మీ వ్యూస్

అర్జున్.. ఓకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఫేక్’ దందా మూలాలను చర్చించిన చిత్రం -అర్జున్ సురవరం తీసి పారేయతగ్గ సినిమా కాదు. సమీక్షకులు మరీ తగ్గించి రేటింగులు ఇచ్చినా, సినిమా చూసిన తరువాత.. ఇప్పుడొస్తున్న చాలా సినిమాలకంటే బెటర్ అనిపించింది. సమీక్షకులు భిన్నకోణాల్లో సినిమాను సమీక్షించినా -ఆడియన్స్ మాత్రం సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ ఉందా? బోర్ కొట్టకుండా కూర్చోగలిగామా? అన్నది మాత్రమే చూస్తారు. ఆ కోణంలో థియేటర్‌లో కూర్చున్న తరువాత -కథతో ఆడియన్స్‌ని ట్రావెల్ చేయంచటంలో దర్శకుడు టి సంతోష్ కృతకృత్యుడైనట్టే అనిపించింది. ఇక నిఖిల్ నటన, లావణ్య త్రిపాఠీ అందం మెచ్చదగినదిగానే ఉంది. ఇదే చిత్రంతో చాలా సినిమాలు థియేటర్లకు వచ్చినా -అర్జున్ సురవరం మాత్రం ఓకే అనిపించింది.
-పి మల్లిక, అల్లవరం
ఉలుకే!
గతవారం వెనె్నల్లో వచ్చిన కవర కథనం ‘అంత ఉలుకెందుకు?’ ఆలోచింప చేసింది. సినీ దర్శకులు తాము తీసిన చిత్రాలు గొప్పవని అనుకుంటారు. కాకిపిల్ల కాకికి ముద్దేకదా. మిగతావాళ్లు ఎవరైనా సినిమాను విమర్శిస్తే తట్టుకోలేకపోతున్నారు. విమర్శలు, గౌరవాలు సమానంగా స్వీకరించినపుడే వాళ్లు నిజమైన దర్శకులు. సమీక్షలు రాసేవారిపై సెటైర్లు వేయడం ఇటీవల దర్శకులకు అలవాటుగా మారింది. తాము తీసే చిత్రాల్లో ఎటువంటి స్టామినా లేకపోయినా.. దాన్ని ఎత్తిచూపే విమర్శకులను మాత్రం ఆడిపోసుకోడానికి స్టామినా వస్తోంది. ఆరోగ్యకరమైన సినిమాలు తీసినపుడు ఎవ్వరైనా మెచ్చుకుంటారు. తప్పుల తడకల కథనాలతో సరైన సన్నివేశాలు లేని చిత్రరాజాలు తీసినపుడు -విమర్శలు తప్పవు. అలాంటి పరిస్థితులనూ ఎదుర్కోగలిగితేనే ముందుకు రావాలి. మేం సినిమాలు తీస్తాం.. ఎవరూ ఏమీ అనకూడదు అనుకుంటే -వాళ్ల ప్రతిభ అక్కడికే పరిమితమవడం తప్పదు.
-వి గరుత్మంతుడు, పేర్నమిట్ట
గండర గండడు
కాంతారావు తొలిసారిగా అనితను కథానాయికగా తీసుకుని రూపొందించిన గండర గండడు అప్పట్లో బాగానే నడిచింది. అనిత తొలిసారి హీరోయిన్‌గా నటించినా -మంచి నటిగా నిరూపించుకుంది. ఆ తరువాత ఆమెకు ఎందుకో అవకాశాలు రాలేదు. అప్పట్లో కత్తి కాంతారావు సినిమాలు అద్భుతంగా ప్రదర్శించేవారు. ప్రేక్షకులు సైతం జానపద చిత్రాలు చూడటానికి బాగా ఇష్టపడేవారు. ముఖ్యంగా విఠలాచార్య సినిమాలు అద్భుతంగా ఆడేవి. నిజంగా అదొక అద్భుతమైన యుగం అనిపిస్తుంది. అయితే -అలాంటి ప్రయత్నానే్న గండర గండడు చిత్రంతో చేసిన కాంతారావు మంచి పేరు, డబ్బు సంపాదించారు. ఆ ఉత్సాహంతో -నిర్మాతగా రెండో ప్రయత్నం చేసి దెబ్బతిన్న విధానం ‘్ఫ్లష్‌బ్యాక్’లో చదివినపుడు ఆశ్చర్యం వేసింది. పాత సినిమా విశేషాలతోపాటు సినిమాయేతర విశేషాలు అందిస్తున్న రచయిత్రి మాణిక్యేశ్వరికి అభినందనలు.
-ఎంవీ సుబ్బారావు, విజయవాడ
నిజంగా విచిత్రాలే
ఆ కాలంలో సినిమాలు నిజంగా చిత్రాలే. అందులో ఎన్నో విచిత్రాలు ఉండేవి. ఈవారం వచ్చిన రమణారెడ్డి నారదపాత్ర కథనం భలే నచ్చింది. ఎంతోమంది నటీనటులు ఈ నారద పాత్రలో పేరు తెచ్చుకున్నారు. కానీ రమణారెడ్డి నారద పాత్ర వేయలేదు. అందుకే పార్వతీ కల్యాణంలో ఆయనను ఆ పాత్ర వరించింది. దర్శక నిర్మాతలు కూడా కొత్తగా ఉంటుందని ప్రయత్నించారు. కానీ రమణారెడ్డి శరీరం నారద పాత్రకు ఏమాత్రం పనికిరాదు. చొక్కా వేయకపోతే ఆయనను ఎవరూ చూసే పరిస్థితి లేదు. అందుకే దర్శకుడు తెలివిగా జుబ్బా తగిలించి నారద పాత్రను రక్తికట్టించారు. అలా జుబ్బా ధరించిన నారదుడు ఏ సినిమాలోనూ కనిపించడు. అదే రమణారెడ్డి స్పెషల్. కోడలు దిద్దిన కాపురం చిత్రంలో సత్యనారాయణ నటించిన బాబా పాత్ర అప్పట్లో సంచలనమే రేపింది. అప్పటికే సత్యసాయిబాబా గురించి చాలామందికి తెలీదు. అయినా సెన్సార్ అడ్డంకులు రావడం, దాంతో అఫిడవిట్ దాఖలు చేసి సర్ట్ఫికెట్ పొదండం ఇటీవల వచ్చిన రావి కొండలరావు వ్యాసంలోనూ చదివాం.
-పీవీ, శృంగవృక్షం
ఇంతేనా..
ఏ తెలుగు సినిమా చూసినా ఏమున్నది వినోదం.. వారంవారం వచ్చే ప్రతి సినిమాలోనూ ఒకటే బాగోతం -అనిపిస్తోంది ఇప్పటి చిత్రాలను చూస్తుంటే. ప్రతివారం నాలుగైదు చిత్రాలు థియేటర్లలో సందడి చేస్తున్నా -గుర్తుపెట్టుకోదగ్గ చిత్రం ఒక్కటీ ఉండటం లేదు. ఆడియన్స్ నిజాయితీగా ఎంజాయ్ చేయగల సినిమా ఈ ఏడాది మొత్తం చూస్తే పట్టుమని నాలుగైదు కూడా కనిపించవేమో. అప్పుడెప్పుడో ఏడాది ఆరంభంలో ఎఫ్-2, ఆ తరువాత మజిలీ, ఆపై జెర్సీ.. బ్రోచేవారెవరురా.. ఇలా వేళ్లపై లెక్కపెట్టతగ్గ చిత్రాలే తప్ప -ఔను నాలుగు పుంజీల సినిమాలు బావున్నాయని చెప్పడానికే కష్టంగా ఉంది. ఇక్కడ చిత్రమేమంటే -విడుదలకు ముందు అన్ని లుక్కులు, టీజర్లు, ట్రైలర్లూ మిలియన్ వ్యూస్‌లు దాటేస్తున్నాయి. సినిమా మాత్రం -బాక్సాఫీసు వద్ద బోర్లాపడుతుంది. ఫ్రీగా టిక్కెట్లు ఇస్తామన్నా -సినిమాకి మిలియన్ ఆడియన్స్ రారన్న విషయాన్ని గ్రహించాలి.
-అల్లంక వి, సికింద్రాబాద్
పల్లె ప్రేమ
గతవారం విడుదలైన రాజావారు రాణీగారు సినిమా పల్లెటూరి కథనంతో ఆకట్టుకుంది. నటీనటులు కొత్తవాళ్లే అయినా మంచిగానే నటించారు. ముఖ్యంగా పల్లె వాసనలు తగ్గిపోతున్న ప్రస్తుత తరుణంలో వెండితెరపై అటువంటి ఫ్లేవర్‌ను తెచ్చిన ఈ సినిమా -ఈ జనరేషన్‌కు కొత్తదనానే్న అందించిందని అనడంలో అతిశయోక్తి లేదు. దర్శకుడు చిన్న పాయింట్‌నే తీసుకుని మంచి కథనంతో సినిమాను తీర్చిదిద్దటం బావుంది. ముఖ్యంగా హీరో, హీరోయిన్లు అద్భుతమైన ఎక్స్‌ప్రెషన్స్‌తో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశారు. దర్శకుడు సైతం కొత్తవాడే అయినా -పాత పాయింట్‌ను బిగుతైన కథనంతో అందించిన విధానాన్ని మెచ్చుకోవాలి. సినిమా హిట్టు ఫట్టు అన్న వర్గీకరణ పక్కనపెట్టి మంచి చిత్రంగా రాజావారు రాణీగారుని ఆదరించొచ్చు.
-ఎస్ ఈశ్వరి, విశాఖపట్నం