మీ వ్యూస్

మణి కాదు పూసే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక్కరు కాదు. ఇద్దరు కాదు. ముగ్గురు కాదు. నలుగురు హీరోలు. ‘ఐదు’కోట్ల కథను రక్తికట్టించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశారు. ఒక్క హీరో రెండు భాగాల కథను చెప్పే స్టయిల్‌కు భిన్నంగా -నలుగురు హీరోలు సింగిల్ పాయింట్‌తో మెప్పించే ప్రయత్నం చేశారు. ఏమైంది? పాతకంపు కొట్టింది. కథలో హీరో పాతకాలపు రోల్స్ రోయిస్ కారు అయినంత మాత్రాన -కథను నడపలేదుగా. నడపాల్సింది డ్రైవర్లేగా. ఆ పనిని కుర్రహీరోలు, కుర్ర డైరెక్టర్ సమర్థంగా నిర్వర్తించలేకపోయారు. వెరసి -శమంతకమణి మెరవలేదు. ప్రేక్షకులు తిప్పికొట్టడంతో మణి కాస్తా -పూసైపోయింది. ఒక్కటి మాత్రం నిజం. మల్టీ హీరోలతో తెలుగు సినిమాను నడిపిద్దామనుకుంటే -పల్టీ కొట్టడం ఖాయమని.
-పావని గంగాధర్, రాజమండ్రి
నిన్ను కోరి..
దిల్ రాజు మనసుపెట్టి తీసిన సినిమా ‘నిన్నుకోరి’ బావుంది. నాని నటన సినిమాకు మరింత ప్లస్ అయ్యింది. ఎదుగుతున్న హీరో అనేకంటే, ఎన్నదగిన ఫెర్ఫార్మర్ నాని అనిపించేలా పాత్రోచిత నటన ప్రదర్శించాడు. కథ తన చుట్టూ తిరిగే పాత్రలో నివేదా థామస్ ఎక్స్‌ప్రెషన్స్ ఆమెలోని ప్రతిభను తేటతెల్లం చేశాయి. తను ప్రేమించిన వ్యక్తి మరొకరిని పెళ్లి చేసుకుని వెళ్లిపోతే, ప్రియుడి బాధ ఎంత భయంకరంగా ఉంటుందో, మళ్లీ కలిసే అవకాశం వస్తే ఎలాంటి ఆశలకు పోతుందో -దర్శకుడు చక్కటి చిక్కటి సంభాషణలు, దృశ్యాలతో చూపించగలిగాడు. రామజోగయ్య శాస్ర్తీ రాసిన ‘ఉన్నట్టుండి గుండె కొట్టుకుందే..’ పాట సూపర్. కార్తీక్ ఘట్టమనేని కెమెరా అద్భుతం. మొత్తంగా ప్రేక్షకుల చేత ‘నిన్నుకోరి’ అనిపించుకుంది సినిమా.
-కె శ్రీనివాస్, బెల్లంపల్లి
భలే భలే నాని
‘నిన్నుకోరి’ అంటూ వచ్చిన నాని -అదరగొట్టాడు. ప్రధాన పాత్రలో నివేదా థామస్ చెప్పుకోదగ్గ నటన ప్రదర్శించింది. సపోర్టింగ్ రోల్‌లో ఆది పినిశెట్టి సూపర్. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటున్న నాని -ఈ సినిమాలోనూ హీరోనన్న విషయాన్ని మర్చిపోయి అంతకుమించిన పాత్రనే చేశాడనిపించింది. కథ కొత్తది. కథనమూ కొత్తగా ఉంది. దర్శకుడు శివనిర్వాణ ఊహ, దాన్ని అందమైన దృశ్యంగా చూపించిన కార్తీక్ ఘట్టమనేని కృషి ఫలించింది. హిట్టు సినిమా అని టాగ్ లైన్ తగిలించేకంటే, ఓ మంచి సినిమాగా ప్రస్తావించుకోదగిన చిత్రం నిన్నుకోరి.
-ఏవీఎస్ మూర్తి, చీరాల
మత్తు దించితేనే..
చిత్రసీమలో విస్తరిస్తున్న మాదక ద్రవ్యాల గురించి ‘కొత్తగా గమ్మత్తుగా..’ అంటూ అందించిన వ్యాసం బావుంది. ఇప్పటికే మద్యపానం మహత్తర కార్యంలాగ భుజానికెత్తుకుంది చిత్ర సీమ. మందుకొట్టే సీను లేకుండా సినిమా ఉండటం లేదు. ప్రభుత్వం కూడా ఇళ్లమధ్య మద్యం దుకాణాలు వెలుస్తున్నా పట్టించుకోవడం లేదు. ఈ సినిమాల ప్రభావంతో కాలేజీ పిల్లలు కూడా ఇంటికి పోతూపోతూ గ్లాసుడు పుచ్చుకుని వెళ్లడం జరుగుతోంది. ఇప్పుడు సినిమా హీరోలు, హీరోయిన్లు ‘మత్తు’ను ఎంజాయ్ చేస్తున్నారని తెలిస్తే -ఎలా ఉంటుందో చూద్దామని పిల్లలు ప్రాక్టికల్స్‌కు దిగినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే, డ్రగ్స్ ఊసెత్తితే ఎంత కఠిన చర్యలు ఉంటాయో ప్రభుత్వం, పోలీసులు నిరూపించాలి. లేదంటే.. ‘ఇంతేనా?’ అంటూ పిల్లలూ అటువైపు అట్రాక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త!
-జివి బొమ్మన, విశాఖ
ధర పెంచొద్దు
తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలు పోటీపడి మరీ పెంచతున్నారు. ఇది దారుణం. గతంలో తక్కువ ధరతో అమితానందం పొందే పరిస్థితి ఉండేది. ఎందుకంటే టికెట్ ధరలు తక్కువ, విడుదలయ్యే సినిమాలన్నీ అంతో ఇంతో ఆనందాన్ని పంచేవి. ఇప్పుడు పరిస్థితి మారింది. ఎంటర్‌టైన్‌మెంట్ కోసం వందలుపోసి టికెట్ కొనుక్కుని థియేటర్‌కు వెళ్తుంటే -ఏడుపే మిగులుతోంది. పైగా థియేటర్లలో పార్కింగ్ నుంచి పాప్‌కార్న్ ప్యాకెట్ వరకూ రెట్టింపు ధరలు పెడుతుంటే -వౌనంగా భరించాల్సి వస్తుంది. చెత్త సినిమాలకు సైతం భారీ బడ్జెట్ పెట్టి, దాన్ని ప్రేక్షకుల నుంచి వసూలు చేసే ‘వ్యూహాన్ని’ అందరూ కలిసి అనుసరిస్తున్నారు. అసలే టికెట్ రేట్లు పెరిగి చస్తుంటే, ప్రత్యేకమైన సినిమాలు వస్తున్నపుడు టికెట్ రేట్లు మరింత పెంచుకోవడానికి ప్రభుత్వాలూ అనుమతి ఇస్తుండటం మరీ దారుణం. మొత్తంగా సైలెంట్‌గా సినిమా దందా నడుస్తోందా? అన్న సందేహాలు కలుగుతున్నాయి.
ఈ విషయంలో బలమైన వర్గాలకు ప్రభుత్వాలు సైతం కొమ్ముకాస్తున్నాయి. పైగా, కలెక్షన్ల లెక్కలు చూపించుకోవడానికీ పెంచేస్తున్న టికెట్ రేట్లు పనికొస్తుండటంతో, సినీవర్గాలు మరింత దూకుడు చూపుతున్నాయి. ఈ పరిణామాల్లో మార్పురాకుంటే, సామాన్యుడికి సినిమా అనేది అందని ద్రాక్ష కావడం ఖాయం. సామాన్యుడు కనుక సినిమాకు దూరమైతే, మొత్తం వ్యవస్థే కుప్పకూలడం ఇంకా ఖాయం.
-బులుసు రాజు, అమరావతి
డ్రగ్స్‌పై శెభాష్!
వెనె్నల్లో గత రెండు వారాలుగా ప్రచురించిన డ్రగ్స్ కథనాలు బావున్నాయి. సినిమా రంగం అందమైనదని అనుకుంటాం. కానీ, వారి వెనుక ఇన్ని చీకటి కోణాలున్నాయని డ్రగ్స్ వార్తల నేపథ్యంలో తెలుస్తోంది. ఇన్నాళ్లూ అమాయక ప్రేక్షక దేవుళ్లు వీరినా తమ అభిమాన హీరోలుగా భావించింది. చిన్న పిల్లలు పాలులేక అల్లాడుతున్నా, వారినోటి వద్ద లాగేసి తమ హీరో బొమ్మలకు పాలాభిషేకాలు చేసే వారికి, అజ్ఞానులైన వెర్రి అభిమానులకు బుద్ధిరావాలి. కెల్విన్ ఎవడో కానీ, సినిమా పరిశ్రమను కెలికేశాడు.
సినిమావారి నిజ స్వరూపాలు బయటపడేలా చేశాడు. అమ్మేవాళ్లు ఎక్కడైనా ఉంటారు. కానీ, కొని ఉపయోగించడానికి మనకు ఉండొద్దా బుద్ధి? అది మన బాధ్యతగల పరిశ్రమలో ఉన్నాం. సంఘానికి సంజాయిషీ చెప్పుకునే పనులు చేయకూడదన్న విజ్ఞత, జ్ఞానం సినిమా వారికి లేకపోయినప్పుడు, వారు ఎంతటి ఘనులైనా విలువ ఏముంది?
-టి రఘురాం, నరసరావు పేట