మంచి మాట

ఆదిపరాశక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూజించే సమయంలో ‘రూపం’లోనూ, స్తుతించేటప్పుడు ‘శబ్దం’లోనూ, చింతన చేసేటప్పుడు ‘ప్రాణం’లోనూ, తత్త్వవిచారం చేసేటప్పుడు సర్వత్రా గోచరిస్తుంది. బ్రహ్మముఖాన సరస్వతిగా, విష్ణువక్షాన లక్ష్మిగా, శంభుని దేహాన పార్వతిగా, విశ్వశరీరునిలో ఆకాశరూపంలో ఉన్న ఆదిపరాశక్తిని శరత్కాలంలో అమ్మను విశేషంగా పూజిస్తారు.
చైత్ర, ఆశ్వయుజ మాసాలు ‘సంధి’కాలాలు. ప్రాణికోటికి ప్రాణాంతకాలు. యమునికి ప్రీతికరమైనవి. అందుకే వీటిని ‘యమదంష్ట్ర’లన్నారు. వీని బారినుండి తప్పించుకోడానికే పరాశక్తిని నవవిధాలుగా పూజిస్తారు.
‘‘యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమో నమః’’ అన్న దేవీ సప్తశతిని అనుసరించి నిరాకారరూపిణి, నిర్వికల్ప, నిరామయ. నిశ్శంక నిర్గుణ అయన అమ్మకు రూపాలను ధరింపచేసి అమ్మను పూజించడం ఈ శరన్నవరాత్రులల్లోని ముఖ్యాంశం.
శ్రీచక్రంలో త్రిపురాత్రయంలో మొదటి దేవతగా అమ్మ బాల గా కీర్తించబడుతోంది. షోడశ విద్యకు ఆదిదేవతగాను స్తుతులందు కుంటుంది. కుమారిపూజ చేసే సాధకులు ఈరోజున పదిఏళ్లలోపు బాలికలను బాలగా చిత్రీకరిస్తారు. వారికి షోడోపచార పూజ చేస్తారు. ఓం ఐం హ్రీం శ్రీం బాలా త్రిపురసుందర్యైనమః అని జపించిన వారికి తల్లి అండగా ఉంటుంది. బాల త్రిపుర సుందరీ అనుగ్రహానికి పాయసాన్నం నివేదన చేస్తారు. దుర్గాత్రిశతిని పారాయణ చేస్తారు. ‘‘నమోదేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మతామ్’’ అన్న మంత్రాన్ని అచంచలమైన నమ్మకంతో పఠిస్తే చాలు అమ్మ అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. ఏ కార్యాన్నై నా సాధించాలంటే ఈ తల్లి అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి.
నవరాత్రిలో ఉపవాసం- ఏకభుక్తం- నక్తం- అయాచితంతోనైనా జనులు దేవిని పూజించాలని శాస్త్ర వచనం.
సాత్విక పూజ మోక్షమును- రాజస పూజ సంపదను, పదవిని, ధనము వంటి వాటిని ఇస్తుందనీ- తామసిక పూజ మధ్యమమనీ శాస్తవ్రచనం. దేవీపూజలు ప్రధాన స్థానమును పొందుతాయి. ఈ తొమ్మిది దినాలను నవరాత్రులు అంటారు. ఈ నవరాత్రులను దేవీ నవరాత్రులనీ పిలుస్తారు.
అష్టమ, నవములందు జగన్మాతయైన అంబికను పూజించినవారు దుఃఖమునకు దూరం అవుతారు. శరత్కాలమున దేవీ పూజ ఫలదాయకము అని మార్కండేయ పురాణం చెబుతుంది.
ఈ శరన్నవరాత్రుల్లో ఉత్తరాంధ్ర ప్రాంతంలోనూ, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలలోను బొమ్మల కొలువులు పిల్లలచే పెట్టించి పేరంటంచేస్తారు. పిల్లలను పెద్దలు ఆశీర్వదించి, అక్షతలు వేస్తారు. తెలంగాణా ప్రాంతంలో ‘బతకమ్మ’ పూజ పసిపిల్లలనుంచి పండుముదుసలి వారి వరకు ఘనంగా నిర్వహిస్తారు. ఏరూపంలోనైనా పరాశక్తిని పూజించడమే ఈ పండుగ పరమోద్దేశం
ఒడిశా, బెంగాల్ ప్రాంతాల్లో దుర్గాపూజోత్సవాన్ని షష్ఠినుంచి ప్రారంభించి విజయదశమినాడు నదుల్లో, సముద్రంలో, చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. లలితాదేవి చిదగ్ని కుండంలో జనించిన అద్వితీయ సౌందర్యరాశి. వివిధాభరణ విరాజిత. సర్వమంగళ. సర్వమంత్రాలకు - తంత్రాలకు లక్ష్యము. అరువది నాలుగు కళలకూ అధిష్ఠాన దేవత. త్రిపుర సుందరి- త్రిపురేశ్వరి- పరమేశ్వరి- కామేశ్వరి- రాజరాజేశ్వరి అను పేర్లతో పూజింపబడుతుంది. మహా సరస్వతి- మహాలక్ష్మి- మహాకాళి అనే అంబత్రయం అమ్మవారి స్వరూపమే. సర్వదేవతా స్వరూపిణియైన పరమేశ్వరిగా వెలుగుతున్నది. వాంఛితార్థప్రదాయి. జగద్రక్షకి జగజ్జనని. రాక్షస శక్తులను సంహరించి, దైవీశక్తులను రక్షించిన పరాశక్తిగా పూజలందుకునే ఈ తల్లిని శరన్నవరాత్రిఉత్సవాలపేరుతో అన్ని శక్తిపీఠాలలోని సంప్రదాయబద్ధంగా ఆరాధిస్తారు.

- జె. శ్యామసుందరి