మెదక్

సాగు, తాగునీరు అవసరాలు తీర్చడానికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొగుట, సెప్టెంబర్ 20: సిద్దిపేట జిల్లాతో పాటు పరిసర జిల్లాలకు సాగు, తాగునీటి అవసరాలు తీర్చడానికి ప్రభుత్వం అహర్నిశలు కృషిచేస్తోందని కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ హరేరామ్ అన్నారు. గురువారం తొగుట మండలం ఎల్లారెడ్డిపేటలో కాళేశ్వరం ప్రాజెక్టు 12వ ప్యాకేకేజ్‌లో లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగడానికి సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావులు ఎంతగానో శ్రమిస్తున్నారన్నారు. సిద్దిపేట, దుబ్బాక, గజ్వెల్ నియోజకవర్గ పరిధిలో కొన్ని ప్రాంతాలు ఎత్తుగా ఉన్నందున ఆ గ్రామాలకు నీరు అందించేందుకు ఇక్కడ ఎత్తిపోతల పథకాన్ని 70 కోట్లతో చేపట్టడం జరుగుతుందన్నారు. భూసేకరణ సమస్య కూడా ఉండదన్నారు. 6 మాసాల్లో పనులు పూర్తిచేయడం జరుగుతుందన్నారు. ఎత్తిపోతల పథకం ద్వారా తొగుట మండలంలోని ఎల్లారెడ్డిపేట, బండారుపల్లి, పెద్దమాసాన్‌పల్లి, ఘనపూర్, గుడికందుల, మిరుదొడ్డి మండలంలోని ధర్మారం, కొండాపూర్, సిద్దిపేట మండలంలోని బుస్సాపూర్, ఇరుకోడు, తోర్నాల, వెంకటాపూర్, దుబ్బాక మండలంలోని తిమ్మాపూర్, పెద్దగుండవెళ్లి, కొండపాక మండలంలోని సిర్సనగండ్ల, మర్పడగ గ్రామాల్లోని 15000 ఎకరాలకు సాగునీరు అందించడం జరుగుతుందన్నారు. కాళేశ్వరం పనులు కొద్ది మాసాల్లో పూర్తయి మల్లన్నసాగర్‌లోకి నీళ్లు వస్తాయన్నారు. కాలువల ద్వారా చెరువులు, కుంటల్లోకి నీటిని పంపించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఆనంద్, సుడా చైర్మన్ మారెడ్డి రవిందర్‌రెడ్డి, జడ్‌పిటిసిలు కొక్కొండ రూపా పరిపూర్ణచారి, గౌతమి మహేష్, ఎంపీపీలు గంట రేణుక రవిందర్, పంజాల కవిత, రాధాకృష్ణరెడ్డి, యాదయ్య, మండల రైతు సమన్వయ సమితి కన్వినర్ ఏల్పుల స్వామి, పీఏసీఎస్ చైర్మన్ మల్లేశం, మాజీ సర్పంచ్‌లు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి నష్టపరిహారం
* చెక్కును అందజేసిన జిల్లా జడ్జి సాయి కళ్యాణ్ చక్రవర్తి
సంగారెడ్డి టౌన్, సెప్టెంబర్ 20: మోటార్ వాహన ప్రమాద కుటుంబానికి కోటి పది లక్షల రూపాయల చెక్కును గురువారం జిల్లా జడ్జి సాయి కళ్యాణ్ చక్రవర్తి అందజేశారు. లోక్ అదాలత్‌లో భాగంగా స్పెషల్ బెంచ్‌ను ఏర్పాటు చేసి ఇరువర్గాల వారితో చర్చించి రాజీమార్గన కేసును పరిష్కరించారు. వాహన ప్రమాద బాధిత కుటుంబానికి బజాజ్ అలియాన్స్ జనరల్ ఇన్యూరెన్స్ కంపెనీ ద్వారా మంజూరైన నష్టపరిహారం చెక్కును అందజేశారు. ఈ లోక్ అదాలత్ కేసులో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. భవాని, బాధిత కుటుంబం తరుపున వాదించిన న్యాయవాది విజయశంకర్‌రెడ్డి, ఇన్సూరెన్స్ తరుపున వాదించిన న్యాయవాది విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

విజయశాంతికి కాంగ్రెస్ నాయకుల అభినందనలు
మెదక్ టౌన్, సెప్టెంబర్ 20: టీ పీసీసీ ఎలక్షన్ స్టార్ క్యాంపైనర్‌గా నియమితులైన మాజీ ఎంపీ విజయశాంతికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మున్సిపల్ చైర్మన్ బట్టి జగపతి అభినందనలు తెలిపారు. స్టార్ క్యాంపైనర్‌గా ఎంపికైన విజయశాంతిని గురువారం హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో కలిసిన కాంగ్రెస్ నేతలు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. త్వరలోనే ప్రచార కార్యక్రమాలను చేపట్టి ప్రజలను చైతన్యపరచాలని వారు కోరారు. ఆయన వెంట మెదక్ మాజీ ఎంపీపీ లింగాల పద్మారావు, కాంగ్రెస్ నాయకులు బాలకృష్ణ, హాఫీజోద్దీన్, చందు తదితరులు ఉన్నారు.
* రేవంత్‌రెడ్డిని ప్రచారానికి రావాలని కోరిన నేతలు
టీ పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్‌గా ఎన్నికైన రేవంత్‌రెడ్డిని జగపతి కాంగ్రెస్ నాయకులతో కలిసి అభినందనలు తెలిపారు. మెదక్ నియోజకవర్గంలో పర్యటించి ప్రచారం నిర్వహించాలని వారు కోరారు.