రాష్ట్రీయం

ఉత్తర తెలంగాణలో మళ్లీ మావోల అలజడి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలుకు నోచుకోని పునరావాసం, ఉపాధి కల్పన హామీలు
ఎల్‌టిఆర్ 1/70 చట్టంపై ‘మావో’లను ఆశ్రయిస్తున్న ఆదివాసీలు
గిరిజన ప్రాంతాల్లో ప్రజావిశ్వాసం కోల్పోతున్న ప్రభుత్వం

హైదరాబాద్, నవంబర్ 23: ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మావోయిస్టులు మళ్లీ అలజడి సృష్టిస్తున్నారు. ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో మావోయిస్టుల కార్యకలాపాలు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో పోలీసు ఇన్‌ఫార్మర్ అంటూ ఒకరి హత్య, వరంగల్‌లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికను బహిష్కరించాలంటూ వెలువడిన కరపత్రాలు, పోస్టర్లు కలకలం రేపాయి. ఖమ్మం జిల్లాలో టిఆర్‌ఎస్ నాయకుల కిడ్నాప్, ఛత్తీస్‌ఘడ్‌లో పోలీసులు, మావోల మధ్య కొనసాగుతున్న పరస్పర దాడులు తెలంగాణ సరిహద్దు రాష్ట్రాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో కనీస సౌకర్యాల కల్పన, రోడ్లు, ఆసుపత్రులు, పాఠశాలలు, కుటుంబానికో ఉద్యోగం, దళితులకు మూడెకరాల వ్యవసాయ భూమి, ఆదివాసీలకు అటవీ సంపదపై హక్కు, సాగు భూముల పంపిణీలో ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు సర్వత్రా వస్తున్నాయి. దీంతో ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన, ఆదివాసీలు మావోయిస్టులను ఆశ్రయిస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఇచ్చిన 1/70యాక్టుపై కూడా మావోలు గూడెం, గిరిజన తండాలను తమ గుప్పిట్లో తీసుకున్నట్టు తెలుస్తుంది. నాలుగు జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసీ గూడెంలను, గిరిజన తండాలను అభివృద్ధి చేస్తే నక్సలైట్ల ప్రభావం ఉండదని, యువత మావోయిజంపై దృష్టి సారించదని తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర సహాయంతో ఆయా ప్రాంతాల్లో వౌలిక వసతుల కల్పనతోపాటు, కుటుంబానికో ఉద్యోగం, వ్యవసాయ భూముల పంపిణీకి సంకల్పించింది. టిఆర్‌ఎస్ అధికారంలోకి రాకముందు ఏజెన్సీ ప్రాంతాల సమస్యలపై గుప్పించిన హామీలు, అధికారంలోకి వచ్చిన తరువాత విస్మరించిందని గిరిజన, ఆదివాసీ సంఘాలు ఆరోపించాయి. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు మళ్లీ తమ ఉనికిని కాపాడుకునేందుకు ఏజెన్సీలోని ఆదివాసి, గిరిజనుల సమస్యలపై పోరాటం సాగించేందుకు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో తమ ఆధిపత్యం కోసం విస్తరిస్తున్నట్టు తెలుస్తుంది.
లొంగిపోయిన నక్సలైట్లకు పునరావాసం, ఉపాధి అవకాశం కల్పించకపోవడమే మావోయిస్టులు విస్తరించడానికి కారణమా..? లేదా కేంద్రం అదనపు సహాయం (అడిషనల్ సెంటర్ అసిస్టెన్సీ) అందించకపోవడమా..? అనే మీమాంస వ్యక్తమవుతుంది. తెలంగాణలోని భద్రాచలం డివిజన్‌లో దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజీడులలో 350కుటుంబాలకు పక్కా గృహాలతోపాటు విద్య, వైద్య, రోడ్డు సౌకర్యం, కుటుంబానికో ఉద్యోగం, వ్యవసాయ భూమి పంపిణీ వంటివి అమలు జరగకపోవడంతోనే తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామనే ప్రభుత్వ సంకల్ప నెరవేరడంలేదని విమర్శలు వస్తున్నాయి. ఖమ్మం జిల్లాలోని చర్ల మండల పరిధిలో గల కుర్నావలి-ఈసరల్లి రోడ్డు నిర్మాణ చేపట్టకపోవడమే ఇందుకు ఉదాహరణ. ఛత్తీస్‌ఘడ్‌కు మూడు వందల కిలోమీటర్ల పరిధిలోని ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లేందుకు కూడా అధికారులు రోడ్డు సౌకర్యానికి నోచుకోవడంలేదు. దీంతో పోలీసులు ఎలాంటి కేసులలోనైనా బాధితులను మండల కేంద్రాలకే రప్పించుకొని కేసులు నమోదు చేస్తుండడంతో ఆయాప్రాంతాల్లో మావోల అనధికార పాలన కొనసాగుతుందని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఏజెన్సీ ప్రాంతాల్లో మావోల సానుభూతిపరులు పెరగడంతోపాటు క్యాడర్ కూడా విస్తరిస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధితో నక్సలైట్లకు అడ్డుకట్ట వేయవచ్చనే ప్రభుత్వ సంకల్పం నెరవేడం లేదని విమర్శలు వస్తున్నాయి. మావోల అణచివేతే లక్ష్యంగా సిఆర్‌పిఎఫ్ దళాలు పల్లెలను జల్లెడ పడుతున్నాయి. మావోయిస్టుల ప్రాబల్యంతో ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంత ప్రజల విశ్వాసాన్ని చూరగొనలేకపోతుందని ఆరోపణలు వస్తున్నాయి.
వరంగల్ జిల్లాలో సెప్టెంబర్‌లో జరిగిన మావోల ఎన్‌కౌంటర్ తరువాత నక్సల్స్ కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయని, జిల్లాలో మావోల ప్రభావం ఏమీలేదని జిల్లా రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్ జా తెలిపారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నిక సందర్భంగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన చిట్యాల, పరకాల, భూపాలపల్లిలో గట్టి భద్రతా ఏర్పాటు చేశామని, ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్నారు. నక్సల్స్ కుటుంబాల ఇళ్లకు వెళ్లి వారి సంబంధికులను హింసను వీడి జనజీవన స్రవంతిలో కలవాలని కోరాలంటూ సూచించారు. లొంగిపోయిన మావోలకు పునరావాసం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో టిఆర్‌ఎస్ నేతల కిడ్నాప్‌తో పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను మావోలు హెచ్చరించినట్టు వచ్చిన ప్రకటన నేపథ్యంలో జిల్లాలో ముందస్తుగా భద్రతా చర్యలు చేపట్టారు. పోలీసులు నక్సలైట్స్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో (ఎన్‌ఐబి) పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా భూతగాదాలు, కుల, వర్గ వైషమ్యాలతో ప్రతీకార దాడులకు పూనుకునేది. వారి బలహీనతలు ఆసరా చేసుకొని మావోలు తమ కార్యకలాపాలను విస్తరింపజేశారు. జల్, జమీన్, జంగల్ పథకానికి నోచుకోని ఆదివాసీలు, దళితులు మావోల వైపే మొగ్గుచూపుతున్నారని, వారిని నక్సల్స్ వైపు వెళ్లకుండా ఉండాలంటే కనీస సౌకర్యాల కల్పన, ప్రభత్వ పథకాలు అందించాలి. కానీ అవి అందకపోవడంతోనే మావోలను ఆశ్రయిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయా ప్రాంతాల ఆదివాసీలు ల్యాండ్ ట్రాన్స్‌ఫర్ రెగ్యులేషన్ వన్‌ఆఫ్ యాక్టు 1/70 సమస్యగా పరిణమిస్తుండటంతో గిరిజనులు నష్టపోతున్నారని విమర్శలు వస్తున్నాయి. మావోలు మాత్రం ఏజెన్సీ ప్రాంతాల్లో తమ పాలనను కొనసాగిస్తున్నారంటూ, వారిని నక్సలిజాన్ని మట్టుబెట్టడమే లక్ష్యంగా పోలీసులు పల్లెప్రాంతాలన్నీ జల్లెడ పడుతున్నాయి.