మిర్చిమసాలా

అమరావతేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంతకీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతేనా లేక కజకిస్తాన్ , సింగపూర్, కౌలాలంపూర్ అలా ఏదైనా నగరంగా మారిపోతుందా అంటూ విపక్షాలు అధికార పక్షంపై సెటైర్లు వేస్తున్నాయి. కారణం లేకపోలేదు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏ నగరానికి పోతే ఆ నగరంతో అమరావతిని పోల్చడం, అదే మాదిరి అమరావతి నిర్మాణం చేపడతామని చెప్పడంతో ఇంతకీ రాజధాని అమరావతేనా అని విపక్షాల నేతలు నవ్వుతూ ప్రశ్నిస్తున్నారు. ఇటీవల రష్యా వెళ్లిన ముఖ్యమంత్రి కజకిస్తాన్‌లోని కొన్ని ప్రావిన్స్‌లు సందర్శించి అక్కడ కట్టిన రాజధాని నిర్మాణాలు చూసి తెగ మురిసిపోవడంతో ఇలా ప్రశ్నించకతప్పడం లేదని వారంటున్నారు
- బి వి ప్రసాద్

బాబు బాగా బిజీ!
రాష్ట్ర మంత్రివర్గంలో ఎవరైనా బిజీగా ఉన్నారంటే ఇద్దరే ఇద్దరు అని చెప్పవచ్చు. వీరిలో ఒకరు కెటిఆర్, మరొకరు హరీశ్‌రావు. వీరిద్దరూ ప్రతి రోజు ఏదో ఒక అంశంపై అధికారులతో సమావేశాలు నిర్వహించడమో, జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడమో చేస్తున్నారు. మిగతా మంత్రులైతే వారానికో, పక్షానికోసారి మాత్రమే అధికారులతో సమావేశం అవుతున్నారు. వీరిద్దరిలో కెటిఆర్ విదేశాల్లో విస్తృతంగా పర్యటిస్తూ పెట్టుబడుల కోసం కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నారు. దీంతో ఆయన్ను కొందరు తరచూ విదేశీ పర్యటనలకు వెళ్లే ప్రధాని మోదీతో పోల్చుతున్నారు. ఆయన్ను కొంత మంది మిత్రులు ‘బాబు బాగా బిజీ’ అంటూ ఆట పట్టిస్తున్నారు.
- వెల్జాల చంద్రశేఖర్

‘స్టిక్ నో బిల్స్’!
కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడ నగరంలో ప్రధాన రహదారులపై ప్రభుత్వ భవనాలు, ప్రహరీ గోడలపై ‘స్టిక్ నో బిల్స్’ అంటూ ఎలాంటి ప్రకటనలు, రాతలు లేకుండా, పోస్టర్లు అంటించకుండా నగరపాలక సంస్థ అధికారులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థినులు కూడా స్పందిస్తూ ఎక్కడైనా ప్రకటనలు, పోస్టర్లు కన్పిస్తే సున్నం పూస్తున్నారు. అయితే రాజకీయ నేతలు సామాన్యులా..? శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్లు సిఎం చంద్రబాబు, నారా లోకేష్ ముఖచిత్రంతో పుష్కర యాత్రికులకు స్వాగతం అంటూ తమ ఫొటోలు, పేర్లతో విద్యుత్ స్తంభాలు, ట్రాఫిక్ సిగ్నల్స్, చివరకు ప్రభుత్వ కార్యాలయాలపై కూడా పోటాపోటీగా ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు కట్టేస్తున్నారు. ‘గోడలన్నీ శుభ్రంగా కన్పించాలి.. లేదా అందమైన చిత్రాలు కన్పించేలా చర్యలు తీసుకోవాలం’టున్న చంద్రబాబు తమ ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలపై ఎలాంటి ఆదేశాలు జారీచేస్తారో వేచిచూద్దాం.
- నిమ్మరాజు చలపతిరావు

నీవు నేర్పిన విద్యయే...!
మల్లన్నసాగర్‌లో పోలీసుల లాఠీ చార్జీలో గాయపడిన వారిని పరామర్శించడానికి గాంధీభవన్ నుంచి బయలుదేరిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. జరిగిన దాడికి నిరసన తెలియజేసే హక్కు కూడా ప్రతిపక్షాలకు లేదా? ప్రభుత్వ చర్యలు ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అసెంబ్లీ ఎదుట ఉన్న గన్‌పార్క్ చుట్టూ ఇనుప కంచె వేసిందీ, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యమ సమయంలో వెలుపలికి రాకుండా యూనివర్సిటీ గేట్లను ఇనుప గడ్డర్లతో మూసివేసిందీ, ట్యాంక్ బండ్‌పై నిర్వహించిన మిలియన్ మార్చ్‌కు వెళ్లకుండా చుట్టూ ముళ్ల కంచెలు వేసిన విషయాన్ని ఈ నాయకులు మరిచిపోయినట్టు ఉన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు కూడా లేదా అని ప్రశ్నించే నాయకులకు చెందిన కాంగ్రెస్ అధికారంలో ఉండగా చేసిన పనినే ప్రస్తుతం అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్నది. దీనినే నీవు నేర్పిన విద్యనే నిరజాక్ష అంటారు.
- వి.సి.హెచ్.

హెల్మెట్...బంపర్ ఆఫర్
మీరు హెల్మెట్ వాడుతున్నారా? అయితే బంపర్ ఆఫర్ తగిలినట్లే! దీంతో కుటుంబ సభ్యులతో విహార యాత్ర (టూర్)కు వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి. అదేమిటీ హెల్మెట్ వాడితే బంపర్ ఆఫర్ ఏమిటా? టూర్ ఏమిటీ? అని అశ్చర్యపోతున్నారా? మన దగ్గర కాదు. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పని సరిగా పెట్టుకునేలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతి రోజూ హెల్మెట్ ధరించే వ్యక్తుల వాహనాల నెంబర్లను రాసుకుని సాయంత్రం 10 డ్రాలు పోలీసు అధికారులు తీస్తారు. ఆ డ్రాలో వచ్చే నెంబర్ వాహనదారులకు ఫోన్ చేసి ఉచితంగా టూర్‌కు వెళ్ళేందుకు టిక్కెట్లు ఇవ్వడం ప్రారంభించారు. మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ టూర్ల బంపర్ ఆఫర్ వస్తే భలే బాగుంటుంది కదూ!. పోలీసులకు ఫొటోలు తీసే, చలాన్లు రాసే పని తప్పుతుంది.
- వి. ఈశ్వర్ రెడ్డి