మంచి మాట

ఆశామోహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్వాసలేని మనిషి లేనట్లే ఆశ లేని మనిషి కూడా లేడు. మానవుడు సర్వ సహజంగా ఆశాజీవి. అతని ఆశ అనంతమైన ఆకాశమంత విశాలం- అంతులేని సాగర గర్భమంత అగాధం. అగ్నికి ఆజ్యం తోడైనట్లు ఈ ఆశకు మోహం తోడైతే మానవుని దుశ్చర్యలకు దుర్మార్గాలకూ అంతమే వుండదు.
ఈ ఆశా మోహములే మానవుని ఆధ్యాత్మిక సాధనకు ఆటంక ప్రాయమవుతుంటాయి. ప్రకృతిలో వున్న మరే జీవికీ లేని ఈ మాయరోగం ఒక్క మానవునికే ఉన్నట్లు గమనించవచ్చు. సృష్టిలోని ప్రతి జీవి కూడా తన కవసరమైనంత మేరకే ఆశిస్తుంది. అందులోనే సంతృప్తి స్వర్గాన్ని పొందుతుంది. ఉదాహరణకు ఒక నదిలో నీళ్ళు తాగే లేడిపిల్ల- తన పొట్టకు ఎన్ని నీళ్ళు కావాలో అనే్న తాగుతుంది.
అలాగే పక్షులు కూడా చెట్టుకొమ్మలపై అతి చిన్న స్థలం తమకు అవసరమైనంతవరకే తమ గూటిని నిర్మించుకొని హాయిగా ఆనందంగా జీవిస్తాయి. ఇలా ఏ జీవిని పరిశీలించినా ‘ఆశ’లేని ఆనందమయ జీవితాన్ని పొందుతున్నాయి.
కానీ ఒక్క మానవుడు మాత్రం అందుకు భిన్నంగా ఆశామోహముల బారినపడి అనేకకానేక పాపకర్మలకు పూనుకొంటున్నాడు. ‘ఆశ’ మానవుణ్ణి మూడు విధాలుగా బాధిస్తుండటం గమనార్హం. అత్యాశ, దురాశ, నిరాశ అనే మూడు విధాల వర్గీకరణలో రకరకాలుగా ప్రేరణ పొందిన మానవుడు తన దుఃఖానికి తానే బాధ్యుడవుతున్నాడు. ఒక సినీ కవి వేదాంత ధోరణిలో చెప్పినట్లు- ఆశామోహముల దరి రానీకోయి- అందులకే నీ సుఖమూ అంకితమోయి- మానవుడు తన సుఖాన్ని వదలుకుని దుఃఖ సాగరంలో మునిగిపోవటానికి మూలకారాణాలైన ఆశా మోహములకు ఎంత దూరమైతే అంత మంచిది.
ఆశ మనిషిని మనశ్శాంతికి దూరం చేస్తుంది. మోహం కోరికలకు ఆలంబనయై- గౌతమ బుద్ధుడు చెప్పినట్లు సర్వ దుఃఖములకు మూలహేతువు అవుతున్నది. ఇంక దురాశ వున్నది చాలదన్న చింతకు దారిచూపుతూ అన్ని దురాగతాలకూ కారణభూతమవుతున్నది. కానీ ఈ సందర్భంగా మనం ఓ అంధుని కథ మననం చేసుకోవాలి. తనకో కన్ను లేదని ఏడిస్తే ఒకటే కనిపించదు- అదే ఇంకొకడికి రెండు కళ్ళూ వున్నాయని ఏడిస్తే ఆ అంధునికి రెండు కళ్ళు కూడా కన్పించవు. కనుక దురాశ ఎప్పుడూ దుఃఖానికి చేటు. అసంతృప్తికి నిలయం.
జీవితానందానికి మనిషిని శాశ్వతంగా దూరం చేసే ఈ దురాశ- మళ్లీ నిరాశకు ప్రాణం పోస్తుంది. నిరాశతో మనిషి జీవితం నిశీధిమయమై ఆవేదనకు గురి అవుతుంది. ఆలోచనారహితమవుతుంది. ఆత్మార్పణకు దారిచూపుతుంది. అందుకనే ఆశను ఏ రూపేణా ఆశ్రయించని మానవుని జీవితమే సుఖవంతమూ- ఫలవంతమూ అవుతాయి.
మోహమనేది మాయ. ఆ జగన్మాయలో పడిన మానవ జీవితం ఆధ్యాత్మిక చింతనకు- చిత్తశుద్ధికి సుదూరమై- శాంతి సౌఖ్యాలు కోల్పోతుంది. శతకారుడు సెలవిచ్చినట్లు ‘చిత్తశుద్ధి లేని శివపూజలేలయా’ అన్నమాట అక్షరాల నిజమై రుజువవుతుంది. పురాణేతిహాసకాలంలో అసురులంతా ఈ ఆశా మోహముల మయాలో పడి - తమ వినాశనానికి తామే కారకులయ్యారు. వారెంతటి భక్తాగ్రేసరులైనా - అహంకార దర్పాలతో విర్రవీగి మారణకాండను సృష్టించినందువలనే ఆ స్థితి కలిగింది.
అసలే కలియుగం. అధర్మం మూడుపాదాలమీద నడుస్తుంటుంది. ధర్మాచరణ చేద్దామని మనసులో అనుకొన్నా దానికి ఎన్నో ఆటంకాలు ఏర్పడుతుంటాయ. వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్లడం గగనకుసుమంగా ఉంటుంది. కనుక కలియుగంలో ఆశమోహాలకు తావివ్వకుండా ధర్మాచరణను చేయడం అంటే నియమనిష్ఠలతో యజ్ఞం చేయడం వంటిది. కలియుగంలో ధర్మాచరణలో కృతకృత్యులు కావాలంటే కేవలం భగవంతుని నామాన్ని ఉచ్చరిస్తూ ఉండాలి. ప్రహ్లాదుని ఆదర్శంగా తీసుకొని నిరంతరం భగవంతుని నామాన్ని జపిస్తుంటే అపుడు దురాశ అనే రక్కసి మన చెంతకు రాదు వ్యామోహపడకుండానే అనుకొన్న దాన్ని సాధిస్తాం. మనం ఆ నిజాన్ని గ్రహించి ఆశా వ్యామోహాల మాయలో పడకుండా శాంతి సౌఖ్యాలను స్వాగతిద్దాం- సర్వజన శ్రేయస్సును కోరుకుందాం! భగవంతుని చింతనే మనలను సదా కాపాడుతుంది.

- మరువాడ భానుమూర్తి