స్వర్ణ కాంతలు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

** ఏ క్రీడాకారిణి చరిత్ర చూసినా ఏదో ఓ కొత్త కథే వినిపిస్తుంది. కన్నీటి చారికలే దర్శనమిస్తాయి. కష్టాల కడగండ్లే కనిపిస్తాయి. కనీస సౌకర్యాలు, ప్రోత్సాహం ఉండదు. ప్రాథమిక హక్కు అయిన చదువునే ఆడపిల్లలకు అందించడానికి చిత్తశుద్ధి కరువైన పాలకులకు.. ఇక అమ్మాయిలను క్రీడాఠంగంలో ప్రోత్సహించాలని, పాఠశాల స్థాయిలో క్రీడలను తప్పనిసరి చేయాలని ఎక్కడుంటుంది చెప్పండి? అయినా మా దీక్షలో ఎటువంటి కొరతా లేదు. మా పట్టుదలను ఎవ్వరూ
ఆపలేరు. మా విజయానికి అడ్డుకట్టను వేసేవారు కనుచూపు మేరలో కనిపించరంటూ కష్టాలు
ఎదురైన ప్రతిసారీ రెట్టించిన ఉత్సాహంతో, సాగర కెరటాల్లా ఎగసిపడుతున్నారు మహిళలు. అంతులేని ఆత్మవిశ్వాసంతో దేశగౌరవాన్ని ప్రపంచం నలుమూలలా చాటుతున్నారు. అందుకే అమ్మాయిలను
ఆడనిద్దాం.. ఆడేందుకు అవకాశం కల్పిద్దాం..
ప్రోత్సహిద్దాం..

కామన్‌వెల్త్ గేమ్స్..
మొత్తం 26 బంగారుపతకాలు..
అందులో మహిళలు గెలుచుకున్నవి.. పది..
ప్రపంచ పటంపై మన కీర్తిపతాకను ఎగరేసింది స్వర్ణ ‘నారీ’మణులే! మీరాబాయి చాను, సంజితా చాను, పూనమ్ యాదవ్, మనూబాకర్, మానికా బాత్రా , హీనా సిద్దు, మేరీకోమ్, సైనా నెహ్వాల్, తేజస్విని సావంత్, శ్రేయాసి సింగ్.. అందరూ ‘బంగారు’ పతకాలను కొల్లగొట్టేసినవారే..
పూనమ్ యాదవ్
వెయిట్ లిఫ్టింగ్‌లో స్వర్ణాన్ని సొంతం చేసుకున్న పూనమ్ యాదవ్ స్వస్థలం వారణాసి. తండ్రి ఓ సాధారణ రైతు. వారిది చాలా పెద్ద కుటుంబం. తండ్రి చేసే వ్యవసాయమే ఆ కుటుంబానికి ఆధారం. పేదరికం. తినడానికి తిండి లేదు. కాళ్లకు చెప్పులు కూడా లేని పరిస్థితి. తండ్రితో పాటు అందరూ తలా ఒక పని చేసేవారు. అలా పూనమ్ యాదవ్ కూడా బర్రెలను మేపుకుని వచ్చేది. పూనమ్‌కు ఇద్దరు అక్కలు. వారు కూడా ఎప్పుడూ ఆటల్లో ఫస్ట్.. దాంతో పూనమ్‌కు కూడా ఆటలపై మక్కువ ఏర్పడింది. 2012లో స్థానిక ఆటలపోటీల్లో ముగ్గురు అక్కాచెల్లెల్లు పాల్గొన్నారు. వారిలో పూనమ్ అత్యుత్తమ ప్ర తిభ కనబరచడంతో పెద్దవారు ఇద్దరూ పక్కకు తప్పుకున్నారు. అలా పూనమ్ వెయిట్ లిఫ్టింగ్‌ను ఎంచుకుంది. కానీ వెయిట్ లిఫ్టర్ కావాలంటే తిండి బాగా తినాలి, ఫిట్‌నెస్ ఉండాలి, శిక్షణ కూడా కావాలి. కానీ ఆ పేద తండ్రికి స్థోమత లేకపోవడంతో అప్పు చేశాడు. కూతురిపై నమ్మకంతో ప్రోత్సహించాడు. 2014లో కామన్‌వెల్త్‌లో పూనమ్ సిల్వర్ మెడల్ గెలుచుకుంది. అప్పుడు వచ్చిన డబ్బుతో అప్పు చెల్లించారు. అలా అలా పూనమ్ తన ప్రతిభను మెరుగుపరుచుకుంటూ స్వర్ణాన్ని సాధించాలనే పట్టుదలతో ప్రయత్నం చేసింది. తరువాత ఆమెకు ఇండియన్ రైల్వేస్‌లో ఉద్యోగం రావడంతో ఆర్థికంగా కొంత స్థిమితపడింది. పూర్తిస్థాయిలో క్రీడలపై దృష్టి పెట్టిన పూనమ్ ఈ కామన్‌వెల్త్‌లో తన సత్తా చాటి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది.
మీరాబాయి చాను
కామన్‌వెల్త్ క్రీడల్లో అలవోకగా బరువులెత్తి పసిడి పతకాన్ని సాధించిన వెయిట్ లిఫ్టర్. అందరికీ తెలిసింది ఇదే.. కానీ బాల్యంలో చాలా కష్టాలు పడింది చాను. ఇంట్లో వంటకోసం చాను కట్టెలు కొట్టి, తెచ్చే సంగతి ఎవరికీ తెలియదు. ఇంఫాల్‌కు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న నాంగ్‌పొక్ కాక్‌చింగ్ గ్రామంలోని పేద కుటుంబంలో పుట్టింది చాను. చాను తండ్రి ఓ చిరుద్యోగి. కుటుంబం పెద్దది. ఇంట్లో ఆరుగురు సంతానంలో చాను చిన్నది. వంట చెరుకు కోసం సోదరులతో కలిసి అడవికి వెళ్లేది. తన కన్నా పెద్దవాళ్లు ఎత్తలేని బరువును కూడా ఆమె సులభంగా ఎత్తేది. చిన్నప్పటి నుంచీ చాను చాలా చురుకుగా ఉండేది. సవాళ్లను ఎప్పుడూ నవ్వుతూ, ప్రశాంతంగా ఎదుర్కోవడం ఆమెకున్న అలవాటు. అలా ఆమె వెయిట్ లిఫ్టింగ్‌లోకి వచ్చింది. తండ్రి ప్రోత్సాహం లభించింది. రియో ఒలింపిక్స్‌లో కనీసం పోటీని కూడా పూర్తిచేయలేదని సోషల్ మీడియాలో ఆమెను లక్ష్యంగా చేసుకుని అనేక విమర్శలు ఎదురయ్యాయి. క్రీడాభిమానులు ఆమెను దుయ్యబట్టారు. ఫలితంగా మీరా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. ఒక దశలో క్రీడలను వదిలేయాలనుకుంది. కానీ వైద్యుల కౌన్సిలింగ్ అనంతరం, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో మళ్లీ వెయిట్ లిఫ్టింగ్‌పై దృష్టి పెట్టింది. విజయం సాధించినప్పుడు అందరి మెచ్చుకోళ్లు ఉంటాయి. అదే విజయాన్ని చేజార్చుకున్నప్పుడు వచ్చే విమర్శలను తట్టుకుని నిలబడటం చాలా కష్టం. అలా క్రీడల నుంచి వైదొలగాలనుకున్న మీరా ఏడాదిలోనే పుంజుకుని ఇప్పుడు కామన్‌వెల్త్‌లో స్వర్ణాన్ని గెలుచుకుంది. 2014 కామన్‌వెల్త్ క్రీడల్లో బంగారు పతకం గెలవడంతో చాను కుటుంబం ఆర్థిక సమస్యల నుంచి బయటపడింది. ఇప్పుడు కూడా చాలా అలవోకగా చాను స్వర్ణం గెలవడంతో ఆ కుటుంబం చాలా ఆనందపడుతోంది.
సంజితా చాను
2014లో కామన్‌వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం గెలుచుకున్న సంజితా చాను తాజాగా కామన్‌వెల్త్ క్రీడల్లోనూ స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. ఈమె స్వస్థలం కూడా మణిపురే. వ్యక్తిగతంగా సంజిత చాలా సిగ్గరి. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడదు. కానీ వెయిట్ లిఫ్టింగ్ ఎరీనాలో అడుగుపెట్టగానే ఆమెలోని మరో రూపం బయటపడుతుంది. గత ప్రపంచ చాంపియన్‌షిప్ జరిగిన సమయంలో సంజితా చాను బాగా గాయపడింది. ఆ పరిస్థితి నుంచి కోలుకోవడానికి సంజిత చాలా కష్టపడింది. కోచ్, ఫెడరేషన్ మద్దతు లభించింది. ప్రతి టై నింగ్ సెషన్‌కు ముందు అదనంగా అరగంటసేపు ఆమె ఫిజియోథెరపిస్ట్ వద్ద గడిపేది. ఈ కామన్‌వెల్త్‌లో ఆమె పసిడి పతకాన్ని ఊహించలేదు. బంగారు పతకం గెలుచుకోగానే సంజిత కళ్లు వర్షించాయి. ‘‘ఇన్ని రోజులు పడిన కష్టాన్ని ఫలితం దక్కిందని, నేను పతకం గెలవలేనేమో అని అనుమానం వ్యక్తం చేసిన వారందరికీ సరైన జవాబు దొరికింది’’ అంది సంజిత.
శ్రేయాసి సింగ్
మొక్కవోని పట్టుదల, అంతకుమించిన ఆత్మవిశ్వాసంతో స్వర్ణాన్ని గెలుచుకుంది శ్రేయాసి సింగ్. శ్రేయది ఢిల్లీ. 2014 కామన్‌వెల్త్‌లో ఈమె రజతాన్ని గెలుచుకున్న సంగతి అందరికీ తెలిసిందే. 2010లో ఢిల్లీ కామన్‌వెల్త్ గేమ్స్‌లో అరంగేట్రం చేసినా ఆమె తండి ఆకస్మిక మరణంతో పతకం గెలవలేకపోయింది. అయితే ఇప్పుడు స్వర్ణ పతకాన్ని గెలవడంతో మీడియాతో తన ఆనందాన్ని పంచుకుంది. ‘‘నా తండ్రి మరణం ననె్నంతో కుంగదీసింది. దాని నుంచి బయటపడడానికి నాకు చాలా సమయమే పట్టింది. ఇప్పుడు బంగారు పతకాన్ని పొందడం నాకెంతో ఆనందంగా ఉంది. నా కెరీర్‌లో ఈ పతకం ఓ మైలురాయి. వచ్చే కామన్‌వెల్త్‌లో షూటింగ్ ఉంటుందో, లేదో తెలియదు. షూటాఫ్ అనేసరికి కాస్త నిరాశపడ్డాను. కానీ నమ్మకాన్ని కోల్పోలేదు. పోటీ కోసం అన్ని రకాలుగా సిద్ధపడ్డాను. నా కుటుంబం నాకు అండగా నిలిచింది. ఎలాగైనా స్వర్ణాన్ని గెలవాలనే కోరిక నెరవేరింది’’ అని సంతోషాన్ని వ్యక్తం చేసింది శ్రేయాసి.
మనూబాకర్
హర్యానాలోని మారుమూల ప్రాంతం నుంచి వచ్చింది మనూబాకర్. మనూ తండ్రి రామ్‌కిషన్ బాకర్ ప్రోత్సాహంతో బరిలోకి దిగింది. స్వర్ణాన్ని గెలిచింది. రామ్ తన కూతురు తనలా ఇంజనీర్ కావాలనుకోలేదు. ఆమెకు నచ్చిన రంగాన్ని ఎంచుకునే స్వేచ్ఛని ఇచ్చాడు రామ్. మొదట మనూ బాక్సింగ్ నేర్చుకుంది. టెన్నిస్ నేర్చుకుంది. తరువాత మణిపురి యుద్ధవిద్య టాంగ్తాను నేర్చుకుని జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుని, బంగారు పతకాన్ని కూడా సాధించింది. 2016లో షూటింగ్‌ను ఎంచుకుంది. అందులో భాగంగా కళాశాలను కూడా మార్చుకుంది. తండ్రిని అడిగి ఒక పిస్తోలును కూడా కొనిపించుకుంది మనూ. షూటింగ్‌ను మొదలుపెట్టిన కొద్దిరోజులకే అంటే ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో రజతం గెలవడంతో మనూ కెరీర్ మలుపు తిరిగింది. అదే సంవత్సరం కేరళలో జరిగిన జాతీయ ఛాంపియన్‌షిప్‌లో ఏకంగా తొమ్మిది పతకాలు సాధించడమే కాకుండా జాతీయస్థాయి రికార్డును బద్దలుకొట్టి ప్రపంచం దృష్ట్టిలో పడింది మనూబాకర్. మెక్సికోలో జరిగిన షూటింగ్ ప్రపంచకప్‌లో స్వర్ణాన్ని సాధించింది. డబుల్స్‌లో మరో స్వర్ణాన్ని సాధించింది. తాజాగా కామన్‌వెల్త్‌లో కూడా స్వర్ణాన్ని కైవసం చేసుకుని తన తండ్రికి తనపై ఉన్న విశ్వాసాన్ని గెలిపించింది మనూబాకర్.
తేజస్విని సావంత్
మరాఠీకి చెందిన తేజస్వినీ సావంత్ మహిళల యాభై మీటర్ల ఈ పొజిషన్స్ విభాగంలో స్వర్ణాన్ని సాధించిన సంగతి తెలిసిందే. మహారాష్టక్రు చెందిన కొల్హాపూర్ తేజస్విని స్వస్థలం. ఆమె తండ్రి రవీంద్ర సావంత్ భారత నావికాదళంలో అధికారి. తేజస్విని ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన మొదటి భారతీయ మహిళగా చరిత్రలో నిలిచింది. తేజస్వినికి ఇద్దరు చెల్లెలు. వారిద్దరూ వివాహితలు. తేజస్విని తండ్రి 2010లో మరణించారు. ఇది ఆమెకు ఎదురైనా అతిపెద్ద ఎదురుదెబ్బ. నెమ్మదిగా మనసును గట్టి చేసుకుని ఆ దుఃఖం నుంచి బయటపడింది తేజస్విని. ఎలాగైనా తను కోరుకున్న స్థాయికి చేరుకోవాలని మెరుగైన ప్రదర్శన ఇవ్వడానికి అహరహరం కృషి చేసింది. ఇబ్బందులు వచ్చినా వాటి ప్ర భావాన్ని ఆట మీద పడకుండా చూసుకుంది. మిగిలిన పనులను చక్కబెట్టుకుంటూనే సాధనను చేసేది. కుటుంబ సభ్యులు కూడా తండ్రి స్థానంలో నిలిచి తేజస్వినిని ప్రోత్సహించారు. ఎంత కష్టమైనా, ఖరీదైనా కూడా తేజస్విని కోచింగ్‌కు కావలసిన ఏర్పాట్లు చేశారు కుటుంబ సభ్యులు. ఆమె సాధనకు ఏనాడూ ఆటంకం కలిగించలేదు. తేజస్విని కోరుకున్న గమ్యాన్ని చేరుకోవాలని ఆమెను అనుక్షణం ప్రోత్సహించేవారు. 2011లో తేజస్విని అర్జున అవార్డును పొందారు.
మానికా బాత్రా
మానికా బాత్రా నాలుగేళ్ళ వయస్సులోనే టెన్నిస్ రాకెట్‌ను చేతబూనింది. ఆమెకు టేబుల్ టెన్నిస్ అంటే ఇష్టం, ప్రేమ, పిచ్చి.. పదిహేనేళ్ళ వయస్సులో జాతీయస్థాయిలో రజతాన్ని సొంతం చేసుకుంది. ఆటకోసం చాలా స్కూల్స్ మారింది. క్లాసులను ఎగరగొట్టింది. 2014లో కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత జట్టుకు కెప్టెన్ అయింది. జట్టును క్వార్టర్ ఫైనల్ వరకు తీసుకెళ్లింది. ఏడాది తరువాత కామన్‌వెల్త్ ఉమెన్స్ డబుల్స్‌లో రజతాన్ని తెచ్చి పెట్టింది. భారతదేశంలో టేబుల్ టెన్నిస్ పేరు చెబితే తన పేరు తప్పక గుర్తు రావాలన్న ఆకాంక్ష ఆమెది. అందుకే 22 సంవత్సరాలకే ప్రపంచంలో టేబుల్ టెన్నిస్‌లో 58 స్థానాన్ని కైవసం చేసుకుంది. తాజాగా కామన్‌వెల్త్ గేమ్స్‌లో స్వర్ణాన్ని గెలుచుకుంది. అలాగే తను కీలకపాత్ర వహించి తన జట్టుకు కూడా స్వర్ణాన్ని తెచ్చిపెట్టింది. స్వర్ణాన్ని అందించిన జట్టులో కీలకపాత్ర వహించిందామె. ఇంత సాధించిన మానికాబాత్రాకు ఆలియాభట్ అంటే ఎంతో ఇష్టం. ఆమె సినిమాలను ఇష్టంగా చూస్తుంది. అలాగే ఫోట్‌షూట్‌లంటే కూడా మానికాకు మహా ఇష్టమట.
మేరీకోమ్
భారత బాక్సింగ్ దిగ్గజం, ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్, రాజ్యసభ సభ్యురాలు అయిన మేరీకోమ్ కామన్‌వెల్త్ గేమ్స్‌లో మరోసారి తన సత్తాచాటి స్వర్ణాన్ని కైవసం చేసుకున్నారు. మహిళల 48 కిలోల విభాగంలో ఫైనల్లో మేరీకోమ్.. నార్తర్న్ ఐర్లాండ్‌కు చెందిన క్రిస్టినీ ఒహారాపై విజయం సాధించి స్వర్ణపతకం ముద్దాడారు. ఈమె కామన్‌వెల్త్ క్రీడల్లో పాల్గొనడం ఇదే తొలిసారి. పాల్గొన్న మొదటిసారే బంగారు పతకం సాధించడంతో ఆమె తన ఆనందాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ‘‘కామన్‌వెల్త్‌లో నేను గెలిచిన ఈ బంగారు పతకాన్ని నా ముగ్గురు కుమారులకు అంకితమిస్తున్నాను. ఫోన్ చేసినప్పుడు ఇంటికి ఎప్పుడొస్తావు అమ్మా! అని అడిగేవారు వాళ్ళు. వారికి, నా కోచ్‌కు, సపోర్టింగ్ స్ట్ఫాకు, శాయ్‌కు నా ధన్యవాదాలు’’ అని తెలిపారు.
సైనా నెహ్వాల్
భారత బాడ్మింటన్‌లో తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటిన సైనా అంటే తెలియని క్రీడాలోకం లేదు. దేశంలో బాడ్మింటన్‌ను మరో మెట్టుకు తీసుకెళ్లిన షెట్లర్. లెక్కకు మిక్కిలి సూపర్ సిరీస్ టైటిల్స్, ఒలంపిక్స్, ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతకాలు.. ఇలా ఎన్నో ఘనతలు సైనా సొంతం. 2012లో లండన్ ఒలంపిక్స్‌లో కాంస్యం సొంతం చేసుకున్న తరువాత ఆమె ఆశించిన స్థాయిలో రాణించలేదు. గాయాలు, ఫామ్ లేని ఆట ఆమెను దెబ్బతీశాయి. కానీ ఆమె వెనుకడుగు వేయలేదు. పూర్వపు ఫామ్‌ను సంపాదించేందుకు, ఆల్ ఇంగ్లాండ్ టైటిల్‌ను అందుకోవడానికి పట్టుదలతో శ్రమించింది. విజయవంతమైంది. పునరాగమనానికి ‘పసిడి’ వత్తాసు పలికింది. కోట్ల భారతీయుల సాక్షిగా, తన గురువు వీక్షిస్తుండగా పసిడి పతకాన్ని ఒడిసిపట్టేసింది.
హీనా సింధు
హీనా సింధు ముంబయి వాసి. ఆమె ఓ డెంటల్ డాక్టర్. హీనా తండ్రి షూటింగ్‌లో జాతీయస్థాయి క్రీడాకారుడు. ఆమె అన్న కూడా పది మీటర్ల షూటరే. హీనా భర్త కూడా షూటరే కావడం విశేషం. హీనా 2006లో షూటింగ్‌ను మొదలుపెట్టింది. 2009లో ప్రపంచ కప్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని హీనా రజతాన్ని సొంతం చేసుకుంది. పది మీటర్ల ఎయిర్ రైఫిల్ పోటీల్లో రజతం సాధించిన హీనా.. 25 మీటర్ల ఈవెంట్‌లో మహిళా విభాగంలో అగ్రస్థానంలో నిలిచి ఎట్టకేలకు స్వర్ణాన్ని సొంతం చేసుకుంది.

-ఎస్.ఎన్. ఉమామహేశ్వరి