మీ వ్యూస్

ఫ్లాప్‌కి లాజిక్కుంది (మీ వ్యూస్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాజిక్‌లేని సాకుతో అబ్బాయల్ని బకరాలు చేసి -ఆనక తూచ్ అనేసే బొమ్మరిల్లు కథల్ని ఎగబడి చూసేస్తారని అనుకుంటే -అలాంటి సినిమాలు ‘నాన్న నేను.. నా బాయ్‌ఫ్రెండ్స్’లాగే బోల్తాపడతాయ. అమ్మా నాన్న ఓ తమిళమ్మాయ రిథమ్‌లో వినిపించిన టైటిల్ చూసి -సినిమాలో కాస్తో కూస్తో కంటెంట్ ఉంటుందిలేనని థియేటర్లకు పరిగెత్తిన ఆడియన్స్ సీన్లు చూసి బుర్రలు పట్టుకున్నారు. ‘కుమారి...’ సినిమాలో హెబా ఓవరాక్షన్ వర్కవుటైంది కనుక -అలాగే మళ్లీ చూపించేస్తే సినిమా చూసేస్తారనుకోవడం నిర్మాణకర్తల అత్యాశ. ఎంటర్‌టైన్‌మెంట్ పేరిట తెలుగు సినిమా స్థాయని దిగజార్చే సినిమాలు లెక్కలేనన్నిగా వస్తున్న వాటిలో -తాజా చిత్రాన్నీ నిరభ్యంతరంగా చేర్చొచ్చు.
-జి రామకీర్తి, సికింద్రాబాద్

లింగ వివక్షకు
చెంపపెట్టు
ముదితలు నేర్వగరాని విద్యలు గలవే అన్నట్టుగా ఏ రంగంలోనైనా నారీమణులు సాధించలేనిది లేదని చెప్పడానికి అమీర్‌ఖాన్ రూపొదించిన డంగల్‌ను ఉదహరించొచ్చు. హీరో ఎప్పుడూ మగ సంతానం కోసం ఎదురుచూస్తూ, అతన్ని మల్లయుద్ధ యోధుడిగా తీర్చిదిద్దడానికి కలలు కంటుంటాడు. కానీ ఆడపిల్లలే పుట్టినా, కుమార్తెలలో మల్లయుద్ధ ప్రావీణ్యం ఉందని గుర్తించి తర్ఫీదు ఇస్తాడు. ఆ అమ్మాయిలు తండ్రి కల నెరవేర్చి, దేశానికి బంగారు పతకం సాధిస్తారు. ఆదర్శవంతమైన కథతో చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. సంభాషణలతో కొన్నిచోట్ల కంటతడి పెట్టిస్తే, మరికొన్నిచోట్ల చక్కిలిగింతలు పెట్టి నవ్వించింది ‘దంగల్’. ఆటలపట్ల నిరాసక్తత ప్రదర్శించే అహంకారి ఆఫీసరులాంటి వైవిధ్యమైన పాత్రలతో వినోదం ప్రధానంగా సాగింది. మంచి సినిమాలు రావట్లేదు అనేవారు, యువతులు అన్ని రంగాల్లో రాణించలేరని చెప్పేవాళ్లు తప్పక చూడాల్సిన సినిమా ఇది.
-పగడాల పాండు, దిల్‌సుఖ్‌నగర్

ఏదీ గొప్ప సినిమా..
2016లో దాదాపు వందదాటి చిత్రాలు విడుదలైతే -పట్టుమని పది కూడా ప్రజాదరణ పొందలేదు. గుర్తుంచుకోదగిన చిత్రాలు రెండు మూడు కూడా లేవు. ఒకప్పుడు అద్భుత విజయాలు, అవార్డులు, రివార్డులతో విరాజిల్లిన తెలుగు సినిమా పరిస్థితిని ఇప్పుడిలా చూసి -అభిమానులు ఆవేదనకు గురవుతున్నారు. హీరోల ఇమేజ్‌ను బట్టి మూస ధోరణిలో ఫార్ములా చిత్రాలు చుట్టేసి -బలవంతంగా జనంమీదకు వదలటం భావ్యం కాదు. వారానికి ఐదారు సినిమాలతో ప్రేక్షకుల మీద దాడి చేస్తున్నారు. ఇక సంభాషణలు, టైటిల్స్ దిగజారుడు తనాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. వైవిధ్యమైన ప్రసారాలతో టెలివిజన్ మాధ్యమం ముందుకెళ్తుంటే -ఆ పోటీని తట్టుకోవడానికి సమర్థవంతమైన సినిమాలు తీయాల్సిన దర్శక నిర్మాతలు చౌకబారుతనాన్ని ఆశ్రయించడం బాధాకరం. తెలుగు సినిమా ప్రతిష్ఠను పెంచే సినిమా ఒకటో అరో వచ్చినా -ఈ దుర్గంధంలో వాటి పరిమళం తెలియడం లేదు. చాలా విచారకరం!
-జి అశోక్, గోదూర్

బావున్నాయి జ్ఞాపకాలు
అస్తమించిన అందాలతార జయలలితతో ఆనాటి నాయికల అనుబంధాన్ని ‘జ్ఞాపకాలు’గా అందించటం చాలా బాగుంది. అరుగుమీద కూర్చునో, పిట్టగోడ వద్ద నిలబడో కబుర్లు చెప్పుకున్నంత లలితంగా ముచ్చట్ల రూపంలో కథనాన్ని అందించటం చదివింపతగినదిగా ఉంది. పురచ్చితలైవి జీవన చిత్రాన్ని సినిమా కోణం నుంచి చూపించే కథనం, ఆమె కెరీర్ ప్రారంభించిన దశలో పడిన కష్టాలు, వ్యక్తిత్వాన్ని నిలుపుకున్న వైనాలు చాలా బావున్నాయి. మంచి వ్యాసాన్ని ప్రచురించినందుకు ధన్యవాదాలు. రచయితకు అభినందనలు.
సునీతారావ్, సికింద్రాబాద్

చిలక పలుకులు
చిలక పలుకులు అంటాంగానీ, నిజానికి చిలుకలు మాట్లాడవు. మన మాటల ధ్వనిని మిమిక్రీ చేస్తాయంతే. అందుకే అర్థంపర్థంలేని మాటల్ని చిలక పలుకులంటాం. ఈమధ్య హీరోయిన్లు వీటిని ఎక్కువ చెబుతున్నారు. ‘అబద్ధాలు రుచిగాను, నిజాలు చేదుగాను ఉంటాయి. అయినా నేను నిజాలే చెబుతాను’ అంటోంది సమంత. ‘నాకు భయం అంటే తెలీదు’ అంటోంది శ్రుతిహాసన్. ‘బాలకృష్ణతో నటించడం పూర్వజన్మ సుకృతం. మామధ్య ఎంతో అనుబంధం పెరిగింది’ అన్నది అంజలి మాట. మూడు సినిమాల్లో నటించిందో లేదో.. భవిష్యత్‌లో ఎలాంటి పాత్రల్లో కనిపించబోతోందో మూటగట్టి మరీ చెబుతోంది రాశిఖన్నా. పెళ్లికేం తొందర అంటున్నారు 40లు దాటిన కథానాయికలు. ఇవన్నీ చిలక పలుకులే అని సరిపెట్టుకోవాలి మనం.
కె సాహిత్యదీప్తి, తూ.గో జిల్లా

అలనాటి సంగతి
చక్రపాణి పట్టుదల
పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే కఠినమైన కార్యాన్నైనా సాధించటం కష్టమైనపని కాదు. విజయా బ్యానర్ అధిపతుల్లో ఒకరైన చక్రపాణి తన 26వ యేట భయంకరమైన క్షయ వ్యాధికి గురయ్యారు. దాంతో మదనపల్లి శానిటోరియంలో వైద్య చికిత్సకు చేరారు. వ్యాధిని నయం చేయటానికి అప్పటి వైద్యులు విశ్వ ప్రయత్నాలు చేసి, చివరకు శస్త్ర చికిత్సతో ఒక ఊపిరితిత్తిని తీసివేశారట. అలా చక్రపాణి ప్రాణాలు నిలిపారు. వైద్యుల కృషి, దైవబలంతో వ్యాధినుంచి విముక్తిపొందిన చక్రపాణికి -శాశ్వతంగా నిలిచే ఏదైనా ఒక కార్యం తలపెట్టాలన్న ఆలోచన కలిగిందట. వెంటనే చిన్నారులకు, పెద్దలకు ఉపయోగపడేలా ‘చందమామ’ మాస పత్రికను ఆరంభించారు. అదే సమయంలో కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా -పట్టువదలని విక్రమార్కుడిలా ఆత్మవిశ్వాసంతో ఎనలేని కృషి సలిపి చందమామను పలు భాషలకు విస్తరించారు. మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లిన ‘చందమామ’ చిన్నపిల్లలు, పెద్దల హృదయాల్లో పదిలంగా నిలిచి వెనె్నల కురిపించింది.
కె వేంకటేశ్వర ప్రసాద్ రావు,
కందుకూరు