మీ వ్యూస్

ఊపిరిలూదింది...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవ శకానికి నాంది. రొటీన్ చిత్రాలకు చెంపదెబ్బ. నటనకు కొత్త భాష్యం. నవ దర్శకులకు మార్గదర్శనం. సకుటుంబ సపరివార చిత్రం. మండు వేసవిలో ఒయాసిస్సు. తెలుగువారికి పన్నీటి జల్లు. తెలుగువాడి స్టామినా. బంధాలను హృదయానికి చేరువచేసిన చిత్రం. కోమాలోవున్న తెలుగు సినిమాకు సరికొత్త -ఊపిరి
- నవీన చైతన్య, హైదరాబాద్

పారితోషికాలు
ఈరోజుల్లో నటులు తీసుకునే పారితోషికంతో -రెండు మూడు చిత్రాలు నిర్మించొచ్చు. ఏదైనా ఓ సినిమా గట్టిగా హిట్టయితే చాలు, పారితోషికాలు నిచ్చెనెక్కి కూర్చుంటాయి. వాస్తవానికి కథాబలంవున్న చిత్రాలే ప్రేక్షకులకు నచ్చుతున్నాయి. స్టార్ హీరోలో, హీరోయిన్లో ఉన్నంత మాత్రాన సినిమాలు హిట్టయ్యే దాఖలాలు బహుతక్కువ. ఎన్టీఆర్, ఎఎన్‌ఆర్‌ల చిత్రాలు అనేకం కథలేకే ఫ్లాప్ అయ్యాయి. మరి వారెంత గొప్ప నటులు! కోట్ల పారితోషికాలిచ్చి అవి ఆడకపోతే నష్టపోయేది నిర్మాతే కదా! కొత్త నటులెందరో ఉన్నారు. వారిని ప్రోత్సహించండి. కథల్లో వైవిధ్యం చూపండి. సంగీతం, సంభాషణలు మొదలైన వాటిపట్ల శ్రద్ధ తీసుకుంటే విజయం తథ్యం. ఇమేజీలమీద పారితోషికాలు పారబోయకండి.
-ఎన్ రామలక్ష్మి, సికిందరాబాద్

అసంపూర్తి సినిమాకు అవార్డా?
ఇటీవల ప్రకటించిన కేంద్ర ప్రభుత్వ చలనచిత్ర అవార్డులలో బాహుబలి చిత్రానికి ఉత్తమ చిత్రంగా అవార్డురావడం తెలుగువారందరికీ ఆనందకరమైన విషయమే. కానీ ఆ చిత్రానికి ఏ అర్హత చూసి ఇచ్చారోగానీ అవార్డు ప్రేమికులు మాత్రం అనర్హమైనదే అనుకుంటున్నారు. గతంలో వచ్చిన అనేక అవార్డు చిత్రాల కథాకథనాలు ఒకసారి పరిశీలిస్తే బాహుబలి బలం అర్థమైపోతుంది. ఇటీవల ఓ అగ్ర తెలుగు సినీ నటి చెప్పినట్లుగా ఫూలిష్ చిత్రం అన్న పదానికి నిదర్శనమే ఇది. మానవ జీవితంలో గొప్ప గొప్ప సందర్భాలను, జీవితంలో వున్న నిర్వేదాలు, ఆనందాలు, సరికొత్త స్వర్గాలు, సామాన్యుడి జీవితంలో వున్న వెలుగులు తదితర అంశాలను ప్రధానాంశంగా తీసుకుని రూపొందించిన గొప్ప గొప్ప చిత్రాల సరసన బాహుబలిని చేర్చటం గర్హించదగిన విషయమే. ఘటశ్రాద్ధ, వానప్రస్థమ్, హలోధియా సోలోమాన్ భావ్‌ధాన్‌ఖాయ్, కాల్ పురుష్, ఎలియప్పతాయమ్, ద్వీప, అంతఃహీన్, మరుపక్కమ్, చరాచర్, తాయ్‌సాహెబా, కంజివరమ్, మృగయాలాంటి చిత్రాలను చూస్తే భారతీయ జీవనం ఎంత గొప్పదో, ఇక్కడి సంప్రదాయాలు, సంస్కృతుల మూల్యం ఎలాంటిదో తెలుస్తుంది. అలాంటిది ఒక కల్పిత కథ, అందులో మరో సగం మరో సినిమాలో వచ్చే కథకు జాతీయ అవార్డు ప్రకటించడంతో అవార్డులకున్న విలువే మాసిపోయింది. అవార్డు చిత్రాలకు కేవలం కమర్షియాలిటీ ప్రాధాన్యమా? జీవితమంటే కేవలం డబ్బేనా? మానవ మూల్యాలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చే ప్రభుత్వాలు ఇలాంటి చిత్రాలకు అవార్డులు ఇవ్వటం ఏ ప్రస్థానానికి మార్గదర్శకాలు?
- టి.రఘురామ్, నరసరావుపేట

బాల నటులు
చలనచిత్రాల్లో నటించిన బాల నటుల వివరాలు వరుసగా వారం వారం ఇవ్వాలని కోరుతున్నాం. మాస్టర్ ఆదినారాయణ, రాము, విశే్వశ్వరరావు, రాజ్‌కుమార్, బేబి రాణి, కుట్టి పద్మిని, బేబి గౌరి, బేబి రోహిణి, సంయుక్త ఇలా ఎందరో ఆ రోజుల్లో నటనలో అదరగొట్టినవారే. తమ ప్రతిభను చూపినవారే. వారిప్పుడు ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? వారి వివరాలు తెలియజేస్తే ఆనందిస్తాం. దీనికొక ప్రత్యేక శీర్షిక పెట్టాలని కోరుకుంటూ..
-సిహెచ్ నాగేశ్వరరావు, హైదరాబాద్

స్నేహానికి ఊపిరి
ఫ్రెంచిలో విజయఢంకా మ్రోగించిన ఇన్‌టచబుల్స్ చిత్రం ఆధారంగా తెలుగులో ఊపిరి చిత్రం ఎంతో ఎత్తుకు వెళ్లింది. ప్రకాష్‌రాజ్, జయసుధ, నాగార్జున, కార్తిల నటన అమోఘం. స్వచ్ఛమైన స్నేహం ఎలా ఉండాలో మనస్సుకు హత్తుకునేలా దృశ్యాలను చిత్రీకరించారు. వీల్‌చైర్‌లో నాగార్జున నటనతో వినోదమే కాదు, కన్నీరూ పెట్టించారు. ఇలాంటి పాత్రను ఒప్పుకున్న నాగ్ సాహసానికి హ్యాట్సాఫ్ చెప్పాలి. అబ్బూరి మాటలు గుండెని పిండేశాయి. నిజమైన స్నేహం కష్టాల్లో కూడా పాలుపంచుకుంటుందని నిరూపించారు. భావాలను కళ్లతోనే పలికించారు.
-కోలిపాక శ్రీనివాస్, బెల్లంపల్లి

ఎంతకాలమిలా?
వెనె్నల్లో గిరివాసు వెలిబుచ్చినవి పచ్చి నిజాలు. మా చిన్నతనంలో జంట నగరాల్లో సినిమాలు చూసిన అనేక థియేటర్లు ఇప్పుడు కనుమరుగయ్యాయి. ఆబిడ్స్ సెంటర్‌కు వెళ్తే వరుస సినిమా హాళ్ళల్లో కనీసం రెండు సినిమాలైనా చూసి వచ్చేవాళ్లం. ప్రస్తుతం అక్కడ థియేటర్లు నామమాత్రమే. సినిమాను నమ్ముకొని, బతికేవారి గురించి ప్రతి అక్షరం నిజమే చెప్పింది. థియేటర్లలోని క్యాంటీన్లు కూడా దివాళా దశలోనే ఉన్నాయి. థియేటర్లు మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలని ఆశిస్తున్నాం.
-దుమోర, హైదరాబాద్

పాత పాటలు
స్వర్ణయుగంలో అనేక చిత్రాలు రూపొందించారు. వాటిల్లో అనేక రసగుళికల వంటి పాటలు ఉన్నాయి. ఆగిపోయిన కొన్ని చిత్రాల్లో అప్పటి నిర్మాతలు విడుదల చేయక వదిలేశారు. అలా ఆగిపోయిన సినిమాలో ఎన్నో మంచి పాటలు కూడా ఉండే ఉంటాయి. కనుక నిర్మాతలు వారి చిత్రాల్లో అలనాడు రికార్డు చేయబడిన పాటలను వాడుకుంటే బాగుంటుంది. దీనికి పెద్ద ఇబ్బందేంటంటే ఆగిపోయిన చిత్రాలు ఏవీ, హక్కులు ఎవరికి చెంది ఉన్నాయి? వంటి వివరాలు తెలియకపోవడం. అలనాటి చిత్రాల్లోని పాటలకి ఈ నాటి చిత్రాల పాటలకి ఏనుగుకు ఎలుకకు ఉన్నంత వ్యత్యాసం వుంది. కాబట్టి ప్రస్తుత నటీనటులతో అలనాటి పాటలను అభినయింపచేస్తే బావుంటుంది. వెర్రిమొర్రి చిత్రాలకు, సంగీతానికి అలవాటుపడిన జనం పాతకాలం నాటి సంగీతాన్ని హర్షిస్తారా? గంజాయి మొక్కలను చూసి, ఆనందపడేవారికి తులసి మొక్కలు కనిపిస్తే చికాకు పుడుతుందేమో.
-నున్న మధుసూదనరావు, హైదరాబాద్