మీ వ్యూస్

అతి పొగడ్తలు ఎవరూ నమ్మరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రభూమి వెనె్నల సమీక్షలో ‘విజేతకాదు పరాజితుడు’ అంటూ హీరో నటన ఇంకా మెరుగుపడాల్సి ఉందన్నారు. అయితే అల్లుడ్ని పొగడాల్సిన అవసరం ఉన్న చిరంజీవి ‘ఇది ఎడ్యుకేటివ్ ఫిలిం. కళ్యాణ్‌దేవ్ ఎక్కడా బెదురులేకుండా పరిణితితో సెటిల్డ్‌గా నటించాడు’అని దండోరావేస్తే అల్లు అర్జున్ కూడా తనవంతు పొగడ్తలు గుప్పించాడు. ఆయనకు విజేత బాగా నచ్చిందట. ‘క్లయమాక్స్ ఎంత అద్భుతంగా ఉందంటే సినిమా పూర్తయినా నేను సీటు లోంచి లేవలేకపోయాను’అంటూ డబ్బా మోగించాడు. అతి పొగడ్తలు ఎవరూ నమ్మరు. నవ్వుకుంటారు అతిగా పొగిడి పరువుపోగొట్టుకోకండి డబ్బారాయుళ్లూ!

- మైథిలి, సర్పవరం

రియల్ హీరో!

చిత్రరంగం అనగానే అనేక శాఖలు, వాటికి సంబంధించిన సంఘాలు ఉంటాయి. ఒకసారి అధ్యక్షుడు, కార్యదర్శిలాంటి పదవులకు ఎన్నికైన వారు రాజకీయ నాయకుల్లాగానే పెద్దగా పనిచేయరు. కాని హీరో విశాల్ మాత్రం వారికి భిన్నంగా ఒక సంఘ అధ్యక్షుడుగా మనసుపెట్టి తనవంతు సేవచేస్తున్నాడు. రీల్ హీరోనే కాదు రియల్ హీరో అనిపించుకుంటున్నాడు. అతని వల్లనే సినిమాలు వరుసక్రమంలో సెన్సార్ అవుతున్నాయి. రజనీకాంత్ సినిమా ‘కాలా’ కూడా క్యూలోనే రావలసి వచ్చింది. అంతేకాదు ఆ చిత్రం విడుదలైన మొదటిరోజే యూట్యూబ్‌లో కొంత భాగం వచ్చేసింది. ఆ చిత్ర నిర్మాతతో కలిసి విశాల్ వెంటనే సైబర్ క్రైమ్‌శాఖకు వెళ్లి రిపోర్ట్‌చేశాడు. అతని పనితీరుని అందరూ మెచ్చుకుంటున్నారు.

- ప్రభాస్, గాంధీనగర్

చెత్త సినిమా!

వరుస ఫ్లాపు సినిమాలతో పరాజయాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన రామ్‌గోపాల్‌వర్మతో నాగార్జున మళ్లీ జతకట్టడం ఎనిమిదో ప్రపంచపు వింతగా అందరూ భావించారు. దానికి తగ్గట్టుగానే ఒక సన్నివేశానికి, మరొకదానికి సంబంధం లేకుండా, టెక్నికల్ స్టాండర్డ్స్ పేరిట తెరపై చూసే విజువల్ అర్ధంకాకుండా ఇష్టారాజ్యంగా కెమెరాలను తిప్పుతూ, చెవులు చిల్లులుపడే సౌండ్ ఎఫెక్ట్‌లతో ప్రేక్షకులకు దిమ్మతిరిగే విధంగా సినిమాను తీసి ప్రేక్షకులకు ‘ఆఫీసర్’ పేరిట మరొక డిజాస్టర్ అందించాడు వర్మ. అసలు నాగార్జున లాంటి అగ్ర హీరోతో సినిమా అంటే స్క్రిప్ట్ ఎంత పకడ్బందీగా వుండాలి? కాని ఈ సినిమాలో సరైన కనెక్టివిటీ లేకుండా ఒక సీను తర్వాత మరొక సీను రాసుకున్నట్లుగా వుంది. ఒకప్పటి సాంకేతిక విలువలకు కొలమానంగా నిలిచిన వర్మనుండి ఆఫీసర్ లాంటి కనీసపు నిర్మాణ విలువలు లేని పిచ్చి సినిమాలు రావడం మన తెలుగుజాతి చేసుకున్న దౌర్భాగ్యం. నాగార్జున వర్మపై అతిగా కాన్ఫిడెన్స్ పెట్టుకొని, కెరీర్‌లోనే అత్యంతపు చెత్త సినిమాను జతచేసుకోవడం దురదృష్టకరం.

- సి.ప్రతాప్, శ్రీకాకుళం

ఎవరైనా రిసెర్చ్ చేస్తే..

మినిట్‌ని నిమిషం అనడమే తప్పు అని నేను అన్నందుకు ఒప్పు ఏమిటో చెప్పమన్నారు. బ్లేడ్, రేజర్, బ్రష్ ఇలా లక్షలాది పదాలకు తెలుగు పదాలు లేక ఆంగ్ల పదాలే వాడుతున్నట్టు తెలుగు సమానార్థకం లేని మినిట్‌ని మినిట్ అనడమే మేలు. నిఘంటువు ప్రకారం నిమిషం అంటే రెప్పపాటు కాలం. అందువల్ల మినిట్‌ని నిమిషం అని అనువాదంచేసిన మేధావిదే తప్పు. ‘అవర్’(గంట) అనాల్సిన పదాన్ని ‘హవర్’అనే మేధావులు చాలామంది ఉన్నా తప్పుతప్పే. హవర్ కాదు అవర్ అనాలి. అలాగే మినిట్‌ని చాలామంది ‘నిమిషం’అన్నా అదీ తప్పే. అయినా త్రేతాయుగంలో దేవతలు, మనుషులు తెలుగు మాట్లాడేవారా? అని అడిగితే అదొక పరిశోధనాంశం అవుతుంది. ఎవరైనా రిసెర్చ్ చేస్తే బాగు.
- శుభ, కాకినాడ

‘కాపీ’కళకాబోదు!

‘కాపీ’ కళ కాబోదు వ్యాసం బాగుంది. కాపీరైట్ అంటే కాపీ చేయడం రైటే అని అర్ధం చెప్పుకుంటారు. మనోళ్లు. ఎవరికీ తెలియదులే అనుకుంటూ విదేశీ కథలు, కానె్సప్ట్‌లు, సీన్లు ఎత్తేస్తారు. తీరా ఎవరో ఆ సినిమాకిది కాపీ అంటూ రచ్చచేసేస్తారు. త్రివిక్రమ్ అంతటివాడు మీనా సినిమాని రీమేక్ చేసేసి అమెరికాలో సెటిల్ అయిన రచయిత్రి నోటీస్ పంపితే టైటిల్స్‌లో చూపించాం. కాని ఎలాగో ఆ కార్డు మిస్ అయిందని చెప్పుకున్నాడు! మదరిండియా లాంటి కళాఖండం నిర్మించిన మెహబూబ్ ‘సన్ ఆఫ్ ఇండియా’ అని మరో సినిమా తీశాడు. అది పూర్తిగా మన ‘బాలనాగమ్మ’ జానపద చిత్రానికి సాంఘిక రూపం!

- హితీక్ష, రమణయ్యపేట

చైతన్య వికాసం కోసం..

నేటి సమాజంలో సమాజ చైతన్యంకోసం సినిమాలు రావాలి. ఇటీవలే విడుదల అయిన ‘అభిమన్యుడు’ చిత్రం ద్వారా సైబర్‌క్రైమ్, సెల్ ద్వారా చేసే మోసాలు చక్కగా విశదీకరించారు. అలా చైతన్యవంతమైన తెలుగు సినిమాలకెప్పుడూ ఆదరణ వుంటుంది అన్న విషయం గుర్తుంచుకోవాలి. ‘అభిమన్యుడు’ అన్నివిధాలా బావుంది. సమాజ చైతన్య వికాసంకోసం విజ్ఞాన చిత్రాలు నిర్మించాలి.
- ఎల్.ప్రపుల్లచంద్ర, ధర్మవరం