మెదక్

అండర్-9 చదరంగ పోటీలలో ప్రతిభ చాటిన గజ్వేల్ విద్యార్థి ఆర్యచాణక్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, ఫిబ్రవరి 24: సిద్దిపేట చెస్ అసోసియేషన్ ఆద్వర్యంలో నిర్వహించిన అంతర్ జిల్లా ఓపెన్ చెస్ టోర్నమెంట్‌లో గజ్వేల్ మున్సిపల్ పరిదిలోని ప్రజ్ఞాపూర్‌కు చెందిన విద్యార్థి ఆర్యచాణక్య ప్రతిభచాటి వనె్న తెచ్చారు. ఆడెపు నర్సింలు, భవానిల కుమారుడు ఆర్యచాణక్య స్థానికంగా ఉన్న సెంటిమెరీస్ విద్యానికేతన్(సీబీఎస్‌ఈ)లో 5వ తరగతి చదువుతుండగా, చిన్ననాటి నుండి చదరంగం పట్ల ఆసక్తి కనబరుస్తుండడంతో ఆర్యచాణక్య ను ఆ దిశగా తీర్చిదిద్దుతున్నారు. ఈ క్రమంలో సిద్దిపేట చెస్ అసోసియేషన్ ఆద్వర్యంలో చదరంగ పోటీలు జరుగుతుండగా, ఆర్యచాణక్య పాల్గొని అండర్-9 కేటగిరిలో ప్రథమ స్థానంలో నిలిచారు. అలాగే గతంలో అండర్-7 కేటగిరిలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించిన చదరంగ పోటీలో అగ్రస్థానంలో నిలిచి మోడల్స్ సాదించిన విషయం తెలిసిందే. చెస్ అసోసియేషన్ కార్యదర్శి శివాజి, నిర్వాహకులు మదుసూదన్‌రెడ్డి, కనకయ్య, సూర్యప్రకాశ్‌ల చేతులమీదుగా ఆర్యచాణక్య ఆదివారం బహుమతి అందుకోగా, సెంటిమెరీస్ విద్యానికేతన్ డైరెక్టర్ ఇన్నారెడ్డి, థామస్‌రెడ్డిలు హర్షం వ్యక్తం చేస్తూ ఆర్యచాణక్యను అభినందించారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ప్రజల్లో అవగాహన అవసరం
లోక్‌సత్తా ఉద్యమ సంస్థ ఉమ్మడి రాష్ట్రాల సమన్వయకర్త బండారు
గజ్వేల్, ఫిబ్రవరి 24: ప్రభుత్వం అమలు చేస్తున్న వివిద సంక్షేమ పథకాల పై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాద్యత యంత్రాంగంపై ఉందని లోక్‌సత్తా ఉద్యమ సంస్థ ఉమ్మడి రాష్ట్రాల సమన్వయకర్త బండారు రాంమోహన్‌రావు పేర్కొన్నారు. ఆదివారం న్యూ ఇండియా చౌపాల్‌ను ప్రజ్ఞాపూర్‌లో ప్రారంభించిన సందర్బంగా ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్తకొత్త పథకాలకు రూపకల్పన చేసి పేదల అభ్యున్నతికి వర్తింపజేస్తుండగా, కింది స్థాయిలో ప్రజలను చైతన్యం చేయని కారణంగా పక్కదారి పడుతున్నట్లు స్పష్టం చేశారు. అయితే పేద వర్గాలకు చెందిన లబ్దిదారులు పూర్తి స్థాయిలో ప్రయోజనం పొందే క్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా చైతన్యం చేయాల్సిన బాద్యతను గుర్తెరగాలని ఆకాంక్షించారు. గ్రామీణులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దితేనే కనీసం పథకాల కోసం దరఖాస్తును స్వయంగా చేసుకునే అవకాశం దక్కుతుందని, అందుకు భిన్నంగా ప్రభుత్వాలు ముందుకెల్తే ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా లక్ష్యం నెరవేరదని తెలిపారు. కళాజాత, కరపత్రాలతో ప్రచారం చేయాలని, పంచాయతీలలో సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు శిక్షణ సందర్బంగా ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచాలని, పాఠశాల స్థాయిలో విద్యార్థులను కార్యోన్ముకులను చేయాలని కోరారు. అయితే చారాన కోడికి బారాన మసాల అన్నట్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాల అమలుకు కెటాయించిన నిదులు నిర్వాహనకే ఖర్చు అవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నచిన్న పథకాలు రద్దు చేసి దేశ వ్యాప్తంగా ఎక్కువ నిదులు వచ్చే పథకాలకే ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇచ్చి కొనసాగించాలని ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాసినట్లు చెప్పారు. అంతకు ముందుగా విద్యార్థులకు స్వచ్ఛ్భారత్‌పై విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు నిర్వహించగా, అనంతరం ముగ్గురు విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

ముమ్మరంగా ఆర్‌అండ్‌ఆర్ కాలనీ నిర్మాణ పనులు
వారంలోగా పనుల పూర్తికి కలెక్టర్ కృష్ణ్భాస్కర్ ఆదేశం
గజ్వేల్, ఫిబ్రవరి 24: మల్లన్నసాగర్ ముంపునకు గురయ్యే గ్రామాల నిర్వాసితుల కోసం గజ్వేల్ మున్సిపల్ పరిదిలోని ముట్రాజ్‌పల్లిలో ఆర్‌అండ్ ఆర్ కాలనీ ఏర్పాటుకు చర్యలు తీసుకోగా, వారం రోజుల్లో చదును చేసే పనులు పూర్తి చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ కృష్ణ్భాస్కర్ ఆదేశించారు. ఆదివారం ముట్రాజ్‌పల్లిలోని 326, 331 సర్వే నెంబర్‌లు, సంగాపూర్‌లోని 68, 80 సర్వే నెంబర్‌లలోని 450 ఎకరాలలో డబల్‌బెడ్‌రూం ఇండ్లు నిర్మించనుండగా, ఆర్‌అండ్‌ఆర్ కాలనీ లేఔట్ నిర్మాణ పనులు శర వేగంగా సాగుతున్నట్లు స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే 4 అధికారిక ప్రత్యేక బృందాల ఆద్వర్యంలో వివిద శాఖలకు చెందిన 100 మంది సిబ్బంది, 50 అదునాతన యంత్రాలతో పనులు చురుకుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అయితే రాత్రి, పగలు తేడా లేకుండా పనులు యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలని, గజ్వేల్ ఆర్డీఓ విజేందర్‌రెడ్డి పర్యవేక్షణలో పనులు కొనసాగనున్నట్లు చెప్పారు. కాగా గట్టి పోలీసు బందోబస్తు మద్య చదును చేసే పనులు ముమ్మరంగా కొనసాగుతుండ గా, కార్యక్రమంలో గడా అధికారి ముత్యంరెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మల్లన్న క్షేత్రానికి పెద్ద సంఖ్యలో భక్తుల తాకిడి
* ఆరవ వారానికి చేరిన మల్లన్న జాతర

చేర్యాల, ఫిబ్రవరి 24: ప్రముఖ శైవక్షేత్రమైన కొమురవెళ్లి మల్లికార్జునస్వామి దేవస్థానానికి భక్తుల తాకిడి పెరిగింది. స్వామివారి జారతలో భాగంగా ఆదివారం నాటికి జాతర 6వ వారానికి చేరగా వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో కొమురవెళ్లికి చేరుకున్నారు. ముందుగా స్వామివారిని దూళి దర్శనం చేసుకొన్నారు. అనంతరం కళ్యాణకట్ట వద్ద తలనీలాలు సమర్పించి కోనేరులో స్నానమాచరించి గంగరేణిచెట్టు , ముఖమండపం వద్ద పంచరంగులతో పట్నాలు వేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం గొల్లకేతమ్మ, బలిజ మేడలమ్మలతో కొలువైన కొమురవెళ్లి మల్లన్నను దర్శించుకున్నారు. మహిళలు బోనాలను తయారుచేసుకొని వాటిని నెత్తిన పెట్టుకొని గుట్టపై కొలువైన ఎల్లమ్మతల్లి సన్నిదికి చేరుకొని అమ్మవారికి బోనాలను సమర్పించుకొని అమ్మవారికి ప్రతీపాత్రమైన కల్లును ఆరగింపుగా చూపారు. తమ కుటుంబాలను సల్లంగా చూడాలని వచ్చే ఎడాదికి మళ్లీ వస్తామంటూ తిరుగుపయనమయ్యారు. జాతరకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ ఇవో వెంకటేశ్, ఆలయ చైర్మన్ సేవెల్లి సంపత్‌లు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ సందర్బంగా ఆలయ ఎఇవో రావుల సుదర్శన్ ఉన్నారు.

సీజన్ వస్తే లోటు..లేదంటే ఘాటూ!

సంగారెడ్డి, ఫిబ్రవరి 24: ఉల్లి చేసే మేలు తల్లి చెయ్యదనే నానుడి ఆరోగ్య రిత్య కావచ్చేమో కానీ, నమ్ముకుని సాగు చేస్తున్న రైతులకు మాత్రం కన్నీళ్లు పెట్టిస్తోంది. ఆరుగాలం శ్రమించి సాగు చేసిన ఉల్లిని మార్కెట్ తీసుకువస్తున్న అన్నదాతలకు ధరలు లేకపోవడంతో నిరాశకు గురి చేస్తోంది. సీజన్ వస్తే చాలు ధరలు పడిపోవడంతో దిక్కుతోచక రోడ్డు ప్రక్కన పారబోయాలా అనే పరిస్థితుల్లో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. సీజన్ లేని సమయంలో మార్కెట్‌కు వెళ్లి ఖరీధు చేసే కొనుగోలుదారులకు ఉల్లి ధర ఒక్కసారిగా ఘాటెక్కి కూర్చోవడం పరిపాటిగా మారింది. ఎకరా ఉల్లిని సాగు చేసేందుకు రైతులు సరాసరిగా 50 వేల రూపాయలు వెచ్చించాల్సిందే. రెండు సార్లు దుక్కి దున్నడం, నాట్లు వేయడం, కలుపు తీత, ఎరువులు, పంట కోత మొదలుకుని 50 వేల వరకు ఖర్చు అవుతుందని రైతులు పేర్కొంటున్నారు. సరైన పెట్టుబడులు పెడితే ఎకరాకు 80 నుంచి వంద క్వింటాళ్ల మేరకు పంట దిగుబడు అవుతుంది. పంట దిగుబడి సక్రమంగా ఉంటే మార్కెట్లో ధర లేక రైతులు నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. సదాశివపేట వ్యవసాయ మార్కెట్లో రూ.350 నుండి రూ.450 నికరం ధర పలుకుతుండగా, అత్యధికంగా రూ.600 వరకు వ్యాపారులు ధరలను నిర్ణయిస్తున్నారు. హైదరాబాద్ మార్కెట్లో రూ.800 నుంచి వెయ్యి రూపాయల వరకు ధర వస్తున్నా అక్కడి వరకు తీసుకువెళ్లేందుకు రవాణా ఖర్చులు అధికం అవుతున్న నేపథ్యంలో గత్యంతరం లేని పరిస్థితుల్లో వ్యాపారులు నిర్ణయించిన ధరలకే విక్రయించుకోవాల్సి వస్తోందని ఉల్లి రైతులు వాపోతున్నారు. కాగా ప్రస్తుతం మార్కెట్‌కు వస్తున్న ఉల్లిగడ్డ ఎక్కువ రోజుల పాటు నిల్వవుండదని ఇందుకోసమే వ్యాపారులు ధరలు పెంచడం లేదని కమీషన్ ఏజెంట్లు పేర్కొంటున్నారు. ఇప్పుడు వస్తున్న ఉల్లి కనీసం నెల రోజులు కూడా నిల్వ ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ సీజన్‌లో సాగవుతున్న ఉల్లి ఎక్కువ రోజులు మన్నికగా ఉంటుందని, జూన్ నెలలో వచ్చే ఉల్లికి మంచి ధర లభిస్తుందని వివరిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట, కొండాపూర్, మునిపల్లి, రాయికోడ్, కోహీర్, ఝరాసంగం, జహీరాబాద్, మొగడంపల్లి తదితర ప్రాంతాలకు చెందిన రైతులు ఉల్లి సాగును అధికంగా చేస్తుంటారు. ఒకప్పుడు అన్ని రకాల పంట ఉత్పత్తులు వచ్చే సదాశివపేట మార్కెట్‌కు ప్రస్తుతం ఉల్లిగడ్డ, మక్కలు మినహా ఇతర ఆహార పంటలు ఏమి రావడం లేదు. వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు కూడా ఉల్లిపైనే ఆధారపడి కాలం వెళ్లదీస్తున్నారు. తల్లిలాంటి ఉల్లిని నమ్ముకుని సాగు చేస్తున్న తమకు ప్రతి సంవత్సరం ధరలు లేక నష్టపోతున్నామని సదాశివపేట మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన సంగమేశ్వర్ అనే రైతు ఆవేదన వ్యక్తం చేసాడు. క్వింటాళుకు కనీసం రూ.1500 ధర ఉంటే పెట్టిన పెట్టుబడులు వస్తాయని లేనిపక్షంలో ఎకరాకు రూ.25 వేల మేరకు నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన చెందాడు. వ్యాపారులు అంటున్నట్లుగానే ప్రస్తుతం సాగుచేసిన ఉల్లి ఎక్కువ రోజులు నిల్వవుండదన్నది వాస్తమే అయినా కొనుగోలు చేస్తున్న వ్యాపారులు అధిక ధరలకు విక్రయించుకోవడం లేదా అని ప్రశ్నించాడు. కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులు కుమ్మక్కై సరైన గిట్టుబాటు ధరను కల్పించకుండా రైతుల నట్టేట ముంచుతున్నారని ఆరోపించాడు. ఉల్లి రైతులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని సంగమేశ్వర్ విజ్ఞప్తి చేసాడు.