మంచి మాట

జ్ఞానము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జ్ఞానమనగా తెలివి. ముఖ్యంగా మోక్ష సంబంధమైన విషయము తెలుసుకొను బుద్ధి. ఇది తెలిసికొన్నవారు ‘జ్ఞాత’. శ్రద్ధగలవాడు, జ్ఞానమునందాసక్తిగలవాడు, ఇంద్రియ నిగ్రహము కలవాడు జ్ఞానము పొందును. జ్ఞానము పొందిన తర్వాత అనతికాలములోనే శాంతిని పొందగలడని భగవానుడు గీతలో తెలియజేశాడు.
జ్ఞానశూన్యుడైన వ్యక్తి శ్రద్ధారహితుడై, సంశయాత్ముడై ఇహము, పరములలో సుఖము లేకుండా నశిస్తాడు. జ్ఞానముకన్నా పవిత్రమైన విషయము ఈ ప్రపంచంలో ఏదీ లేదు. జ్ఞాన రహిత కర్మ బంధవౌతుంది. కర్మను జ్ఞానపూరితం చేసి మోక్ష సాధనగా రూపొందించుకొనుటయే నిజమైన జ్ఞానము. మనుష్యునికి జ్ఞానము కలుగగానే సూర్యుని ముందు మంచు గడ్డ కరిగినట్లుగా కర్మలన్నియు తేజోవంతమై యజ్ఞ స్వరూపములుగా మార్పు చెందును. జ్ఞానపూరిత కర్మయే కర్మయోగమనబడుతుంది. అవగాహన నుండియే కర్మ కదులుతుంది. అవగాహనను జ్ఞానము శుద్ధిపరుస్తుంది. అప్పుడే నిజమైన ఆత్మజ్ఞానము కలుగుతుంది.
అవగాహన ద్వారా వ్యక్తి సంస్కరింపబడతాడు. జ్ఞాన సంస్మరణలో సమ్యక్ జ్ఞానమును పొందుతాడు. అంటే వ్యక్తి సంస్కరింపబడాలి. కాని సృష్టి సంస్కరింపబడదు. ధర్మగ్లాని కలిగినపుడు ధర్మమును ఉద్ధరించుటకు భగవానుడు అవతరించాడు. అందుకే భగవానుడు ధర్మగ్లాని అన్నాడే కాని ధర్మనాశనము అనలేదు. నశించే ధర్మాన్ని బాగుచేయుట సాధ్యము కాదు. ధర్మము ఎపుడు కూడా నశించదు. దీపమునకు కొడిగట్టినట్లు ధర్మాగ్లాని కలుగుతుంది. ఆ కాడి తొలగించగానే దీపం తిరిగి దేదీప్యమానంగా వెలిగినట్లు అవగాహనను కలిగించగానే ధర్మజ్యోతి కాంతులీనుతుంది. ధర్మము బలహీనులైన ఇంద్రియ నిగ్రహం లేనివారి చేతులలో పడుట చేత ధర్మమునకు గ్లాని ఏర్పడుతుంది. అలాంటి సమయంలో జ్ఞానులు జ్ఞానదీపమును వెలిగించాలి. ధర్మజ్యోతికి అవగాహన చమురును అందించవలసినవారు ధర్మాత్ములే.
భగవత్సంబంధమైన జ్ఞానముతో ఆచరింపబడే ప్రతి కర్మా యజ్ఞమగును. జ్ఞానము లేక చేయు కర్మలన్నియూ కుంటివి, గ్రుడ్డివి. కర్మాచరణకు ఉపకరించబడని జడ జ్ఞానము గ్రుడ్డిది. ఈ రెండింటి యొక్క అద్భుత అపూర్వ సమ్మేళనములను తెలిసికొనుటయే ఉత్తమోత్తమ స్థితి. ఈ స్థితిలో జ్ఞాన కర్మలను విభజించలేము. ఒక్కొక్కప్పుడు ఈ జ్ఞాన యోగ అవగాహనలో జ్ఞాన కర్మలు ప్రత్యేక అస్తిత్వమును కోల్పోయి సమరసవౌతాయి.
ఈ జ్ఞానము మనకు పుస్తకాలో లభించదు. శ్రోత్రియ బ్రహ్మ నిష్ఠుడైన సద్గురువు మస్తకమునుండి జాలువారాలి. సూర్యభగవానుని కిరణములు పద్మమను వికసింపచేయునట్లు గురుదేవుని అనుభమునుండి కదలిన జ్ఞాన కిరణాలు శిష్యుని హృదయ కమలమును వికసింపజేయాలి. తత్త్వవేత్తలైన సద్గురువులు అందించు జ్ఞానమే ఆత్మజ్ఞానము. ఇది కలిగిన తర్వాత ఇక పొందవలసిన జ్ఞానమంటూ ఏది ఉండదు. ఎంతటి పాపాత్ముడైనను ఈ జ్ఞానమనే నావలో సంసార సాగరాన్ని దాటవచ్చును. అయితే ఇట్టి జ్ఞానము కేవలము శ్రద్ధావంతులకే లభ్యమగుతుంది. సంశయచిత్తులకు ఏ మాత్రము లభించదు.
వాదము భేదమును కలిగిస్తుంది. విచారము ఆభేదమును తొలగించి వేదమును తెలియపరచి జీవుని అనాహత వాదమువైపునకు త్రోవ చూపి నడిపించి అమరునిగా మార్చుతుంది. సంశయము మదిని కలత చెందిస్తుంది. ఎవరైతే భగవత్ చైతన్యమును సంపూర్ణముగా విశ్వసించి ఆ చైతన్యముతో తాను సాగరములోని ఒక అల వలె యున్నట్లు భావించి ఒదిగిపోవువారు ధన్యులై జీవన్ముక్తులగుదురు. భక్తులైనవారు తరిస్తారు. అందుకే భగవానుడు, ఓ అర్జునా! జ్ఞానయోగము ద్వారా సంశయ రహితుడవై సమ్యక్ జ్ఞానముతో శోభించి అలరారుమని భగవద్గీతలో జ్ఞానయోగము ద్వారా తెలియజెప్పాడు. అంటే ప్రజలు అజ్ఞానాన్ని వీడి జ్ఞానాన్ని పొంది తాము ఉత్తేజితులై లోకాన్ని కూడా ఉత్తేజపరచి ముక్తులు కావాలి. ఇది గ్రహించని వారంతా అజ్ఞానులే.

-పెండెం శ్రీ్ధర్