మంచి మాట

సమత్వ బుద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధనుంజయా! నీవు యోగం నందుండి సంగత్వం లేనివాడవై కార్యం సిద్ధించినా సిద్ధించకపోయినా సమత్వ బుద్ధితో ఉంటూ కర్మల నాచరించుము. సమత్వ బుద్ధియే యోగమని కృష్ణుడు అర్జునునకు భగవద్గీతలో బోధించాడు.
అదేవిధంగా (్భగవద్గీత 5-18లో) విద్య వినయం గల బ్రాహ్మణుని యందు గోవు, కుక్క, చండాలుని యందునూ విజ్ఞులు సమదృష్టిని కలిగియుందురని, అట్టివారే జీవన్ముక్తులని తెలియజేసాడు.
అలాగే (6-9లో) సహృదయుల యందు, మిత్రులు, శత్రువులు, మధ్యస్తులు, విరోధులు, బంధువులు, ధర్మాత్ములు, పాపుల యందును సమ భావం కలిగి ప్రవర్తించేవారు శ్రేష్టులని పేర్కొన్నాడు.
అంతేకాక (6-29లో) ఆత్మయోగి సర్వత్ర సమదృష్టి కలిగి తనను సర్వభూతము లందును, సర్వ ప్రాణులను, తనయందును దర్శించునని చెప్పాడు.
ఆ క్రమంలోనే (14-24లో) త్రిగుణాతీతుడు సుఖః దుఃఖములను సమానంగా భావించునని మట్టి, రాయి, బంగారం అతనికి ఒకేలా వుంటాయని ప్రియ, అప్రియాలకు, నిందాస్తుతులకు అతడు తొణకడని, సమత్వ బుద్ధితో వుంటాడని తెలియపరిచాడు.
లోకంలో కొందరు వ్యక్తులు తాము అధికులమని, విద్య ధన అధికార బలవంతులమని, వివేకాన్ని కోల్పోయి మిడిసిపాటుతో ఇతరులను అల్పులుగా భావించి చులకనగా చూడడం, హేళన చేయడం, వాదోపవాదాలతో చిన్నబుచ్చేలా అవమానించడం, కఠిన వాక్కులతో బాధించడం వంటివి మనం రోజూ చూస్తున్నాం, వింటున్నాం, వారి బాధాతప్త హృదయాలను గమనిస్తున్నాం, అట్టివారు సదా సమత్వ బుద్ధిని అలవర్చుకుని తద్వారా శాంతిని పొంది, ముక్తి మార్గానికి చేరువ కావాలన్న శ్రీకృష్ణుని గీతా సందేశంలో పలుచోట్ల సమత్వ దృష్టిని పెంపొందించుకోవాలని వివరించబడింది. ‘‘ఆత్మవత్ సర్వ భూతాని, ఈశ్వరీగం సర్వభూతానాం’’ అనే వేద సూక్తులను విస్మరించరాదని, హెచ్చరిక చేస్తోంది భగవద్గీత.
రామాయణ మహా కావ్యంలో కూడా సమత్వ భావానికి రాముడే ప్రధాన నాయకుడని వాల్మీకి తెలియజేసాడు. రామా! రేపే నీ పట్ట్భాషేక మహోత్సవం అని తెలిపిననాడూ, రామా! రేపే నీ వనవాసం పదునాలుగేండ్ల వరకు అని తెలిపిననాడూ, రాముని ముఖ కవళికల్లో తొలిరోజుకీ, మరుసటి రోజుకీ ఇసుమంతయు తేడాలేదని, ‘‘రామచంద్రుడవికారుడు, కానలకేగవేళలన్’’యని విశ్వనాథుడు రామాయణ కల్పవృక్షంలో పేర్కొన్నాడు.
మహాభారతం అరణ్యపర్వంలో, యక్షుడు, ధర్మరాజుతో జరిపిన యక్ష ప్రశ్నలలో ఒక ప్రశ్నగా ‘‘ఆర్జవం’’ అంటే ఏమిటి? అని అడుగగా- ‘‘ఎల్లప్పుడూ సమభావం కలిగి యుండడ’’మని, ధర్మరాజు సమాధానం విని సంతుష్టుడయ్యాడు యక్షుడు.
సమవర్తియైన యమధర్మరాజు సమత్వ భావానికి ఆద్యుడు. ధనికుడైనా పేదయైనా, పండితుడైనా పామరుడైనా, ఏ జాతియైనా, ఏ మతమైనా వయోధికుడైనా, అల్పాయుష్కుడైనా, ఆయువు తీరగానే వాని ప్రాణాలు గైకొనడమే తన కర్తవ్యంగా భావిస్తాడు.
చిన్న ప్రాణి చీమపైనా, పెద్ద ఏనుగుపైనా కాచే ఎండ వేడిమి ఒక్కటే, అదే భగవంతుని సమత్వ భావం అంటూ, మెండైన బ్రాహ్మణుడు ఉండేది, చండాలుడుండే సరిభూమి యొక్కటే. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అని పద కవితా పితామహుడు అన్నమయ్య ఆలపించాడు.
‘‘సమచిత్తునకు చంచలముగాదు (2-307)’’ దృఢ మనస్కుడికి, న్యాయాధీశుడికి, సమభావం గలవాడికి, మనస్సు ఎప్పుడూ ఒకేవిధంగా వుంటుందని అన్నమయ్య సంకీర్తనల్లో తెలిపాడు. అలా సమత్వ భావంలో వుండేవారికి, తానే సృజించిన దేహాలలో ఉండి జీవులను భగవానుడే వారి కర్మలనుండీ తరింపజేస్తాడని రుగ్వేదం చెబుతోంది. సమత్వభావం, సమదృష్టి, సమబుద్ధి, సర్వదా ఆచరణీయములని శాస్త్ర సందేశం.
ఈ కలియుగంలో సదా ఆర్థిక సంబంధాలతో గడిపే కాలమున్నా కాస్తలో కాస్తంత సమయాన్ని కేటాయంచుకుని ధర్మాధర్మాలను తెలుసుకొని మరీ ఆచరించాలి. తోటివారితో కేవలం ఆర్థికసంబంధాలే కాక ప్రేమానురాగాలను కూడా ఏర్పరుచుకోవాలి. అవి మళ్లీ పుణ్యపాపాలను సమకూర్చి పెట్టేవికాకుండా ఉండేలా చూచుకోవాలి. అంటే అతి ప్రేమ కాని అతి ద్వేషం కాని ఉండకూడదు. ఏదైనా సర్వం ఆ భగవంతుడు కల్పించినదే అని భావిస్తూ కాలాన్ని గడిపితే సమబుద్ధి అలవడుతుంది. భగవంతుని తత్వం బోధపడుతుంది.

-చెళ్ళపిళ్ళ సన్యాసిరావు