మీ వ్యూస్

వర్మ క్రియేటివిటీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ సినిమాకు సెన్సార్ విధానాన్ని రద్దుచేయాలని రాంగోపాల్‌వర్మ ఇటీవల విచిత్రమైన సూచన చేసారు. ప్రతీసారి అర్ధంపర్ధం లేని ప్రకటనలు చేస్తూ వార్తల్లో వుండేందుకు ప్రయత్నించే ఈ దర్శకుడు ఈసారి తన క్రియేటివిటీని దేశంలో సినిమాకు సెన్సార్ విధానం ఎందుకు ఉండకూడదో వివరించడంలో చూపించారు. మొబైల్ ద్వారా అనవసరమైన, అశ్లీలత అంతా క్షణాల్లో ఎక్కడబడితే అక్కడ వీక్షించే వెసులుబాటు వుండవచ్చుగాక! బ్లూఫిల్మ్‌లు విరివిగా డౌన్‌లోడ్ చేసుకొని చూసే సౌలభ్యం కూడా వుండవచ్చు. అంతమాత్రాన దానికి సెన్సార్‌కు లింక్ పెట్టడం అసంబద్ధం. నలుగురు కూర్చొని చూసే సినిమాకు సామాజిక కట్టుబాట్లు తప్పనిసరి! సెన్సార్ పుణ్యమా అని కనీసం వినలేని, వినరాని డైలాగులు వచ్చినప్పడు బీప్ శబ్దం, చూడరాని విషయాలను బ్లర్ చేయడం జరుగుతోంది. ఇప్పటికే సినిమా కట్టుబాట్లు నెమ్మదిగా దాటుతోంది. శృంగారం, అసభ్యత, అనైతికత, ద్వందార్థాలు, శృతిమించి రాగాన పడుతున్నాయి. ఇక సెన్సార్ లేకపోతే సినిమాలన్నీ ఎక్స్‌రేటెడ్ సినిమాల్లా అయిపోవడం ఖాయం. ప్రతీ విషయాన్ని సెనే్సషనల్ చేసే బదులు లక్షలాది ప్రజలను అమితంగా ప్రభావితం చేసే సినిమాలు మరింత క్రియాశీలకంగా, నిర్మాణాత్మకంగా కళాత్మకంగా వుండేందుకు వర్మలాంటి దర్శకులు సూచనలుచేస్తే ఉపయుక్తంగా వుంటుంది.
- సిహెచ్.సాయిఋత్త్విక్, నల్గొండ

వాస్తవికతకు అద్దం
సినిమా అంటే ఆరు పాటలు, ఒక ఐటం, నాలుగు ఫైట్లు, రొమాన్స్, వల్గర్ కామెడీ, పంచ్ డైలాగులు అనుకునే ప్రేక్షకులకు ఫైట్లు తప్ప మిగిలినవేవీ లేని ‘చీకటిరాజ్యం’ నచ్చకపోవచ్చు. ఆ ఫైట్లు చాలా వాస్తవికంగా ఉండడం ఒక కొత్తదనం. టైట్ స్క్రీన్‌ప్లే, అక్కడక్కడ నవ్వించే మెరుపు డైలాగులు, నటనా వైదుష్యం కోరుకునే వారికి రెండు గంటల సత్కాలక్షేపం. ఎవరూ తినని ముప్ఫయి రకాలు వడ్డించిన విందు భోజనం కాదు. సంతృప్తికరంగా తినగలిగిన పదార్ధాలే వున్న విందు. కమల్ సరే ప్రకాశ్‌రాజ్ నటన ఆకట్టుకుంటే మేకప్ లేని త్రిష కూడా రియలిస్టిక్‌గా అలరించింది. క్లబ్బు వాతావరణం అత్యంత సహజంగా వుంది.
- ప్రసాద్, గొడారిగుంట

గ్యాప్ మంచిదే!
27 నవంబర్, 2015 వెనె్నల ద్వారా ఈవారం విడుదలైన చిత్రాల్లో ఏ ఒక్క చిత్రమూ ప్రేక్షకుడిని మెప్పించలేక విఫలమైన వైనాన్ని తెలుసుకున్నాం. నాకు నచ్చిన సినిమా శీర్షికలో అందించిన ‘పెళ్ళిచేసి చూడు’ చిత్ర విశేషాలు అశేష పాఠకులను అలరించడంలో నూటికి నూరుపాళ్ళు సఫలీకృతమైంది. వ్యంగ్యంతో కూడిన ఆరోగ్యకర హాస్యాన్ని మేళవించి, సాంఘిక చిత్రాల్ని జనరంజకం చేయవచ్చునే ధోరణికి అంకురార్పణ చేసిన ఈ చిత్ర విశేషాలను అందించి ఆనందింపజేసిన భూమికి ధన్యవాదాలు. రుద్రమదేవి ప్రత్యేక ప్రెస్‌మీట్‌లో గుణశేఖర్ టీమ్‌వర్క్‌ని అభినందిస్తూనే, దర్శకరత్న దాసరి నారాయణరావు చిత్ర పరిశ్రమ పరిస్థితులపై వ్యాఖ్యానించిన విశేషాల్ని ‘గ్యాప్‌మంచిదే’ వ్యాసం ద్వారా తెలుసుకున్నాం.
- అల్లాడి వేణుగోపాల్, బారకాసు

ఇలాఅయితే ఎలా?
చిత్ర పరిశ్రమ అనేది కేవలం వినోద సాధనం మాత్రమేకాక, ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో వేల కుటుంబాలకు ఉపాధి కల్పించే ఒక పరిశ్రమ. అలాంటి పరిశ్రమలో వరుసగా సూపర్‌హిట్స్ రాకపోయినాగానీ ఓ మోస్తరు హిట్స్ వచ్చినా పరిశ్రమకి ఊరటగా ఉంటుంది. కానీ దెబ్బమీద దెబ్బ లాగా వరుసగా ఫ్లాపులు, భారీఫ్లాపులు వస్తుంటే పరిశ్రమ పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది. 2015 దసరా సీజన్‌లో ఎన్నో భారీ అంచనాలతో విడుదలైన రామ్‌చరణ్ ‘బ్రూస్‌లీ’ చిత్రం ఘోర పరాజయంపాలై నిర్మాతకీ, డిస్ట్రిబ్యూటర్లకీ, ఎగ్జిబిటర్లకీ భారీ నష్టాన్ని రుచి చూపించింది. చిరంజీవి కనిపించాడు అనీ ఎంత హడావిడిచేసినా గానీ బ్రూస్‌లీ చిత్రాన్ని ప్రేక్షకులు ఏమాత్రం పట్టించుకోలేదు. ఇహ పటాస్ తర్వాతి చిత్రంగా కళ్యాణ్‌రామ్ ‘షేర్’ మంచి అంచనాలతో విడుదలై బ్రూస్‌లీ మాదిరిగానే అట్టర్‌ఫ్లాప్ అయి అందరికీ భారీనష్టాల్ని మిగిల్చింది. ఏదిఏమైనా ఇలా వరుసగా భారీ ఫ్లాపులు రావటం చిత్ర పరిశ్రమ మనుగడకే ప్రమాదకరం. కనీసం 2016లో అయినా మంచి ఫలితాలు వస్తాయని ఆశిద్దాం.
- మహమ్మద్ హుమాయూన్, బంటుమిల్లి

పద్మశ్రీ ఇవ్వాలి
ఎస్వీరంగారావుకు భారత ప్రభుత్వం పద్మశ్రీని ఇవ్వాలి. 67వ వచ్చిన నర్తనశాల చిత్రానికి గాను రాష్టప్రతినుండి ఉత్తమ అవార్డుతోపాటు ఇతర దేశాల అవార్డులు కూడా అందుకున్నారు. మాయాబజార్‌లో ఆయన చేసిన నటన ఇంతవరకూ ఎవరూ చేయలేకపోయారు. ఆయన వేసిన పాత్రలన్నీ సహజంగా చేసినవే. అందుకే అంతర్జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. పండంటి కాపురం శత దినోత్సవ వేడుకలో కృష్ణ ఈ హిట్ తనవల్ల కాదని ఎస్వీరంగారావుతో వచ్చిందని చెప్పారు. పాతాళభైరవిలో మాంత్రికుడుగా ఆయన అమోఘంగా నటించి మెప్పించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పాత్రలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ ఇచ్చి గౌరవించాలని కోరుకుంటున్నాం.
- కోలిపాక శ్రీనివాస్, బెల్లంపల్లి

అలవాటు చేశారు
ప్రస్తుతం సినిమా రంగం అచ్చమైన తెలుగు సంస్కృతికి దూరంగా వినోదాన్ని అశ్లీలంతో ముడిపెట్టి ప్రేక్షకుల మధ్యకు సినిమా పేరుతో వదిలేస్తుంది. గతంలో కథకు అవసరాన్నిబట్టి శృంగారాన్ని ఆచితూచి జతచేసి చూపేవారు. నేడు వద్దన్నాకానీ శృంగారాన్ని చూపిస్తూ అలాంటి కథలనే తయారుచేస్తూ ప్రేక్షకులకు ఈ ధోరణి అలవాటు చేస్తున్నారు. సహజసిద్ధ హాస్యం కరువై భయంకర ద్వంద్వార్థపూరిత హాస్యం పెరిగిపోయి, వీరలెవెల్లో తాండవం చేస్తోంది అశ్లీలత. అందమంటే అదేననే భావన్ని ప్రజల్లోకి చొప్పించే విధంగా సినిమావారు మాయచేసి విలువలను కాలరాస్తున్నారు.
- పి.రేవతి, ఓ.వి.పేట