మీ వ్యూస్

బోరు రకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విష్ణు, రాజ్‌తరుణ్‌లు ఇద్దరు కలిసి హీరోలుగా నటించిన ‘ఆడో రకం ఈడో రకం’ చిత్రం బోరు బోరుగా సాగింది. సినిమాలో సరైన కథాకథనాలు లేకుండా కేతిగాళ్లకన్నా ఘోరమైన నటనతో ఇద్దరు హీరోలు సినిమాను అటకెక్కించారు. దర్శకత్వ ప్రతిభ కూడా ఏమాత్రం ఎక్కడా కనబడదు. అతని గత సినిమాలు గుర్తుచేసుకుని ఈ సినిమాకు వెళితే బోరుకొట్టేసింది. హీరోయిన్లు కూడా ఏమాత్రం సినిమాను నిలబెట్టలేకపోయారు. అసలు సరైన కథ వుంటేనే కదా సినిమా కొద్దోగొప్పో అలా నిలిచేది. మొత్తానికి ‘ఆడోరకం ఈడోరకం’ సినిమా బోరు రకం సినిమాగా ప్రేక్షకుల పాలిట శాపమైంది.
- టి.రఘురామ్, నరసరావుపేట

గొప్ప గాయినే...
అనేక భారతీయ భాషలలో అద్వితీయంగా, అమృతతుల్యంగా వేలాది పాటలు పాడి చిత్రసీమలో అనేకమంది హీరోయిన్లకు కీర్తినార్జించి పెట్టిన తెలుగింటి ఆడపడుచు సుశీల గిన్నిస్ రికార్డుకెక్కడం తెలుగువారందరికీ గర్వకారణం. ఆమె ఘంటసాల, పి.బి.శ్రీనివాస్‌లతో పాడిన పాటలు, సోలోగా పాడిన అనేక పాటలు ఈనాటికీ పాతబడలేదు. వయసుతో అనేక మార్పులు వస్తాయి. కొత్త నీరు పాత నీరును బయటకు పంపేస్తుంది. ఈనాడామెచేత ఎవరు పాడించుకుంటున్నారు? ఘంటసాల బ్రతికున్నా యిదే గతి. సుశీల మధుర గాయిని. ఆమె పాటలు విని ఉప్పొంగిపోయిన వారందరూ తరించినవారే..
- ఎన్.ఆర్.లక్ష్మి, సికిందరాబాద్

ఇక వర్మ మారడా?
సెనే్సషనల్ క్రియేటివ్, ఇన్స్‌పిరేషనల్, టెక్నికల్ డైరెక్టర్ అంటూ తనకు తానే బోలెడు బిరుదులు ఇచ్చుకున్న రాంగోపాల్‌వర్మ వెరైటీకోసమంటూ చేసే ప్రయత్నాలు దారుణంగా బెడిసి కొడుతున్నా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే వున్నాడు. దయ్యం సినిమాల ప్రయోగం తర్వాత సంచలన వ్యక్తుల బయోగ్రఫీల వెంటపడ్డాడు. రక్తచరిత్ర సిరీస్ తర్వాత వీరప్పన్ సినిమా తీసి, పేరుమోసిన స్మగ్లర్ జీవితంలో మంచి కోణాలు ప్రొజెక్ట్‌చేశాడు. ఇప్పుడు వంగవీటి సినిమా ప్రారంభించి విజయవాడలో హంగామా చేసాడు. తర్వాత అండర్‌వరల్డ్ మాఫియా డాన్‌గా పేరుమోసిన క్రిమినల్ దావూద్‌పై సినిమా తీస్తానని ప్రకటించాడు. తర్వాత బిన్‌లాడెన్, నెపోలియన్, హిట్లర్, అంతర్జాతీయంగా పేరుమోసిన స్మగ్లర్లు, తీవ్రవాదులు, ఆర్థిక నేరస్థులపై వరుసగా సినిమాలు తెలుగు ప్రేక్షకులపై దాడి చేయవచ్చేమో? ఏదిఏమైనా ప్రజల తిరస్కారానికి గురవుతున్నా, మీడియాలో అనేక వ్యతిరేక కథనాలు వెలువడుతున్నా తన పని తాను చేసుకుపోయే రాంగోపాల్‌వర్మ ఒక ప్రత్యేక వ్యక్తిత్వంగల వాడని ఒప్పుకోక తప్పదు!
-సి.సాయిమనస్విత, విజయవాడ

కాజల్ అవసరమా?
సర్దార్‌కి కాజల్ అవసరమా? కాజల్ ఆ చిత్రంలో ఏం చేసింది? ఏం నటించింది? ఆమె తప్ప మరెవ్వరూ చెయ్యలేరనిపించే సీన్ ఒక్కటైనా ఉందా? ఆమె జస్ట్ ఉందంతే. ఆ పాత్రని ఎవరైనా చేయొచ్చు. ఆమె లేకపోతే పోయేదేం లేదు. పికె పక్కన ఎవరో ఒక అప్పలమ్మని పెట్టలేక కాజల్‌ని పెట్టేరంతే. బ్రహ్మాండంగా నటించిందన్న పేరురాకపోయినా పారితోషికం దక్కింది. ఖాతాలో మరొక్క సినిమా కలిసిందామెకు. అది చాలు. ఇక్కడ నిత్యగురించి చెప్పుకోవాలి. మహేష్ పక్కన నామమాత్రపు పాత్రను తిరస్కరించి విమర్శల పాలైనా లెక్కచేయలేదామె. బ్రేవో, నిత్యా!
-లక్ష్మి, బృందావనం

ఆహార్యానికి తావులేదు
నేటి టాలీవుడ్ హీరోయిన్లు సినిమాలో కేవలం పాటలకే పరిమితమవుతున్నారు. అందంతోపాటు ఆహార్యం ఉంటేనే ఆ అందానికి మరింత మెరుగులు దిద్దినట్టు ఉంటుంది. అలనాటి సావిత్రి, జమున, బి సరోజాదేవి లాంటి మేటి హీరోయిన్లు ముఖ కవళికలతోనే చక్కని భావ ప్రకటన చేసేవారు. వారు ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో ముద్రవేసుకొనే ఉన్నారు. ఇప్పటి హీరోయిన్లు మాత్రం పాటలకోసమే వస్తున్న ఆటబొమ్మల్లా ఉన్నారు. సినిమా మొత్తం పది డైలాగులు ఉండటం లేదు. అలాగని లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఏవైనా చేస్తున్నారా? అంటే అదీ లేదు. ఇకముందైనా స‘జీవ’పాత్రలు పోషిస్తారో లేదో చూడాలి.
-టేకి రామకృష్ణ, పొందూరు

సూపర్ కవర్
ఈరోజు వెనె్నలలో ‘ఇద్దరూ... ఇద్దరే’ వ్యాసం వాస్తవికతకు దగ్గరగా బ్యాలన్స్‌డ్‌గా సాగింది. సుప్రసిద్ధులు వ్రాస్తున్న ‘్ఫ్లష్‌బ్యాక్ ఎట్ 50’, శరత్కాలం మంచి సమాచారంతో విశే్లషణాత్మకంగా సాగుతున్నది. పాఠకుల ద్వారా వస్తున్న ‘నాకు నచ్చిన సినిమా’, ‘నాకు నచ్చిన పాట’ పాతతరం ప్రేక్షకులకేకాక వర్తమానానికి చెందిన పాఠకులకు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
-పివిఎన్ ఆచార్యులు,లూటుకుర్రు

అదే పోలీస్
గతంలో ఓంకార్ తీసిన పోలీసోడి పెళ్లాం సినిమా విడుదలకు ముందు పోలీస్ డిపార్ట్‌మెంట్ ఆ టైటిల్ పెట్టరాదని అంటే పోలీసుభార్యగా మార్చారు. ప్రస్తుతం విజయ్ నటించిన తమిళ డబ్బింగ్ సినిమా పోలీసోడు పేరును కూడా వ్యతిరేకిస్తే పోలీస్‌గా మార్చారు. పోలీసువారిని బఫూన్లుగా ఏ సినిమాలో చూపించినా ఆ డిపార్ట్‌మెంట్ ఎటువంటి వ్యతిరేకత వ్యక్తం చేయదు. గబ్బర్‌సింగ్ చిత్రంలో ఎస్‌ఐగా వేసిన పవన్‌కళ్యాణ్ పోలీస్‌స్టేషన్‌ను తన సొంత ఇంటిలా చూపించాడు. అంత్యాక్షరి రౌడీలతో కలిసి పాడించినా డ్రెస్ సరిగ్గా వేసుకున్నా, వేసుకోకున్నా, తుపాకీలోని గుళ్లను అదే పనిగా వేస్ట్ చేస్తున్నా పోలీస్ డిపార్ట్‌మెంట్ ఏమాత్రం వ్యతిరేకత ప్రదర్శించదు. ఐటమ్ పాటల అమ్మాయితో డాన్స్ చేస్తున్నా అబ్జక్షన్ చేయని పోలీస్ డిపార్ట్‌మెంట్ టైటిల్ వెగటుగా అనిపించి, మార్చేవరకు నిద్రపోవడంలేదు. నిజానికి పోలీస్‌స్టేషన్లలో గబ్బర్‌సింగ్ లాంటి ఎస్‌ఐలు ఉంటారా? అలా చేస్తే పోలీస్ డిపార్ట్‌మెంట్ ప్రతిష్ఠ దిగజారుతుందని పోలీస్ వారికి తెలియదా? జగపతిబాబు ఎస్‌ఐగా ఉన్న సినిమాల్లో పోలీస్‌స్టేషన్‌లో బార్ పెట్టలేదా? వాటికి వ్యతిరేకత ప్రదర్శించని వారు ఇటువంటి చిత్రాలకు ఎందుకు ప్రదర్శిస్తారు? కొన్ని సినిమాల్లో రాజకీయ నాయకులు చెప్పినట్లు నడుచుకుని వారివద్ద డబ్బులు వసూలుచేసుకున్నట్లు చూపితే ఇదేంటి అని అడగరెందుకు? ఆ సీన్లు కట్ చేయాలని గగ్గోలు పెట్టరెందుకు? కేవలం పోలీసోడు అన్న పదానికే మర్యాదపోయిందా? పోతుందా?
- జి.ఎం.కృష్ణారావు, హైదరాబాద్