మీ వ్యూస్

అంత సీన్ లేదు -- మీ వ్యూస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందరూ దెయ్యాలు సినిమాలు తీసి హిట్ అవుతున్నారన్న ఆలోచనతో స్వాతి కూడా త్రిపుర అంటూ ముందుకు వచ్చింది. కానీ ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికెగరగలదా? అనుష్క ‘అరుంధతి’తో హిట్ కొట్టింది అంటే, ఆమె నటనే ప్రధాన కారణం. ఆ తరువాత నందిత ‘ప్రేమకథా చిత్రమ్’ అంటూ హిట్ కొట్టిందంటే అది దర్శకుడి ప్రతిభ. కానీ, త్రిపురలో ఏముందని ఆమె ఇలాంటి సినిమాలు చేసిందో అర్ధంకాదు. ఎవరికో హిట్ దొరికిందన్న ఆలోచనతో తాను కూడా మళ్లీ అలాంటి హారర్ చిత్రాలవైపే మొగ్గుచూపడం విచారకరం. స్వాతి ఎప్పట్లా బబ్లీ అమ్మాయిలా అల్లరి అల్లరిగా తిరుగుతూ యాక్షన్ చేస్తేనే ప్రేక్షకులు చూస్తారు. అది ఆమెకు పడిన ముద్ర. అది చెరుపుకోవాలని త్రిపురతో ప్రయత్నించినా పాపం, ప్రయోజనం శూన్యం. హారర్ చిత్రాలు మేమూ తీస్తాము అనే ప్రతివారికి త్రిపుర ఓ చెంపపెట్టు.
-టి.రఘురామ్, బాపట్ల

అతిలోక సుందరి
శ్రీదేవి ప్రస్తావన రాగానే అందరూ అతిలోక సుందరి అంటారు. కానీ ఆమె ఇప్పుడు సీనియర్ సిటిజన్. ముఖంలో, శరీరంలో వృద్ధాప్య ఛాయలు కనిపిస్తున్నాయి. అయినా అతిలోక సుందరి అనడం మానరు. ఆమెకోసమే రాసిన ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ చిత్రం హిట్టయ్యింది. ఏ చిత్రంలో నటించినా హిట్టవుతుంది అనుకోవడం భ్రమ. ఎక్కువ పారితోషికానికి ఆశపడి బాహుబలిని వదిలి పులిమీదే ఎక్కింది. అది కాస్తా పిల్లిలా మ్యావ్ అంది. అయినా కూతురితో పోటీపడి అందంగా కనిపించాలి అనుకుంటే ఎలా?
- కె.లక్ష్మీప్రసన్న, పేర్రాజుపేట

భ్రమ
రానా సినిమాలో తాప్సీకి ఛాన్సు దొరికిందని, ఆమె పంట పండిందని అందరూ అంటున్నారు. ఆమె పంట ఎన్నిసార్లు పండుతుందో, ఎప్పటికి పండుతుందో ఎవరికీ అర్ధంకాదు. గంగ చిత్రం హిట్టయితే ఆమె పంట పండిందన్నారు. ఎక్కడికో వెళ్లిపోతుందన్నారు. ఆమె ఎక్కడికీ వెళ్లిపోలేదు. వేసినచోటనే పదిలంగా వుండిపోయే కంబళిలా తయారైంది ఆమె పరిస్థితి. ఆమె కంటే జూనియర్లు రకుల్‌ప్రీత్‌సింగ్, శృతిహాసన్‌లు జయాపజయాలతో నిమిత్తం లేకుండా దూసుకుపోతున్నారు. తాప్సీ మాత్రం అలాగే వుంది. రానాకే దిక్కులేదు. అతనితో జతకట్టిన తాప్సీ ఎక్కడికో వెళ్లిపోతుంది అనుకోవడం ఉత్త భ్రమ.
- ఆర్.శాంతిచంద్రిక, సామర్లకోట

ఫ్లాష్‌బ్యాక్
ఈవారం వెనె్నల ఫ్లాష్‌బ్యాక్‌లో ‘త్యాగయ్య’ సినిమాపై రాసిన ఆర్టికల్ అద్భుతంగా వుంది. తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డ, నటనకు నిలువెత్తు స్వరూపం, నటుడిగా, దర్శకునిగా, గాయకునిగా అసంఖ్యాక తెలుగువారి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన మాన్యశ్రీ చిత్తూరు నాగయ్యగారు నటించి, జీవించిన త్యాగయ్య చిత్రం చూస్తున్నంతసేపు ఆ వాగ్గేయకారుని సజీవంగా చూస్తున్నంత తాదాత్మ్యం కలుగుతుంది. నాగయ్యగారు స్వరపరచి, పాడిన కృతులన్నీ ఇప్పటికీ సంగీతాభిమానులను విశేషంగా అలరిస్తున్నాయి. ఒక రామదాసు, పోతన, వేమన, త్యాగయ్య అంటే నాగయ్యగారే గుర్తుకువస్తారు. ఇదే కథాంశంతో తర్వాత వచ్చిన సినిమాలు సక్సెస్ కాకపోవడానికి కారణం ఒక అద్భుతమైన కళాఖండాన్ని తెరకెక్కించడంలో ఆయనలో నిజాయితీ, నిబద్ధత, తపనలు లోపించడమే!
- ఎం.కనకదుర్గ, తెనాలి

పాట ఎటోపోతోంది!
మన తెలుగు సినిమాలలో వస్తున్న పాటల నాణ్యతను చూస్తుంటే చాలా బాధకలుగుతోంది. పాటలో సాహిత్యం వివిధ భాషలతో కూడిన పదాలతో వుండి అసలు అర్థంకాదు. ఇక వాయిద్యాల ఘోష సాహిత్యాన్ని మరుగున పడేస్తోంది. పదాలను ఉచ్ఛరించడంలో ఘోరమైన తప్పులను చేస్తూ గాయకులు తెలుగు పాటల ప్రతిష్టను అధఃపాతాళానికి తొక్కేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో దేశస్థాయి పోటీలలో పాల్గొని ఎనలేని ఖ్యాతి గడించిన శ్రీరామచంద్ర, కారుణ్య వంటి మంచి గాయకులు ఎందరో వుండగా, వారిని కాదని పరభాషా గాయకులను దిగుమతి చేసుకొని వారిచేత పాటలు పాడించడం, వారు పదాల పడికట్టును యిష్టం వచ్చినట్లు విరిచేసి, బొంగురు గొంతుకులతో, గొంతు చించుకొని పాడుతూ వుంటే, ఆ పాటలను వినలేక తెలుగు సంగీత ప్రేమికులకు ఎంతో వేదన కలుగుతోంది. ఒకప్పుడు దిగంతాలకు వ్యాపించిన తెలుగు పాట వైభవం ఇప్పటి అధఃపాతాళానికి దిగజారిపోతోంది. ఏటా వస్తున్న వేలాది పాటలలో పట్టుమని మంచి పాటలు ఏది కూడా రావడం లేదంటే అతిశయోక్తి కాదు.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం

కానె్సప్ట్ మంచిదే
చిన్న సినిమాకు డిజిటల్ ఊపిరి వ్యాసం ఆశావహ దృక్పధంతో ఆలోచనాత్మకంగా వుంది. కానె్సప్ట్ మంచిదే. కాని దాన్ని ఎంతమంది సద్వినియోగం చేసుకుంటారో చెప్పలేం. మనవాళ్లకి పాత్రల్ని తీర్చిదిద్దడం, మంచి కథ నిర్మించుకోవడం చేతగాదు. చిన్న సినిమా అనగానే శ్రమపడనక్కరలేని సినిమా అనుకొని బేవార్స్ డైలాగులతో నాలుగు సన్నివేశాలు, వల్గర్ కామెడీ సీన్లతో చాపచుట్టేస్తారు. అదే సినిమా అనుకుంటారు. డబ్బులిచ్చి తలనొప్పి కొనితెచ్చుకోవడం ఎందుకని ప్రేక్షకులు పారిపోయేట్టు చేయకూడదు. సౌకర్యాలు సమకూర్చాలి. దృశ్యం చక్కగా కనిపించాలి. మాటలు చక్కగా వినిపించాలి. సాంకేతిక అంశాల్లో రాజీపడకూడదు. ఇవన్నీ జరిగేనా?
- చంపక్, మాధవనగర్

150వ చిత్రం
చిరంజీవి 150వ చిత్రం ఏది చేద్దామా అని ప్రపంచంలో వున్న క్వశ్చన్ మార్కులన్నీ నెత్తిమీద పడ్డట్టుగా ఆలోచిస్తున్నాడు. ఇందులో ఆలోచించడానికి ఏముంది? పాతాళభైరవి చిత్రాన్ని నిర్మించమని ఓ పాఠకుడు చెప్పాడు కదా! ఇంతకన్నా బాగుండేది ‘మాయాబజార్’ సినిమా రీమేక్ చేస్తే! చిరంజీవి కృష్ణుడిగా, రామ్‌చరణ్ అభిమన్యుడిగా, నాగబాబు ఘటోత్కచుడుగా, అల్లు అర్జున్ దుర్యోధనుడిగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో చేస్తే కుటుంబ చిత్రం అన్న ముద్రతో సినిమా హిట్టవ్వదూ!
-శంకర్, వక్కలంక