మీ వ్యూస్

ఆహా.. మాయాబజార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాయాబజార్ చిత్రాన్ని ఈరోజు చూసినా పాత చిత్రాన్ని చూసినట్టుండదు. కృష్ణుడు నిజంగా ఇలానే ఉంటాడేమో అన్నంత గొప్పగా ఎన్టీఆర్ నటించడమే కాదు, మిగిలిన పాత్రధారులంతా అద్వితీయమైన నటన ప్రదర్శించి మెప్పించారు. ‘నిజంగా నీవంతటి వాడివే అయితే ఇలా మాటలు చెబుతూ కాలం వెళ్లదీస్తావా అభిమన్యూ.. ఊ’ అన్న డైలాగ్‌లో ఎన్టీఆర్ అభినయం చూసి ఎవ్వరైనా ఫ్లాటైపోవాల్సిందే. 60యేళ్ల మాయాబజార్‌పై అటు పత్రికల్లోను, ఇటు చానెల్స్‌లోనూ కథనాలు చూస్తుంటే -అలాంటి చిత్రాలు మళ్లీ మన తెలుగు చిత్రసీమలో రావా? అన్నంత బాధ కలుగుతుంది. మాయాబజార్ స్థాయిని అందుకోకున్నా, అలాంటి అపురూప చిత్రాలను నిర్మించే ప్రయత్నమైనా చేయటం, వాటిని సృష్టించిన వాళ్లను గౌరవించుకోవడమే. ఏమంటారు?
-విఆర్‌ఆర్‌ఎ రాజు, హైదరాబాద్

రసరాజులు లేనట్టేనా?
తెలుగు చిత్రసీమలో కొసరాజు గురించి తెలీనివారుండరు. 1955లో ‘రోజులు మారాయి’ చిత్రంలో ‘ఏరువాకా సాగారో రన్నో చిన్నన్న’ పాటను అందించి ప్రజాదరణ చేశారు. మూగమనసులు చిత్రంలో ‘గౌరమ్మా నీ మొగుడెవరమ్మా’, ‘తోడికోడళ్లు’ చిత్రంలో ‘ఆడుతు పాడుతు పని చేస్తుంటే అలుపూ సొలుపేమున్నది’ లాంటి అద్భుతమైన పాటలు సుమారు వెయ్యి వరకూ అందించారు. అలాంటి కొసరాజులు మళ్లీ చిత్రసీమకు రాలేదు. రారేమో కూడా. స్వర్గయుగం కాలంలో అద్భుతమైన పాటలు అందించిన కవులు వెళ్లిపోయాక, సినీ పరిశ్రమలో తెలుగుదనాన్ని మదినిండా నింపే పాట ఒక్కటైనా రాసే కవి కనిపించక పోవడం దురదృష్టం.
-కెవి ప్రసాద్, కందుకూరు

నిర్మాతే హక్కుదారుడు
గొప్ప సంగీత దర్శకుడిగా ప్రఖ్యాతి సంపాదించుకున్న ఇళయరాజా ‘పాట’ మీద రాయితీ కోరుకోవడం తన స్థాయిని దించుకోవటమే. ఒకవేళ అలాంటి చట్టం ఏమైనా వస్తే -ఆ రాయితీ నిర్మాతకు దక్కాలి. గొప్ప పాటలతో సంగీత దర్శకులు, గాయకులకు పేరు తెచ్చిపెట్టిన సినిమాలు చాలానే ఢమాల్‌మన్నాయి. ఎంతో పెట్టుబడి పెట్టిన నిర్మాత నష్టపోయాడు. నిర్మాత సొమ్ముతో సృష్టించబడినవన్నీ నిర్మాతకే కనుక -అలాంటి అవకాశం ఏమైనా ఉంటే రాయితీని నిర్మాతకే అందించాలి. అప్పుడు నిర్మాత బాగుపడతాడు. రాజా సృష్టించిన పాటకు నిర్మాత నుంచి డబ్బు తీసుకుని, ఇప్పుడు రాయితీ అంటూ కొత్తవాదం లేపడం ఆయన స్థాయికి సరికాదు. సో.. ఎవరు ఎక్కడ ఎలా కచేరీ చేసినా -కమర్షియల్ ప్రోగ్రాముల్లో పాటలు పాడాల్సి వస్తే దానికి రాయితీని నిర్మాతకు చెల్లించడమే సబబు.
-ఎం లతీఫ్, నాచారం

పూరి.. మరీ!
సినిమా వ్యాపారమేగానీ, మరీ ఇంత పచ్చిగానా? బాలయ్య హీరోగా పూరీ జగన్నాథ్ తీయబోయే చిత్రానికి ‘టపోరి’ పేరు పెట్టడాన్ని చూస్తుంటే సినిమాను పచ్చి వ్యాపారం చేసేస్తున్నారన్న భావన కలుగుతుంది. సీనియర్ హీరో, రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే పదవిలోవున్న వ్యక్తి హీరోగా చేస్తున్న చిత్రానికి ఈ టైటిల్ ఏ ఉద్దేశంతో పెట్టారో దర్శకుడు పూరీయే చెప్పాలి. కుర్ర హీరోల చిత్రాలకు అలాంటి పేర్లు పెట్టారంటే సరిపెట్టుకోవచ్చు. సొసైటీలో బాధ్యతగల వ్యక్తి హీరోగా చేస్తున్న చిత్రానికి ‘టపోరి’ పేరు పెడితే, ఆ హీరో తన అభిమానులకు ఎలాంటి సందేశం ఇస్తున్నట్టు. ఈమధ్యనే తెలుగు చక్రవర్తి కథ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రం చేసిన బాలయ్య, పూరీ ‘టపోరి’కి ఎలా అంగీకరించారో అర్థంకాదు. సెంచరీ దాటిన బాలయ్య, సంచలన దర్శకుడు పూరీ కలిసి చేస్తున్న మొదటి చిత్రమిది. ఇద్దరి హోదాకు తగిన బాధ్యతాయుతమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తే -బావుంటుంది.
-ప్రవల్లిక, సికింద్రాబాద్

భలే కీరవాణి
గొప్ప సంగీత దర్శకుడు కీరవాణి. అందులో సందేహం లేదు. కాకపోతే బాహుబలికి ఎక్కువ పని చేసి అలసిపోవడం వల్ల.. బాణీలు కట్టడం ఆపేసి కవితలు రాయడం మొదలెట్టాడు. ‘బుద్ధిలేని చాలామంది దర్శకులతో పనిచేశా/ వాళ్లు కథ చెప్పగానే అది ఫ్లాప్ అని తెలిసిపోతుంది/ చెప్పినా వినరు/ అలాంటి వాళ్లతో పని చేయకూడదని అనుకుంటున్నా/ నేను ఈ రంగం నుంచి నిష్క్రమిస్తే ఆ స్థానాన్ని ఆక్రమిద్దామని కొందరి ఆశ/.. అంటూ చిత్రమైన హైకూలు రాస్తున్నాడు. డౌట్‌లేదు, వీటికి బాణీ కట్టాలంటే మళ్లీ కీరవాణే హార్మోనియం అందుకోవాలి. ‘వౌనంగానే ఎదగమని మొక్కనీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది’ అన్న పాటకు ట్యూన్ కట్టాడేగానీ, అందులోని అంతరార్థాన్ని గ్రహించలేకపోయాడు కీరవాణి.
-శాండీ, కాకినాడ

గోల పాటలు
మంచి పాటకు టాటా అంటూ ప్రచురించిన వ్యాసం బావుంది. అంతమాత్రాన మన తెలుగు సినిమాల్లోని పాటల పరిస్థితి రాత్రికి రాత్రి మారిపోతుందని ఆశపడటం కల్ల. ఈలపాటలు, గోల పాటలు తప్ప ఇంపైన పాట ఒక్కటీ ఇప్పటి రోజుల్లో వినిపించటం లేదు. పాత పాటల్లోని మాధుర్యాన్ని రవ్వంత కూడా పలికించలేని పెడసరి సంగీత దర్శకులు చిత్రసీమను రాజ్యమేలుతుండటమే కారణం. టెక్నాలజీ ఎంత పెరిగినా, సంగీత వాయిద్యాలు ఎన్ని కొత్తవి వచ్చినా.. సందర్భాన్ని రక్తికట్టిస్తూ బాణీ కట్టగలవారు ఇప్పుడెక్కడ? అని వెతకాలనుకోకూడదు. సినిమాలో అద్భుతమైన పాటలున్నాయని విడుదలకు ముందు, పాటలు హిట్టయ్యాయని ఆడియో ఫంక్షన్లలోను ప్రచారం చేసుకోవడానికి తప్ప -పట్టుమని పది గంటలు గుర్తు పెట్టుకోగలిగే పాట ఇప్పటి సినిమాల్లో ఒక్కటీ లేదనడం అతిశయోక్తి కాదు. ‘తివిరి ఇసుమున తైలమ్ము తీయవచ్చు’ లాంటి పద్యాలను గుర్తు చేసుకుంటూ ముందుకెళ్లిపోవడమే అందరికీ మంచిది.
-ఎన్ రామలక్ష్మి, సికింద్రాబాద్

కలర్‌ఫుల్లుగా..
ఫిలిం క్విజ్ బావుంటుంది. అయితే, కొంచెం కష్టమైన ప్రశ్నలు ఇస్తుండటం వల్ల పాఠకులకు ఇబ్బందిగా ఉంది. మరీ లోతైన ప్రశ్నలు జోలికిపోకుండా, కాస్త సులువుగా పజిల్ పూర్తి చేసే ప్రశ్నలైతే పాఠకులూ ఆసక్తి చూపిస్తారని మనవి. అసలు హీరో విలనే! కథనం ప్రస్తుత సినిమా కాలానికి సందర్భోచితంగా ఉంది. వెనె్నల సంపుటాన్ని మరింత కలర్‌ఫుల్‌గా తీర్చిదిద్దిదే బావుంటుదని నాలాంటి పాఠకుల ఆశ.
-పివిఎస్‌పి రావు, అద్దంకి