మీ వ్యూస్

క్రెడిట్ దర్శకుడిదే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథ లేకున్నా కథనంతో ప్రేక్షకులను సీనిమాలో లీనంచేసిన ఘనత గీత గోవిందం దర్శకుడు పరశురామ్‌కు దక్కుతుంది. ఇలాంటి సినిమాలు అడపాదడపా వస్తున్నాయి. హ్యాపీడేస్, కొత్తబంగారులోకం తదితర సినిమాలు ఈ కోవలోకే వస్తాయి. ఈ సినిమాల క్రెడిట్ అంతా సినిమా దర్శకుడికే చెందుతుంది. కథలు లేవు అనే వర్ధమాన దర్శకులు ఇలాంటి సినిమాలు చూసి నేర్చుకోవలసింది ఎంతో ఉంటుంది. ఇక గీతగోవిందం సినిమా మంచిచెడ్డలకు వస్తే యువతకు నచ్చేవిధంగా తక్కువ కథలో వినోదాత్మకంగా ఎక్కువ ట్విస్టులులేకుండా లవ్‌స్టోరీ నడిపించాడు. సంభాషణలు సహజంగా ఫన్నీగాఉన్నాయి. వెకిలికిపోకుండా సున్నితమైన సంభాషణలతో హాస్యం అందించాడు. కొన్ని సంభాషణలు తెలంగాణ యాసలో ఫిదా సినిమాను గుర్తుకుతెస్తాయి. మొత్తంమీద దర్శకుడు ప్రేక్షకుల నాడిని బాగా పసిగట్టి సినిమాలో వారికి అవసరమైన కంటెంట్‌ను బాగా కుదించి అందించాడు. హీరోయిన్ రష్మిక చాలా అందంగా ఉంది. విజయ్ దేవరకొండ ముఖంలో హావభావాలు పలికించడంలో మరింత పరిణతి ప్రదర్శించాలి. వెనె్నలకిశోర్ పెళ్ళికొడుకు పాత్రలకు బాగా నప్పుతున్నాడు. అలాగే గిరిబాబు కూడా ఈమధ్య సంభాషణలు లేని (ఉన్నా అతి తక్కువ) వృద్ధ పాత్రల్లో కనిపిస్తున్నాడు.

- జి.అశోక్, గోదూర్

తస్మాత్ జాగ్రత్త!

విజయపథంలో మంచి రైజ్‌మీద ఉన్నాడు విజయ్ దేవరకొండ. కాని ఇదే అతని కెరియర్‌లో అతి ముఖ్యమైన జంక్షన్. ఇప్పుడు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఉన్నతస్థాయికి చేరుకుంటాడు. ఏమాత్రం నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే అధఃపాతాళంలో పడిపోతాడు. ఈ పరిస్థితిలో డబ్బు వచ్చిపడుతుంది. చుట్టూ స్నేహితులుచేరి రకరకాల దిక్కుల్లో లాగుతుంటారు. డబ్బు, విజయం కలిగించే మత్తుకు మద్యం, మగువల మత్తుచేరితే పతనం తప్పదు. గతంలో హరనాథ్ మంచి రైజ్‌లో ఉండేవాడు. ఎన్టీఆర్ అతనికి రాముని వేషం ఇచ్చి ప్రోత్సహించాడు. జమున, హరనాథ్ హిట్ పెయిర్‌గా వెలుగొందారు. హఠాత్తుగా అతన్ని మత్తు ఆవహించి పాతాళంలో పడ్డాడు. తస్మాత్ జాగ్రత్త.

- సుభాష్, శ్రీనగర్

ఆలోచింపజేశాయి..

భేషజాలు లేని నటుడు నాగార్జున. ఇటీవల ‘గూఢచారి’ చిత్ర విజయోత్సవంలో చెప్పిన విషయాలు నిజంగా ఆలోచింపజేశాయి. కొత్త జనరేషన్ నటీనటులు, టెక్నీషియన్లు- మీరే తెలుగు సినిమా భవిష్యత్తు మీతో నేను ప్రయాణంచేయాలి. లేకుంటే వెనుకబడిపోతాను. గూఢచారి సినిమా చూస్తున్నంతసేపు ఇంత తక్కువ బడ్జెట్‌తో టెక్నికల్‌గా సూపర్ సినిమా తీయడం చూసి షాక్‌అయ్యాను. పెద్ద కెమేరాలతో భారీ బడ్జెట్‌తో మేము చేసే సినిమాస్థాయిలో ఉంది గూఢచారి. మేము చేసిన చిత్రాల్ని దీనితో పోల్చితే మేమెంత సోంబేరులమో, ఎంత బద్ధకస్తులమో తెలిసింది. ఇంత తక్కువ ఖర్చుతో మేము చిత్రాలు తియ్యలేము అన్నాడు నిజాయితీగా.

- శాంతిసమీర, వాకలపూడి

బయోపిక్‌ల హవా

బయోపిక్‌ల హవా నడుస్తున్నట్టుంది. కాని ఇవి నిజంగా బయోపిక్‌లు కావు. ఎందుకంటే ఎవరెంత గొప్పవారైనా వారిలోనూ నెగెటివ్ చాయలు బలంగానే ఉంటాయి. జయలలిత జైలుపాలవడం, ఎన్టీఆర్ రెండో పెళ్లివల్ల రాజకీయాల్లో చిక్కుల్లోపడటం, మాచ్ ఫిక్సింగ్ మకిలివల్ల అజహరుద్దీన్, డ్రగ్స్ ఆయుధాలవల్ల సంజయ్‌దత్.. ఇలా చాలా ఉన్నాయి. అయితే అభిమానులు బయోపిక్‌లలో ఈ మచ్చలు కనిపిస్తే నానా రచ్చచేస్తారు. అందుకనే ఇవి కనిపించకుండా రంగులుపూసి వివాదాలు లేని విషయాల్నే హైలైట్ చేస్తారు. పాత నలుపుతెలుపు చిత్రాల్లో పాటలు రంగుల్లో చూపి పార్ట్లీ కలర్డ్ అనేవారు. అలాగే ఇవి బయోపిక్‌లు కావు పార్ట్లీ బయోపిక్‌లు మాత్రమే.

- శుభ, కాకినాడ

కలక్షన్లతో కొలవకూడదు

హీరోలు సఖ్యంగానే ఉంటారు గాని వారి అభిమానులే కలక్షన్ల విషయంలో వివాదాలు సృష్టిస్తూఉంటారు. అసలు సినిమా గొప్పదనాన్ని కలక్షన్లతో కొలవకూడదు. చెత్త సెక్స్ చిత్రం క్లాసికల్ చిత్రంకన్నా ఎక్కువ వసూలు చేయవచ్చుగాని దాని స్థానం సిగ్రేడ్ మాత్రమే. రంగస్థలం, భరత్ అనే నేను చిత్రాల అభిమానులు మా చిత్రానికి వచ్చిన గ్రాస్ మీ చిత్రం కంటే ఎక్కువ అని తగాదాపడ్డారు గాని ఒక నిష్పక్షపాత పత్రిక గత ఆరు నెలల్లో వచ్చిన చిత్రాల్ని సమీక్షిస్తూ భరత్ బయ్యర్స్ కొందరు నష్టపోయారని స్పష్టంచేసింది. నాగార్జున కూడా హిట్ అయిన చిత్రాలను పేర్కొంటూ రంగస్థలంని ఉదహరించాడు గాని భరత్‌ని కాదు.

- మరుదకాశి, కరప

ఇదేం పోయేకాలం?

గత తరం నిర్మాత, దర్శకులు తమ చిత్రం విడుదలకాగానే ప్రేక్షకుల మధ్య కూచుని వారి ప్రతిస్పందనలు గమనించి తమ లోపాలు సవరించుకొనేవారు. ప్రఖ్యాత దర్శకుడు బి.యన్.రెడ్డి ‘రాజమకుటం’ చిత్రంపై ప్రజాభిప్రాయం తెలుసుకోడానికి బెజవాడ థియేటర్‌లో బెంచి క్లాసు ప్రేక్షకుల మధ్య కూచున్నారట. ఫైటింగ్ సీను రాగానే పక్కనున్న ప్రేక్షకుడు ‘‘బియన్‌కి ఇదేం పోయేకాలం? ఫైటింగులు పెట్టాడు’’ అన్నాడట. అంతే. అవమానభారంతో ఆయన బయటకు వెళ్లిపోయి టూర్‌ప్రోగ్రాం కాన్సిల్ చేసుకొని మద్రాసుకి వెళ్లిపోయారట. తర్వాత ఆయన జానపద చిత్రాలే తియ్యలేదు.

- శాండో ప్రచండ్, శ్రీనగర్