మీ వ్యూస్

మీ వ్యూస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టైటిల్ జస్ట్ఫికేషన్

సుకుమార్‌కు దర్శకుడిగా బోలెడంత కన్‌ఫ్యూజన్ వుంది. నాన్నకు ప్రేమతో చిత్రాన్ని త్వరగా విడుదల చేయాలన్న తొందరలో లింకులు మిస్సయ్యానని చెప్పుకున్నాడు. తాపీగా చేసినా వంద శాతం లవ్‌కి వంద మార్కులు పడలేదు. నిడివి ఎక్కువైందని, రిపీటైందని, కొన్ని సీన్లు తొలగించినట్లు అప్పుడు టీవీ ఛానల్లో చెప్పాడు. స్క్రీన్‌ప్లే పక్కాగా రాసుకొని, నలుగురితో చర్చించి తొలగింపులు, కూడికలు ముందే నిర్ణయించుకుంటే ఈ తిప్పలుండవు కదా? నాన్న ఒక రివేంజ్ స్టోరీగా మిగిలిపోయిందిగానీ తండ్రి కొడుకుల మధ్య అనుబంధం చూపించే రెండు మూడు సన్నివేశాలు చేర్చి వుంటే టైటిల్ జస్ట్ఫికేషన్ అయ్యేది. నలుగురితో చర్చించి ఉంటే ఈ లోకం స్క్రీన్‌ప్లే రాసుకున్నప్పుడే బయటపడేది!
- పి.శుభలక్ష్మి, కాకినాడ

ఆసక్తిదాయకంగా!
హీరోయిన్‌కు దయ్యం పట్టిందన్న వ్యాసం ఆద్యంతం ఆసక్తిదాయకంగా సాగింది. నాటి హీరోయిన్లు దయ్యం రూపంలో కనిపించడానికి ఆసక్తి చూపించేవారు కాదు. ఇప్పటివారు వరుసపెట్టి దయ్యాల పాత్రల్లో నటించడానికి తహతహలాడుతున్నారు. ఎన్నో యధార్థ విశేషాలను వ్యాసం చెప్పింది. అందమైన దయ్యాలు, తెలుగు తెరపై భయపెట్టడానికి వచ్చినా భయపడటం లేదు. ఫ్లాష్‌బ్యాక్‌లో శభాష్‌రాముడు చిత్ర విశేషాలను ఇచ్చి ఆనందింపజేశారు. విలన్‌గా నటించిన ఆర్.నాగేశ్వరరావు ఈ చిత్రం విడుదలకు నెల ముందు స్వర్గస్తులు కావడం బాధాకరం. కోడెనాగు చిత్రంలో అనురాగ సంగమం అన్న పాటను పునశ్చరణ చేసే అవకాశం ఇచ్చారు.
- అల్లాడి వేణుగోపాల్, బారకాసు

అది అబద్ధమే!
అల్లాఉద్దీన్ అద్భుత దీపం నుండి భూతం వచ్చినట్లు టాలీవుడ్ మీడియానుండి గాసిప్‌లు పుట్టుకొస్తాయి. సాదాసీదా నటీమణులకు ఒకటి రెండు ఆఫర్లు వస్తే చాలు. చేతినిండా చిత్రాలతో బిజీగా వుంది అంటూ ఆకాశానికెత్తేస్తారు. డిక్టేటర్‌లో అంజలికి ఛాన్స్ రాగానే మీడియా బాజాలు మోగించి ఎక్కడికో వెళ్లిపోతుందన్నారు. ఆమె కూడా బాలయ్యతో తనకు మంచి సాన్నిహిత్యం ఏర్పడిందంటూ సన్నాయి నొక్కులూ నొక్కింది. తీరా చూస్తే ఆమెది ప్రాముఖ్యం లేని చిన్నపాత్ర. అలాగే వందో చిత్రంలోనూ తాప్సీకి ఛాన్స్ వచ్చింది. ఆకాశంలోకి దూసుకుపోతుందని బాజాలు మోగాయి. తను ఆ చిత్రంలో నటించడం లేదని తాప్సీ స్వయంగా చెప్పింది. రోబో-2లో టెర్మినేటర్ స్క్వార్జ్‌నెగ్గర్ విలన్‌గా నటిస్తున్నాడని భజంత్రీలు మోగాయి, అదీ అబద్ధమే. అయినా బాజాలు మోగుతూనే ఉంటాయి.
- బి.చంద్రిక, రాజేంద్రనగరం

కత్తిగతి!
తమిళ కత్తి తెలుగు కత్తిగా మారబోతుందన్న విషయం తెలిసిందే. ఆ తమిళ కత్తి కథాస్క్రీన్‌ప్లే నావే, తమిళ నిర్మాతలు దొంగిలించారంటూ ఎన్.నరసింహారావు అనే వ్యక్తి పరిహారం కోసం 2014లోనే రచయితల సంఘానికి ఫిర్యాదు చేశాడు. దాన్ని తెలుగులో చరణ్ నిర్మిస్తున్నాడని తెలిసి అతడు మళ్లీ రచయితల సంఘానికి ఫిర్యాదుచేశాడు. పరిహారం పంపించాల్సిందిగా దాసరి నారాయణరావు చిరంజీవికి లేఖ పంపాడట. జవాబు లేదు. దాంతో దర్శకుల సంఘం పరిహారం చెల్లించేవరకూ తెలుగు కత్తికి ఏ విధమైన సాయం చేయరాదని సంఘ సభ్యుల్ని హెచ్చరించిందట. తెలుగు కత్తిగతి ఏమి కానున్నదో!
- సదాప్రసాద్, గొడారిగుంట

శరత్‌కాలం
వెనె్నల పేజీకి వెలుగులు విరజిమ్మే శరత్‌కాలం మాకు నచ్చింది. స్వర్ణలత గురించి తెలియని విషయాలు ఎన్నో తెలిపారు. అద్భుతమైన పాటల్ని ఆలపించి, అలరించిన గాయనికి విధి వశాత్తు అలా జరగడం దురదృష్టకరం. రహహృదయాలన్నీ కలుక్కుమన్నాయి. ఏమైనా వారి తనయుడు అనిల్‌రాజ్ తల్లిపేరిట ఆమె పాడిన పాటలతో స్వరాంజలి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ పాటల సీడీలను ఉచితంగా పంపిణీ చేయడం అభినందనీయం. వెనె్నల తీర్చిదిద్దుతున్నవారికి అభినందనలు.
- మల్లిడి విజయ్‌భాస్కర్‌రెడ్డి, కుతుకులూరు

గ్లామర్ సూత్రం
మడిగట్టుకు కూర్చుంటే కుదరదని నటీమణులు గ్లామర్ బాట పట్టారు. గ్లామర్ ప్రదేశాలు కనిపించేటట్టు జాకెట్లు, చీరకట్లు మారాయి. ఆ తర్వాత లోనెక్, బ్యాక్‌లెస్ జాకెట్లు వచ్చాయి. ఇప్పుడు జీన్స్, టాప్స్ గ్లామర్ సూత్రం అయ్యాయి. అయితే నటన శాశ్వతం, గ్లామర్ తాత్కాలికం అని గ్రహించిన సమంత, నయనతార లాంటి వాళ్లు నటన వైపు మొగ్గితే కాజల్ లాంటివారు అందాలు చూపించడానికి సిద్ధపడుతున్నారు. బికినీలు, ఇతర గ్లామర్ దుస్తులు రెండు మూడు సినిమాల వరకూ ఓకే. తర్వాత ఎవరూ చూడరు. అప్పుడు కొత్తవాళ్లు దూసుకు వస్తారు. గ్లామర్ తీసుకెళ్లేది కొద్ది దూరమే. నటన ఎక్కువ దూరం తీసుకెళ్తుందని ఎప్పుడు గ్రహిస్తారో వీళ్లు.
- బి.సోనాలి, సూర్యారావుపేట

తీరు మారాలి
తెలుగు సినిమాల్లో కొనే్నళ్లనుండి కొత్తదనం కరువైంది. టాలీవుడ్ దర్శకులు సినిమాలను మరీ నీరసంగా, కథాకథనాల్లో వెనకబడిపోయి నడిపిస్తున్నారు. ఇంటర్వెల్ తర్వాత విలన్ ఇంట్లోకి వెళ్లి వాళ్లతో ఆటాడేసుకోవడం లాంటి సినిమాలు చాలా వచ్చాయి. బోర్ కొట్టించాయి. మాధుర్య ప్రధానమైన పాటలకు తావే లేదు. సాహిత్యాన్ని పాటల రచయితలు చక్కగా అందిస్తున్నా, ఈ డప్పులు దరువుల్లో అవి వినబడడం లేదు. ఇలా ఎంతకాలం సాగుతాయో చూడాలి. చివరికి థియేటర్లు ఆడక మూతపడటం ఖాయం.
- టేకి రామకృష్ణ, పొందూరు

పొరపాటు
నాకు నచ్చిన పాటలో కోడెనాగు చిత్రంలోని సంగమం పాట ఆత్రేయ రాసినట్టు పాఠకుడు పేర్కొన్నారు. అది పొరపాటు. అది మల్లెమాల (ఎం.ఎస్.రెడ్డి) రాసినట్టు గమనించాలి.
- ఎస్.వి.రామారావు, హైదరాబాద్