మీ వ్యూస్

సీతమ్మగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గీతాంజలిని తొలిసారిగా సీతమ్మ పాత్రలోనే చూశాం. ఆ తరువాత కథానాయికగా, వాంప్‌గా, రెండో కథానాయికగా, ముఖ్యంగా అక్కినేని చెల్లెలిగా ఆమె నటించిన ప్రతి పాత్ర వైవిధ్యమే. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆమె సినిమాలన్నీ అద్భుతం. ముఖ్యంగా ఏ పాత్రలో నృత్యం అయినా సరే అద్భుతంగా చేసి మెప్పించగల నటి గీతాంజలి. ఆమె తెలుగు ప్రేక్షకులను వదిలి దూర తీరాలకు వెళ్లడం, పాత సినిమా ప్రేక్షకులకు బాధాకరం. ఆమె ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటున్నాను.
-రమ్య లాహిరి, కడవకుదురు
భలే హీరోలు..
ఈవారం చర్చించిన హీరోల వరస సరికొత్తగా వుంది. నిర్మాతలను పట్టుకొని ఓ పాత్ర ఇవ్వండి అని దేబిరించే హీరోలు, తామే దర్శక నిర్మాతలకు సినీ నటులుగా అవకాశం ఇవ్వడం అనేది ఓ కొత్త పోకడే. రోజురోజుకూ తెలుగు చిత్ర పరిశ్రమ కొత్త పోకడలు పోతుంది అనడానికి ఇది కూడా ఓ నిదర్శనం. గతంలో కూడా సినీ నటులు సినిమాలు తీసిన ఉదాహరణలు ఉన్నాయి. కానీ ఆయా దర్శక నిర్మాతలకు అవకాశలిచ్చిన మాట మాత్రం లేదు. అందుకే డామిట్ కథ అడ్డం తిరిగిందిరా అని మరోసారి సినీ పరిశ్రమ గురించి చెప్పుకోవాలేమో!
-చిన్న తంబి, సూళ్ళూరుపేట
కాలుమ్ము మారిందోయ్
మరో రెండేళ్లవరకు దేవరకొండతో నటించనని రష్మిక ప్రకటించడం ఆశ్చర్యం కాదు. ఎందుకంటే, ఆ జంటమధ్య బాగా కెమిస్ట్రీ కుదరడానికి కారణం వారి మధ్య రహస్య లింక్ వుందని మీడియా కోడై కూసింది. ఆమె తల్లిదండ్రులు బాధపడడంవల్లనే ఆమె ఈ నిర్ణియం తీసుకుందని అభిమానులు నమ్ముతున్నారు. ఆమె చెప్పిన కారణం ఒకే హీరోతో రెండుసార్లు నటించేసరికి ప్రేక్షకులకు బోరు కొట్టి రెండో సినిమా ఫ్లాప్ అయింది అని. ఒకరితోనే పలుమార్లు నటిస్తే నాకు కూడా బోరే అంది. అలనాడు అంజలి, సావిత్రి, జమున, కృష్ణకుమారి, బి.సరోజాదేవి లాంటివారు ఒక్కొక్క హీరోతో 10, 12సార్లు నటించినా ప్రేక్షకులకు బోర్ కొట్టలేదు ఎందుకనో మరి? ఎందుకంటే ఇప్పటి హీరోయిన్లకు ఎవరైనా ఒక్కసారి చాలు.. అంతే. మరో కొత్త హీరో కావాలి. హీరోలు కూడా అలాగే ఉన్నారులే...
-శాండో ప్రచండ్, శ్రీనగర్
అందుకా.. సోషల్ వేదిక
సామాజిక స్పృహ వున్న మాధ్యమంలో మనవాళ్లు గొప్పలు చెప్పుకోవడానికి దుర్వినియోగం చేస్తున్నారు. పొద్దున తిన్న టిఫిన్ దగ్గరనుంచి తాను కొన్న కారు వరకూ అన్నీ ఫొటోలతో సహా పోస్ట్ చేసి బడాయిలు చాటుకుంటున్నారు. ఇలా లేనిపోని గొప్పలకుపోవడం మన సంప్రదాయం కాదు. మన పెద్దలు ఎంత సంపద వున్నా, డాబులకు పోకుండా గుంభనంగా ఉండేవారు అని చెప్పుకొచ్చింది నటి రీచా చద్దా. అయితే ఈ మేటర్‌కి జత చేసిన ఫొటోలలో ఆమె బికినీలాంటి డ్రెస్ ధరించింది. ఆమె ధరించిన డ్రెస్ చాలా ఎబ్బెట్టుగా వుండి ఓ రకంగా నగ్నత్వాన్ని చాటాయి. ఇలా శరీరాన్ని ప్రదర్శించడం మన సంప్రదాయమా రీచా?
-వి.చంద్రిక, రాజేంద్రనగర్
సమీక్షలు సూపర్
వెనె్నల్లో వస్తున్న చిత్ర సమీక్షలకు మేం అభిమానులం. ఈ వారం వచ్చిన ఆత్మ లేని ఆవిరి, చెప్పడానికేముంది సినిమాలకు నిజంగా ఇవే టైటిల్స్ అయితే బాగుండేమో అన్నట్లుగా సమీక్షలు ఉన్నాయి. సమీక్షలు చూస్తే చాలు సినిమా కళ్లముందు కదలాడినట్లే ఉంటుంది. అందుకే ప్రతివారం ఆంధ్రభూమి వెనె్నల రాగానే చదివేది చిత్ర సమీక్షలే. రివ్యూలు వ్రాస్తున్న వారికి అభినందనలు.
-ఎం.వెంకటేశ్వరరావు, పలాస
ఇద్దరిదీ విషాదమే
1955 సంవత్సరంలో విడుదలైన విజయావారి మిస్సమ్మ చిత్రంలో మేరీ పాత్రలో సావిత్రి నటించి ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. అలాగే హిందీ మిస్సమ్మ చిత్రంలో మీనాకుమారి ఆ పాత్రలో జీవించి నెంబర్‌వన్ స్థానానికెదిగింది. అయితే వీరిద్దరి జీవితంలో విధి విషాదం నింపింది. ఇద్దరూ మద్యపానానికి బానిసయ్యారు. హీరో డామినేటెడ్ పాత్రలు పోషించే సత్తా వున్నా అక్కడికక్కడికే వొదిగిపోయారు. చివరికి ఎవరూ చెయ్యి ఇచ్చి ఆదుకునే పరిస్థితిలేక దూరమయ్యారు. నిజంగా విధి ఇద్దరినీ ఒకేలా పెంచి పోషించి విషాదం నింపి దూరం చేసింది!
-కెవిపి, కందుకూరు
హఠాత్తుగా ఏంటీ ప్రేమ
ప్రేమ ఉప్పొంగిన కింగ్ ఆఫ్ ది హిల్ ‘సేవ్ నల్లమల’అని అరవగా మనం ఏం తక్కువ అనుకొని మరికొన్ని గొంతుకలు లేచాయి. పర్యావరణం పట్ల నటీనటుల ప్రేమ మంచిదే. అయితే వీరు ఏ రంగంలో భాగమో ఆ రంగంలోని కుళ్లుపై దృష్టిపెట్టి గళం ఎత్తితే మరింత బాగుండేది. ఇప్పుడు సినిమాల్లో హీరో ఇమేజ్ ఎలా ఉంది. తేనె పట్టులా గడ్డం పెంచి అతి క్రూరంగా నికృష్టంగా కనిపిస్తూ ఫ్యాక్టరీ పొగగొట్టంలా నోటినుంచి పొగ వదులుతూ పరమ వల్గర్‌గా కర్ణకఠోరంగా మాట్లాడుతూ స్ర్తిపట్ల కనీస గౌరవం చూపకుండా ఆమెను కొట్టితిట్టి అదే హీరోయిజం అని చూపిస్తున్నారు. ధూమపానం, మద్యపానం ధారాళంగా చూపిస్తూ తెరమీద చిన్న అక్షరాలతో అవి ఆరోగ్యానికి హానికరం చూపిస్తే బాధ్యత తీరిపోతుందా? అతి పొట్టి దుస్తులతో శృంగార తారల చేత సెక్సీ పాటలు పాడిస్తూ గంతులేయడం సమాజ హితమా? పెచ్చుమీరిన సెక్స్, హింస, వల్గారిటీ చూపిస్తూ సాంస్కృతిక హననంచేయటం లేదూ? పర్యావరణ విఘాతంకన్నా ఈ సాంస్కృతిక విఘాతం తక్కువ ప్రమాదకరం కాదు.
మరి ఈ ప్రమాదంపై నటీనటులు గళం ఎత్తరు ఎందుకని?
-చంపక్, మాధవనగర్