మెదక్

లక్ష ఎకరాలకు నీరందిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొల్చారం, మార్చి 29: లక్ష ఓట్ల మెజార్టీ ఇవ్వండి లక్ష ఎకరాలకు నీరందించి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు అన్నారు. శుక్రవారం మండలంలోని పోతంశెట్టిపల్లి హనుమమ్మ గార్డెన్‌లో మండల తెరాస కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ నర్సాపూర్ నియోజకవర్గం నుండి మెదక్ ఎంపీగా పోటీ చేస్తున్న కొత్త ప్రభాకర్‌రెడ్డిని లక్ష మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు సూచించారు. గత ఐదేళ్ల పాలనలో ప్రభాకర్‌రెడ్డి ఢిల్లీలో తెలంగాణ కోసం జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలతో కలిసి ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ది చేసేలా చర్యలు చేపట్టారన్నారు. దేశంలోనే మొట్టమొదటి ఎంపీగా కొత్త ప్రభాకర్‌రెడ్డిని ఐదు లక్షల మెజార్టీతో గెలిపించాలని ఆయన ఆశభావం వ్యక్తం చేశారు. అలాగే తెలంగాణఉద్యమంలో కొల్చారం మండల ప్రజలు కీలక పాత్ర పోషించి ఉద్యమ ప్రారంభం నుండి తెలంగాణ వచ్చేంత వరకు ఒడిదుడుకులకు ఎదురునిలచి ఉద్యమంలోపాల్గొన్నారన్నారు.
ఎంపీ అభ్య ర్థిప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ తనను కేసీఆర్ మెదక్‌నుండి రెండవసారి పార్లమెంట్ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు ఇక్కడి ప్రజల ఆశీస్సులతో ఎంపీగా గెలుపొంది అందరిని కలుపుకొని జిల్లాను మరింత అభివృద్ది చేస్తానన్నారు. మనోహరాబాద్ నుండి నర్సాపూర్ వరకు నూతనంగా రైల్వేలైన్ ఏర్పాటు చేస్తానని కార్యకర్తలకు హామి ఇచ్చారు. ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో తనను 38 వేల మెజార్టీతో గెలిపించిన నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలకు శిరస్సువంచి అభివాదం చేస్తున్నానన్నారు. ప్రతి ఒక్కరిని కలుపుకొని నియోజకవర్గాన్ని మరింత అభివృద్ది చేస్తానన్నారు. మంజీరపై చెక్‌డ్యామ్‌లు నిర్మించి పంట పొలాలకు నీరందిస్తామని ఆయన హామి ఇచ్చారు. అలాగే కాళేశ్వరం నీరుతో నర్సాపూర్ నియోజకవర్గంతో పాటు ఇతర జిల్లాలకు నీరు అందేలా మంజీర నదిఒడ్డున నిండుకుండల ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
* తెరాసలో చేరిన సీడీసీ మాజీ చైర్మన్ దుర్గారెడ్డి
కౌడిపల్లి మండలం సీనియర్ కాంగ్రెస్ నాయకులు, సీడీసీ మాజీ చైర్మన్ దుర్గారెడ్డి తన అనుచరులతోమాజీమంత్రి హరీష్‌రావు సమక్షంలో తెరాస పార్టీలో చేరారు. హరీష్‌రావు గులాబి కండువ కప్పి సాదారణంగా వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు మండలంలోని పోతంశెట్టిపల్లి గ్రామ సర్పంచ్ నాగమణి నర్సింలుతో పాటు వార్డు సభ్యులు, గ్రామానికి చెందిన 200 మంది కార్యకర్తలు తెరాసలో చేరారు. కౌడిపల్లి మండలం సలాబత్‌పూర్‌కు చెందిన సర్పంచ్, చిలిపిచెడ్ మండలం గౌతాపూర్ గ్రామ సర్పంచ్‌లు తెరాస పార్టీలో చేరారు.
* జిల్లా రేషన్ డీలర్ల సంఘం సంఘీభావం
మెదక్ జిల్లా రేషన్ డీలర్ల సంఘం నిజాంపురం ప్రభాకర్ ఆధ్వర్యంలో శుక్రవారం ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డికి మద్దతు తెలుపుతూ ఈ ఎన్నికల్లో జిల్లా నుండి రేషన్ డీలర్లందరు కలిసికట్టుగా తమ ఓట్లను వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని హరీష్‌రావు ముందు తెలపడంతో అందుకు హరీష్‌రావు సంతోషం వ్యక్తం చేస్తూ సాధారణంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ముత్యంరెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు శేఖర్, మాజీ అధ్యక్షులు గౌరిశంకర్, తెరాస రాష్ట్ర కార్యదర్శి వెంకటయ్య, నర్సాపూర్ ఇంచార్జీ దేవేందర్‌రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ చంద్రాగౌడ్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, రేషన్ డీలర్లు పాల్గొన్నారు.

కమనీయం స్వామివారి తిరు కళ్యాణం
* ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించిన కలెక్టర్
గజ్వేల్, మార్చి 29: ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న నాచగిరి శ్రీలక్ష్మినృసింహ క్షేత్రంలో గురువారం అర్ధరాత్రి దాటాక స్వామివారి తిరుళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. యజ్ఞాచార్యులు శ్రీనివాసాచార్యుల నేతృత్వంలో వేదపండితుల మంత్రోచ్ఛరణలు, భక్తజనుల జయజయద్వనుల మద్య సర్వాంగసుందరంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై శ్రీలక్ష్మి నృసింహస్వామివారిని అధీష్టింపజేశారు. ఈ సందర్బంగా నిర్వహించిన ఎదుర్కోలు ఉత్సవం, జిలుకర్రబెల్లం సమర్పన, మాంగళ్య దారణ, తలంబ్రాలు, స్వామివారికి యజ్ఞోపవితం కన్నుల పండుగ గా జరిగింది. కాగా మొదటగా క్షేత్రంలో శ్రీలక్ష్మి నృసింహస్వామి మూల వర్యులకు అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేకపూజలు, క్షీరాభిషేకం నిర్వహించి పట్టువస్త్రాలు, సుగంద ద్రవ్యాలు, పూలమాలికలతో సుందరంగా తీర్చి దిద్దారు. కాగా రాత్రి సతీసమేతులైన శ్రీ స్వామివారిని నాచగిరి పుర వీదులలో ఊరేగించి తూర్పుద్వారం ఎదురుగానున్న కళ్యాణ మండపంపై అధీష్టింపజేసి మేళతాళాలు, భక్తుల జయజయద్వానాలు, వేద పండితుల మంత్రోశ్చరణల మద్య కలెక్టర్ కృష్ణ్భాస్కర్ స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు. స్వామివారి కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర కార్పోరేషన్ చైర్మెన్ ఎలక్షన్‌రెడ్డి, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ సుదాకర్‌రెడ్డి, నాచగిరి ట్రస్టుబోర్డు చైర్మెన్ మాజీ చైర్మెన్ కొట్టాల యాదగిరి, సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, దాతలు రాజనర్సింగ రావు, తాత నర్సింహరావు, రాజ్‌కుమార్‌లు పాల్గొనగా, కళ్యాణ మహోత్సవ వ్యాఖ్యాతగా శ్రీమాన్ కృష్ణమాచార్యులు వ్యవహరించారు.
ఎన్నికల విధులకు ఉత్తర్వులు జారీ
*7,524మందికి ఉత్తర్వులు * విధులనుండి ఏలాంటి
మినహాయింపు ఉండదు
* శిక్షణ తరగతులకు తప్పని సరి హాజరు కావాల్సిందే..
- ఎన్నికల అధికారి హన్మంతరావు
సంగారెడ్డి టౌన్, మార్చి 29: పార్లమెంట్ ఎన్నికల విధుల నిర్వహణకు జిల్లాలో 7,524మంది పోలింగ్ అధికారులు, సిబ్బందికి ఉత్తర్వులు జారీ చేసామని, ఎన్నికల విధుల నుండి ఎవరికి ఏలాంటి మినహాయింపు ఉండదని జిల్లా ఎన్నికల అధికారి, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఎం.హన్మంతరావు పేర్కొన్నారు. ఎన్నికల విధులకు తప్పని సరి హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసారు. పిఓ,ఏపిఓలకు ఈ నెల 30,31తేదీల్లో, ఇతర పోలింగ్ అధికారులకు ఏప్రిల్ 1,2తేదీల్లో నియోజవర్గ కేంద్రంలో శిక్షణ తరగుతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సంబంధితులందరూ శిక్షణ తరగతులకు హాజరు కావాలని, ఉదయం 9నుండి సాయంత్రం 5గంటల వరకు శిక్షణ ఉంటుందన్నారు. నారాయణఖేడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, జహీరాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అందోల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సంగారెడ్డి తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పటాన్‌చెరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. శిక్షణ తరగతులకు గైర్హాజరైన వారిపై ఎన్నికల నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. శిక్షణ తరగతులకు సంబంధించి ఉత్తర్వులు అందుకున్న పిఓ,ఏపిఓ, ఓపిఓలు తమకు కేటాయించిన నియోజకవర్గంలో సూచించిన తేదీలలో నిర్ణీత సమయంలోగా హాజరు కావాలని సూచించారు.
సోనియా రుణం తీర్చుకుందాం
* ప్రజాస్వామాన్ని ఖూనీ చేస్తున్న కేసీఆర్
- ఎంపీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి
చేర్యాల, మార్చి 29: తెలంగాణా రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాందీ రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని అందుకే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో చేయి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్దులను గెలిపించాలని భువనగిరి ఎంపి అభ్యిర్ది కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం చేర్యాల, కొమురవెళ్లి, మద్దూరు, బచ్చన్నపేట మండలాలలో ప్రచారాన్ని నిర్వహించిన అనంతరం చేర్యాలలోని రేణుకా గార్డెన్‌లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సాదరణమని అన్నారు. గత ఎన్నికల్లో ఎన్నో అవకతవకలు జరిగాయని గుర్తు చేశారు.
నీళ్లు, నిదులు, నియామకాలు అని చెప్పి నేడు వాటి గురించి పట్టించుకోకుండా కేసి ఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. పేద ప్రజలకు, రైతులకు ఆయన చేసిందేమి లేదని అన్నారు. నిరంకుశ పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం వచ్చిందని సంతలో పశువులను కొన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కేసీఆర్ కొంటూ ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తున్నాడని అన్నారు.అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరగాల్సి ఉండగా మోడి కాళ్లు పట్టుకొని ముందస్తుగా అసెంబ్లీ ఎన్నికలు జరిపి ఇవి ఎంలను ట్యాంపరింగ్ చేసి అదికారంలోనికి వచ్చిన కేసి ఆర్‌కు నేడు బుద్ది చెప్పాల్సిన అవకాశం వచ్చిందని దీనిని సద్వినియోగం చేసుకొని కాంగ్రెస్‌కు ఓటు వేయాలని అన్నారు. మాజి టిపిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ ఇవి రాహుల్, మోదికి మద్య జరుగుతన్న ఎన్నికలని ఇందులో కాంగ్రెస్‌ను గెలిపించి రాహుల్‌ను ప్రదానిగా చేయాలని అన్నారు. నోట్ల రద్దు, రాఫెల్ కుంబకోణం లాంటివి ఎన్నో చేసిన ఘనత మోడీదేనని అన్నారు. రానున్న రోజుల్లో కేసి ఆర్ తన శేష జీవితాన్ని చంచల్‌గూడ జైళ్లో గడపాలని జోస్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో టీజేఎస్ వ్యవస్థాపక అద్యక్షుడు ప్రొఫెసర్ కోందడరాం, నాయకులు ఆది శ్రీనివాస్, గిరి కొండల్‌రెడ్డి, జెడ్పీటిసి పద్మవెంకట్‌శ్, బండి శ్రీనివాస్, దర్మ సంతోష్‌రెడ్డి, ఉడుముల బాస్కర్‌రెడ్డి, కొమ్ము నర్సింగరావు, ముస్త్యాల యాదగిరి, ఉడుముల బాల్‌రెడ్డి, చిరంజీవులు, నిమ్మ రాజీవ్‌రెడ్డి, కీజర్, రవీందర్‌రెడ్డి, నర్సయ్యపంతులు, సుదాకర్, కాటం శ్రీనివాస్‌తో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ మారిన వారు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఉన్నత పదవులు అనుభవించారని గుర్తుచేశారు. తాగు సాగునీరు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. దమ్ముంటే కేసీఆర్ ఈ ఎన్నికల్లో తనబిడ్డకవితను గెలిపించుకోవాలని అన్నారు. ఇప్పటి వరకు ఎటు ఓటు వేసినా ఇప్పుడు మాత్రం తెలంగాణా ఇచ్చిన కాంగ్రెస్‌కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపులతో ప్రజాస్వామ్యానికి మచ్చ తెస్తున్న ఘనత కేసి ఆర్‌కే దక్కుతుందని అన్నారు. టీఆర్‌ఎస్ లోని ప్రతి ఒక్కరు చేతులు కట్టుకొని కేసీఆర్ ముందు మోకరిల్లాల్సిందేనని అన్నారు.
గజ్వేల్ రైల్వేలైన్ బీజేపీ కృషి ఫలితమే..
* ములుగులో ఉద్యానవన యునివర్సిటీ ఏర్పాటు
* డబల్‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలకు కేంద్ర నిదులు మంజూరు * ఎన్నికల నిబందనలు ఉల్లంఘిస్తున్న ఎమ్మెల్యే హరీష్‌రావుపై కమిషన్‌కు ఫిర్యాదు
- మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు
గజ్వేల్, మార్చి 29: ఎన్నికల నిబందనలకు విరుద్దంగా బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ఎమ్మెల్యే హరీష్‌రావుపై ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిది, మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం గజ్వేల్‌లో కార్యకర్తల సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. ప్రజలను రెచ్చగొడుతూ తప్పుదారి పట్టించే విదంగా వ్యవహరించడం ఎన్నికల నిబందనలకు విరుద్దమని, చాలెంజ్‌లు చేస్తూ ఇతర పార్టీల అభ్యర్థులను అనామకులుగా దూషించడం నేరమని, అయితే నిబందనలు యదేచ్చగా ఉల్లంగిస్తున్న ఆయనపై కేసు నమోదు చేయడంతో పాటు శాసన సభ సభ్యత్వం రద్దు చేసే విదంగా ఆదారాలతో ఎన్నికల కమీషన్‌కు అందజేస్తామని స్పష్టం చేశారు. మనోహరాబాద్ నుండి పెద్దపల్లి వరకు ఏర్పాటు చేస్తున్న రైల్వేలైన్‌కు నిదులు బీజేపీ మంజూరీ చేయగా, ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి తానేదో పోరాడి సాదించినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు.
అలాగే లక్డారం గ్రామాన్ని కొత్త ప్రభాకర్ రెడ్డి దత్తత తీసుకొని ఎలాంటి అభివృద్ది చేయలేదని, అలాగే గజ్వేల్‌కు ఉద్యానవన యునివర్సిటీ మంజూరీ చేసిన ఘనత బీజేపీకే దక్కుతుండగా, గజ్వేల్ నియోజకవర్గంలో నిర్మిస్తున్న డబల్‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణంలో సింహ భాగం నిదులు తమవేనని తెలిపారు. ముఖ్యంగా ప్రపంచ దేశాల్లో భారత్‌కు వనె్న తెచ్చిన ప్రధాని నరేంద్రమోడీ సారద్యంలోనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ది సాదిస్తుందని, పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం లక్ష్యంగా పథకాలు రూపొందించి వెలుగులు నింపినట్లు చెప్పారు. జీఎస్‌టీ, పెద్దనోట్ల రద్దు వంటి సాహసోపేత నిర్ణయం ప్రతిపక్షాలకు మింగుడు పడడంలేదని, కాంగ్రెస్, కమ్యునిస్ట్‌లతో పాటు ప్రాంతీయ పార్టీలకు దేశంలో కాలం చెల్లినట్లేనని వివరించారు.
ఈ కార్యక్రమంలో నేతలు పేర్ల శ్రీనివాస్, ఉప్పల మదుసూదన్,శ్రీనివాస్,మనోహర్‌యాదవ్, సురేశ్, తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నేడు వర్గల్‌లో తెరాస రోడ్‌షో
* హాజరుకానున్న మాజీ మంత్రి హరీష్‌రావు
* గ్రామాల్లో ప్రతిపక్ష పార్టీలకు ఎజెంట్లు లేకుండా చూద్దాం - టీఆర్‌ఎస్ రాష్ట్ర నేత వంటేరు ప్రతాప్‌రెడ్డి
గజ్వేల్, మార్చి 29: టీఆర్‌ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా ఈ నెల 30న వర్గల్ మండలకేంద్రంలో భారీరోడ్‌షో నిర్వహించనుండగా, ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్‌రావు, అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రామలింగారెడ్డిలుహాజరు కానున్నట్లు టీఆర్‌ఎస్ రాష్ట్ర నేత, వర్గల్ మండల ఇంచార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం అనంతగిరిపల్లిలో సర్పంచ్ అప్పిడి సునిత రమణారెడ్డి నేతృత్వంలో ఆయా పార్టీల శ్రేణులు టీఆర్‌ఎస్‌లోచేరిన సందర్బంగా రాష్ట్ర పర్యాటక శాఖ చైర్మెన్ భూపతిరెడ్డితో కలిసి మాట్లాడారు. గ్రూపులు, వర్గాలకతీతంగా పనిచేసి కేసీఆర్ గౌరవం ఇనుమడింపజేద్దామని,అలాగేకష్టపడే కార్యకర్తలకు తప్పనిసరిగా గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు. నియోజకవర్గం లో కేసీఆర్ చేసిన అభివృద్దికి ప్రతిపక్ష పార్టీల ఎజెంట్లు ఉండరని భావిస్తుండగా పోలింగ్ శాతం పెంచి లక్షకు పైగా మెజార్టీ సాదిద్ధామని అన్నారు. వర్గల్ రోడ్‌షో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలోమండలటీఆర్‌ఎస్ బాద్యులు నాగరాజు,జడ్పీటీసీ పోచయ్య, పీఏసీఎస్‌చైర్మెన్ వేలూరి వెంకట్‌రెడ్డి, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు సంతోష వెంకట్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నేతలు తదితరులు పాల్గొన్నారు.
ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి
* ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై జాప్యం వద్దు
* అభ్యర్థుల ప్రచారంపై ప్రత్యేక నిఘా పెట్టాలి
- ఎన్నికల వ్యయ పరిశీలకులు చందన్ కుమార్
సిద్దిపేట, మార్చి 29 : లోక్‌సభ ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై జాప్యం చేయవద్దని, నియమాలు ఉల్లంఘించే వారిపై వచ్చిన ఫిర్యాదులపై అధికారులు వెంటనే స్పందించాలని పార్లమెంట్ ఎన్నికల వ్యయ పరిశీలకులు చందన్‌కుమార్, జిల్లా కలెక్టర్ కృష్ణ్భాస్కర్ వెల్లడించారు. సిద్దిపేట సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ కృష్ణ్భాస్కర్, జేసీ పద్మాకర్, మెదక్ పార్లమెంట్ పరిధిలోని నియోజక వర్గాల రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల ప్రత్యేకాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా ఎన్నికల ప్రత్యేక బృందాలు తీరు తెన్నుల గూర్చి సిద్దిపేట జిల్లాలోని 22 మండలాలు, 5నియోజక వర్గాలు, సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాకతో పాటు జనగాం, మానకోండూరు నియోజక వర్గాలు జిల్లా పరిధిలో ఉన్నాయని డీఆర్‌ఓ చంద్రశేఖర్ వివరించారు. జిల్లాలోని దుబ్బాక, గజ్వేల్ నియోజక వర్గాలు ఎన్నికల వ్యయ పరిశీలకులుగా వచ్చిన చందన్‌కుమార్ బీహార్ వాస్తవ్యులు, 2014 బ్యాచ్‌కు చెందిన ఐఆర్‌ఎస్ అని, ప్రస్తుతం జార్కండ్ రాష్ట్రంలో సేవలు అందిస్తున్నట్లు జిల్లా అధికార యంత్రానికి డీఆర్‌ఓ చంద్రశేఖర్ వివరించారు. లోకసభ అభ్యర్థుల ఎన్నికల వ్యయ ప్రచార పరిమితి 70 లక్షలుగా భారత ఎన్నికల సంఘం నిర్దేశించిందని, ప్రచార ఖర్చులను లెక్కించేందుకు అప్రమత్తంగా ఉండాలని వ్యయ పరిశీలకులు చందన్‌కుమార్ తెలిపారు. ఖర్చుల లెక్కలో ప్రతి అంశాన్ని రికార్డు చేయాలని, సీవిజిల్ యాప్, 1950 ద్వారా వచ్చే ఫిర్యాదులపై స్పందించాలన్నారు.
రాజకీయాల గతిని మార్చిన టీడీపీ
* పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో జడ్పీటీసీ
పటన్‌చెరు, మార్చి 29: జాతీయ రాజకీయాల గతిని తెలుగుదేశం పార్టీ మార్చిందని పటన్‌చెరు జడ్పీటీసీ గడీల శ్రీకాంత్‌గౌడ్ అన్నారు. రాష్ట్ర రాజకీయాలలోను ఓ కొత్త చరిత్రను టీడీపీ లిఖించిందని అన్నారు. తెలుగుదేశం పార్టీ 38వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పటన్‌చెరు మండలం ఇస్నాపూర్ గ్రామ కూడలిలో శుక్రవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్, జడ్పీటీసీ గడీల శ్రీకాంత్‌గౌడ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సంధర్బముగా ఆయన మాట్లాడుతూ 1982 సంవత్సరము మార్చి 29వ తేదికి రాష్ట్ర చరిత్రలో ఓ ప్రముఖ స్థానం ఉందన్నారు.పార్టీ ఆవిర్భవించిన కేవలం తొమ్మిది నెలల అనతికాలంలోనే రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకున్న ఘనత ఆయన సొంతమన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌ఎన్‌వీ రాష్ట్ర కార్యదర్శి కిషోర్‌రెడ్డి, ధనరాజ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
విలువలతో కూడిన విద్యనందిస్తున్న ఘనత మైనార్టీ గురుకులాలదే
*కార్పోరేట్ తరహాలో ఇంగ్లీష్ మాద్యమంలో బోదన
- జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖాధికారి జీవరత్నం
గజ్వేల్, మార్చి 29: విలువలతో కూడిన విద్యనందిస్తున్న మైనార్టీ గురుకులాలు గ్రామీణ పేద విద్యార్థులకు వరంగా నిలిచిందని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖాధికారి జీవరత్నం పేర్కొన్నారు. శుక్రవారం గజ్వేల్ పట్టణంలోని మైనార్టీ గురుకులంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరై ప్రసంగించారు. మైనార్టీ విద్యార్థులకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం ప్రతి విద్యార్థిపై రూ. లక్షా 25వేలు ఖర్చు చేస్తుండ గా, ఉన్నత విద్య కోసం రూ. 25లక్షలు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో బాలుర, బాలికలకు వేర్వేరుగా మైనార్టీ గురుకులాలు ఏర్పాటు చేస్తూ విద్యార్థుల మేదో సంపత్తికి పదును పెడుతుండగా, కుంటిసాకులు చెబుతూ విద్యార్థులను విద్యకు దూరం చేయవద్దని తల్లిదండ్రులకు సూచించారు. ముఖ్యంగా మైనార్టీ గురుకులాల విద్యార్థులు నాసాకు ఎంపికవడం శుభ పరిణామం కాగా, కిలిమంజారో అదిరోహనతోపాటు వివిద డిబెట్, సైన్స్ ప్రదర్శనల్లో పాల్గొంటూ చక్కటి ప్రతిభ చాటుతున్నట్లు తెలిపారు.
భవిష్యత్తులో మైనార్టీ గురుకులాలు ఉన్నత విద్యా సంస్థలుగా తీర్చి దిద్దబడనుండగా, ఎలాంటి నిదుల కొరత లేకుండా సకలవసతులు, పోషక విలువలతో కూడిన ఆహారం అందిస్తూ ఆరోగ్యంగా, విద్యాపరంగా, ఇతర రంగాలలో విద్యార్థులను నిష్టాతులుగా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి పక్కా భవన నిర్మాణాలు జరగనుండగా, ఇప్పటికే స్థల ఎంపికలు జరిగినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి సునిత, ప్రిన్సిపాల్ గణేష్‌గౌడ్ తదితరులు పాల్గొనగా అనంతరం వివిద రంగాలలో ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.