మీ వ్యూస్

అదీ విషయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అజ్ఞాతవాసి అపజయం తరువాత విజయం కోసం త్రివిక్రం సర్వశక్తులొడ్డిన చిత్రం అరవింద సమేత. అనుభవం లేని ఫ్యాక్షన్ జోనర్‌లోకి అడుగుపెట్టాడు. సినిమా అతుకుల బొంత. త్రివిక్రమ్ మార్క్ సహజత్వం నిల్. పైగా తెలుగు ప్రేక్షకులను హింసించి కసి తీర్చుకున్న పగా ప్రతీకారాల జానర్. అతి హీరోయిజంతో ఇప్పటికే విసుగెత్తిన ప్రేక్షకుడిని తట్టిలేపి వెగటు పుట్టించిన చిత్రమిది. తమన్ నేపథ్య సంగీతం ఒక్కటే రిలీఫ్. పూజాహెగ్దె తెలుగు డబ్బింగ్ దారుణం. వెరసి రెండున్నర గంటల సాగదీత. విదేశీ చిత్రాన్ని మక్కీకి మక్కీ కాపీ కొట్టి అజ్ఞాతవాసి తీసి అప్రదిష్ట సంపాదించిన త్రివిక్రమ్, ఈసారి రాయలసీమలోని వర్ధమాన రచయిత ‘మొండి కత్తి’ని అంతే చమత్కారంగా లేపేశాడన్న కథనాలు చదువుతుంటే ‘సక్సెస్‌కు సూత్రమిదా’ అన్న సందిగ్దం కలుగుతోంది.
-సిహెచ్ ప్రతాప్, శ్రీకాకుళం

మసాలా వేరంతే..
తెలుగు, తమిళ చిత్ర రంగాల్లో రాజకీయ చిత్రాలపై ఆసక్తి పెరిగినా ఆ చిత్రాలతో ఒక ఇబ్బంది ఉంది. అన్ని చిత్రాల్లోనూ థీమ్ ఒక్కటే ఉంటుంది. మసాలాలు మారుతుంటాయి. నటించే నటీనటులు మారుతుంటారు. వారి అభిమానులే అలాంటి చిత్రాలను విజయవంతం చేస్తుంటారు. అభిమానుల వల్ల హిట్ అయిన చిత్రం మళ్లీమళ్లీ ప్రదర్శించడానికి పనికిరాదు. స్టార్ హీరోలు కూడా ఒకటిరెండు రాజకీయ చిత్రాల్లో నటిస్తారు తప్ప ఎక్కువ చిత్రాలు చెయ్యరు. మండలాధీశుడు హిట్ అయిందికదాని మళ్లీ ఆయనతోనే లేక ఇతరులతో అలాంటి చిత్రాలుతీస్తే అవి ఫ్లాప్ అయ్యాయి. వినోద చిత్రాలకున్న డిమాండ్ రాజకీయ చిత్రాలకుండదు.
- అభిలాష, సాంబమూర్తినగర్

మారేదెప్పుడు?
అభిమానుల అభిమానం ఒక్కోసారి వికృత రూపం దాల్చుతుంది. గతంలో కృష్ణ కుమార్తె సినిమాల్లోకి రావడాన్ని అభిమానులు అడ్డుకున్నారు. ఎందుకంటే హీరోయిన్ సెక్సీగా రొమాంటిక్‌గా కనిపించాలి. అభిమాన నటుని కుమార్తె అలా కనిపించడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. సమంత, చైతన్య ఒక దీవికి హనీమూన్‌కోసం వెళ్లి ఎంజాయ్‌చేస్తూ ఆ ఫొటోల్ని ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్‌చేసింది సమంత. చిట్టిపొట్టి దుస్తుల్లో సమంత మహాసెక్సీగా కనిపిస్తూ ఉండడంతో అక్కినేని అభిమానులు ఆగ్రహంతో చెలరేగిపోతున్నారు. అక్కినేని కోడలు ఇంత పచ్చిగా పోజులివ్వడమా అని ఘాటుగా విమర్శిస్తున్నారు. ఆమె భర్త, అక్కినేని కుటుంబం, సాక్షాత్తు సమంతా ఆ వ్యాఖ్యల్ని పట్టించుకోలేదు. కందకు లేని దురద కత్తిపీటకెందుకు?
- సత్య, కరప

బావుంటాయ సరే..!
ఎంతోకాలంగా ఎంతో ‘ఇది’గా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తే అప్పుడప్పుడు దర్శనం ఇచ్చే జీవితానికి దర్పణం లాంటి, బతుకుకి అర్ధం చెప్పేలాంటి చిత్రాలు వస్తుంటాయని చెప్పిన వ్యాసం బాగుంది. ఇలాంటి చిత్రాలకు అవార్డులు రావచ్చు. విమర్శకులు మెచ్చుకోవచ్చు. కాని అసలు విషయం- డబ్బులు రావు. జీవితంలోని బాధలు, సమస్యలు మరిచిపోడానికి డబ్బులు ఖర్చుపెట్టి సినిమాకెళ్తే అక్కడా తమ జీవిత సమస్యలే ప్రత్యక్షమయితే చాలామంది తట్టుకోలేరు. విమర్శకులు ఎంతగానో మెచ్చుకున్న బాటసారి, చివరకు మిగిలేది, ఈమధ్య వచ్చిన డబ్బింగ్ చిత్రం కర్తవ్యం లాంటి చిత్రాలు బాక్సాఫీసువద్ద ఢమాల్‌మన్నాయి. బిచ్చగాడు, రఘువరన్ లాంటి ఒకటి రెండు చిత్రాలు విజయం సాధించినా చాలా చిత్రాల గతి కలక్షన్-నిల్!
- ధర్మతేజ, గొడారిగుంట

వ్యాసం బావుంది
‘రివ్యూలలో రిస్కెంత?’ వ్యాసం బాగుంది. ఈ డిజిటల్ యుగంలో రివ్యూలను అడ్డుకోవడం సాధ్యంకాదు, నిజానికి నెట్ రివ్యూలవల్ల జనం ప్రభావితం అవుతారనుకోడానికి రుజువులు లేవు. ఎందుకంటే ప్రతి ప్రేక్షకునిలో ఒక విమర్శకుడు ఉంటాడు. ఇతరుల రివ్యూలతో సంబంధం లేకుండా ఎవరి మటుకువారే నిర్ణయించుకుంటారు. సినిమా చూడాలన్న కాంక్ష ఉండి డబ్బులుంటే చాలు నెగెటివ్ రివ్యూని పట్టించుకోడు. చివరకు ప్రేక్షకుడే న్యాయనిర్ణేత. సినిమాని గొప్పగా పొగిడినా, ఘోరంగా విమర్శించినా సినిమాలో సత్తాఉంటే రివ్యూలు పనిచేయవు.
- పవన్‌పుత్ర, రామారావుపేట

ఎందుకు భరించాలి?
తమిళ హాస్య నటుడు వడివేలు డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగువారినీ మెప్పించాడు. అయితే కీర్తి, విజయం తలకెక్కితే చాలామందికి తలతిక్క నోటి దురుద ప్రారంభమవుతాయి. వడివేలు కూడా తిక్కగా వ్యవహరిస్తూ సెట్స్‌కి ఆలస్యంగా వస్తూండటంతో తమిళ దర్శక నిర్మాతల మండలి అతనిని బ్యాన్ చేసింది. తెలుగులోకూడా ప్రకాశ్‌రాజ్ తిక్కతిక్కగా ప్రవర్తిస్తున్నాడు. దిల్‌రాజు సినిమా ‘హలోగురూ ప్రేమకోసమే’లో ప్రకాశ్‌రాజ్ అనుపమ పరమేశ్వర్‌ని అవమానించి కొన్ని రోజులు గడిచాక సినిమాటోగ్రాఫర్‌పై ఆగ్రహించాడు. తమిళుల మాదిరి మనవాళ్లూ ఆయన్ని బ్యాన్‌చేయించకుండా బతిమాలి, బామాలి నెత్తికెక్కించుకుంటున్నారు- ఎందుకోమరి!
- సంపూర్ణ, సాంబమూర్తినగర్

నాటక రంగానికి గ్రహణం
చిత్ర పరిశ్రమకు పూర్వం తోలుబొమ్మలాట భాగోతం, జానపద నృత్యాలు, పౌరాణిక, రంగస్థల నాటక రంగం, ముఖ్యంగా సురభి కంపెనీవారు నాటక రంగమునకు ప్రాణంపోసిన చిరస్మరణీయులు మిక్కిలినేని రమణమూర్తి, సోమయాజులు, వంగర, సూర్యకాంతం, గోవిందరాజుల సుబ్బారావు, సియస్‌ఆర్ మొ.వారు నాటక రంగంనుండి చిత్రసీమకు అడుగుపెట్టిన నటులు. ఆ నాటక రంగం అనుభవం వారికి ఎంతో యశస్సుతెచ్చింది. కాని నానాటికి నాటక రంగం అడుగంటి చిత్ర పరిశ్రమకు ప్రాధాన్యత ఇచ్చిన నేడు నాటకరంగానికి గ్రహణం పట్టింది.
-కెవి ప్రసాదరావు, కందుకూరు.