మెదక్

సంగారెడ్డి సెగ్మెంట్‌పై కమలదళం కన్ను!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, సెప్టెంబర్ 25: జంట నగరాల తరువాత భారతీయ జనతా పార్టీకి మంచి పట్టున్న సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో మళ్లీ పాగా వేసేందుకు కమలదళం విస్తృత కసరత్తు చేస్తోంది. సంస్థాగతంగా పార్టీ నిర్మాణంతో పాటు టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలను సమర్థవంతంగా ఎదుర్కొనే దమ్మున్న అభ్యర్థిని రంగంలోకి దింపాలన్న యోచనలో బీజేపీ రాష్ట్ర అధిష్ఠానం యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గం పరిధిలోని కొండాపూర్ మండలం మల్లెపల్లి గ్రామానికి చెందిన ఎంపీపీ మాజీ అధ్యక్షుడు రాజేశ్వర్ రావు దేశ్‌పాండేను తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించేందుకు అధిష్ఠానం నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు దేశ్‌పాండే మంగళవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ను కలుసుకోవడంతో దేశ్‌పాండే చేరికకు బలాన్ని చేకూరుస్తోంది. నియోజకవర్గంలో భారీ జనసమీకరణతో బహిరంగ సభను ఏర్పాటు చేసి దేశ్‌పాండే మెడలో కాషాయం కండువా ధరింపజేసే యోచనలో నాయకులు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో హిందుత్వ నినాదంతో గతంలో ఒక పర్యాయం బీజేపీ ఎమ్మెల్యేగా గెలిపించుకుంది. 2009 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని పటన్‌చెరుకు చెందిన కె.సత్యనారాయణను అభ్యర్థిగా దింపి గెలిపించుకుంది. సంగారెడ్డి, సదాశివపేట మున్సిపల్ పట్టణాల్లో బీజేపీకి మంచి పట్టుంది. పార్టీలో గ్రూపుల గొడవలతో పూర్వవైభవం పొందలేకపోతుందని ఆ పార్టీ శ్రేణులు మదనపడుతున్నాయి. ఇందుకుగాను కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపి గ్రూపులను ఏకతాటిపైకి తీసుకురావాలని అధిష్ఠానం వ్యూహరచనలు చేస్తున్నట్లు తెలిసింది. దేశ్‌పాండెను అభ్యర్థిగా దింపడం వల్ల టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు దీటుగా డబ్బును ఖర్చు చేసేందుకు వెనకడాడనే విశ్వాసాన్ని బీజేపీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. కొండాపూర్ మండలం తనకంటూ కొంత ఓటు బ్యాంకు ఉన్న దేశ్‌పాండేకు పార్టీ ఓటు బ్యాంకు తోడైతే కాషాయం జెండా ఎగరడం పెద్ద కష్టం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముస్లిం మైనార్టీల ఓట్లు కూడా అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో మెజార్టీగా 60 శాతం ఓట్లు టీఆర్‌ఎస్‌కు మొగ్గుచూపిస్తే, మిగతా 40 శాతం ఓట్లు కాంగ్రెస్‌కు పడే అవకాశాలు ఉన్నట్లు భాజాపా నేతలు అంచనాకు వస్తున్నారు. క్రైస్తవుల ఓట్లు అధిక శాతం కాంగ్రెస్‌ను ఆకర్షించినా మిగిలిన ఓట్లు టీఆర్‌ఎస్‌కు వెళతాయన్న ఆలోచనతో బీజేపీ నేతలు సమీకరణలు మొదలుపెట్టారు. మూడు పర్యాయాలు సంగారెడ్డి మున్సిపాలిటీపై కాషాయం జెండాను ఎగుర వేసి ఒక సారి ఎమ్మెల్యే స్థానాన్ని కైవసం చేసుకున్న బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు, ఆధిపత్య పోరుతో పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలోనే మరోసారి హిందుత్వ నినాదాన్ని బలంగా వినిపించేందుకు పార్టీ నేతలు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా త్వరలోనే పరిపూర్ణానంద స్వామి అడుగుపెట్టబోతున్నాడన్న ప్రచారం బీజేపీ నేతలు, కార్యకర్తలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇటీవలే జనాకర్షణ కలిగిన స్వామిగా గుర్తింపు తెచ్చుకోవడం, ముఖ్యమంత్రి అభ్యర్థిగా పార్టీ ప్రకటిస్తే పార్టీకి ఓట్ల శాతం పెరుగుతున్న ఆలోచనలు చేస్తున్నారు. పార్టీ పరిశీలనలో ఉన్న దేశ్‌పాండే గతంలో కాంగ్రెస్ పార్టీలో అప్పటి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి సన్నిహితుడిగా కాంగ్రెస్ శ్రేణుల్లో గుర్తింపు, అనంతరం టీఆర్‌ఎస్‌లో ఉండి తాజామాజీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుల్లో ఒకడిగా ఉంటూ పార్టీ నేతలతో సన్నిహిత సంబంధాలు పెంచుకున్నారు. దేశ్‌పాండేను రంగంలోకి దింపితే టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఓట్లకు గండికొట్టాలని పావులు కదుపుతున్నారు. టీఆర్‌ఎస్‌లో ఉన్న అసమ్మతి, అసంతృప్తి నేతలు కూడా గుట్టుచప్పుడు కాకుండా దేశ్‌పాండేను ప్రోత్సహించే కార్యక్రమంలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. మొత్తంమీద బీజేపీ సంగారెడ్డి నియోజకవర్గంలో పూర్వవైభవాన్ని సంతరించుకునేలా వ్యూహప్రతివ్యూహాలు రచిస్తున్నారని స్పష్టమవుతోంది.

మెదక్ బంద్ ప్రశాంతం
*వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్, బీజేపీ నాయకుల భారీ ర్యాలీ *మెదక్ పురపాలక సంఘ కార్యాలయం ముట్టడి
*జ్ఞాపికపై చర్చిని ఏర్పాటు చేయడం పట్ల నిలదీసిన ఆందోళనకారులు
మెదక్, సెప్టెంబర్ 25: మెదక్‌లో హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా జరిగిన వినాయక నిమజ్జనంలో బహూకరించిన జ్ఞాపికల్లో చర్చి ఫొటో పెట్టడం పట్ల విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్, బీజేపీ నాయకులు మంగళవారం మెదక్ బంద్ పాటించారు. బంద్ ప్రశాంతంగా జరిగింది. అంతే కాకుండా బైక్ ర్యాలీలు పట్టణంలోని వ్యాపార సంస్థలు, పెట్రోల్ బంక్‌లు, సినిమా థియోటర్లను మూసివేయించారు. ఇందులో ఆర్టీసీ బస్సులకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు మినహాయింపు చేశారు. అంతే కాకుండా రామాలయం నుండి భారీ ర్యాలీగా బయలుదేరి మెదక్ పురపాలక సంఘాన్ని ముట్టడించారు. పట్టణ సీఐ శ్రీరాం విజయ్‌కుమార్, ఎస్సై శేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు చేసి ఆందోళనకారులను లోనికి ప్రవేశించకుండా గేటును వేశారు. ఉదయం నుండే మెదక్ పట్టణమంతా ఉద్రిక్తత చోటు చేసుకుంది. మెదక్ చర్చి గేటును పూర్తి స్థాయిలో మూసివేశారు. మెదక్ పురపాలక సంఘం కమిషనర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. జై శ్రీరాం అంటూ భారీయేత్తున ఆందోళనకారులు నినాదాలు చేశారు. కమిషనర్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఒక దశలో మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో ఆందోళనకారులు రాస్తారోకో చేశారు. యువత రెచ్చిపోయి వినాయక మంటపాలకు అందజేసిన జ్ఞాపికలను మున్సిపల్ కార్యాలయం ముందు విసిరికొట్టారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మున్సిపల్ అధికారులు ప్రవర్తించారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు వనపర్తి వెంకటేశం, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గడ్డం శ్రీనివాస్, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు నందారెడ్డి, జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు కటికె శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు గోదల మల్లేశం, భజరంగ్‌దళ్ పట్టణ అధ్యక్షులు చాట్ల నరేందర్, బీజేపీ నాయకులు గడ్డం కాశీనాథ్, సైదులు, వనపర్తి సురేష్, అంకం శ్రీనివాస్, సునిల్, భూషణంగౌడ్ తదితరులు ఉన్నారు.
* క్షమించండి: కమిషనర్ సమ్మయ్య
నేను హిందువును, స్వచ్ఛ భారత్‌లో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు జ్ఞాపిక మీద లోగోలు ఖిల్లా, సరస్వతి శిశుమందిర్, మెదక్ చర్చిని ఏర్పాటు చేయడం జరిగిందని కమిషనర్ సమ్మయ్య తెలిపారు. మీ బాధను గుర్తించాను, ఎవరి మనోభావాలను దెబ్బతీసే విధంగా తాను స్వయంగా వ్యవహరించలేదని ఆయన తెలిపారు. ఈ లోగో వెనుక చైర్మన్‌గానీ, కౌన్సిలర్లుగానీ ఎవరు లేరని ఆయన స్పష్టం చేశారు. కాగా మీరు డిమాండ్ చేస్తున్న విధంగా ఈ జ్ఞాపికపై ఉన్న చర్చి ఫొటోను తొలగిస్తానని ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా మీరందరు బాధపడినందుకు క్షమించాలని ఆందోళనకారులకు విజ్ఞప్తి చేశారు.
* మాకు సంబంధం లేదు: డీసీసీ చైర్మన్, ప్రిసిబిటరి ఇన్‌చార్జీ విజయరావు
అన్ని మతాలను గౌరవిస్తాం, సోమవారం జరిగినటువంటి వినాయక నిమజ్జనంలో మంటపాలకు బహూకరించిన జ్ఞాపికలో చర్చిని ఏర్పాటు చేసిన విషయంలో మాకు సంబంధం లేదని డీసీసీ చైర్మన్, ప్రిసిబిటరి ఇన్‌చార్జీ రెవ.విజయరావు స్పష్టం చేశారు. అయినా మున్సిపల్ అధికారులు తమను అడుగకుండా ఇలాంటి కార్యక్రమాలు చేయడం సరికాదన్నారు. ఈ విషయంలో ప్రజలు బాధపడినందుకు విచారిస్తున్నానని, ప్రజలంతా శాంతియుతంగా జీవించాలన్నదే తమ లక్ష్యమని ఆయన తెలిపారు.

బహుజనుల రాజ్యాధికారానికి కార్మికులు ఉద్యమించాలి
* వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పాలి * సీఐటీయు రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు

సిద్దిపేట, సెప్టెంబర్ 25 : రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీకి ఐదు ఏళ్లు పరిపాలించాలని ప్రజలు అధికారం కట్టబెడితే స్వార్ధ రాజకీయాలతో ముందస్తు ఎన్నికలకు వెళ్లటం సిగ్గుచేటని సీఐటీయు రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు విమర్శించారు. టీఆర్‌ఎస్ పార్టీ ఏకారణం చేత ముందస్తు ఎన్నికలకు వెళ్లారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. మంగళవారం సిద్దిపేట జిల్లా సీఐటీయు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్మికులకు వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్న కేసీఆర్ పట్టించుకోవటం లేదని విమర్శించారు. కనీస వేతనాల సలహామండలి రెండు సార్లు మారిందని, నేటికి కనీస వేతన నిర్ణయం చేయలేదన్నారు. కనీస వేతనాల కాలం చెల్లిన జీవోలో నేటికి సవరణ చేయటం లేదన్నారు. రాష్ట్రంలో ప్రజస్వామ్య పద్దతిలో ధర్నాలు చేయకుండ ఇందిరాపార్క్ వద్ద ధర్నా చౌక్‌ను తొలగించారని, ఆ విషయంలో హైకోర్టు మొట్టికాయాలు వేసి ధర్నా చౌక్‌ను యధావిథిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా 2లక్షల మంది ఉన్నారని, వారికి అధికారంలోకి రాగానే రెగ్యులరైజ్ చేస్తానని హామీనిచ్చారని,కాని అమలు చేయలేదని విమర్శించారు. ఒకవైపు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లేక, మరోకవైపు రెగ్యులర్ కాలేక అనేక మంది యువతి, యువకులు ఇబ్బందులు ఎదుర్కోంటున్నారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయటం లేదని, అర్హులైన వారికి డబుల్ బెడ్‌రూంలు, దళితులకు మూడెకరాల భూమి, కేజీ నుండి పీజీ విద్య అమలు తదితర హామీలు అమలుకు నోచుకోలేదన్నారు. కేంద్రంలో బీజేపీ సర్కార్ ప్రజాకార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయన్నారు. అప్రజాస్వామికమైన టీఆర్‌ఎస్ సర్కార్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రమాదకరమైన విధానాలను అమలు చేస్తుందని, కార్మిక వర్గం ప్రత్యామ్నాయ విధానాల కొరకు పోరాడాలని పిలుపునిచ్చారు. ఈసమావేశంలో సీఐటీయు రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్, జిల్లా కార్యదర్శి రేవంత్‌కుమార్, అధ్యక్షుడు గోపాలస్వామి, నాయకులు కళావతి, భాస్కర్, ఎల్లయ్య, సత్తిరెడ్డి, చంద్రారెడ్డి, మహేశ్, మధు, మహేందర్, రాజు, లక్ష్మి,బాల్‌లక్ష్మి, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.

ఇంటింటికీ తాగునీరు..ప్రతి ఎకరాకు సాగునీరు
* ఇదే తీరుతో ముందుకెళ్లాలి: మంత్రి హరీష్‌రావు పిలుపు
ములుగు, సెప్టెంబర్ 25: ఇంటింటికీ తాగునీరు ఇచ్చింది మనమే ప్రతి ఎకరాకు తాగు నీరు అందించేది మనమే ఇదే నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని కార్యకర్తలకు మంత్రి హరీష్‌రావు పిలుపునిచ్చారు. మంగళవారం మండల పరిదిలోని వంటిమామిడి వీపీజే ఫంక్షన్‌హాల్‌లో మండల విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించగా, ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ దేశంలో లేని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావును ఓడించడం ఎవరి తరం కాదన్నారు. బలమైన పార్టీ క్యాడరు కార్యకర్తల అండ ఇంత దండిగా ఉన్న పార్టీ టీఆర్‌ఎస్ పార్టీ ఒక్కటేనని దీన్ని ఓడించడానికి ఎన్ని కూటములు ఏర్పడ్డా అది సాధ్యం కాదన్నారు. మహిళల కోసం ఇంటింటికీ తాగునీరు అందిస్తూ రైతుల కోసం సాగునీరు అందించడానికి ప్రాజెక్టులు నిర్మిస్తూ రైతుల భవిష్యత్తు కోరుతున్న ఈ ప్రభుత్వాన్ని అందరూ కృషి చేసి సీఎం కేసీఆర్ గెలుపు దేశంలోనే చరిత్ర సృష్టించాలన్నారు. 60 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్, టీడీపీలు చేయని అభివృద్ధి నాలుగున్నర సంవత్సర కాలంలో చేసి చూపించిన ఘనత ముఖ్యమంత్రిదన్నారు. వచ్చే రోహినీకార్తె వరకు కొండపోచమ్మ ప్రాజెక్టు ద్వారా చెరువులు, కుంటలు నింపి సస్యశ్యామలం చేయనున్నట్లు దీంతో ప్రతి ఎకరాకు నీరందించనున్నట్లు ఆయన తెలిపారు. కొండపోచమ్మసాగర్ ఇప్పటివరకు 90 శాతం పనులు పూర్తయ్యాయని ఇంత తక్కువ కాలంలో అంతపెద్ద ప్రాజెక్టు నిర్మించడం దేశంలోనే మొదటి స్థానంలో నిలుపనున్నట్లు ఆయన చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధితో దేశంలోని మిగతా రాష్ట్రాల చూపంతా తెలంగాణ వైపు చూసే విధంగా చేసింది ముఖ్యమంత్రి కేసీఆరే అన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ములుగు మండలంలో హార్టికల్చర్ యూనివర్సిటీ, ఫారెస్టు యూనివర్సిటీ ఏర్పాటు చేసి అభివృద్దికి నాంది పలికాడని అన్నారు. మామిడ్యాలకు చెందిన కుర్మ, చాకలి, మస్కూరి సంఘాల వారు కేసీఆర్‌కే ఓటేస్తామని తీర్మానం చేయడం శుభపరినామమన్నారు. నియోజకవర్గంలో వర్గల్ మండలం గుంటిపల్లి గ్రామాన్ని నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు ఆదర్శంగా తీసుకొని కేసీఆర్‌కు అండగా నిలవాలన్నారు. ప్రతిపక్ష పార్టీలకు ఈసారి కనీసం డిపాజిట్‌లు కూడా రావని మహా కూటమి పేరుతో బూటకపు మాటలు చెపుతూ ప్రజల్లోకి వస్తున్నారని వారిని నమ్మవద్దన్నారు. కొక్కొండ, బస్వాపూర్, దాచర్లపల్లికి చెందిన ఆయా పార్టీల కార్యకర్తలు హరీష్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరగా కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ సభ్యుడు ప్రభాకర్‌రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్‌లు ఎలక్షన్‌రెడ్డి, మడుపు భూంరెడ్డి, పన్యాల భూపతిరెడ్డి, డీసీసీబీ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, జెడ్‌పీటీసీ సింగం సత్తయ్య, వంటిమామిడి మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్‌లు జహంగీర్, సలీం, గజ్వేల్, ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మెన్ భాస్కర్, టీఆర్‌ఎస్ యువత విభాగం అధ్యక్షుడు బట్టు అంజిరెడ్డి, నాయకులు సురేశ్, అర్జున్‌గౌడ్, మాదాసు శ్రీనివాస్, మరలీదర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు.

అభివృద్ధికి, అవకాశవాదానికి జరుగుతున్న ఎన్నిక
* గజ్వేల్ అభివృద్ధి దేశానికి దిక్సూచీ * కాంగ్రెస్, టీడీపీలవి అవకాశ వాద పొత్తు
* కాళేశ్వరంతో ఈప్రాంతం సస్యశ్యామలం * మంత్రి హరీష్‌రావు
సిద్దిపేట/ జగదేవ్‌పూర్, సెప్టెంబర్ 25 : గజ్వేల్ నియోజక వర్గంలో ఎన్నిక అభివృద్ధికి, అవకాశ వాదానికి జరుగుతున్న ఎన్నిక అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. కాంగ్రెస్, టీడీపీలు అవకాశవాద పొత్తులతో ముందుకు వస్తున్నాయన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజక వర్గంలో కేసీఆర్ దత్తత గ్రామాలైన ఎర్రవెళ్లి, నర్సంపేట గ్రామాస్తులు కేసీఆర్‌కే ఓటెస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఆనంతరం నిర్వహించిన మండల టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ నియోజక వర్గ ప్రజలు అభివృద్ధి వైపా..అవకాశవాదానికా అని తెల్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. టీఆర్‌ఎస్ సర్కార్ ఇప్పటికే చాల పనులు చేశారని, ఇంకా చేయాల్సి ఉందన్నారు. అభివృద్ధిపై ప్రణాళికలు తయారు చేసుకొని పనులు చేసుకుందామని సీఎం కేసీఆర్ అంటున్నారన్నారు. అభివృద్ధి అంటే ఏమితో..ఏట్లా ఉంటుందో నాలుగున్నర ఏళ్లలో చేసి చూపించినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ వస్తే ఏమిస్తది.. కాలిపోయే మోటర్లు, ఎరువుల కొరత తప్ప ఇంకేమి ఉండదన్నారు. టీఆర్‌ఎస్ గెలుపు విషయంలో ఏలాంటి సందేహాలు లేవన్నారు. కళ్ల ముందు, కంటి ముందు అభివృద్ధి కన్పిస్తోంటే కేసీఆర్‌కు, కారు గుర్తుకు తప్ప ఏవ్వరికి ఓటు వేయరన్నారు. రైతులు మృతిచెందితే కాంగ్రెస్ ఒక్క రూపాయైన ఇచ్చిందా? కనీసం పరామర్శిందా ? అని ప్రశ్నించారు. తెలంగాణ సర్కార్ రైతుబంధుతో పెట్టుబడి సాయం, రైతులకు బీమాతో ధీమా కల్పించిందన్నారు. తెలంగాణ ప్రాంతానికి సాగునీరు అందించేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు 95 శాతం పూర్తయిందన్నారు. రాష్ట్రంలో అధిక మేజార్టీ సీఎం కేసీఆర్‌కు ఇస్తామంటున్నారన్నారు. అభివృద్ధిలో గజ్వేల్ నెంబర్‌వన్, మేజార్టీలో సైతం గజ్వేల్ నెంబర్‌వన్‌గా ఉండాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో వర్షం పడిన పడకపోయిన, కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో ఈప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తానని హామీనిచ్చారు. ఈకార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ భూంరెడ్డి, కార్పొరేషన్ చైర్మన్‌లు ఎలక్షన్‌రెడ్డి, పన్యాల భూపతిరెడ్డి, జెడ్పీటీసీలు రామచంద్రం, సత్తయ్య, ఎంపీటీసీలు భాగ్య, వీడీసీ చైర్మన్ కిష్టారెడ్డి, కరుణాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.