మీ వ్యూస్

ఓ దిక్సూచిలా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగ అశ్విన్ దర్శకత్వంలో కీర్తిసురేష్ ప్రధాన పాత్రధారిగా వచ్చిన అలనాటి మేటి నటి ‘సావిత్రి’ బయోపిక్ ‘మహానటి’ ఆద్యంతం దృవ్యకావ్యంలా అనిపించింది. బయోపిక్ చిత్రాలు తీయాలంటే ఈ చిత్రం ఓ దిక్సూచిలా పనిచేస్తుందనడంలో సందేహం లేదు. చిత్రంలో కీర్తిసురేష్ నటన చూస్తే సావిత్రే దిగివచ్చి నటించిందా? అనిపించింది. కీర్తిసురేష్‌కు ఈ చిత్రానికి తప్పకుండా జాతీయ అవార్డు వస్తుందనిపించింది. జెమినీ గణేషన్‌గా నటించిన దుల్కర్ సల్మాన్ కూడా మంచి నటన ప్రదర్శించాడు. రాజేంద్రప్రసాద్, మోహన్‌బాబు, క్రిష్, ప్రకాష్‌రాజ్ తదితరులు తమతమ పాత్రలకు న్యాయంచేసారు. విజయ్‌దేవరకొండ, సమంతల ఎపిసోడ్ కృతకంగా ఉన్నా.. వారి పెర్‌ఫార్మెన్స్‌తో ఆ లోటు రానీయలేదు. తెలుపు నలుపు, రంగుల కలయికలతో డేనీ ఫొటోగ్రఫీ మ్యాజిక్ చేసింది. మిక్కీ జే మేయర్ సంగీతంలోని పాటలు, నేపథ్య సంగీతం చాలా బాగుంది. బుర్రా సాయిమాధవ్ మాటలు సినిమాకు ప్రాణం పోశాయి. ఈ బయోపిక్‌ను ధైర్యంగా భారీగా నిర్మించిన స్వప్నదత్, ప్రియాంక దత్‌లను మెచ్చుకోవాల్సిందే. ఆఖరిగా ‘సావిత్రి’ని గూర్చి సరిగా తెలియని ఈతరంతో పాటు మరికొన్ని తరాలవరకూ సావిత్రిని మరచిపోని విధంగా ఎటువంటి లోటుపాట్లులేకుండా ‘మహానటి’ని తీర్చిదిద్దిన దర్శకుడు నాగ అశ్విన్ అన్నివిధాలా అభినందనీయుడు. హేట్సాఫ్ టూ నాగ అశ్విన్.

-కొవ్వూరి జగా శ్రీనివాసరెడ్డి, కొంకుదురు, తూ.గో.జిల్లా.

మూడొంతులు ప్లాపులే!

ఈమధ్య కాలంలో సినిమాలు తీసేవాళ్ళు ఎక్కువయ్యారు, సినిమాలు ఎక్కువయ్యాయి. మూడొంతులు ప్లాపులే. ‘బాహుబలి’ తర్వాత అంతటి పేరు ‘మహానటి’కి వచ్చింది. ఇప్పటి నిర్మాతలు ఎందుకు సినిమాలు తీస్తున్నారు. కొందరయితే అడ్డగోలుగా సంపాదించిన డబ్బు ఖర్చయితే ఏమిలే అని, కొందరు పరిశ్రమలలో సంపాదించిన సొమ్ము, ముఖ్యంగా నల్ల డబ్బుని తెల్లడబ్బుగా మార్చుకొనుటకు సినిమా మాధ్యమంగా పెట్టుకొని సినిమా హిట్ అయినా ఫట్ అయినా మూస ధోరణిలో తీసేస్తున్నారు. ఏ హాల్లోను ఒక సినిమా 50 రోజులు ఆడిన పాపాన పోలేదు. సినిమాహాళ్లు పెరుగుతున్నాయి. రోజూ ఓ సినిమా విడుదలవుతోంది. రంగస్థలం, భరత్ అనే నేను, మహానటి లాంటి సినిమాలు ఎందుకు తీయలేరు?

-కె.వి.యస్.యన్.మూర్తి, విశాఖపట్నం

నేరచరితులకు బయోపిక్‌లా?

ఇప్పటివరకు మహోన్నత వ్యక్తిత్వం గల ప్రముఖులు, సెలబ్రిటీలు, క్రీడారంగానికి చెందినవారి జీవిత చరిత్రలను బయోపిక్‌లుగా తీసారు. ఈ బయోపిక్‌లను రూపొందించేటప్పుడు కొంత నాటకీయత, కల్పనలు జోడించినా వారి వ్యక్తిత్వానికి భంగం కలగకుండా, వారి జీవితాలను సాధ్యమైనంత సహజంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగింది. అయితే తొలిసారిగా తన జీవితంలోవున్న భయంకరమైన చీకటికోణాలను కప్పిపుచ్చి, మకిలి వ్యక్తిత్వం వున్న ఒక వ్యక్తిని ఒక మంచి మనిషిగా చిత్రీకరించి అతడి చీకటి జీవితానికి సమాజంలో ఒక వర్గం మరియు మీడియాయే ప్రధానంగా కారకులని చూపించే ప్రయత్నం సంజూ సినిమాలో జరిగింది. ఈ సినిమాకు అధికారికంగా రచయిత రాజ్‌కుమార్ హిరానీయే అయినా, అనధికార రచయిత సంజయ్‌దత్ అనిపించక మానదు. తానుచేసిన ప్రతీ తప్పుకు, సంఘ విద్రోహకర చర్యలకు అతనిది తప్ప ఇతరులే కారణమని చూపించారు. పనె్నండేళ్ల జైలుశిక్షకూడా న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించిన దొంగ సాక్ష్యాలు అని చెబుతారు. క్రమశిక్షణను అలవరచిన తల్లిదండ్రుల కారణంగా, ఒక వ్యాపారిచిత వ్యక్తి స్నేహితుడిలా దగ్గరయ్యి సరదాగా అలవాటుచేస్తే అతగాడు మత్తుపదార్థాలకు అలవాటుపడినట్లు, మత సంఘర్షణల సమయంలో తన కుటుంబాన్ని రక్షణ కల్పించేందుకు ఉగ్రవాదులు వాడే ఆయుధాలను ఇంట్లోపెట్టినట్లు వాస్తవాలను దారణంగా వక్రీకరించి ప్రజల చెవుల్లో పూలుపెట్టేందుకు చేసిన ఒక వ్యర్థ ప్రయత్నం సంజు సినిమా. మూడువందల మంది అమ్మాయిలతో శృంగారం నెరపిన ఈ ప్రబుద్ధుడిని జస్ట్ ఫర్ ఫన్ అంటూ సనాతన భారతీయ సత్సంప్రదాయాలకు, పవిత్రమైన వైవాహిక వ్యవస్థకు ఆలవాలమైన ఈ పుణ్య భారతావనిలో స్ర్తిపురుష సంబంధాలను అతి నీచానికి దిగజార్చిన ఒక వ్యక్తిత్వం లేని హీనచరితుడికి బయోపిక్ తీయడం, అది మన భారతీయ ప్రేక్షకులు చూడాల్సిరావడం నిజంగా మన దౌర్భాగ్యం.. సంజయ్‌దత్‌లోని వ్యక్తిత్వ లోపాలు, బలహీనతలను హాస్యంతో మిళితంచేసి వాటిని కప్పిపుచ్చే ప్రయత్నం జరిగింది. నిజానిజాలను పక్కనపెట్టి, తమకు నచ్చిన విధంగా అతనిని తప్ప ఈ ప్రపంచాన్ని ఆఖరుకు ఈ దేవుడినికూడా బాధ్యులను చేసేసి, అతగాడికి సంజయ్‌దత్‌కు క్లీన్ చిట్ ఇచ్చి, వాస్తవాలకు మసిపూసి మారేడుకాయచేసే ప్రయత్నమే ఈ సినిమా. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌అయ్యింది. కాబట్టి ఘోరమైన హత్యలు, మానభంగాలు చేసి జైళ్ళలో మగ్గుతున్నవారు, వేల కోట్లు నొక్కేసి విదేశాలకు పారిపోయినవారు. దేశాన్ని, ప్రజాసంపదను అడ్డగోలుగా దోచినవారు తాము సచ్ఛరిత్రులమంటూ కొత్త బయోపిక్‌లతో భారతీయ ప్రేక్షకుల ముందుకు వస్తారేమో?

-ఎం.కనకదుర్గ, తెనాలి