మీ వ్యూస్

హిట్టంటే కోట్లే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూర్వం సినిమాలు శతదినోత్సవాలు జరుపుకుంటే ఎంత లాభం వచ్చిందో తెలియకపోయినా హిట్ అనేవారు. ఈ కాలంలో ఏ గొప్ప సినిమా అయినా పాతిక రోజులు ఆడకున్నా సూపర్‌హిట్టని ప్రచారం చేస్తున్నారు. వెయ్యి థియేటర్లలో వారం ప్రదర్శనలోనే ఏ మాత్రం సినిమా బాగున్నా వంద కోట్ల వర్షం కురుస్తోంది. అదే హిట్ సినిమాగా ముద్రపడిపోతోంది. హిట్టంటే కోట్ల రాబడే కాని మంచి సినిమా మాత్రం కాదని కోట్ల క్లబ్‌లో చేరిన సినిమాల వరుస చూస్తే తెలుస్తోంది. విడుదలైన నాలుగు రోజులకే దువ్వాడ జగన్నాధం వంద కోట్లు వసూలు చేసేసిందని ప్రచారం సాగిపోవడాన్ని ఏమనుకోవాలి.
-ఎన్.రామలక్ష్మి, సికింద్రాబాద్
బఫే సినిమాలే
దశాబ్దం క్రితంవరకు పెళ్లి విందు అంటే చక్కగా కూచోబెట్టి అరిటాకు వేసి రెండు స్వీట్లు, మూడు కూరలు, పచ్చడి, పప్పు, ఆవకాయ, గడ్డ పెరుగు, సాంబారుతో సంతృప్త భోజనం పెట్టేవారు. మృష్టాన్నాన్ని ఆరగించి వధూవరుల్ని ఆశీర్వదించేవారు. ఇప్పుడు టేబుళ్లపై 30 రకాల అర్థంకాని పదార్థాలు పెడితే, అట్టబొచ్చె పట్టుకొని ఖైదీల్లా క్యూలో నిలబడే రెండు ముద్దలు మింగి వధూవరుల నెత్తిన అక్షింతలు కొట్టి పారిపోవడమే! నాటి చిత్రాలిచ్చిన మానసికానందం నేటి చిత్రాలు ఇవ్వలేవు, నాటి నేటి విందుల్లాగే. ఇపుడు ఎంత ఖర్చు, ఎంత విలువైన గిఫ్టులు వచ్చాయి అన్నదే లెక్క. నాటి చిత్రాలు హార్దికంగా హిట్. నేటివి ఆర్థిక హిట్‌లు.. అంతే.
-బి.స్నేహమాధురి, పెద్దాపురం
దెబ్బకొట్టాడు
వినోదం అంటే అమితంగా ఇష్టపడే బన్నీ, హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన దువ్వాడ జగన్నాథమ్‌పై ప్రేక్షకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అందరి ఆకాంక్షలకు భిన్నంగా డీజే రుచీ పచీ లేని వంటకమై ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. రొటీన్ సన్నివేశాలు, పాట- కామెడీ- ఫైట్స్ ఫార్మాట్‌లో అరగదీసిన గ్రామఫోన్ రికార్డులా తయారైంది. రెండు షేడ్స్ వున్న పాత్రల్లో అర్జున్ నటన బాగానే వున్నప్పటికీ వంటోడి పాత్రలో అక్కరలేని వెటకారం ప్రదర్శించడం, స్తోత్రాలు, మంత్రాలను కామెడీ భాషలో అర్థంలేకుండా ఉచ్ఛరించడం, రుద్రాక్షమాల, యజ్ఞోపవీతాన్ని పట్టుకొని పిచ్చి కామెడీ ప్రదర్శించడం దారుణం. కథ, స్క్రీన్‌ప్లేలో ఏ విధమైన వైవిధ్యం లేకపోవడం దర్శకుడి విఫలం. సినిమా పేరిట సాగే ఇలాంటి పిచ్చి ప్రయత్నాలను ఆదిలోనే గర్హించకుంటే, అదే సంప్రదాయమై కూర్చునే ప్రమాదం లేకపోలేదు.
-సి.ప్రతాప్, శ్రీకాకుళం

కాసులకోసం అనైతికత, అసభ్యత, హింస, బూతు, అశ్లీలత వంటి ఎన్నో అంశాలను కమర్షియల్ విలువల కోసం సినిమాలలో అన్ని హద్దులను చెరిపేసి జోడించే కొన్ని సామాజిక వర్గాలను కించపరిచే వినూత్న ప్రక్రియ సినిమాల్లో ఎక్కువవుతోంది.
ఓట్ల కోసం నాలుగు సానుభూతి మాటలు మాట్లాడి ఆనక వారి నెత్తినెక్కి పెత్తనం చేసే విధానం రాజకీయ పార్టీలే బహిరంగంగా చేస్తుంటే ఇక సినిమావాళ్లను ఆపగలిగేవారు ఎవ్వరు? సినిమా అనేది వినోదాత్మకంగా, ఆహ్లాదంగా ఉండాలే తప్ప ఒక వర్గం లేక కులం వారినో కించపరచేటట్లు ఉండకూడదు! సృష్టికర్త త్రిగుణాతీతుడు, సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుని కీర్తించే నమక చమకాలను హీరోయిన్ అందాలను వర్ణించడంలో ఉపయోగించినప్పుడు ఇటీవల వచ్చిన డిజె భావదారిద్య్రం కలెక్షన్ల కోసం ఎంతగా దిగజారిపోతున్నారో అర్థమవుతోంది.
-ఎం.కనకదుర్గ, తెనాలి
అంత పొగరా?
బన్నీకి గర్వం తలకెక్కిందా? అనే అంటున్నారు పవన్, చిరు అభిమానులు. సభల్లో బన్నీ ఎప్పుడూ చిరు అంతటి నటుడు లేనేలేడని పొగడేవాడు. అదంతా గతం. డీజే విజయోత్సవ సభలో దర్శకుడు హరీశ్ శంకర్- ‘డీజే బన్నికి కెరియర్ బెస్ట్ అవుతుంది. తొలి కలెక్షన్లు గబ్బర్‌సింగ్‌ని మించిపోయాయి’ అన్నాడు. పవన్ అభిమానులు గురగురమన్నారు. డీజే ఖైదీ నెం150ని మించిపోతుందంటూ చిరు అభిమానులకు చిరచిర కలిగించాడు బన్నీ. అంతేకాదు, డీజేని విమర్శించేవాళ్లది నెగెటివ్ ధోరణి అంటూ విమర్శకులనే విమర్శించాడు. బన్నీ అతే చిరచిరలకు కారణం.
-పవన్‌పుత్ర,
రామారావుపేట
ఎందుకొచ్చిన కథ
జయదేవ్ చిత్ర కథనం డైరెక్టర్ ఎన్నుకొన్నదేనా? చిత్రం స్క్రిప్ట్‌లో ఆ డైరెక్టర్ ప్రమేయం ఉందా? అని అనుమానం. ఇంత పేలవమైన కథ కథనం వారినుంచి వస్తుందని అనుకోలేదు. జయంత్ సి.పరాన్జీ ఎలాంటి చిత్రాలు, హిట్స్ ఇచ్చారు. కేవలం గంటా రవి కోసమే తీసినా రక్తికట్టించే సన్నివేశాలు ఏవీ లేవు. ఎంతసేపు బెడ్‌రూమ్, పిల్లలతో, హీరో హీరోయిన్ల ప్రేమ సన్నివేశాలు తప్ప వెరైటీ ఏమీ లేదు. పాటల్లో కూడా మంచి స్టెప్స్ లేవు, హీరో ఉప్పు బస్తా మొయటం తప్ప. ఐటెంసాంగ్ వేస్ట్. హిట్ పాటల్ని ఖూనీ చేశారు. హీరోలో విగ్రహం తప్ప హావభావాలు ఏ కోశాన లేవు. జయంత్ పోలీస్ కథ లక్ష్మీనరసింహ ఎంత బాగా తీశారు. ఇంత చెత్తగా ఈ చిత్రాన్ని ఎలా తీశారు. కేవలం ఫైట్స్‌మీదే దృష్టిపెడితే ఎలా? ఈ డైరెక్టర్ నుండి భవిష్యత్తులో ఇలాంటి చిత్రాలు రావని ఆశిస్తున్నాము.
-పి.వి.శివప్రసాద్‌రావు, అద్దంకి

పేరుతోపాటు, పాటలో కూడా కొంత అనవసర దాద్ధాంతం సొంతం చేసుకున్న డిజె సినిమా పాత వాసనలు ఉన్నా, ఇంగువ కట్టిన గుడ్డలా కొత్త వాసనా గుబాళించింది. అందుకు కారణం అర్జున్ నటన. కాకతాళీయం అయినా 25 ఏళ్ళనాటి ఆ అర్జున్, నేటి అర్జున్ ఇద్దరూ బ్రాహ్మణుల వేషాలు వేసి దుర్మార్గులను అంతం చేయడంలో ఇరగదీశారు. కథ, కథనం ఈ కాలానికి సరిపోయేట్టుగా బావుంది. నమకం- చమకం పైత్యకారి పాటను తీసివేయడం ఒకింత సంతోషం. మొదటి సగం నరుకుడు, రెండో సగం నవ్వటంతో లాగించారు.
అందుకే ఒకసారి చూడవచ్చు. కాకపోతే, కలెక్షన్లు, రికార్డుల గురించి మరీ అతిగా మాట్లాడి ఇబ్బంది పెడుతున్నారని అనిపిస్తుంది. హీరోల మధ్య కలెక్షన్ల పోటీలు, ఇగోలు తీసేస్తే తప్ప, ఇలాంటి న్యూసెన్స్ వ్యవహారం తగ్గదేమో.
-ఎస్ లక్ష్మినరసింహమూర్తి, హైదరాబాద్