మీ వ్యూస్

ఓ మంచి మజిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రేమ విఫలమై దూరమైన అమ్మాయ, అబ్బాయ కొత్త జీవితం మొదలుపెట్టిన తరువాత మళ్లీ ఆ జీవితంలోకి రావడం..లాంటి ఇతివృత్తాలతో తెలుగులో చాలా కథలే వచ్చినప్పటికీ, అలాంటి కథతో మజిలీ చిత్రాన్ని నడిపించిన విధానం చాలా బావుంది. చాలాకాలం తరువాత ఓ మంచి తెలుగు సినిమా చూశామన్న భావన కలిగింది. దర్శకుడు శివ నిర్వాణ కథను నడిపించిన తీరు, ఆయా పాత్రల్లో ముఖ్య పాత్రలు ఒదిగిన విధానం మనసుకు హత్తుకుంది. అటు సంగీతపరంగాను, ఇటు కెమెరా పనితనం పరంగాను మంచి నాణ్యతను చూపించటం మెచ్చదగింది. సినిమా సెకెండాఫ్‌కు ఓ క్షణం ముందొచ్చిన శ్రావణి (సమంత) పాత్రే ఈ చిత్రానికి కర్త, కర్మ, క్రియ అన్న సమీక్షలోని పదాలు అక్షరాలా నిజం. ఈ పాత్రను చాలా అవలీలగా పోషించటం సమంతకే సాధ్యమేమో. సినిమాలో సాధారణ పాత్రే అయనా సమంత అందంగా, నిండుగా కనిపించటం మరింత బావుంది.
-కెవి సమీర, ఘట్‌కేసర్
ఆశ్చర్యం!
ఒక భారతరత్న, భారత కోకిల, ఇండియా నైటింగేల్ ప్రఖ్యాత గాయని, లతామంగేష్కర్‌కి తమిళ నటుడు శివాజీగణేశన్ ఆమెకు ఆహారంలో కోకిల మాంసం వడ్డించడం విడ్డూరం. అంత తప్పు ఆ మహానటుడు ఎలా చేసాడో! కోకిల గొంతుకి పాటపరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. అసలు ఆ పక్షిని వధిస్తారనే విషయమే తెలియనివారికి, ఒక గొప్పనటుడు, దాని మాంసం ఆరగిస్తారని అందులో ఒక అతిథికి అందచేస్తారని ఆదివారం వెనె్నల శీర్షికలో ఇమంది రామారావుగారి ‘ఆనాటి హృదయాల’ద్వారా తెలుసుకుని విచారించాము. అసలు ఈ వ్యాస రచయితకు ఈ విషయం ఇంత విపులంగా ఎలా తెలిసిందోనని ఆశ్చర్యం కలిగింది. కానీ చివరగా ఆ నటుడు మాంసాహారానికి స్వస్తిచెప్పడం, శివాజీ సున్నిత హృదయాన్ని, లతాజీ పట్ల గౌరవాన్ని తెలియజేసింది. ఆసక్తికర సినీ విశేషాలను అందించడంలో ఇమంది గారిది అందెవేసిన చేయి. ఆయన వ్యాసాలు అలరిస్తున్నాయి. ఆంధ్రభూమికి అభినందనలు.
-యంవిఆర్ కుమారి, హైదరాబాద్
వెనె్నల హాయి
ఆంధ్రభూమి అందించే వెనె్నల ఎంతో హాయినిస్తోంది. వారంవారం ఇమంది రామారావు ‘ఆనాటి హృదయాల’, సరయుశేఖర్ అలనాటి ‘నటీనటుల పరిచయం’ ఎంతో ఆకట్టుకొంటున్నాయి. అలాగే నచ్చిన సినిమా నచ్చిన పాట శీర్షికకూడా బాగుంది. కొత్త సినిమాల రివ్యూలు నిష్పక్షపాతంగా.. నిక్కచ్చిగా వుంటున్నాయి. ఫ్లాష్‌బ్యాక్ ఎట్ 50 పేరిట పాత సినిమాల వివరణాత్మకంగా సాగుతున్నాయి. ఫిలింక్విజ్ పాఠకులకెంతో హాయినిస్తున్నాయి. ఇక ముఖ్యంగా ముందు పేజీలో వ్యాసాలు, ఫొటోలు కూడా కలర్‌ఫుల్‌గా చాలా బాగుంటున్నాయి. నాటికీ, నేటికీ, ఏనాటికైనా ఆంధ్రభూమికి ఏదిసాటి లేదు. రాదన్నది అక్షర సత్యం. అభిమాన పాఠకాదరణతో మరింత ఉన్నత శిఖరాలకు చేరాలని.. అభిమాన పాఠకుడిగా మా ఆశ. ప్రతి పాఠకుడికి ఆదివారం వచ్చిందంటే ఆరోజు హృదయాల్లో అక్షర వెనె్నల విరబూయడం ఖాయం.
-కె శ్రీనివాసులు, హైదరాబాద్
పెరుమాళ్లు పెరుమాళ్లే
నటనలో లీనమై ఆ పాత్ర ఔన్నత్యం చాటిచెప్పిన నటుడు పెరుమాళ్ళు. వీరు తండ్రిగా, తమ్మునిగా, చిననాన్నగా నటించిన గొప్ప క్యారెక్టర్ నటుడు ఆడపెత్తనం చిత్రంలో (అంజలి) తండ్రిగా, కలసివుంటే కలదుసుఖం చిత్రంలో యస్.వి.రంగారావు తమ్మునిగా నటించి ఆ పాత్రకు గొప్ప బలం చేకూర్చారు. అలాగే వరకట్నం చిత్రంలో ఓ తండ్రిగా నటించి కూతురు యింటికి వచ్చి వియ్యంకురాలి చేత అవమానపడి ప్రేక్షకుల కంట తడిపెట్టించిన పెరుమాళ్ళు చిరస్మరణీయులు!
అప్పట్లో అలా..!
ప్రకృతి సహజసిద్ధమైన స్ర్తిజన్మకు ఋతుక్రమ క్రియ సహజసిద్ధమైనది! అయినా అప్పటి గృహిణులు, నియమకాల రీతిని అనుసరించి ఇంటికి దూరంగా సనాతన పద్ధతులు తప్పక ఆచరించేది! అలాగే చిత్రసీమలో కూడ స్ర్తిలు కొంతమంది నటీమణులు అది ఎంత ఆదాయమైనా కళామతల్లికి అశుచి లేకుండా ఆ సమయంలో నటించకుండా వుండే పద్ధతి అనుసరించడం గొప్ప విశేషం. కాని ఇప్పుడో ఆ కాల నియమ పద్ధతిని ఆచరించకుండా ఇప్పటి నటీమణులు నటించడం కళామతల్లిని కించపరచడమే అనిపిస్తుంది. ఏదైనా భారతీయ సంప్రదాయ నియమావళి అనుసరించడం మన ధర్మంకాదా?
-కెవి ప్రసాదరావు, కందుకూరు
భలేగుంది..!
గతవారం నటి రమాప్రభ జీవితంలోని ఓ ముఖ్య ఘట్టాన్ని ఆనాటి హృదయాల శీర్షికన అందించటం భలేగుంది. అనుకున్నామని జరగవు కొన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని.. జీవించటమే మనిషిపని -అంటూ ఓ సినీ కవి రాసిన పాట గుర్తుకొచ్చింది కథనం చదివిన తరువాత. వద్దు వద్దంటూనే సినిమా మొదలుపెట్టి అప్పులపాలైన రమాప్రభ, ఆమె బంధువర్గం.. చివరకు అదే అప్పుల అప్పారావు చిత్రంతో అప్పులన్నీ తీర్చేసి మిగులులోకి రావడం భలే తమాషా అనిపించింది. రచయత ఇమంది రామారావు అందిస్తున్న పాత జ్ఞాపకాలు, ముచ్చట్లు చాలా బావుంటున్నాయ. వారం వారం ఆసక్తికంగా సాగుతున్న ఇలాంటి కథనాలు అందిస్తున్న ఆంధ్రభూమి వెనె్నల బృందానికి అభినందనలు. ఇక ఝాన్సీలాంటి ఆర్టిస్టుల కోసం సినిమాలే నటిస్తుంటాయని, ఫలానా పాత్రకు ఆమె తప్ప మరెవ్వరూ ఇమడలేరంటూ మారాం చేస్తుంటాయంటూ సరయు శేఖర్ రాసిన కథనం భేష్. దర్శకుడో, నిర్మాతో తప్పనిసరి పరిస్థితుల్లో సినిమాను సంతృప్తిపర్చటానికి ఆమెనే తీసుకోవాల్సి వస్తుంటుందని అంటూనే, బహుశ శంకరాభరణంలో -ఝాన్సీని ఎంపిక చేసుకోవడంలో కళాతపస్వి విశ్వనాథ్ కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొని ఉండాలన్న రచయత ఎక్స్‌ప్రెషన్ భలే అనిపించింది. ఇలాంటి కథనాలు మరిన్ని వెనె్నల పాఠకులకు అందిస్తారని ఆశిస్తూ..
-బాల శ్రీకాంతరావు, పెనుమంట్ర