మెదక్

రూ.5 లక్షలు పలికిన అమీన్‌పూర్ వినాయకుడి లడ్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమీన్‌పూర్, సెప్టెంబర్ 22: గణేష్ నవరాత్రి ఉత్సవాలు ముగియవస్తుండటంతో లంబోధరుడి లడ్డూను దక్కించుకోవడానికి భక్తులు వేలం పాటల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అమీన్‌పూర్ మున్సిపాలిటి పరిధిలోని శివాలయం చౌరాస్థాలో నెలకొల్పిన వినాయకుని లడ్డును వేలం వేయగా రూ.5 లక్షల గరిష్ట ధర పలికింది. ప్రతి సంవత్సరం నిర్వహించే వేలం మాదిరిగానే ఈ ఏడు కూడా మండపం నిర్వాహకులు వేలం పాట నిర్వహించారు. చివరకు రూ.5 లక్షలకు రాంరెడ్డి వినాయుకుని మహాప్రసాదాన్ని స్వంతం చేసుకున్నారు. లడ్డుతో పాటు వినాయకుని పూజలో తొమ్మిది రోజులు ఉంచిన లక్ష్మీ, గణపతి, సరస్వతి వెండి నాణాలను అయిదింటిలో మొదటి దానిని రూ.2.60 లక్షలకు మధు దక్కించుకోగా, రెండవ నాణాన్ని రూ.1.17 లక్షలకు కొండల్, మూడవ నాణాన్ని ఒక లక్షకు సిద్దిరామిరెడ్డి, నాలుగవ నాణాన్ని రూ.70 వేలకు మల్లేష్, అయిదవ నాణాన్ని రూ.1.30 లక్షలకు కొండల్ దక్కించుకున్నారు. లడ్డూను, నాణాలను వేలం పాటలో దక్కించుకున్న భక్తులకు పూజలు నిర్వహించి శాలువాలతో సన్మానించి పూజారులు అందజేసారు. ఆది దేవుడు తమ నమ్మకాన్ని వమ్ము చేయకుండా సకల సౌభాగ్యాలు సిద్ధిస్తున్నాడని వేలం పాటలో పాల్గొన్న భక్తులు విశ్వాసం వ్యక్తం చేశారు.
రామచంద్రాపూరంలో రూ.3.50 లక్షలు పలికిన లడ్డు
రామచంద్రాపురం మండల పరిధిలోని రామచంద్రారెడ్డి నగర్ కాలనీలోని వినాయక విగ్రహం వద్ద జరిగిన లడ్డూ వేలం పాటలో అత్యధికంగా రూ.3.50 లక్షలకు వేలం పాడి జిల్లాగ్రంధాలయ సంస్థ డైరెక్టర్ కుమార్‌గౌడ్ గణపతి లడ్డూను చేజిక్కించుకున్నారు. భగవంతుని అనుగ్రహం ఉంటే జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకోగలమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ తొంట అంజయ్యయాదవ్, ఆదర్శ్‌రెడ్డి, రామ్ మోహన్‌రెడ్డి, రాజిరెడ్డి, నాగభూశనం, చంద్రశేఖర్, తిరుమల్‌గౌడ్ తదితరులు ఉన్నారు.

సజావుగా ఈవీఎంల పరిశీలన
* సంతృప్తి వ్యక్తం చేసిన సీఈఓ ప్రకాష్‌జ్యోతి
సంగారెడ్డి టౌన్, సెప్టెంబర్ 22: జిల్లాలో కొనసాగుతున్న ఈవీఎంలు, వీవీప్యాట్‌ల ప్రథమస్థాయి పరిశీలన ప్రక్రియ సజావుగా జరుగుతుండటంపై సీఈఓ కార్యాలయ అదనపు సీఈఓ ప్రకాష్‌జ్యోతి సంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం సీఈఓ కార్యాలయ బృందం సంగారెడ్డిలోని పాత డీఆర్‌డీఎ కార్యాలయ ఆవరణలోని గోదాంలో జరుగుతున్న ఈవీఎం, వీవీప్యాట్‌ల పరిశీలన ప్రక్రియను పరిశీలించారు. ఈవీఎంల భద్రత చర్యలు, బ్యాలెట్, కంట్రోల్ యూనిట్ల స్కానింగ్, గోదాంల పటిష్టత, స్ట్రాంగ్‌రూం తదితర వాటిని అడిగి తెలుసుకున్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్‌ల పరిశీలన రాజకీయ ప్రతినిధుల సమక్షంలో జరుగుతున్నట్లు కలెక్టర్ హన్మంతరావు తెలిపారు. ఈసీఐ నిబంధనల మేరకే ప్రక్రియ నిర్వహిస్తున్నామని, పూర్తయిన బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లను స్కానింగ్ చేయడం, వివరాలు కంప్యూటర్‌లో అప్‌లోడ్ చేయడం తదితర వాటిని వివరించారు. అదనపు సీఈఓ అక్కడే ఉన్న రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఈవీఎం,వీవీప్యాట్‌ల పరిశీలన, పనితీరు, కల్పిస్తున్న అవగాహనపై ఆరా తీశారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సందేహాలను నివృత్తి చేస్తూ పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తున్నట్లు ఇంజనీర్లు తెలిపారు. అన్నింటిని తమ సమక్షంలోనే చెక్ చేస్తున్నారని, ఈవీఎం, వీవీప్యాట్‌ల వినియోగంపై పూర్తిస్థాయి అవగాహన వచ్చిందని రాజకీయ పార్టీల ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నిఖిల, డీఐఓ శాంతికుమారి, తహసీల్ధార్ విజయ్‌కుమార్, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ పాషా, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

డెడ్ స్టోరేజీలో ఘణపురం ప్రాజెక్ట్
* సింగూర్‌లో 7.1 టీఎంసీ నీటి నిలువ
* పంటల అవసరాలకు తగిన ఎక్వైర్‌మెంట్ నివేదిక ప్రభుత్వానికి సమర్పణ
* మెదక్ జిల్లా ఇరిగేషన్ శాఖ అధికారి ఏసయ్య
మెదక్, సెప్టెంబర్ 22: సింగూర్‌లో 7.1 టీఎంసీ నీరు ఉన్నట్లు మెదక్ జిల్లా ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి.ఏసయ్య శనివారం తెలిపారు. మాజీ ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు ఘణపురం ఆయకట్టుకు సింగూర్ నీరు వదులుతున్నట్లు ఆదేశాలు వచ్చినప్పటికీ అందుకు సంబంధించిన ఉత్తర్వులు ప్రభుత్వం నుండి రాలేదని ఆయన తెలిపారు. శనివారం ఘణపురం ఆయకట్టు క్రింద ఉన్నటువంటి పంటలను పరిశీలించేందుకు ఇరిగేషన్ శాఖ జూనియర్ ఇంజనీర్లు వెళ్లారని ఆయన తెలిపారు. ఆ పంటల వివరాలు సేకరించి శనివారం సాయంత్రానికి ఆ పంటలకు అవసరమైన నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వానికి నివేదించబోతున్నట్లు ఆయన తెలిపారు. ఘణపురం ఆయకట్టు క్రింద 21 వేల 625 ఎకరాలు ఉన్నట్లు తెలిపారు. అయితే వర్షాభావ పరిస్థితుల కారణంగా 80 శాతం పంటలు మాత్రమే వేశారని తెలిపారు. ఈ పంటలను కాపాడేందుకు భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు రాష్ట్ర ఆపద్దర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దృష్టికి తెచ్చారని, సింగూర్ నీళ్లు విడుదల చేయడానికి అంగీకారం వెలువడినట్లు ఆయన తెలిపారు. అందువలన ఘణపురం ఆయకట్టు క్రింద వేసిన పంటలు రైతుల చేతికి వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే వరి పంట పొట్టకు వచ్చిందని, ఇప్పుడు కురుస్తున్న వర్షాలతో పాటు సింగూర్ నీరు వస్తే పంటలు అనుకున్న మేరకు పండుతాయన్నారు. ఇప్పుడు కురుస్తున్న వర్షాలు 16.6 ఎం.ఎం వర్షపాతం నమోదు అయినట్లు తెలిపారు. మెదక్ జిల్లాలో చెరువులు, కుంటలు 3494 ఉండగా, అందులో కేవలం ఎఫ్‌ఎన్, ఎంఎన్ కెనాల్ క్రింద చెరువుల్లో నీళ్లు ఉన్నాయని, మిగతా చెరువులకు నీళ్లు రాలేదన్నారు. అందువలన చెరువుల క్రింద పంటలు వేయలేదని తెలిపారు. అతి పెద్ద చెరువులైన రాయిన్‌పల్లి, కొంటూర్ చెరువుల్లో కొద్దిపాటి నీళ్లు ఉన్నాయని, ఇవి పశువులకు తాగడానికి మాత్రమే ఉపయోగపడతాయని తెలిపారు. గ్రౌండ్ వాటర్ తగ్గాయన్నారు. కాగా మెదక్ జిల్లా రైతులు ఆశించిన మేరకు పంటలు వేయలేదని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఈ విషయంలో ఆలోచిస్తుందని ఆయన తెలిపారు. ఘణపురం ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజికి చేరింది. కాలువలు ఎండిపోయాయి. సింగూర్ నుండి విడిచే నీరు కాలువలు మొత్తం తాగగా, మిగిలన నీళ్లు ఘణపురం ప్రాజెక్ట్‌కు చేరుకుంటాయి. ఈ నీటిని పంటలకు విడుదల చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.