మీ వ్యూస్

సూపర్‌స్టార్ అయ్యాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాహుబలిని, ప్రభాస్‌ని చూసి హాలీవుడ్ షేక్ అయింది. బాలీవుడ్ బావురుమంది అంటూ డబ్బాలు మోగాయి. అయితే భారత్, చైనా, ఇతర దేశాల్లోని వసూళ్లని బట్టి ప్రేక్షకుల సంఖ్యను అంచనా వేస్తే అమీర్‌ఖాన్‌ని 300 కోట్లమంది వీక్షించారనీ, ఇది ప్రపంచ రికార్డు అని తేలింది. 3 ఇడియెట్స్ పరసీ క్యాసెట్లు, సత్యమేవ జయతే టీవీ షోలు చూసిన చైనావారు అప్పటికే అమీర్ అభిమానులయ్యారు. తర్వాత వచ్చిన పీకె 831 కోట్లు, సీక్రెట్ సూపర్‌స్టార్ 874 కోట్లు, దంగల్ 1908 కోట్లు వసూలు చేసి అభిమానుల సంఖ్యను బాగా పెంచేశాడు. అలా అమీర్‌ఖాన్ ప్రపంచంలోనే సూపర్‌స్టార్ అయ్యాడు.
-కె.వింధ్యారాణి, శ్రీనగర్

ధర భూతం!
పైరసీ భూతం సినీ పరిశ్రమని వెంటాడుతున్నదని, దానివలన సినీ పరిశ్రమ నష్టపోతున్నది అని చాలామంది నటులు, నిర్మాతలు వాపోతున్నారు. ఈమధ్య డా.మోహన్‌బాబు కూడా ఇదే విషయం ప్రస్తావించారు. కాని సామాన్య, మధ్యతరగతి కుటుంబాల గురించి సినీ పరిశ్రమ ఆలోచిస్తుందా? హాలులో టిక్కెట్ల ధరలు మధ్య తరగతి మనిషికి అందుబాటులో లేవు. అందుకే వాళ్లు పైరసీని ఆశ్రయిస్తున్నారు. ఇక చిత్రాల్ని నిర్మించాలి అంటే కోట్లు కోట్లు ఖర్చుపెట్టేస్తారు. ఆ ఖర్చంతా జనం మీదికి రుద్దేస్తున్నారు. అవసరమా? ఇక సినిమాకు ఒక హీరో 25 నుండి 30కోట్లు తీసుకుంటాడు. విలన్లని, హీరోయిన్ల కోసం పరాయి భాషనుండి రప్పించుకుంటారు. వాళ్లకి అన్ని సదుపాయాలతో ఖరీదైన హోటళ్లు బుక్‌చేస్తారు. ఈ ఖర్చంతా ఎవరు భరిస్తారు? చివరకు ప్రజలు మీదకి రుద్దేస్తారు. ఒక పాట చిత్రీకరణ చేయాలంటే హీరో, హీరోయిన్లతోపాటు ఒక వందమందిపైగా డాన్సర్లతో కనీసం 15 నుండి 20 రోజుల వరకు చిత్రీకరిస్తారు. అవసరమా? డాన్సర్లు లేకుండా పాటలు చిత్రీకరించండి. పరాయి భాష నుండి విలన్లకి, హీరోయిన్స్‌కి దిగుమతులు చేయకండి. ఒక హీరో ఒక చిత్రానికి ఒకటో రెండో కోట్లు తీసుకోవచ్చు. అపుడు చిత్రీకరణ ఖర్చు కూడా తగ్గుతుంది. టికెట్ ధరలు తగ్గించండి. అపుడు ఏ తెలుగు ప్రేక్షకుడు పైరసీ జోలికి పోడు. మోహన్‌బాబు ఒక మాట అన్నారు. మేము కష్టపడి ఎంతో డబ్బు ఖర్చుచేసి సినిమాలు తీస్తుంటే ఈ పైరసీవల్ల నష్టపోతున్నాం అని. కాని సినిమా చూసేవాడు కూడా రాత్రీ పగలు కష్టపడి సంపాదించిన డబ్బుతోనే సినిమా టికెట్ కొంటున్నాడు. పై సూచనలు ప్రతి ఒక్క హీరో, హీరోయిన్, నిర్మాత పాటిస్తే పైరసీ భూతమే ఉండదు.
-కొండవలస కృష్ణమూర్తి పట్నాయక్
రాయగడ, ఒడిషా
గురువులను
అవమానిస్తారా?
గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర అన్నారు. తల్లి, తండ్రి దైవంతో సమానులైన గురువులను పూర్వం పూజించేవారు. ఎన్నో సేవలు చేస్తూ వారి వద్ద విద్య నేర్చుకొనేవారు. అటువంటి గురువులను అవమానిస్తూ సినిమాలు రావడం సిగ్గుచేటు. కళాశాలల్లో అధ్యాపకుల పాత్రలకు కమెడియన్లను ఎంపిక చేస్తూ, వారిని శిష్యులచేత ఏడిపిస్తూ, అవమానిస్తూ కుళ్లు జోకులను వేస్తున్నారు. కాలేజీ సన్నివేశాలున్న చాలా చిత్రాలలో గురువులను జోకర్లుగా చిత్రీకరించారు. గురువులకు నిక్‌నేమ్‌లు పెట్టి ఏడిపించే సన్నివేశాలనూ చిత్రించారు. ఇలా దర్శక నిర్మాతలు ఎందుకు తీస్తున్నారు? సెన్సార్ వారికి కళ్ళు ఎందుకు పనిచేయడం లేదు. తల్లితో సమానమైన టీచర్‌ను కొడుకులాంటి విద్యార్థి ప్రేమించే చిత్రాలు, అశ్లీల సన్నివేశాలు తీయడం మరీ సిగ్గు సిగ్గు! వ్యాపార దృక్పథంతో సమాజాన్ని తప్పుదారి పట్టిస్తారా? కళ్ళుండీ చూడలేని పనికిరాని సెన్సార్ ఎందుకు? ప్రభుత్వం వీటికి ఎందుకు అనుమతిస్తుంది? గురువుల గౌరవాన్ని పెంచడానికి సినిమావారు ప్రయత్నించండి. వెకిలి ప్రయత్నాలు ఆపండి!
-సరికొండ శ్రీనివాసరాజు,
హైదరాబాద్
ప్రేక్షకులు
బంద్ చేస్తే?
డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల వైఖరిని నిరసిస్తూ దక్షిణాది రాష్ట్రాల నిర్మాతల మండలి, ఎగ్జిబిటర్స్ కలిసి సినిమా థియేటర్లలో ప్రదర్శనలు నిలిపివేస్తూ బంద్ ఓ వారం పాటు చేశారు. ఎందుకని? వారి సాధక బాధలు, సమస్యల పరిష్కారం కోసం! మరి సినిమా ప్రేక్షకుల సమస్యలు, సాధక బాధలు వీరికి పట్టవా? పైగా ఈ వర్గమంతా కలసి ప్రభుత్వానికి ఈ మధ్యన రాష్టమ్రంతా అన్ని ప్రాంతాలలో సినిమా టిక్కెట్ల ధరలు ఒకేలా ఉండాలని మొరపెట్టుకున్నారు. ఇది సరైంది కాదని ప్రభుత్వం నిరాకరించింది. ఇంతకన్నా అన్యాయం ఇంకోటి ఉందా? నగరంలోని ధరలు మండల పరిధిలో కూడా అవే ఉండాలా? అంటే నగరవాసుల సంపాదన, థియేటర్ల సౌకర్యం మండలాల్లో ఉంటాయా? ఇలా ధరలు పెంచితే మధ్యతరగతి, అల్ప సంపాదన వర్గాలు థియేటర్లకు రాగలరా? అన్ని వర్గాలు కాకుండా ఒక వర్గంవారు వస్తే కలెక్షన్లు వస్తాయా? ప్రతిరోజూ ఉంటాయా? విసుగెత్తిన ప్రేక్షకులే సినిమాలను బంద్ చేస్తే? నిజం చెప్పాలంటే ఈ బంద్ రోజుల్లో ప్రేక్షకులు ఈ ఖర్చులు లేకుండా ప్రశాంతంగా ఉన్నారు. సినిమా పిచ్చోళ్ళు హాయిగా టీవీముందు కూర్చుని వచ్చే సినిమాలతో కాలక్షేపం చేశారు! ఇంకా ధరలు పెంచుకుంటూ పోతే అనధికారంగా ఈ బంద్ కొనసాగుతూ ఉంటుంది. సినిమా వర్గాలవారు ప్రేక్షకుల్ని థియేటర్లకు వచ్చే విధంగా చేయాలి కాని పారిపోయేలా కాదు. కొత్త సినిమా విడుదలనుండి అన్ని క్లాసుల టికెట్ల ధరలు పెంచకుండా అమ్మాలి. అలా చేయకుండా కలెక్షన్లు లేవని బాధపడితే ఉపయోగం లేదు. ప్రేక్షకులే సినిమాలను బంద్ చేస్తే పరిస్థితి ఎలా వుంటుందో ఊహించండి.
-పి.వి.శివప్రసాదరావు, అద్దంకి
కం: శ్రీదేవిని గొని పోవగ
ఏ దేవికి తొందరాయె ఎంతటి ఘోరం
ఏ దేవకన్య ఐనను
శ్రీదేవికి సాటిరాదు చెన్నగు రూపున్
- గొల్లపూడి శివయ్య,
అంగలకుదురు (గుంటూరు జిల్లా)