపునకే పలికే భక్తవత్సలుడు. మారుతిలాంటి వారి హృదయంలో నెలకొన్న ఇష్టదేవతా స్వరూపుడు. గుహునిలాంటి వారికి మంచి స్నేహితుడు. వాలి, రావణుడు లాంటి వారిని నిద్రపోనివ్వని భయంకరాకారుడు. సీతమ్మలాంటివారికి మనోభిరాముడు. విభీషణుడు లాంటివారికి అభయప్రదుడు. ఇందరికి ఇన్ని రూపులుగా కనబడేవాడు ఒక్క శ్రీరాముడే. అందుకే రాముని గూర్చి పలువురు పలువిధాలుగా భావిస్తుంటారు.
ఆ రాముని గూర్చి కొందరు రామ అని అన్నా . రాముని కథను విన్నా అనేక జన్మల పాపాన్ని పోగొట్టుకోవచ్చునని అంటారు.
మరికొందరు రామ అని అనడం జపించడం కన్నా రాముని లాగా సత్యధర్మాలను పాటించాలని. అన్యాయాన్ని ఎదుర్కోవాలని. రాముని నడవడిని అర్థం చేసుకొని రామునిలాగా నడవడిని తీర్చిదిద్దుకుంటే జీవితం నందనవనం అవుతుందని అంటారు. అంతేకాదు రామనామ స్మరణ మిక్కిలి జ్ఞానాన్ని, జన్మ రాహిత్యాన్ని కలిగిస్తుందనడంలో అంతరార్థం ఇదేనంటారు.
భాతృప్రేమకు, పితృప్రేమకు, దాంపత్యధర్మానికి రాముడే ఆదర్శం. ఆదర్శ వంతమైన రాజుగాను, మంచిస్నేహితుడుగాను కూడా రాముడే ప్రపంచానికి ఆదర్శం. అటువంటి రాముని అయనాన్ని బాగా పరిశీలించి రాముని లాగా ధర్మపరిరక్షణకు మన జీవితాలను కూడా అంకితం చేయాలి.
రామునిలోఉన్న అన్ని సద్గుణాలను ప్రోది చేసుకోలేక పోయనా అందులో కొన్ని మంచిలక్షణాలన్నా పొదువుకుని ఉండాలి. అట్లానే రావణునిలోని ఏ దుర్గుణాన్ని మన దరికి చేరనీయకపోవడం మంచిదంటారు. రావణునిలా జీవనగమనాన్ని తీర్చుకోకపోవడం ఎంత అవసరమో రాముని నడవడిని చూచి రామునిలాగా చరించాలి అనుకోవడం అంతే అవసరమంటారు మరికొందరు.
సమాజాన్ని ఒక తాటిపైన నిలబెట్టగలగడం ఒక్కరామునికే సాధ్యమైందని అట్లాంటి రామరాజ్యం మళ్లీ కావాలని అంటే అందరూ రాముని శ్రద్ధఓర్పులను అలవర్చుకోవాలి. అన్యాయాన్ని ఎదిరించే క్షాత్రశక్తిని నేర్చుకోవాలి. తల్లి దండ్రులపైన ఎంత ప్రేమానురాగాలను కలిగిఉంటామో అట్లానే మన జన్మభూమిపైన కూడా అంతే మమకారం ఉండితీరాలి. అపుడే రాముని పోలిన రాజులుగా భావిపౌరులను నిర్మాణం అవుతారు.
రాముడెప్పుడూ ఇతరులలో తప్పులు ఎంచడు. శాంతచిత్తుడు. ఎల్లవేళలా ప్రియభాషణమే చేస్తాడు. ఆ పురుషోత్తముడు నిగ్రహానుగ్రహ సమర్థుడు ఇన్ని మంచి లక్షణాలున్న రాముణ్ణి నిత్యమూ స్మరిస్తూ ఉంటే రాముని కథలనే వింటూ ఉంటే భ్రమర కీటక న్యాయాన్ని అనుసరించి రాముని కథను విన్న వారందరూ రాముణ్ణి పోలిన రాముళ్లుగా మారుతారు. రామునిలాగే సత్యధర్మాలను పాటించేవారౌతారు. అపుడు రామరాజ్యం సునాయాసంగా పొందగలుగుతాం. జగమంతా కూడా రామమయంగా భాసిల్లుతుంది.
హరికథలు, బుర్రకథలు, సంకీర్తనలు, గేయాలు, జానపదాలు, కథలు, కావ్యాలు ఇట్లా సాహిత్యప్రపంచంలోని అన్ని ప్రక్రియలన్నింటా రామకథను రామ అన్నశబ్దంలో మాధుర్యాన్ని చవిచూసిన వారందరూ చొప్పించారు. ఆ శబ్దమాధుర్యానికి లోబడివారందరూ రాముని గూర్చి తెలుసుకొంటారని రాముని సద్గుణాలను అలవర్చుకుంటారని పెద్దల ఆలోచన అయఉంటుంది. కనుక రాముని గూర్చిన కథలను వినాలి. రాముని క్షాత్రశక్తిని పుణికి పుచ్చుకోవాలి. రాముని దేశభక్తిని మనలో పొదువుకోవాలి. రామునిగా మనమూ సత్యధర్మాలను పాటించే వీరులం కావాలి.

- చోడిశెట్టి శ్రీనివాసరావు