మంచి మాట

నమ్మకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి మనిషికి నమ్మకం ఉంటుంది. నమ్మకం లేకపోతే జీవనయానం సరిగా జరగదు అని కూడా అనుకోవచ్చు. అమ్మనాన్నలపై ఉన్న నమ్మకం వారి చెప్పిన మాటలపైనా కూడా ఉంటుంది. వారి చూపిన దారిలో నడిచి ఉన్నత స్థానాన్ని అలంకరిస్తుంటారు.
గురువు పైన ఉన్న నమ్మకంతోనే ఆయన చూపిన అక్షరాలు నేర్చుకుని పెద్ద పెద్ద గ్రంథాలు చదివే సౌభాగ్యాన్ని పొందుతారు. అట్లానే ఒక నమ్మకం అనేది ఏర్పరుచుకుంటే దానివల్ల ఎన్నో మంచి పనులు జరుగవచ్చు. నమ్మకం ఏర్పరుచుకుంటే చెక్కముక్కకూడా మంచి శక్తి మంతం అవుతుంది అంటారు.
ఏకలవ్యుడు ద్రోణాచార్యుని దగ్గర శిష్యరికం చేస్తానని వస్తాడు. కాని రాజకుమారులకే తాను బోధిస్తానని నీకు నేను బోధించలేనని చెప్పి ఏకలవ్యుని పంపించివేస్తాడు ద్రోణుడు. కాని ఏకలవ్యుడు ఇంటికివెళ్లి ద్రోణాచార్యుని బొమ్మచేసుకుని ఆ బొమ్మనే తన గురువుగా నమ్మి విలువిద్య నేర్చుకుంటాడు. ఆ విలువిద్యలో ఎంతటి కౌశలం నేర్పు తెచ్చుకున్నాడంటే ఆ విలువిద్యను చూసి అర్జునుడే భయపడుతాడు తనను మించిన వీరుడు ఏకలవ్యుడు అనుకొంటాడు. కేవలం నమ్మకంతోనే ఇంతటి విజయాన్ని సాధించాడు.
కలియుగంలోను సుందరాకాండ పారాయణ చేస్తే దాంపత్యంలో వచ్చే మనస్పర్థలు తొలుగుతాయి అనే నమ్మకంతో చాలామంది సుందరాకాండ చదువుతుంటారు. చాలామంది అనుకొన్నట్లే వారి జీవితాల్లో మార్పులు వస్తుంటాయి.ఇదంతా కేవలం పారాయణ మాహాత్మ్యం అని వారు నలుగురికీ చెబుతుంటారు.
పెద్దలు కూడా పారాయణ మంచిఫలితాలనిస్తుందని అంటారు.ప్రతి రోజు భగవద్గీత, విష్ణుసహస్రనామ పారాయణ లాంటివి చేయమని చెబుతుంటారు. కలియుగంలో నామపారాయణే స్వర్గపువాకిళ్లను తెరుస్తుందని కూడా ఓ నమ్మకం భక్తుల్లో ఉంది.
అయితే ఇక్కడ ఓ విషయాన్ని గమనించాలి. కేవలం ఆర్భాటంగానో మొక్కుబడిగానో పారాయణ చేసిన వారికి ఆ గ్రంథాలు, స్తుతులు ఫలితాలను ఇవ్వవు ఈ విషయాన్ని కూడా పలువురు చెబుతుంటారు. మేం లక్షపారాయణ లో ఉన్నాం కాని మాకు మంచి ఫలితమేమీ రాలేదు అంటుంటారు. ఇదీ నిజమే. ఎందుకంటే కేవలం నోటితోనే పదిసార్లు కాదు వేయి,లక్షసార్లు అంటే చాలదు.
మనసా వాచా కర్మణా మనం ఏమి చెబుతున్నామో దానిని ఆచరించాలి. ఏది పలుకుతున్నామో ఆ పదాన్ని గురించి అవగాహన చేసుకోవాలి. సుందరాకాండ పారాయణ చేస్తే ఎన్ని కష్టాలు వచ్చినా సీతమ్మ తల్లి రామునిపైన ప్రేమను దూరం చేసుకోదు. ఎన్నిసార్లు రావణాసురుడు తన్ను ప్రలోభ పెట్టినా తాను మాత్రం రావణుడిన పరపురుషుడుగానే భావిస్తుంది. అట్లానే ఆ ఘట్టాన్ని పారాయణ చేసేవారు కూడా ప్రలోభాలు లొంగిపోకూడదు. కష్టాలు వచ్చాయి కదాఅని అఘాయిత్యాలు చేసుకోకూడదు. సంయమనం పాటించాలి. ఏమి చేస్తే కష్టాలు దూరమవుతాయో తమను తాము విమర్శించుకోవాలి.
ఏవిధంగా వారు మారితే సమస్యకు పరిష్కారం దొరుకుతుందో వివేచనతో ఆలోచించాలి. ఆ వివేకంతో కూడిన వివేచన మంచిమార్గంలో పయనింపచేస్తుంది. ఆ ప్రయాణమే మంచి ఫలితాలను ఇస్తుంది. అపుడే కష్టాలు దూరమవుతాయి.
చేప నీళ్లల్లో ఉంటుంది.నీళ్లల్లో ఉండి కూడా శ్వాస పీల్చుకోవడం దాని శరీర అవయవ నిర్మాణంలో ఉంది. చేప నీటిలో ఉంటుంది కదా అని ఈత రాని వాళ్లు కూడా నీళ్లల్లో ఉంటామని వెళ్లితే ఊపిరాడక కొట్టుకొంటారు. అట్లాగే చేసే పని మీద మనసు పెట్టి, ధర్మయుతంగా, శాస్తబ్రద్ధంగా, నీతిమంతంగా పనిచేస్తే చాలు మంచి ఫలితం అదే వస్తుంది.
అందరికీ అన్నీ ఉన్నాయ అందరూ సౌఖ్యంగా బతికేస్తున్నారు. తాను మాత్రం కష్టాలు అనుభవిస్తున్నాడనుకొంటూ అడ్డదారిలో సంపాదన మొదలెట్టితే కొద్దిసేపు ప్రయాణం సాగినా చివరకు పయనించలేక చతికిల బడుతారు. కనుక ఎల్లప్పుడూ సుఖ ప్రయాణం చేయాలి. అంటే సత్యధర్మాలను ఆచరించాలి. సత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోను విడనాడకూడదు. అపుడే అనుకొన్న గమ్యస్థానానికి మంచి దారి కనబడుతుంది. ఆ దారిలో ఆటంకం లేకుండా ముందుకు సాగవచ్చు.

- డి. రాణి