మీకు మీరే డాక్టర్

ఏ పళ్లెంలో తినాలి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

(గత సంచిక తరువాయ)
ప్లాస్టిక్ సీసాలు, పళ్లాలు, అల్యూమినియం క్యారేజీలు, సత్తు పాత్రలు వీటన్నింటిలో బైస్ఫేనాల్ ఎ, ఫ్తాలేట్స్ లాంటి విష రసాయనాల కారణంగా అవి ఆహారాన్ని విషపూరితం చేస్తాయి. చాలా స్వల్పమాత్రలోనే ఈ విషయం ఉండవచ్చు. కానీ, నాటికీ మనం ప్లాస్టిక్ మీద ఆధారపడటం పెరిగే కొద్దీ ఈ ‘స్లో పాయిజన్’ వేగవంతమైన కాలకూట విషంగా మారే ప్రమాదం ఉంది.
16-17 శతాబ్దాల నాటి తెలుగు వారి సామాజిక జీవనానికి అద్దం పట్టే యోగరత్నాకరం అనే వైద్య గ్రంథంలో ఏ లోహంతో చేసిన పళ్లెంలో తింటే ఎలాంటి సుగుణాలు కలుగుతాయో వివరంగా ఉంది. ఈ నిజాలను పరిశీలించండి.
బంగారు పళ్లెం: సంతోష దాయకంగా ఉంటుంది. అనారోగ్యాలున్నప్పుడు ఆహారాన్ని బంగారు పళ్లెంలో కలిపి పెడితే దోష హరంగా ఉంటుంది.
వెండి పళ్లెం: వెండి పళ్లెంలో భోజనం కూడా ఇలాంటి గుణాలే కలిగి ఉంటుంది కానీ, బంగారం కన్నా తక్కువ స్థాయిలో ఉంటుంది. వెండి పళ్లాలలో తింటే కంటికి మంచిది. శరీరంలో వేడి తగ్గుతుంది. కానీ కఫవాత దోషాలను ప్రకోపింప చేస్తుంది.
కంచు పళ్లెం: కంచు పళ్లెంలో భోజనం రుచిగా ఉంటుంది. బుద్ధిప్రదంగా ఉండి, ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రక్తప్రసార వ్యాధులతో బాధపడే వారికి, బీపీ, గుండె జబ్బులున్న వారికి బంగారం పళ్లెం తరువాత ఎక్కువ మేలు చేసేది ఈ కంచు పళ్లెమే!
ఇత్తడి పళ్లెం: దీన్లో భోజనం పరమ అనారోగ్యకరం. వాత దోషాల్ని పెంచుతుంది. బాగా వేడి చేస్తుంది. కాబట్టి, ఇత్తడి పళ్లెలలో ఎట్టి పరిస్థితుల్లోనూ భోజనం చేయకూడదు. ముఖ్యంగా పుల్లని పదార్థాలు ఇత్తడి గినె్నల్లో వండటం, ఇత్తడి పళ్లాల్లో తినటం చేయకూడదు.
స్టీలు పళ్లెం: స్టీలు అంటే ఉక్కుతో చేసిన పళ్లెంలో భోజనం ‘సిద్ధికారకమ్’ అన్నాడు ఈ వైద్యగ్రంథంలో. కాయసిద్ధి అంటే శరీరాన్ని అన్ని విధాలా శక్తి, బలమూ కలుగుతాయి. పైగా రక్త క్షీణత లాంటి వ్యాధుల్లో మంచే చేస్తుంది గానీ చెడు చేయదని దీని భావం.
రాతి పాత్రలు, మట్టి మూకుళ్లు: వీటిలో భోజనం దారిద్య్రానికి గుర్తుగా ఈ వైద్యగ్రంథం భావించింది. అంతేగానీ, అందువలన ఆరోగ్యానికి పెద్ద ప్రమాదాలేమీ చెప్పలేదు. పూర్వం రోజుల్లో మట్టి కుండలో అన్నం వండుకొని, మూకుళ్లలో ఆహార పదార్థాలు ఉంచుకొనేవారు. దాలిగుంటలో కుండను ఉంచి కాచిన పాలు గాని తోడుపెట్టిన పెరుగు గానీ చాలా రుచికరంగా ఉంటాయి. స్టీలు గినె్న పెరుగుకేం తెల్సు కుండ పెరుగు రుచి! అలాగే, రాతి పాత్రలలో (రాచ్చిప్ప అనేవారు) పులుసు, పప్పుచారు కాచేవాళ్లు. లోహ పాత్రల్లో పులుపు కాయడం మంచిది కాదని రాతిపాత్రల్ని వాడేవారు.
చెక్క పళ్లాలు: చెక్కతో చేసిన పళ్లెంలో భోజనానికి ఈ వైద్య గ్రంథం ఓటు వేయలేదు.
అరిటాకులు, బాదం ఆకులు: అరిటాకుల్లోనూ, బాదం ఆకుల్లోనూ భోజనం శ్రేష్టదాయకం. విషదోషాలు పాపాలను హరిస్తాయి.
అడ్డాకు విస్తరి: అడ్డాకు విస్తట్లో భోజనం వలన శరీరానికి చేసే మేలు ఏమీ లేకపోగా, దానికి లోపలి వైపు తగరం కాయితం, లామినేషన్ షీట్లు అంటిస్తున్నారు. వీటివలన తీవ్ర అనారోగ్యం కలుగుతుంది. చుట్టాల్ని, స్నేహితుల్నీ భోజనానికి పిలిచి కమ్మని వంటలు చేయించి, ఇలాంటి విషతుల్యమైన విస్తళ్లలో వడ్డించటం ధర్మం కాదు.
థర్మోకూల్ బెండు పళ్లాలు: పూర్తి విషతుల్యమైన పళ్లాలివి. వాడుతున్నారు. వాటి ప్రభావం ఎలా ఉంటుందో ఏనాడయినా ప్రభుత్వం ఆలోచించిన దాఖలా లేదు. ఇలాంటివి మార్కెట్‌కి తీసుకు రాబోయే ముందు, ప్రజారోగ్య శాఖ వాటిని క్షుణ్ణంగా పరిశీలించి, అవి జనారోగ్యానికి చెరుపు నిచ్చేవి కావని చెప్పాలి. ఘనత వహించిన మన ప్రభుత్వ శాఖలు చెప్పే ఉంటాయని ఆశిద్దాం. కానీ, వైద్యపరంగా భరోసా ఇవ్వగలిగే స్థితి లేదు.
సెరామిక్ పళ్లాలు: ప్లాస్టిక్‌తో పోల్చినప్పుడు సెరామిక్ (పింగాణీ) పళ్లాలు చాలా వరకూ నయం అని చెప్పాలి. మన దర్జా, హోదా దర్పాలను చాటుకోవడానికి ఈ సెరామిక్ పళ్లాలు బాగా ఉపయోగపడతాయి. పింగాణీ, సెరిమిక్ గాజు పళ్లాలు విస్తృతంగా వస్తున్నాయి.
స్ఫటిక పళ్లెంలో భోజనం తింటే పవిత్రం, చలవ నిస్తాయని యోగరత్నాకరం వైద్య గ్రంథం చెప్పింది. ఇవే గుణాలను గాజు, సెరామిక్ వగైరా పళ్లాలకు కూడా అన్వయించుకోవచ్చు.
రాగి పళ్లెం: రాగి పళ్లెంలో భోజనం నిషేధం. రాగి గ్లాసులో నీరు తాగితే మంచిదనీ, శరీరాన్ని మృదువు పరుస్తుందనీ ఈ వైద్య గ్రంథం పేర్కొంది. మృదువు పరచటం అంటే యాంటీ ఆక్సిడెంట్ - విష దోష నివారకంగా ఉంటుందని!
ప్లాస్టిక్ పళ్లాలు: ప్లాస్టిక్ పళ్లాలు, క్యారీ బ్యాగులు, పివిసి బాటిల్స్, బాటిళ్లలో ఉంచిన ఆహారం, పచ్చళ్లు, నీళ్లు ఇవన్నీ ప్లాస్టిక్ విషాలను కలిగి ఉంటాయి. మెలమైన్, పోలీ ప్రొపలీన్ అనే ప్లాస్టిక్ పదార్థాలు విషాన్ని విరజిమ్మేవిగా ఉంటాయి. అవి ఓవెన్‌లో తట్టుకుంటాయా లేదా అని చూస్తారే గానీ, వాటిలో ఆహారం తింటే, వాటి విషాన్ని మన శరీరం తట్టుకుంటుందా లేదా అని చూడకపోవడమే మన బలహీనత. పోలీ వినైల్ క్లోరైడ్ (పివిసి) పోలీ కార్బొనేట్, పోలీ ఎథిలీన్ టెరెప్తాలేట్ (పెట్) ఎక్కువ సాంద్రత కలిగిన పోలీ ఎథిలీన్, తక్కువ సాంద్రత కలిగిన పోలీ ఎథిలీన్, పోలీ స్టెరీన్ (స్టిరో ఫోమ్) ఇలాంటి ప్లాస్టిక్‌లతో తయారైన పళ్లాలు, గ్లాసులు, డబ్బాలు ఇవన్నీ ఆహార పదార్థాల్నీ, పానీయాల్నీ విషపూరితం చేస్తాయి.
అవి ప్లాస్టిక్ వాసన రావటానికి వాటిలో ‘బిస్ఫెనాల్ ఎ’ (బిపిఎ) అనే రసాయనం లాంటివి కలవటం కారణం. ప్లాస్టిక్ వాసన లేకపోతే మంచివనుకోవటం కూడా అపోహే! కొద్దిపాటి వేడి తగలగానే ఫాక్స్ ఈస్ట్రోజెన్ అనే ఒక విష రసాయనం విడుదల అయి ఆహారాన్ని విష పూరితం చేస్తుంది. దీని వలన ఒవేరియన్ కేన్సర్, ప్రోస్టేట్ కేన్సర్, బ్రెస్ట్ కేన్సర్ లాంటి వ్యాధులు వస్తున్నాయని శాస్తవ్రేత్తలు హెచ్చరిస్తున్నారు. గర్భవతులు ఈ ప్లాస్టిక్ విషాహార పానీయాలు తీసుకుంటే పుట్టే బిడ్డకూ కేన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. మెలమైన్ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటాం. ఖరీదు పెట్టి వాటిని కొంటూ ఉంటాం కూడా! కానీ, ఒక మెలమైన్ పాత్రలో వేడివేడి సూప్ తాగిన వ్యక్తి మూత్రాన్ని పరీక్షిస్తే, ఆ మూత్రంలో మెలమైన్ అవశేషాలు ఉన్నట్టు కనుగొన్నారు. కుండను ఈసడించి, ప్లాస్టిక్‌ని నమ్మటం, భక్తుణ్ణి తూలనాడి దెయ్యం వెనకాల వెళ్లటం లాంటిదేనని మనం గుర్తించేవరకూ, ప్లాస్టిక్ భూతంలా వెన్నాడుతూనే ఉంటుంది. ఈ వివరాలన్నీ ఒక విషయం స్పష్టం చేస్తున్నాయి. భోజనం చేయడానికి బంగారు పళ్లాలే అక్కరలేదు. వెండి పళ్లానికన్నా, స్టీలు పళ్లానికన్నా, కంచు కంచాలు మేలయినవి. పెళ్లిళ్లలో పెళ్లికొడుకు వెండి కంచమూ, వెండి చెంబూ అడుగుతాడు. తెలివైన వాడయితే, కంచు కంచం, రాగి చెంబు అడగాలి.

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com