మంచి మాట

చిరంజీవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిశ్చల ఏకాగ్ర చిత్తంతో తపమాచరించు సమయంలో శిలలా కదలకుండా వుండి, అడవిలోని మృగాల యొక్క కండుయాన్ని (దురదను) తీర్చినవాడైనందున ‘మృకండు’ మహర్షిగా పిలువబడే మహర్షికి మరియు మహాసాధ్వి అయిన ఆయన భార్య మరుద్వతికి కలిగిన పుత్రుడే మార్కండేయుడు.
‘అపుత్రస్య గతిర్నాస్థి’ యని సంతానం కోసం వారణాసిని చేరి ఘోర తపస్సు చేయగా శివుని యొక్క సాక్షాత్కారం కలిగింది. ఆయన చిరంజీవి అయిన దుర్గుణుడు కావాలో, సద్గుణుడైన 16 ఏళ్ళ అల్పాయుష్కుడు కుమారుడుగా కావాలో కోరుకొమ్మని అన్నారు. మృకండుడు ఆయన్ని సద్గుణవంతుడ్నే ప్రసాదించమని కోరాడు.
ఏడేళ్ళ ప్రాయంలోనే సప్తఋషులను భక్తితో నమస్కరించి వారి మెప్పు పొంది వారిచే చిరంజీవ అని దీవింపబడ్డాడు. ఆ తరువాత వారతని విషయం గ్రహించి, ఆయుష్మంతుని చేయదలచి బ్రహ్మదేవుని ప్రార్థించి ఆయనతో సైతం చిరంజీవి అని ఆశీర్వదింపజేశారు.
నారద మహాముని ఉపదేశానుసారం శివుని శరణుజొచ్చిన మార్కండేయుని తేజస్సును భరింపలేక యమకింకరులు జడిసి వెనక్కు రాగా, స్వయంగా యమధర్మరాజే వచ్చి పాశమును విడుస్తాడు. శివోపాశనతో శివలింగాన్ని కావలించుకున్న మార్కండేయునిపై విసిరిన పాశము తాకగానే ఉగ్రరూపుడై మహాదేవుడు శివలింగం నుంచీ ఉద్భవించి యముడ్ని భయకంపితుడ్ని చేసి పారిపోయేలా చేస్తాడు. అంతేకాక తాను ఇచ్చిన వరం ‘సుపుత్ర ప్రాప్తిరస్తు’ అని మాత్రమే. కావున ఎన్నటికీ చిరంజీవిగా వర్థిల్లమని దీవించాడు శివుడు.
వేదవ్యాసుని శిష్యుడైన పరాశర మహర్షి పుత్రుడు జైమినికి, మార్కండేయునికి మధ్య జరిగిన సంవాదం నాలుగు ప్రశ్నలతో ప్రారంభింపబడి, పధ్నాలుగు మన్వంతరాల గురించి వివరింపబడింది. దానినే అష్టాదశ పురాణాలలో ఒకటైన మార్కండేయ పురాణంగా చెప్పబడింది.
హర్యానా, కోలార్, రాజమండ్రిలలో మార్కండేయుని మందిరాలు వున్నాయి. బిలాస్‌పూర్‌కి 20 కి.మీల దూరంలో గల మార్కండేయుని గుడి ప్రసిద్ధమైంది. ఏడాదిలో కొన్ని వేలమంది భక్తులు ఆయుష్మంతులు సత్సంతానం కోసం వేడుకోవటానికి వస్తుంటారు. చిరుప్రాయంలోనే భక్తిశ్రద్ధలను ఏకాగ్రతతో ఆశ్రయించి యముని సైతం జయించి, దేవదేవుని అనుగ్రహంతో చిరంజీవిగా ఆశీస్సులు పొంది ఆదర్శవంతుడయ్యాడు. నేటి పిల్లలకు ఏకాగ్రబుద్ధికి మార్గదర్శకుడయ్యాడు.
అటువంటి మార్కండేయుని నేటి విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలి. పట్టుదలతో, అవిశ్రాంతంగా కష్టపడి విద్యనేర్చుకోవాలి. శారదాదేవి విద్యార్థి కున్న ఆసక్తిని గమనించి ఆ తల్లి సర్వవిద్యలనూ ప్రసాదించాలి. అటువంటి పట్టుదల ప్రతివిద్యార్థికి కావాలి అంటే వారిలో చదువుపట్ల సత్యం పలుకడం పట్ల పట్టుదల ఏర్పరుచుకోవాలి. చిన్నప్పటి నుంచి మంచిని నేర్చుకోవాలి. మొక్కై వంగనిది మానై వంగునా అన్నట్టు చిన్నప్పడు మంచిచెడు పట్ల విచక్షణ లేకుండా ప్రవర్తించినా వారి తల్లి తండ్రులు చిన్నపిల్లలు కదా అని వదిలివేసి తిరిగి వారు పెద్దవారైన తరువాత మంచి పనులు చేయడం లేదు అని వాపోతే ఏం లాభం ఉంటుంది. అట్లానే పెద్దలు కూడా మార్కండేయులను ఆదర్శంగా తీసుకోవాలి. అంతటి కఠోరమైన నియమాలతో భగవంతుడిని మెప్పించాలి. ఇక్కడ కఠోర నియమాలు అంటే ఇతరుల సొమ్ము దోచుకోవాలన్న బుద్ధిని విడనాడడం స్వార్థబుద్ధిని దూరం చేసుకోవడం తనతో పాటు నలుగురు బాగుండాలన్న కాంక్ష కలిగి ఉండడం ఇట్లాంటివి నియమాలను పెట్టుకుని కేవలం అట్టహాసంతోనో లేక ఆడంబరంగానో కాకుండా తనకున్న పరిధిలోనే తన కర్తవ్యాన్నిఆచరిస్తూ భగవంతునిపై అపారమైన నమ్మకాన్ని ఏర్పరుచుకోవాలి. అపుడు భగవంతుడే భక్తుని చెంతకు తరలి వస్తాడు.ఇదే విషయాన్ని మార్కండేయ చరిత్ర చెబుతోంది.

-డేగల అనితాసూరి, హైదరాబాద్