మెదక్

నేడు గ్రామపంచాయితీల్లో సర్పంచ్‌ల ప్రమాణ స్వీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, ఫిబ్రవరి 1: ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి ఈ మేరకు ఎంపీడీఓలకు ఆదేశాలు జారీ చేస్తూ ఎవరి గ్రామపంచాయితీ వారికి సర్పంచ్‌లను బాధ్యతలు అప్పగిస్తూ దృవీకరణ పత్రాలు అందజేయాలని తెలిపిన విషయాన్ని డీపీఓ హనూక్ శుక్రవారం విలేఖరులతో మాట్లాడుతూ తెలిపారు. శనివారం 469 గ్రామపంచాయితీ నూతన పాలకవర్గానికి అపాయింట్‌మెంట్ డేగా ప్రకటించారు. 4086 మంది వార్డు సభ్యులు, 469 మంది సర్పంచ్‌లు శనివారం పదవి బాధ్యతలు చేపడతారని ఆయన తెలిపారు. 469 ఉప సర్పంచ్‌లలో 19 మంది వాయిదా వేయడం జరిగిందన్నారు. అందులో శివ్వంపేట మండలంలో భీమ్ల తండా, గోమారం, పాంబండ, రేగోడ్ మండలంలో దోసపల్లి, మార్‌పల్లి, టేక్మాల్‌లో వెల్పుగొండ, కౌడిపల్లిలో జాజితండా, కౌడిపల్లి, కూకట్లపల్లి, మహమ్మద్‌నగర్, సదాశివపల్లి, వెల్మికనె్న, చిలిపిచెడ్‌లో చందూర్, ఫైజాబాద్, వెల్దుర్తిలో రామాయపల్లి, చిన్నశంకరంపేటలో శంకరంపేట, నిజాంపేటలో చల్మెడ, మనోహరాబాద్‌లో కూచారం, కాళ్లకల్ ఉప సర్పంచ్‌లు వాయిదా వేయడం జరిగిందని తెలిపారు. జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి నిర్వహించిన గ్రామపంచాయితీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్లు ఆయన తెలిపారు. సర్పంచ్‌లను, వార్డు సభ్యులను, ఉప సర్పంచ్‌లను కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంపీడీఓలు పంచాయితీల వారిగా స్పెషల్ ఆఫీసర్, పంచాయితీ సెక్రటరిల ద్వారా శనివారం ప్రమాణ స్వీకరాలు చేయడమే కాకుండా పదవి బాధ్యతలు చేపడతారని డీపీఓ తెలిపారు. ఫిబ్రవరి 10 తరువాత గ్రామ సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, ఉప సర్పంచ్‌లకు శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు.

వర్గల్ క్షేత్రంలో
ఘనంగా మూల ఉత్సవం
భక్తులతో కిటకిటలాడిన శ్రీ విద్యాధరి ఆలయం
ఉత్సవానికి అంకురార్పన చేసిన సిద్దాంతి ‘యాయవరం’
గజ్వేల్, ఫిబ్రవరి 1: వర్గల్ శ్రీ విద్యాధరి క్షేత్రంలో శుక్రవారం మూల ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. తెల్లవారుజామున ఆలయ వ్యవస్థాపక చైర్మెన్ యాయవరం చంద్రశేఖరశర్మ సిద్దాంతి ఉత్సవానికి అంకురార్పన చేశారు. అనంతరం వేద పండితుల మంత్రోశ్చరణల మద్య అమ్మవారికి విశేష పంచామృతాభిషేకం, లక్ష పుష్పార్చన, చంఢీహోమం అలంకరణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయం లో ఆద్యాత్మికత వెల్లువిరియగా, విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆలయ సముదాయం కిటకిటలాడింది. ఈ కార్యక్రమాల్లో ఆలయ కమిటీ అధ్యక్షులు పొద్దుటూరి నర్సింహారావు, కార్యదర్శి సత్యనారాయణ, మాజీ అధ్యక్షులు దాచెపల్లి వెంకటకృష్ణ, కమిటీ నిర్వాహకులు గంగా శ్రీనివాస్ గుప్త, రాజేశ్వర్‌రావు, గంగిషెట్టి సుదాకర్, అత్తెల్లి బాపిరాజు, ఇర్రి మల్లారెడ్డి, నూకా బిక్షపతిగుప్త, టేకులపల్లి బాల్‌రెడ్డి, ఎన్‌బీ ప్రభాకర్ గుప్త, వెంకట్‌రాం రెడ్డి, రేణిగుంట శ్రీనివాస్, కుమార్, దోసపాటి రవి, నాగిరెడ్డి, ఆలయ వేద పండితులు అనంతగిరిశర్మ, శశిధరశర్మ, నాగరాజ శర్మ, ప్రవీన్ కుమారశర్మ తదితరులు భక్తుల సౌకర్యాల కల్పనలో నిమగ్నం కాగా, హాజరైన భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు మహా ప్రసాదం అందజేశారు.

6 యేండ్ల క్రితం తప్పిపోయిన వ్యక్తిని
మద్యప్రదేశ్ నుండి రప్పించిన గజ్వేల్ పోలీసులు
గజ్వేల్, ఫిబ్రవరి 1: గజ్వేల్ మండల పరిదిలోని జాలిగామకు చెందిన గంగల్ల నర్సింలు 6 సంవత్సరాల క్రితం తప్పి పోగా, మద్యప్రదేశ్‌లో ఉన్న సమాచారం మేరకు ఏసీపీ నారాయణ నేతృత్వంలో శుక్రవారం గజ్వేల్‌కు రప్పించారు. ఈ సంఘటనకు సంబందించి వివరాలిలా ఉన్నాయి. గజ్వేల్ నుండి తప్పిపోయిన గంగల్ల నర్సింలు తిరుగుతూ తిరుగుతూ మద్యప్రదేశ్ చేరుకోగా, అశోక్‌నగర్ రైల్వేస్టేషన్‌లో కాల్లకు రక్తం కారుతూ అక్కడి వివేకానంద యువసేన సభ్యులు అనూష్‌మాన్‌త్యాగికి కనిపించాడు. దీంతో అతనిని దరిచేర్చుకోవడంతోపాటు ఆసుపత్రిలో చికిత్స చేయిస్తూ నర్సింలు నుండి సమాచారం సేకరించారు. హైదరాబాద్‌లోని తన మిత్రుడికి ఈ సమాచారం చేరవేస్తూ సిద్దిపేట పోలీస్ కమిషనర్‌కు పూర్తి వివరాలు అందించారు. కమిషనర్ జోయల్‌డెవిస్ ఆదేశాల మేరకు ఎస్‌బీ ఇన్స్‌పెక్టర్ నాగయ్య, ఏఎస్‌ఐ జగదీశ్వర్‌లు జాలిగామకు చేరుకొని మద్యప్రదేశ్ నుండి వాట్సాప్ ద్వారా వచ్చిన ఫోటోలు వారి కుటుంబ సభ్యులకు చూపించారు. దీంతో నర్సింలు తమ కుటుంబ సభ్యుడేనని గుర్తించగా, ఈ సమాచారం మద్యప్రదేశ్‌కు చేరవేయడంతో వివేకానంద యువసేన సభ్యులు నర్సింలును గజ్వేల్‌కు తీసుకువచ్చి ఏసీపీ నారాయణ ఆద్వర్యంలో అప్పగించారు. ఈ సందర్బంగా స్వామివివేకానంద యువసేన సభ్యులు అనూష్‌మాన్‌త్యాగి, రాకేశ్‌త్యాగి, ఇమానుష్‌జైలను పోలీసులు సన్మానించగా, ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ అంజనేయులు, సీఐ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులూ ....
లక్ష్యాలు నిర్ధేశించుకొని విద్యనభ్యసించాలి
- అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ నారాయణ
గజ్వేల్, ఫిబ్రవరి 1: విద్యార్థులు లక్ష్యాలు నిర్ధేశించుకొని చక్కటి విద్యనభ్యసించాలని గజ్వేల్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ నారాయణ స్పష్టం చేశారు. శుక్రవారం గజ్వేల్‌లో ఎస్‌ఎఫ్‌ఐ ఆద్వర్యంలో 10వ తరగతి మోడల్ టెస్ట్ ప్రశ్నపత్రాలు ఆవిష్కరించిన సందర్బంగా ఆయన మాట్లాడారు. కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితేనే మంచి ఫలితాలు వస్తాయని, తల్లిదండ్రులు మార్కుల కోసం వత్తడి తేకుండా వారి సామర్థ్యం పెంచేలా దృష్టి పెట్టాలని సూచించారు. ముఖ్యంగా విద్యార్థుల మార్కుల రిపోర్ట్‌కార్డులు ప్రాతిపదిక కాదని, అయితే అందివచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకునేలా చొరవ చూపి నైపుణ్యం పొందేలా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. విద్యార్థులతో గురువులు, తల్లిదండ్రులు మమేకమైతే నే వారి భవిష్యత్తు ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని, పరీక్షా సమయం లో వత్తిడి అదిగమించేందుకు మానసికంగా తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. చదువుల పట్ల పిల్లలను ప్రోత్సహించడంలో తప్పు లేదని, అయితే అదిక శాతం మార్కుల కోసం వత్తడి తెస్తే మాత్రం విద్యార్థులు నిరాశనిస్పృహ లకు గురై ఉన్న నైపుణ్యం, సామర్థ్యం కోల్పోతారని చెప్పారు. విద్యార్థులను తీర్చిదిద్దే క్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ చేస్తున్న కృషి ఫలితాలు ఇవ్వాలని ఆశిద్దామని వివరించారు. ఈ కార్యక్రమంలో సీఐ ప్రసాద్, ఎస్‌ఎఫ్‌ఐ నేతలు రాజు, రియాజ్, నరేశ్, మహేశ్‌లు పాల్గొనగా, ఫిబ్రవరి 2న గజ్వేల్‌లోని బ్రిలియంట్ కళాశాలలో టెస్ట్ నిర్వహిస్తున్నారు.

రైతు సంఘాలకు విజన్ సహకారం
తూప్రాన్, ఫిబ్రవరి 1: రైతులు సంఘటితంగా ఏర్పడితే విజన్ సంస్థ ద్వారా మీ గ్రామానికి ఎరువులు, విత్తనాలు, మందులు సరఫరా చేస్తామని విజన్ సంస్థ డైరెక్టర్ కైలాస్ పేర్కొన్నారు. మండలంలోని మల్కాపూర్‌లో రైతులకు రైతువృత్తికారుల సంఘం ఏర్పాటుపై అవగాహన కార్యక్రమంలో ప్రసంగించారు. రైతులు సంఘంగా ఏర్పడితే అవసరమయ్యే విత్తనాలు, ఎరువులు సరఫరా చేయడంతో పాటు వారికి అన్ని రకాలుగా సహకరిస్తామన్నారు. దీంతో రైతుకు సమయం వృదా కాదని, నాణ్యమైన వస్తువులు అందుతాయన్నారు. రైతు సంఘంలో 10 మంది డైరెక్టర్‌లు ఉంటారని, మిగితా వారు సభ్యులుగా ఉంటారని ప్రతి రైతు 1100ల రూపాయలు సభ్యత్వం చెల్లిస్తే నాబార్డ్‌వారు అంతే మొత్తంలో సబ్సీడీ ఇస్తామన్నారు. రైతులకు గిట్టుబాటు దరతోపాటు కూరగాయల ట్రాన్స్‌పోర్ట్‌కు వాహనాన్ని సంఘం ద్వారా సమకూర్చుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజనాభివృద్ది సంస్థ అధికారి వసంతకుమార్, ఎస్‌సీ కార్పోరేషన్ ఈడీ దేవయ్య, సర్పంచ్ మహాదేవి, నాయకులు అంజనేయులు, గుణశేఖర్, శ్రీనివాస్‌రెడ్డి, నర్సింలు, ఉద్యానవన శాఖ అధికారి జలేందర్‌రెడ్డిలు పాల్గొన్నారు.

సీసీ కెమరాల రక్షణలో బస్వాపూర్ గ్రామం
- గౌరారం సీఐ శివలింగం
ములుగు, ఫిబ్రవరి 1: గ్రామాలలో సీసీ కెమరాల ఏర్పాటు ద్వారా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఇక నుండి చెక్ పెట్టవచ్చునని దీంట్లో భాగంగానే బస్వాపూర్ గ్రామంలో సీసీ కెమరాలు ఏర్పాటు చేసి ప్రారంభించినట్లు గౌరారం సీఐ శివలింగం పేర్కొన్నారు. శుక్రవారం నూతన సర్పంచ్ చెలిమెల ఎల్లమ్మ ఆద్వర్యంలో గ్రామంలో ఏర్పాటు చేసిన 6 సీసీ కెమరాలను సీఐ శివలింగం, సర్పంచ్ ఎల్లమ్మలు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 24 గంటలు గ్రామరక్షణలో సీసీ కెమరాల పాత్ర చాలా ముఖ్యమని ఆయన తెలిపారు. సీసీ కెమరాలు ఏర్పాటు చేసిన గ్రామాలలో కేసుల నమోదు తగ్గిందని ఏ చిన్న సంఘటననైనా తొందరగా తెలుసుకోవచ్చన్నారు. గ్రామాలలో బెల్టుషాప్‌ల నిర్వాహన, గుట్కా అమ్మకాలు జరిగినట్లు మాకు సమాచారం అందితే వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని నేటి నుండి మీ గ్రామంలో సీసీ కెమరాలు పాత్ర కూడా ఇందుకు ఉపకరిస్తుందని కాబట్టి అప్రమత్తంగా గ్రామాన్ని ప్రశాంత వాతావరణంలో ఉండేలా అందరూ సహకరించాలన్నారు. సీసీ కెమరాలు లేని గ్రామాలలో గ్రామ సర్పంచ్‌లు, ప్రజాప్రతినిదులు ముందుకు వచ్చి ఏర్పాటు చేసుకుంటే ఆ గ్రామం పూర్తి రక్షణలో ఉంటుందని ఆయన తెలిపారు. బస్వాపూర్ గ్రామంలో ఏదైనా సమస్య ఉంటే వెంటనే పోలీస్‌స్టేషన్‌లకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ రాజేంద్రప్రసాద్, కోఆప్షన్ సభ్యుడు మొహినొద్దీన్, మాజీ సర్పంచ్ అర్జున్‌గౌడ్, గ్రామస్తులు పాల్గొన్నారు.

డైరీ ఆవిష్కరించిన కలెక్టర్, ఎస్పీ

సంగారెడ్డి టౌన్, పిబ్రవరి 1: సంగారెడ్డి వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన 2019డైరీని శుక్రవారం జిల్లా కలెక్టర్ హన్మంతరావు, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డిలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలతో పాటు సమాజాభివృద్దికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు కృష్ణ, డేవిడ్ రాజ్, శ్రీనివాస్, పుండరికం, సంగమేష్, రఘునందన్, నాగభూషణం, మస్తాన్‌అలీ, నర్సింలు, బాలయ్య, నరహరి, మోహన్, వీరేశం తదితరులు పాల్గొన్నారు.
అక్షయపాత్ర ద్వారా
అంగన్‌వాడి కేంద్రాలకు భోజనం

సంగారెడ్డి టౌన్, పిబ్రవరి 1: అక్షయ పాత్ర ద్వారా అంగన్‌వాడి కేంద్రాలకు మంచి పౌష్టిక భోజనం అందించడం ఒక శుభ పరిణామమని జిల్లా కలెక్టర్ ఎం.హన్మంతరావు అన్నారు. జిల్లాలోని ఐసీడీఎస్ సదాశివపేట ప్రాజెక్టు పరిధిలోని సంగారెడ్డి, సదాశివపేట, కొండాపూర్, మునిపల్లి మండల్లాలోని 248 అంగన్‌వాడి కేంద్రాలకు అక్షయ పాత్ర పౌండేషన్ ద్వారా ఆరోగ్యలక్ష్మి పేరుతో ప్రతి రోజు మధ్యాహ్న సంపూర్ణ భోజనం అందించనుంది. ఈ కార్యక్రమాన్ని శుక్రవారం పోతిరెడ్డిపల్లి అంగన్‌వాడి కేంద్రంలో కలెక్టర్ హన్మంతరావుప్రారంభించారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ అక్షయ పాత్ర ద్వారా గర్భిణీలు, బాలింతలు, 3-6సంవత్సరాల లోపు పిల్లలకు ఒక పూట భోజనం అందించడం జరుగుతుందన్నారు. త్వరలో ఈ కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా ప్రారంభించేలా చూస్తామన్నారు. అక్షయ పాత్ర భోజనం అందించడం వల్ల అంగన్‌వాడి టీచర్లు, ఆయాలకు పనిభారం తగ్గుతుందని, ఇకపై టీచర్లు ఫ్రీ స్కూల్ కార్యక్రమాలపై దృష్టి సారించాలని, అంగన్‌వాడి కేంద్రాల్లో పిల్లల సంఖ్య పెంచాలని సూచించారు. ఐసీడీఎస్ అధికారి మోతి మాట్లాడుతూ అక్షయ పాత్ర అందించే రోజు వారి మెనూ వివరాలను తెలియజేసారు. సీడీపీఓ రేణుక మాట్లాడుతూ సదాశివపేట ప్రాజెక్టు పరిధిలోని నాలుగు మండలాల్లో గర్భిణి,బాలింతలు 2541, 3-6యేళ్ల పిల్లలు 4972మంది ఉన్నారని వీరందరికి ప్రతి రోజు భోజనం అందించబడుతుందని తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ జితేష్ పాటిల్, సివిల్ సప్లయి అధికారి శ్రీకాంత్‌రెడ్డి, ఎంపిడిఓ జయలక్ష్మి, అక్షయపాత్ర పౌండేషన్ పిఆర్‌ఓ విజయభాస్కర్‌రెడ్డి, అంగన్‌వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

పార్లమెంట్ ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నం

సంగారెడ్డి టౌన్, పిబ్రవరి 1: పార్లమెంట్ ఎన్నికల ఏర్పాట్లు ప్రారంభమయ్యాయని జిల్లా కలెక్టర్ ఎం.హన్మంతరావు పేర్కొన్నారు. ఈవీఎంల మొదటి విడత తనిఖీలు ప్రారంభించినట్లు తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయని, సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. శాసన సభ, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చాల వరకు ఓట్లు గల్లంతయ్యాయని, ఈ నెల 4లోపు మీసేవ కేంద్రాల్లో ఓటరు జాబితాలో పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. 4తర్వాత ఓటరు నమోదుకు ఎలాంటి అవకాశం ఉండదని ప్రతి ఒక్కరు విషయాన్ని గమనించాలని కోరారు. డిసెంబర్ 25నుండి నూతనంగా ఓటరు నమోదుకు దరఖాస్తున్న అర్హులతో కూడిన నూతన జాబితాను ఈ నెల 2న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 3న బూత్ లెవల్ అధికారులతో గ్రామ పంచాయతీల్లో నిర్వహించే ఓటరు నమోదు కార్యక్రమన్ని సద్వినియోగం చేసుకొని జాబితాలో లేని వారు దరఖాస్తులు అందజేయాలని సూచించారు. ఓటరు లిస్టులో తమ పేరు ఉందా లేదా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. 18యేళ్లు నిండిన యువతీ,యువకులు ఓటరు నమోదు చేసుకోవాలన్నారు. కలెక్టరేట్‌లో నిరంతరాయంగా ఓటరు సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసామని, 1950 టోల్ ఫ్రీ నంబర్‌ను సద్వినియోగం చేసుకుని కావాల్సిన సమాచారం, ఫిర్యాదులను చేయవచ్చన్నారు. జిల్లాకు ప్రత్యేకంగా 18004257260 టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుందని, ఈ కేంద్రానికి ఐదు లైన్ల ఫోన్ సౌకర్యం ఏర్పాటు చేసామన్నారు. జిల్లాలో ఉన్న 1479 పోలింగ్ కేంద్రాలు ప్రస్తుతం 1557కు పెరిగిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితా సిద్ధంగా ఉందని, ఈ నెల 15తర్వాత పూర్థిస్థాయి సమాచారం ఇస్తామన్నారు. సమావేశంలో బీసీ సంక్షేమాధికారి కేశురాం పాల్గొన్నారు.

రైతాంగం పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలి
* రైతు రుణాలన్ని రీ షెడ్యూల్ చేయాలి
* కలెక్టరేట్ ముందు రైతు సంఘం ధర్నా
సంగారెడ్డి టౌన్, పిబ్రవరి 1: రైతాంగం పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, రైతు రుణాలన్ని రీ షెడ్యూల్ చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి జయరాజ్ డిమాండ్ చేశారు. శుక్రవారం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి కలెక్టరేట్ ఎఓ గుండేరావుకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా జయరాజ్ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న పట్టాపాస్ పుస్తకాలు వెంటనే రైతులకు ఇవ్వాలన్నారు. దేశవ్యాప్తంగా రైతాంగం గిట్టుబాటు ధరలు అందక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. డాక్టర్ స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం రైతాంగం పండించిన పంటలకు, పెట్టుబడికి అదనంగా 50శాతం కలిపి గిట్టుబాటు ధరలు నిర్ణయించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో వర్షభావ పరిస్థితుల వల్ల వేసిన పంటలన్ని ఎండిపోయాయని, పంట నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రూ.25వేల పరిహారం చెల్లించాలన్నారు. జిల్లాలో నకిలి పత్తి విత్తనాలతో పంటలు నష్టపోయినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. చెరుకు రైతులకు సరైన సమయంలో పర్మిట్లు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కంది రైతులకు బకాయిలు చెల్లించలేదని, రైతు బంధు చెక్కులు సకాలంలో అందించాలని డిమండ్ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు నర్సింహారెడ్డి, ఉపాధ్యక్షులు మనె్న రామాంజనేయులు, నాయకులు మహిపాల్‌రెడ్డి, మల్లారెడ్డి, కిష్టయ్య, మల్లేశం, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

తున్కికల్సాలో కార్డన్‌సర్చ్

గజ్వేల్, ఫిబ్రవరి 1: వర్గల్ మండలం తున్కికల్సాలో శుక్రవారం తెల్ల వారుజామున అడిషనల్ డీసీపీ (లాఅండ్ ఆర్డర్) నర్సింహారెడ్డి, ట్రేయినీ ఐపీఎస్ డాక్టర్ శబరీష్, గజ్వేల్ ఏసీపీ నారాయణ నేతృత్వంలో కార్డన్‌సర్చ్ నిర్వహించారు. ఈ సందర్బంగా డీసీపీ నర్సింహారెడ్డి మాట్లాడుతూ ప్రజల రక్షణతోపాటు భద్రతాభావం కల్పించడం లక్ష్యంగా కార్డన్‌సర్చ్ చేపట్టినట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రజల నుండి నేరుగా సమస్యలు తెలుసు కోవడం, కొత్త వ్యక్తులు, నేరస్తులు గ్రామాల్లో షెల్టర్ తీసుకోవడం పై ఈ ఆకస్మిక తనిఖీలతో బహిర్గతమవుతుందని పేర్కొన్నారు. నేరరహిత గ్రామాలుగా తీర్చిదిద్దే క్రమంలో కార్డన్‌సర్చ్ కీలకపాత్ర పోషించనుండ గా, నేను సైతం కార్యక్రమంలో భాగంగా సీసీ కెమరాల ఏర్పాటుకు ప్రజాప్రతినిదులు, గ్రామపెద్దలు, వ్యాపారులు, వివిద కుల సంఘాల నేతలు, యూనియన్ నాయకులు, ఉద్యోగులు సహకరించాలని కోరారు. సీసీ కెమరాల ఏర్పాటుతో ఏ చిన్న సంఘటన జరిగినా తెలుసుకునే వీలు కలుగడంతోపాటు అమాయక ప్రజలను రక్షించవచ్చని చెప్పారు. అలాగే యువత చెడు అలవాట్లకు బానిస కాకుండా భవిష్యత్తును ఎంచుకొని ముందుకు సాగాలని, విద్యార్థులు చక్కగా చదువుకొని తల్లిదండ్రుల కు మంచి పేరు తేవాలని సూచించారు. అంతేగాకుండా పరిచయం లేని వ్యక్తులకు ఇండ్లు అద్దెకు ఇవ్వవద్దని, నేరాలు తగ్గుముఖం పట్టేందు కే కార్డన్‌సర్చ్‌లు నిర్వహిస్తున్నట్లు వివరించారు. సరైన పత్రాలు లేని 43 వాహనాలను స్వాదీనం చేసుకోగా, కార్యక్రమంలో గజ్వేల్ రూరల్ సీఐ శివలింగం, తొగుట సీఐ నిరంజన్, టాస్క్ఫోర్స్ సీఐ రవీందర్, ఎస్‌ఐలు వీరన్న, రాజేంద్రప్రసాద్, విజయకుమార్, సాయిరాం, శ్రీనివాస్‌రెడ్డి, పరమేశ్వర్, శేఖర్, నర్సింలు, విజయకుమార్‌లు పాల్గొన్నారు.