రాష్ట్రీయం

మాస్టర్‌ప్లాన్ అంతా బూటకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూములిచ్చిన రైతులకు స్థలాలెక్కడో చూపలేదు
ఉపాధి లేక జీవచ్ఛవాల్లా వ్యవసాయ కూలీలు
ట్రిబ్యునల్‌లో బయటపడనున్న అసలు రంగు
పర్యావరణ పరిరక్షణ ఉద్యమ నేత శ్రీమన్నారాయణ

విజయవాడ, డిసెంబర్ 29: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా తెల్లవారుజామున విడుదల చేసిన రాజధాని అమరావతి మాస్టర్‌ప్లాన్‌లో ఎక్కడా పారదర్శకత, చిత్తశుద్ధి అనేది కన్పించడం లేదని, అంతా దగా, మోసమేనని పర్యావరణ పరిరక్షణ ఉద్యమవేత్త పందలనేని శ్రీమన్నారాయణ ధ్వజమెత్తారు. పర్యావరణ పరిరక్షణ విషయంలో మొదటి నుంచి దోబూచులాడుతున్న ఈ ప్రభుత్వం అసలు రంగు తాను పోరాడుతున్న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లోనే బయటపడగలదని, జనవరి 15న తుది విచారణ జరగనుందని అన్నారు. సోమవారం నాడిక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో శ్రీమన్నారాయణ మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు నమ్మి కొందరు రైతులు బెదిరింపులకు లోనై తమ పంట భూములను అప్పగిస్తే మాస్టర్ ప్లాన్‌లో వీరందరికీ ఎక్కడ ప్లాట్లు కేటాయిస్తారో చూపలేదన్నారు. మాస్టర్‌ప్లాన్ ఖరారు తర్వాత గజం విలువ కోటి రూపాయలు పలుకుతుందని నమ్మి 7400 గజాల కోసం ఎకరం భూమి చొప్పున ఉదారంగా ఇచ్చారని అన్నారు. ప్లాట్లు ఇచ్చేవరకు కౌలు కింద జరీబు భూములకు రూ.50 వేలు, ఇతర భూములకు 25 వేలు చొప్పున చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం అత్యధిక మంది రైతులకు తొలి వాయిదా సొమ్ము కూడా చెల్లించలేదన్నారు. ప్రభుత్వం 25 వేల మంది కూలీలనే గుర్తించి నెలకు రూ.2500 చొప్పున పరిహారం చెల్లిస్తోందని, ఇదేమి న్యాయమని శ్రీమన్నారాయణ ప్రశ్నించారు. ఒక్క ఎకరంపై ఐదారుగురు కూలీలు ఆధారపడితే ప్రభుత్వ లెక్కల ప్రకారం ఒక్కరు కూడా లేరా అని ప్రశ్నించారు. మహిళలకు కూడా ఈ రంగంలోనే నైపుణ్యత ఉందన్నారు. వీరికి ఏ రంగంలో శిక్షణ ఇచ్చి ఉపాధి చూపగలరని ప్రశ్నించారు. 33 వేల ఎకరాల పంట భూములు రెండేళ్లుగా బీడుగా ఉంచడంతో వ్యవసాయ కూలీలకు ఉపాధి లేకుండా పోయిందన్నారు. మరోవైపు ఆహార భద్రత కూడా లేకుండా పోతోందన్నారు. ఇవన్నీ గమనించి తాను అక్టోబర్ 10 తేదీ ట్రిబ్యునల్‌లో కేసు దాఖలు చేసి రాజధాని శంకుస్థాపనను నిలువరించడానికి ఎంతగానో ప్రయత్నించానని అన్నారు. అయితే భూముల జోలికి వెళ్లలేదంటూ ప్రభుత్వం తప్పుడు సమాచారం అందజేసిందన్నారు. కోర్టు ఆదేశాలను ప్రభుత్వం ధిక్కరించిందంటూ నవంబర్ 5న తాను మరో కేసు దాఖలు చేయగా వచ్చే జనవరి 15 తేదీ విచారణ జరగనుందన్నారు.
ఇటీవల కురిసిన వర్షాల వల్ల చెన్నై నగరం అతలాకుతలం కాగా ఇందులో సగం వర్షం కురిసినా రాజధాని మునిగిపోగలదని, బాధితులను హెలికాప్టర్లలో తరలించడం మినహా మరో మార్గం లేదని నిపుణులు తేల్చి చెప్పారన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రపంచ బ్యాంక్ కూడా పర్యావరణాన్ని ధ్వంసం చేస్తే ప్రభుత్వానికే కాదు ఏ కంపెనీకి కూడా నయాపైసా రుణం ఇవ్వబోమని తేల్చి చెప్పిందన్నారు. దశాబ్దాలుగా కొండవీటి వాగుకు వరద వస్తే 20 వేల ఎకరాల భూమి ముంపునకు గురయ్యేదని, ప్రస్తుతం ఈ ప్రవాహాన్ని ఎటు మళ్లించేది కూడా మాస్టర్‌ప్లాన్‌లో స్పష్టం చేయలేదన్నారు. రాజధానిలో భవనాల నిర్మాణానికి 400 ఎకరాలను మాత్రమే కేటాయించారని, మిగిలిన భూములన్నింటినీ ప్రైవేట్ కంపెనీలకు ధార దత్తం చేయబోతున్నారనేది అర్థమవుతోందన్నారు. అందుకే రైతుల్లో ఈ ప్రభుత్వంపై విశ్వాసం లేక ఇప్పటికే 1500 ఎకరాల్లో దున్ని పంటలు సాగు ప్రారంభించారని అన్నారు.